8, ఫిబ్రవరి 2018, గురువారం

'రాయల్‌ బెంగాల్‌ టైగర్‌'. - ఆత్మకథ.

దట్టమైన కీకారణ్యం... చిన్నా పెద్దా నీటి మడుగులు... రకరకాల జంతువులు... పక్షుల కిలకిలరావాలతో అలరారే పచ్చ పచ్చని తరువులు నా సామ్రాజ్యం. అక్కడ నేను మకుటంలేని మహారాజుని. నేను ఠీవిగా నడిచొస్తుంటే ఆమడ దూరంలో ఒక్క పిట్టా కనబడేది కాదు. ఇక నేను వికటాట్టహాసం చేస్తే ఎవరికైనా చలీజ్వరం రావాల్సిందే. నా గాండ్రింపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. రాచఠీవికి, గాంభీర్యానికి ప్రతీక నేను. అప్రమత్తతకు, తెగువకు సంకేతం నేను. భీతిగొలిపే స్ఫురద్రూపానికి, తిరుగులేని శక్తికి, లక్ష్యంపైకి విజృంభించి వేటాడే పట్టుదలకు చెరగని చిరునామా నేను. రాజసం ఉట్టిపడే నడక నా సొంతం. ఇప్పటికే నేనెవరో మీకు అర్థమై వుంటుంది. నా గురించి అంతో కొంతో తెలిసే ఉంటుంది. కానీ మీకు చాలా విషయాలు నా గురించి సరిగ్గా తెలీవు. నా గురించి మరికొంత మీకు తెలియాలి. అందుకే ఈ ఆత్మకథ.
నా పేరు 'రాయల్‌ బెంగాల్‌ టైగర్‌'. అంతా నన్ను ముద్దుగా పెద్ద పులి అంటారు. దేశానికి జాతీయ పతాకమల్లే... నేను మన జాతీయ జంతువును. అది తలచుకుంటే నా రాజదర్పం ఆకాశమంత పెరిగినట్టనిపిస్తుంది. అప్పుడు నా అడుగులు మరింత బలంగా పడతాయి. నీటిలో ఈదులాడటమంటే చాలా సరదా. ఒక్కోసారి నదులు, చెరువుల్లో గంటలకొద్దీ ఈతకొడతాను. ఇంకా చెప్పాలంటే... మీ మనుషులకంటే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మాకే ముప్పయి రెట్లు ఎక్కువ. మేము పూర్తి తెల్లగా లేత రంగు చారలతో, బంగారు రంగులో, పూర్తి నలుపు రంగులో, నీలి రంగులో కూడా వుంటాము. మీకు ఇంకో సీక్రేట్‌ చెప్పనా... అడవిలో మా సరిహద్దులను మేమే ఏర్పాటు చేసుకుంటాం. ఈ సరిహద్దులను గుర్తించడానికి ఎంపిక చేసుకున్న ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తాం. ఇక ఆ సరిహద్దుల నడుమ వున్న ప్రాంతమంతా నా సామ్రాజ్యమే. ఆ సరిహద్దులు దాటి ఏ ఇతర జంతువులు ప్రవేశించినా వాటికి మరణ శాసనమే. నేను సుమారు 11 అడుగుల పొడవు, 300 కిలోల బరువు వుంటా. 5 మీటర్ల దూరం వరకు దూకగలను. గంటకు 65 కి.మీ. వేగంతో పరుగెత్తగలను. మీరు గమనించారో లేదో... మా జాతిలోని ఏ పులి ఒంటి మీదనయినా దాదాపుగా 100 చారలు ఉంటాయి. ఏ రెండు పులుల ఒంటి మీది చారలూ ఒకేలా ఉండవని మీరు తెలుసుకోవాలి. నాకు కాస్త కోపం కూడా ఎక్కువే. ఒక్కసారి పంజా విసిరానంటే... మనిషి పుర్రె చెక్కలవ్వాల్సిందే.
మాలా బతకడంలే..
