8, ఫిబ్రవరి 2018, గురువారం

బతుకమ్మ

ఒక మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో

విడదీయలేని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి సేదతీరేవాడు…. కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలువలేకపోతున్న మనిషి ఇక ప్రకృతి తో ఎలా కలుస్తాడు. బతుకమ్మ పండగకి మాత్రం కచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి ప్రకృతి తో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పతనం.

ప్రపంచంలో మరెక్కడా కానరాని అద్భుతమైన సంబరం ఇది. ప్రకృతి లోని అన్ని రకాల పూలతో ఆడవారు

ఆడుకునే పండుగ...

ఆటపాటల్లో అంతరాలు తెలియవు.. ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఇబ్బందులు లేవు..

కులం లేదు.. మతం లేదు.. ధనం లేదు.. చిన్నా.. పెద్దా.. పిల్లా.. పాపా.. అమ్మలు.. అక్కలు అమ్మాయిలు... అంతా కలిసి.. అన్నింటిలో కలగలిసి.. చెరువు

గట్టున చక్కగా సాగే పూల జాతర బతుకమ్మ.మగువలు మాత్రమే జరుపుకునే సంబరం.......మగువలు మాత్రమే జరుపుకునే సంబరం. ప్రకృతితో మమేకమయ్యే పండుగ. బతుకమ్మ పూలతో ప్రాణం పోసుకుంటుంది. బతుకమ్మలో గడ్డిపూలు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. సుగంధాలను వెదజల్లుతాయి. సాయంసంజె వేళ పల్లెల్లో ఉయ్యాల పాటలు మనతో ఊసులాడతాయి.ప్రకృతితో మమేకమయ్యే సంబరం......పువ్వులే రూపం.. పువ్వులే ఆధారం....ఈ పండుగకు తెలుగు లోగిళ్లన్నీ పువ్వులతో కళకళలాడతాయి. ఒకే దారానికి ఒక్కో పువ్వును గుచ్చినట్టుగా, పువ్వులను అందంగా పేరిస్తే బతుకమ్మ ప్రాణం పోసుకుంటుంది. ఆమెకు పువ్వులే రూపం. పువ్వులే ఆధారం. పూలతో పాటు ప్రకృతిలో జీవం పోసుకునే సమస్త మైన అంశాలు కలిస్తే బతుకమ్మ రూపం సంతరించుకుంటుంది. పళ్లెంలో గుమ్మడి ఆకులు వేసి వాటిపై తంగేడి పువ్వు, గునుగు పువ్వు, కట్టెపువ్వు, బంతి, చామంతి, గులాబి, గడ్డిపువ్వు, చిట్టి చామంతి, పట్టుగుచ్చుల పువ్వు, చివరగా పైన గుమ్మడి పువ్వు ఇలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేరుస్తారు. ఐదు రకాలతో గానీ, ఏడు రకాలతో గానీ బేసి సంఖ్యలో పువ్వులు ఉండేలా అంతరాలలో బతుకమ్మను పేర్చుతారు. పసుపుతో చేసిన గౌరమ్మను చిక్కుడాకులో ఉంచి బతుకమ్మకు ప్రాణం పోస్తారు. పసుపు ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మపై చిక్కుడు ఆకులో పెడతారు.గునుగు పువ్వుకు, గడ్డి పువ్వుకు రంగులు...గునుగు పువ్వుకు, గడ్డి పువ్వుకు రంగులు అద్దుతారు. ప్రకృతి వర ప్రసాదితాలైన బీరకాయ ఆకుతో తీసిన రసం ఆకుపచ్చ రంగు, కుంకుమ, సున్నం కలిపిన నీళ్లు కాషాయం రంగు వస్తాయి. వీటినే ఆ పువ్వులకు పట్టిస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ కెమికల్స్‌తో కూడిన రంగులు వచ్చాయి గానీ అంతకుముందు ఇలా ప్రకృతి సిద్ధంగా లభించిన రంగులనే పువ్వులకు అద్దేవారు. అలా పేర్చిన బతుకమ్మను ఒక్కచోటకు చేర్చి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఇంతులు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఈ సంబరాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నవమి నాటి వెన్నెల జిలుగుల మధ్య ఈ సంబరం అంబరాన్నంటుతుంది.