8, ఫిబ్రవరి 2018, గురువారం

*దేవాలయానికి ముందు ధ్వ‌జ‌స్తంభం ఎందుకు?*


ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను 'బలి' అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా, కార్తీకమాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత 'మయూరధ్వజుని' గౌరవిస్తున్నారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని 'ముఖం'గాను, ధ్వజస్తంభాన్ని "హృదయం'గాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది లేకపోతే అవి 'మందిరాలు' అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని 'ధాన్యాధివాసం' అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని 'జలాధివాసం' అంటారు.

తయారీ విధానం:
మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు. వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు(చెక్క)ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూలవిరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి 'జీవధ్వజం' అని మరో పేరు ఉంది. దీనిని 'దారు బేరం' అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి.

పలాస - మోదుగ, అశ్వత్థ - రావి, బిల్వ - మారేడు, బంధూకం - వేగిస, పనస - పనస, వకుళ - బొగడ, అర్జున - మద్ది వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను వాడకూడదు. ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద 'కూర్మయంత్రం' వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడువరసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్ని 'మేఖల' అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. మేఖల కింద సుదర్శన చక్రం (వైష్ణవాలయాలలో), నందీశ్వరుడు (శివాలయాలలో) ఉంటాయి. గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి 'మూల విరాట్టు'తో సమానం. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు.

దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి 'సాష్టాంగ ప్రణామం' చేయాలి. ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో, ఇది కూడా అటువంటిదే. దారురూపంగా దీన్ని భావించాలి. మూలవిరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తరువాత మళ్ళీ కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు.

ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే 'ధ్వజావనతం' అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటె ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే 'ఉత్తమం', కలశంతో సమానంగా ఉంటే 'మధ్యమం', కలశం కంటె తక్కువ ఎత్తులో ఉంటే 'అధమం'. ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి.

మయూరధ్వజుని కథ:
భారత యుద్ధం తర్వాత పాండవాగ్రజుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజ్య పాలనలో ధర్మమూర్తిగా, మహాదాతగా పేరు పొందాలనే కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టాడు. దానమైనా, ధర్మమైనా కర్తవ్యంగా చేయాలే తప్ప కీర్తి కోరి చేయకూడదు. అలాచేస్తే అది స్వార్థమవుతుంది. ప్రతిఫలాపేక్షలేని కర్తవ్యంగా సాగాల్సిన దానక్రియకు స్వార్థం తోడైతే పాపపుణ్యాల పద్దు తగులుకుంటుంది. ఈ విషయం ధర్మ రాజుకు తెలిసొచ్చేలా చెప్పాలనుకున్నాడు కృష్ణుడు. పాండవుల హస్తగతమైన కౌరవ సామ్రాజ్యం స్థిరమైనది, తిరుగులేనిది అని లోకానికి చాటడానికి వీలుగా అశ్వమేధయాగం చేయమని సూచించాడు కృష్ణుడు. కృష్ణుని సలహా శిరసా వహించి ధర్మరాజు అశ్వమథానికి సన్నాహాలు చేయిస్తాడు. యాగాశ్వానికి రక్షకులుగా నకులుడు, సహదేవుని నియమించి ససైన్యంగా పంపుతాడు. ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరగా మణిపురం చేరుకుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు. తమ రాజ్యంలోకి వచ్చిన పాండవుల యాగాశ్వాన్ని తామ్రధ్వజుడు బంధిస్తాడు. తామ్రధ్వజుడితో హోరా హోరి పోరాడి నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు ఓడిపోతారు. ఇంత మంది యోధానుయోధులు, మహాభారత యుద్ధాన్నే అవిలీలగా గెలిచిన పాండువీరులు ఓడిపోయారన్న వార్త తెలిసి ధర్మరాజు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరగా తానే యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని వారిస్తాడు. ఆయనను శౌర్య ధైర్యాలతో కాకుండా కపటోపాయంతో జయిద్దామంటాడు కృష్ణుడు. ధర్మరాజు, కృష్ణుడు బ్రాహ్మణ వేషాలతో మణిపురం వెళతారు. మయూరధ్వజుడు కృష్ణ, ధర్మరాజులను చూసి ముచ్చటపడి ఏం కావాలో కోరుకోమంటాడు. మీ దర్శనం కోసం వస్తుంటే దారిలో ఒక సింహం వచ్చి (ధర్మరాజును చూపించి) ఇతని కుమారుని పట్టుకుంది. ఆ పిల్లవాడిని విడిచిపెట్టమని సింహాన్ని ఎంత ప్రార్థించినా వినలేదు. పైగా మీ కుమారుడు కావాలంటే మణిపుర మహారాజు మయూరధ్వజుడు తన శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా ఇవ్వాలి. అది కూడా ఆయన భార్యా పుత్రులే కోసి ఇవ్వాలి. అప్పుడే మీ పిల్లవాడిని విడిచి పెడతాను అని చెప్పింది అని కృష్ణుడు చెప్పాడు. విషయం అర్థమైన మయూరధ్వజుడు రెండవ ఆలోచనలేకుండా భార్యా, పిల్లల్ని పిలిచి తన శరీరాన్ని సగానికి కోసి ఈ బ్రాహ్మణులకు దానం చేయమని ఆదేశించాడు. ఆయన మాట జవదాటని భార్యా, బిడ్డలు ఆయనను నిలువునా చీల్చి కృష్ణుడికి సమర్పిస్తారు. మయూరధ్వజుని దాన గుణాన్ని చూసి ధర్మరాజు నివ్వరపోయాడు. మయూరధ్వజుని ఎడమ కంటి నుంచి నీరు కారడం చూశాడు కృష్ణుడు. ఏడుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అంటాడు.

అందుకు ధర్మరాజు కూడా ఔనన్నట్టుగా తల ఆడిస్తాడు. వారి మాటలకు మయూరధ్వజుడు విలవిలలాడాడు. స్వామీ మీరు అను కున్నట్టుగా నేను బాధపడుతూ నా శరీరాన్ని త్యాగం చేయడం లేదు. ఇప్పటిదాకా ఒక్కటిగా ఉన్న ఈ శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. ఇందులో కుడిభాగానికే మీ వంటి పుణ్యపురుషులకు దానంగా వెళ్ళే అవకాశం అబ్బింది..ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమకన్ను బాధపడుతోందని వివరించాడు.మయూరధ్వజుని దాన శీలానికి మెచ్చిన కృష్ణుడు తన నిజ రూపం చూపించాడు. మయూరధ్వజుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు. మయూరా..! నీ దాన గుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు. పరమాత్మా నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారం కోసం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని దీవించాడు. నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా, నీ పేరు మీద స్థంభం వెలుస్తుంది. ఆ స్థంభానికి మొక్కకుండా, దానికి ప్రదక్షిణ చేయకుండా ఏ భక్తుడు గుడిలోకి రాడు. ఆ స్థంభాన్ని ఆశ్రయించుకున్న నీ ఆత్మ నిత్యం నా సానిధ్యంలోనే ఉంటుంది. ప్రతి రోజూ ధ్వజస్థంభం వద్ద ఎవరు దీపం పెడతారో వారి జన్మ సఫలం అవుతుంది. రాత్రివేళ బాటసారులకు ఆ దీపం దారి దీపమవుతుంది అని అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్థంభం ఏర్పాటు చేయడం సంప్రదాయంగా మారింది. ముందుగా ధ్వజస్థంభాన్ని దర్శించుకుని దాన్ని కలుపుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాకనే దైవ దర్శనానికి వెళ్ళడం ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం.
- అంతర్జాలం నుండి

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...