ప్రపంచంలో మా పులుల సంఖ్య అంతరించిపోయే దశకు చేరుకోవడంతో కళ్లుతెరిచిన అంతర్జాతీయ సంస్థలు పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో 2010 నవంబర్‌ 24న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో మొట్టమొదటి పులుల సదస్సును నిర్వహించాయి. 'జూలై 29న అంతర్జాతీయ పులుల దినం'గా పాటించాలని ఆ సదస్సు తీర్మానించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా మేము విస్తరించి ఉన్న దేశాలన్నింటిలోనూ అంతర్జాతీయ పులుల దినాన్ని పాటిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టర్కీ నుంచి రష్యా తూర్పు తీరం వరకు మా రాజ్యం విస్తరించి ఉండేది. గడచిన వందేళ్లలో మా ఆవాసంలో 93 శాతం విస్తీర్ణాన్ని కోల్పోయాం. మా సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అడవుల నరికివేత వల్ల, వేటగాళ్ల వల్ల మా సంఖ్య దాదాపు 97 శాతం మేరకు పడిపోయింది. దీంతో మా జాతి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. రాబోయే తరాల వారు మమ్మల్ని జూలోనే చూడాలేమో. ఆ విషయం తలచుకుంటేనే బాధగా వుంది. నాగరిక సమాజం మా పులుల పాలిట శాపంగా మారుతోంది. ఆ విషయం నేనేదో ఊహించి చెప్పడంలేదు. శాస్త్రీయ అధ్యయనాలు, గణాంకాలను మీరూ ఓసారి చూస్తే ఎన్నో చేదు నిజాలు వెల్లడవుతాయి. ఏ అడవిలో పెద్ద పులి ఉంటుందో ఆ అడవిలో పర్యావరణ సమతుల్యం పరిఢవిల్లుతుంది. మాకో నీతి వుంది. ఒక పులి సంచరించే ప్రాంతం చుట్టుపక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్‌ పిరమిడ్‌లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతో కూడిన దట్టమైన అడవి అయ్యి ఉండాలి. ఇదీ మా రాజసం. అయితే... 1913 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష మా సంఖ్య. 2010 నాటికి ఆ సంఖ్య కాస్తా 3,200కు పడిపోయింది. తాజా లెక్కల ప్రకారం మా సంఖ్య 3,890కి చేరుకుంది. గుడ్డి కంటే మెల్ల నయమన్నట్టుగా కాస్త ఉపశమనం. మీకింకో షాకింగ్‌ న్యూస్‌ చెప్పనా... వందేళ్లలో మా పులుల సంఖ్యలో తొలిసారిగా నమోదైన పెరుగుదల ఇది. అయితే శాస్త్రీయంగా గణాంకాల నిగ్గు తేల్చింది లేనిది తెలీదు. అంతకు ముందు మా సంఖ్య అంతా లెక్కగట్టగలిగారా లేదా? ఇప్పటి లెక్కల కన్నా అప్పుడే ఎక్కువున్నాయా? అనే సందేహాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే సంతోషించాల్సింది ఏమీ లేదు. ఒకవేళ నిజంగానే మా సంఖ్య పెరిగి ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగితే... భారత్‌, నేపాల్‌, భూటాన్‌, రష్యాలలో కూడా మా సంఖ్య బాగానే పెరిగే అవకాశం వుంది.
వందేళ్లలో మొదటిసారి 
ప్రపంచవ్యాప్తంగా గడిచిన వందేళ్లలో మొదటిసారిగా పులుల సంఖ్య పెరిగినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పులుల అక్రమ రవాణాను అడ్డుకుని, సంరక్షణ చర్యలు చేపడుతున్నందు వల్లే పులుల సంఖ్యలో ఈ పెరుగుదల నమోదైనట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య 3,890 ఉన్నట్టు ప్రకటించింది. 2010లో 3,200గా ఉన్న పులుల సంఖ్య నమోదైంది. అంటే దాదాపు 700 పులుల సంఖ్య పెరిగినట్టు ఐయూసీఎన్‌ తెలిపింది. ఆసియా మొత్తంలో ఉన్న పులులను వీరు లెక్కించారు. భారతదేశంలో 2,226, రష్యా, సైబీరియా-433, 371, ఇండోనేషియా-371, మలేషియా-250, నేపాల్‌-198, థాయిలాండ్‌-189, బంగ్లాదేశ్‌-106, భూటాన్‌-103, చైనా-7, వియత్నాం-5, లావోస్‌-2, కంబోడియా-1గా ఉంటే, మయన్మార్‌లో పులుల సంఖ్య శూన్యం. వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ (డబ్యూడబ్యూఎఫ్‌) మేసేజర్‌ డారెన్‌ గ్రోవర్‌ 20వ శతాబ్దంలో పులుల సంఖ్య పెరగడం ఇదే మొదటిసారని సంతోషం వ్యక్తం చేశారు. పులుల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022 నాటికి పులుల సంఖ్య 6400కు చేరుకుంటుందని గ్రోవర్‌ తెలిపారు.