ఆశ్వయుజ మాసం ప్రారంభానికి ముందు....ఆశ్వయుజ మాసం పది రోజలుందనగా బొడ్డెమ్మ పండుగ ప్రారంభమవుతుంది. బొడ్డెమ్మ మట్టితో ముడిపడి ఉన్న పండుగ. కన్నెపిల్లలు పుట్ట మన్నును తీసుకొచ్చి, శ్రీ చక్రాకారంలో బొడ్డెమ్మను ఒక పీట మీద చేస్తారు. అలా చేసిన బొడ్డెమ్మను అర్చిస్తారు. ఈ పూజను కన్నె పిల్లలు ఇష్టంగా చేస్తారు. మట్టిని మాతృమూర్తిగా భావించి కొలుస్తారు. ముఖ్యంగా వ్యవసాయానికి మట్టే మూలాధారం. కాబట్టే మట్టి ముద్దనే బొడ్డెమ్మగా మలిచి, గౌరమ్మగా భావించి మురిసిపోతారు.మంచి భర్త రావాలని బొడ్డెమ్మకు పూజలు .....ఈ తొమ్మిది రోజులు కన్నెపిల్లలు మంచి భర్త రావాలని బొడ్డెమ్మకు పూజలు చేస్తారు. సాయం సంధ్యవేళ బొడ్డెమ్మను చక్కగా జాజుతో అలికి, పూలతో అలంకరిస్తారు. పసుపు, కుంకుమలతో బొడ్డెమ్మపై ముగ్గులు వేస్తారు. ఇంటి ముంగిట కల్లాపి జల్లి అందులో బొడ్డెమ్మను కూర్చోబెడతారు. ఆ తరువాత దాని చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడతారు. అప్పుడే తెంపిన పూలతో బొడ్డెమ్మను అలంకరిస్తారు. ఇటు పువ్వుల పరిమళం, అటు అగర్‌బత్తీల పరిమళం వెరసి అంతులేని ఆనందం కలుగుతుంది. సైన్స్‌ పరంగా చూస్తే మట్టి వాసన.. అగరు సువాసన మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.భాద్రపద అమావాస్య రోజు బతుకమ్మ మొదలు.....ఇక బతుకమ్మ పండుగ సరిగ్గా భాద్రపద అమావాస్యనాడు మొదలవుతుంది. ఈ అమావాస్యనే పెత్తరామాస్యగా పిలుచుకుంటారు. ఆశ్వయుజ మాసం ప్రారంభమైన తరువాత బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తొలిరోజు బతుకమ్మతో పాటు, బొడ్డెమ్మను చెరువుకు తీసుకెళ్లి నీటిలో బతుకమ్మ తొలిరోజున ప్రసాదంగా తమలాపాకును మాత్రమే పంచుతారు. ఆ తరువాత రోజు నుంచి పలహారాలను పంచడం ప్రారంభమవుతుంది.

బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి.ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా’ అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదలు రాకూడదని, కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.ఈ పండుగను తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ.తొమ్మిది రకాల బతుకమ్మల పేర్లు:1. ఎంగిలిపూల బతుకమ్మ

2. అటుకుల బతుకమ్మ

3. ముద్దపప్పు బతుకమ్మ

4. నాన బియ్యం బతుకమ్మ

5. అట్ల బతుకమ్మ

6.అలిగిన బతుకమ్మ

7. వేపకాయల బతుకమ్మ

8. వెన్నముద్దల బతుకమ్మ

9. సద్దుల బతుకమ్మ (చివరిరోజు)ఎంగిలి పువ్వుల బతుకమ్మ :బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.అటుకుల బతుకమ్మ:రెండవ రోజునాడు ఉదయానే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో వేస్తారు.

రెండవ రోజు అటుకులు వాయనంగా పెడుతారు.ముద్దపప్పు బతుకమ్మ :మూడవ రోజు బతుకమ్మను మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో అలంకరించి తామర పాత్రలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరో లేక నాలుగు బాటలు కాడ అందరూ కలసి ఆడవారు ఆడుకొని చెరువులో వేసి వస్తారు.