మా తాత ముత్తాతలు 
జంతులోకంలో పులులు, పిల్లులదీ ఒకటే జాతి. అందుకే మమ్మల్ని 'బిగ్‌ క్యాట్‌' అంటారు. స్థూలంగా మేము 'ఫెలైన్‌' జాతికి చెందినవారము. మేము మాంసాహార జంతువులమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. 'ఫెలైన్‌' జాతిలో 41 రకాల ఉపజాతులు ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘ గతానికి చెందిన ఒకే జంతువు నుంచి పరిణామం చెందాయి. వీటిలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. వీటిలో భారీగా ఉండి, అడవుల్లో సంచరించే అన్ని రకాల పులులు, చిరుతలు, సింహాలను 'పాంథరీన్‌' అంటారు. మిగిలిన రకాల పిల్లులను 'ఫెలినే' అంటారు. 'ఫెలైన్‌' జాతిలోని జంతువుల్లో మా పులుల జాతే పెద్దగా ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది జాతుల పులులు ఉండేవి. వాటిలో మూడు జాతుల పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌, ఇండో-చైనీస్‌ టైగర్‌, మలయన్‌ టైగర్‌, సైబీరియన్‌ టైగర్‌, సౌత్‌ చైనా టైగర్‌, సుమత్రన్‌ టైగర్‌. కాగా... బాలీ టైగర్‌, కాస్పియన్‌ టైగర్‌, జావన్‌ టైగర్‌ అంతరించి పోయాయి. సైబీరియన్‌ పులిని ఉత్తర చైనా పులి అని, మంచూరియన్‌ పులి అని, అముర్‌ అని కొరియన్‌ పులి అని కూడా పిలుస్తారు. ఇది పులి జాతిలో ఒక అరుదైన జంతువు. దూర ప్రాచ్యం ప్రాంతంలో అముర్‌ నది ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుతం రక్షిత వన్యప్రాణి. ఇది పులి ఉపజాతిలో ఫెలినే కుటుంబంలో అతి పెద్దదైన జంతువు. ఇది సాధారణంగా మనుషులను తినడానికి అలవాటు పడదు. మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన వాటిని 'లైగర్‌' అంటారు. మగపులికి, ఆడ సింహానికి పుట్టిన వాటిని 'టైగన్‌' అంటారు. మా శాస్త్రీయనామం పాంథేరా టైగ్రిస్‌. టైగర్‌ అనే పదం గ్రీకు భాషలోని టైగ్రిస్‌ నుండి వచ్చింది. దాని అర్థం బాణం. పాంథేరా అంటే పసుపు జంతువు అని అర్థం. ఇది ఫెలిడే కుటుంబానికి చెందినది. పాంథేరా తరగతికి చెందిన నాలుగు 'పెద్ద పిల్లులలో' ఇదొకటి.
మా జీవితమిదీ 
జీవిత కాలంలో ఒక ఆడపులి సుమారుగా సమాన సంఖ్యలో ఆడ, మగ కూనలకు జన్మనిస్తుంది. వాటికి మూడున్నర నెలల వయసు వచ్చేంత వరకు తల్లిపులి వాటిని తన స్థావరంలో ఉంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ తర్వాత తల్లి వద్దనే వేట మెళుకువలూ నేర్చుకుంటాము. ఏడాదిన్నర వయసు వచ్చేసరికి సొంతంగా వేటాడే స్థితికి చేరుకుంటాం. అయితే, రెండున్నరేళ్లు వచ్చేంత వరకు తల్లి వద్ద పెరిగే మేము... ఆ తర్వాత తల్లిని విడిచిపెట్టేస్తాము. ఆడ పులులు మూడున్నర నుంచి నాలుగేళ్ల వయసులోను, మగ పులులు ఐదు నుంచి ఆరేళ్ల వయసులోను పునరుత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. మా ఆయుర్దాయం గరిష్టంగా 26 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే... వేటగాళ్ల బారిన పడటం, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు వంటి కారణాల వల్ల మా సగటు ఆయుర్దాయం పదేళ్లకే పరిమితమవుతోంది. తగిన రక్షణ చర్యలు తీసుకుంటే మా ఆయుర్దాయం మరింత పెరిగే అవకాశం వుంది.