మూడవ రోజు వాయనంగా సత్తుపిండి,పేసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడుతారు.నానబియ్యం బతుకమ్మ:నాలుగవ రోజు నానబియ్యం ఫలహారంగా పెడుతారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు.వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.అట్ల బతుకమ్మ :ఈ ఐదవ రోజు తంగేడు, గునుగు,చామంతి,మందార, గుమ్మడి పూలను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడుతారు.

ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడుతారు.అలిగిన బతుకమ్మ:

ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్దా తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు.వేపకాయల బతుకమ్మ :ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.

ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.వెన్న ముద్దలా బతుకమ్మ:ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆట,పాటల మధ్య చెరువులో వేస్తారు.

ఈ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.సద్దుల బతుకమ్మ:ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు.చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు.విద్యుత్‌ జిలుగులు, మరోవైపు కొత్త బట్టల్లో మెరిసిపోయే ఆడపడుచులు......ఓ వైపు విద్యుత్‌ జిలుగులు, మరోవైపు కొత్త బట్టల్లో మెరిసిపోయే ఆడపడుచులు. మహిళలంతా పట్టు చీరలతో, కన్నెపిల్లలు లంగావోణీల్లో, చిన్నపిల్లలైతే పావడాలు ధరించి అందంగా ముస్తాబై ఒక్కచోటుకు చేరతారు. విజయదశమికి ఒక్కరోజు ముందు సద్దుల బతుకమ్మ పండుగ జరుగుతుంది. గ్రామం పట్టణం, నగరం ఎక్కడైనా సరే సద్దుల బతుకమ్మ రోజు అందంగా ముస్తామైన మగువలు చెరువు, నది, జలాశయాలు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతుకమ్మ ఆడతారు. గౌరమ్మను కీర్తిస్తూ పాడతారు. స్త్రీలు సద్దుల బతుకమ్మ రోజు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఉన్నంతలో తెలంగాణ ప్రాంతంలో ప్రతీ ఒక్కరు ఎంతో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. ఒక్కచోటకు చేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ అతివలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. బతుకమ్మ ఆడటం పూర్తయిన తరువాత వాటిని చెదిరిపోకుండా నీటిలో వేస్తారు. పోయిరా మా లక్ష్మి పోయిరావమ్మా అంటూ తాంబాలాలను ఒక్కచోట చేర్చి పాడతారు. బతుకమ్మతో పాటు తీసుకొచ్చిన గౌరమ్మను ముత్తయిదువులు వారి తాళిబొట్టుకు ఒకరికొకరు పెట్టుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలైతే గంధంలా పూసుకుంటారు. ఆ తరువాత తీసుకువచ్చిన ఫలహారాలను పంచిపెడతారు. మొదటిరోజు తమలపాకును మాత్రమే పలహారంగా ఇస్తారు. ఆ తరువాత ఒక్కోరోజు ఒక్కో పప్పు చక్కెరతో, అటుకులు చక్కెర, నువ్వుల పొడి ఇలా ఒక్కోరోజు ఒక్కోరకమైన ప్రసాదాలు పంచిపెడతారు. అందరూ కలిసి ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఎలాంటి తేడాలు చూపించుకోకుండా ఆనందంగా కాలం గడుపుతారు. సంవత్సరమంతా ఎన్నో కష్టనష్టాలతో అలసిపోయిన మగువలకు ఇదో ఆటవిడుపు. ప్రశాంతంగా ఆడుకుంటారు. పాడుకుంటారు.బతుకమ్మ పాటకు పల్లవి అక్కర్లేదు.చరణాలు అసలే అక్కర్లేదు. మహిళల మనస్సులోని భావాలే పాటలుగా ఆవిష్కారమవుతాయి. జానపదాలు గల్లుమంటాయి. మగువలు తమ కష్ట సుఖాలనే పాటలుగా మలుస్తారు. అప్పటికప్పుడు అనుకొని పాడే ఈ పాటలకు ఆది అంతం ఉండదు. అలా సాగిపోతూనే ఉంటాయి. కన్నెపిల్లలయితే తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ వాళ్ల ఆశలనే ఉయ్యాల పాటలుగా పాడుకుంటారు. ప్రతీ పదంలో అంతర్లీనంగా ఓ అర్థం దాగి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంతులేకుండా సాగే ఉయ్యాల పాటలో ఎన్నో అర్ధాలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఆనందాలు వినిపిస్తాయి. ప్రతీ పల్లెల్లో ఈ పాటలు ఎంతో ఆనందంగా ఆలపిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే జరిగే ఈ పండుగకు ప్రతీ పల్లె ఉయ్యాల పాటతో ఊగిసలాడుతుంది.బతుకమ్మ ఆడపడుచులకు అంబరాన్ని తాకే సంబరం....బతుకమ్మ ఆడపడుచులకు అంబరాన్ని తాకే సంబరం. ఈ పండుగలో పువ్వులకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నీ పూల సువాసనతో పరిమళిస్తాయి. ప్రకృతిని ఆరాధించే సంస్కృతికి ప్రతీకే ఈ బతుకమ్మ. నేలకు, నీళ్లకు, మట్టికి, ప్రకృతిలో ఉన్న ఇదే ఈ పండగకు గొప్పగా కనిపిస్తుంది. చెట్టూ, పుట్టా తిరిగి ఏరి కోరి తీసుకొచ్చిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చడం ఓ వింత అనుభూతి. ఒక్కొక్క పువ్వేసి.. ఒక్కొక్క అంతరం పేర్చుతూ బతుకమ్మను తయారు చేయటం ఒక ఎత్తైతే.. అన్నీ కలిపి ఒక చోట చేర్చి ఆనందంతో ఆడటం మరో అనుభూతి. సైన్స్‌ పరంగా చూస్తే ఈ పండగతో మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరగుతుందని చెప్పొచ్చు. బతుకమ్మకు ఉపయోగించే ప్రతీ పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వర్షాకాలం నీరు చెరువును చేరుతుంది. పాతకాలంలో చెరువు నీటితే తాగేవారు. కాబట్టి చెరువులను శుభ్రం చేసుకోవడానికి సహజ సిద్ధంగా దొరికే పువ్వులను వాడేవాళ్లు. అలా బతుకమ్మ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అమృత మూర్తిగా పేరు పొందింది. ఈ పండుగ వస్తే ఇళ్లల్లో ఒకటే సందడి. పూల వేట పూర్తయి మగాళ్లు ఇంటికి చేరుకోగానే పువ్వును సరిగ్గా తెంపే పని ప్రారంభమవుతుంది. అప్పుడు మిగతా బతుకమ్మల కంటే తమ బతుకమ్మ పెద్దగా ఉండాలంటూ పోటీ పడి మరీ సాయంకాలం వరకు పేరుస్తూనే ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మను పేర్చడం పూర్తయ్యాక, బతుకమ్మకు సద్దులు కడతారు. పూజ చేసి పులిహోర, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మల్లీద ముద్ద, పులిహోర, పెరుగన్నాన్ని బతుకమ్మను చెరువులో వదిలాక వాటిని ప్రసాదంలా పంచుకుంటారు. ఇలా తెలంగాణ పల్లెల్లో అణువణువునా ఆనందం వెల్లివిరిసే రోజులు ఇవే అంటే అతిశయోక్తి కాదేమో. ఉన్నంతలో గొప్పగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగింది.

బోనాల పండుగ

అసలు బోనం అంటే ఏమిటి?? మనందరిని రక్షించే తల్లికి మర్యాద పూర్వకంగా వందనం సమర్పణ చేయ్యడం మే బోనం అందరిని కలరా మషూచి సకల రోగాలనుండి రక్షించే తల్లికి నివేదన చేయ్యడమే బోనంబోనం అంటే భోజనం. అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం !!!అమ్మకు మాత్రం ఆకలిదప్పులుండవా! అందువల్ల ఆమెను కన్నకొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి బోనాల పండగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపుతుంటారు.మరి ఆషాడ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంబిస్తాయి. మరోవైపు గ్రామీణులు వ్యవసాయం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, తమ పిల్లా పాపా గొడ్డు గోదా, పాడి పంటా, చల్లగా కాపాడుతల్లీ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.బోనం అంటే భోజనం. అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం (భోజనం). బువ్వ, ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో, ఊరేగింపుగా ఉరుమ్మడిగా కలిసి వెళ్ళి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పిస్తారు.

ఆషాడమాసం వర్షాలు విరివిగా కురవడం మూలాన క్రిమికీటకాలు, వైరస్ ద్వారా అంటు వ్యాధులు వ్యాపించి జన నష్టం కలగజేస్తాయి. పూర్వకాలంలో వైద్యవిజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి, వంటి అంటు వ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి. దానినే గత్తర వచ్చింది అనేవారు.

ప్రకృతి భయంకర వికృత చేష్టలు, బీభత్సాలు, వైపరీత్యాలు జన సామాన్యానికి అర్థమయ్యేవి కావు. ఈ ప్రకృతి వైపరిత్యాలను, ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం మానవుడు భక్తిభావంతో గ్రామదేవతలను ప్రతిష్టించుకొని విశ్వాసంతో ఆరాధించడం మొదలు పెట్టిండు. దీనినే శక్తి ఆరాధన, ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన అంటారు.

తీజ్ పండుగ :

అన్నాచెల్లెళ్ల అనుబంధాలు. ఆ పై భక్తి భావం. వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ. తరాలు మారినా చరిత్రలో భాగమై.. కట్టుబాట్లు చెక్కుచెదరక అనాదిగా... గిరిజనులతో పాటే సమాజంలో అంతర్భాగమైన ఈ సంప్రదాయ మహోత్సవం. 9 రోజుల పాటు జరిగే పండుగ ఈ పండుగను మొలకల పండగ అని కూడా పిలుస్తారు.ఆదివాసీల పండగ... ఆడపడుచుల పండగ... అంబరాన్నంటే పండగ... యుగాలు మారినా... తరాలు మారినా... హైటెక్ యుగంలోనూ చెక్కుచెదరని గిరిజనుల బతుకమ్మ. అందుకే తీజ్ పేరు వింటేనే గిరిపుత్రులు పులకరించిపోతారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన పండగను చేసుకునేందుకు సంబరపడిపోతారు.

వర్షాకాలంలో ప్రారంభం..

ప్రతి గిరిజన తండా పచ్చని ప్రకృతిలా మారి ఆకుపచ్చ రంగు పులుముకుంటుంది. పెళ్లికాని ఆడపిల్లలు పెద్ద ఎత్తున జరుపుకునే ఈ తీజ్‌ పండుగతో తండాలు కళకళలాడుతాయి. తండా పెద్దలు, తల్లిదండ్రులు కన్నెపిల్లలకు ఆశీర్వదిస్తే.. సోదరులు వచ్చే ఏడాదికి తమను వీడిపోతుందని పైకి ఉబికి వచ్చే కన్నీళ్లను అదుముకుని.. ఇదే వీడ్కోలు అంటూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తారు. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ తీజ్‌ ఉత్సవాలను ప్రారంభిస్తారు.ఆఖరి రోజు ప్రత్యేకం..

పెళ్లికాని యువతులు తీజ్ వేడుకల మొదటి రోజు గోధుమలు తెచ్చి ఎరువులతో కూడిన మట్టి బుట్టల్లో విత్తుతారు. అలా విత్తన నాటి నుంచి అత్యంత పవిత్రంగా కేవలం ఆకు కూరలే తింటూ పూజలు నిర్వహిస్తారు. అలా తొమ్మిది రోజుల పాటు నీరు పోసి పూజలు చేసిన అనంతరం బతుకమ్మలా నిమజ్జనం చేస్తారు. అయితే ఆఖరిరోజు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. చివరి రోజు బంధుమిత్రులంతా ఒకచోట చేరి పండుగ సంబురాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.


మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...