మా మెనూ
ఇక నాకు ఇష్టమైన ఆహారమేదో మీకు తెలుసుగా... నాన్‌ వెజ్జే. సాంబార్‌, గౌర్‌, జింక, అడవి పంది, నిల్గై, నీటి గేదె, పెంపుడు గేదెలు నాకు అత్యంత ప్రీతికరమైన ఆహారం. కొన్నిసార్లు చిరుతలు, కొండచిలువలు, ఎలుగుబంటి, మొసళ్ళను కూడా వేటాడతాను. సైబీరియాలో ముఖ్యమైన ఆహారం మంచూరియన్‌ వాపితి, అడవి మగపంది, సికా జింక, మూస్‌, రో డీర్‌, కస్తూరి జింక. సుమత్రాలో సాంబార్‌, ముంట్జాక్‌, అడవి మగ పంది, మలయన్‌ టాపిర్లు ఆహారంగా తీసుకుంటా. ఆ మాట కొస్తే... కుందేళ్లు, చేపలతో సహా దేన్నీ వదిలిపెట్టను. 
మీరు మా వేషాల్లో 
నేను ఎంత ప్రాచుర్యమంటే... తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాలుగా పులివేషం వర్థిల్లుతోంది. మీకు తెలుసో లేదో ఇదో జానపద కళారూపం. దీన్ని వేత నృత్యమని కూడా పిలుస్తుంటారు. హిందూ, ముస్లిం అనే మత వివక్ష లేకుండా దసరా, సంక్రాంతి పండుగలకు, మొహరం, పీర్ల పండంగలకూ పులివేషం వేస్తారు. పులివేషం వేసినవాళ్లు లయబద్దంగా వేసే అడుగులు చూసి నాకు నేనే మురిసిపోతుంటాను. నా ఠీవిని వాళ్లలో చూసుకుంటాను. ఇప్పుడంటే... నా వేషం వేసేవాళ్లు తగ్గిపోయారు గానీ.. ఒకప్పుడు ఆంధ్రదేశం నలుమూలల పల్లెపల్లెనా పులి నృత్యాలను మీరూ చూసే వుంటారు. అసలు పులి నృత్యాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చింది పల్లె ప్రజలే. పులివేషం వేసినవారు నృత్యంలో చూపే నైపుణ్యానికి పిల్లలు భయపడేవారంటే నమ్మండి. నాకైతే భలే సంతోషంగా వుండేది.
ఇదేం వినోదం
అడవికి రారాజునైన నన్ను దురదృష్టవశాత్తూ సర్కస్‌లో వినోదాన్ని అందించే స్థాయికి దిగజార్చేశారు. నా స్వేచ్ఛను అడ్డుకుని బోనులో బంధిస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు, వన్యసంరక్షణ కేంద్రాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కాదు. ఇదే జరిగితే భవిష్యత్‌లో బోనుల్లో చూడటానికి కూడా మేము మిగలకపోవచ్చు. ఇంటర్నెట్‌లో ఫొటోలు చూసుకోవాల్సిన పరిస్థితి దాపురించవచ్చు. అందుకే పాలకులు, అధికారులు మా స్వేచ్ఛను కాపాడాలి. రాచరికపు వ్యవస్థలోనూ మమ్మల్ని వినోద వస్తువుగాను, వేటాడబడే జంతువుగానే చూశారు. బ్రిటిష్‌ హయాంలోనూ విచ్చలవిడిగా వేటాడారు. 1920 కాలంలో కల్నల్‌ జెఫరీ నైటింగేల్‌ అనే బ్రిటిష్‌ సైనికాధికారి ఏకంగా మా ముత్తాతలైన 300 పులులను మట్టుబెట్టాడు. మహేశ్‌ రంగరాజన్‌ అనే చరిత్రకారుని అంచనా ప్రకారం 1875 నుంచి 1925 మధ్య కాలంలో వేటగాళ్ల తూటాలకు దాదాపు 80 వేల పులులు బలైపోయాయి. స్వాతంత్య్రానంతర కాలంలో ఇప్పటి ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా మహారాజా తాను 1150 పులులను వేటాడినట్లు 1965లో బహిరంగంగానే చెప్పుకున్నాడు. అప్పట్లో రాజవంశీకులు, జమీందార్లు తాము వేటాడిన మా పులుల చర్మాలను ఇళ్లలో అలంకారంగా ఉంచుకునేవారు. మా గోర్లతో పతకాలు తయారు చేయించుకుని, వాటిని ధరించడం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించేవారు. ఇక స్వాతంత్య్రానంతరం విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వం వేట కోసం భారత్‌ రావచ్చంటూ ఆహ్వానించింది. దీంతో మా సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1971 నాటికి మన దేశంలో పులుల సంఖ్య 1800కు పడిపోయింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం... మా సంరక్షణ కోసం 1972లో రూపొందించిన 'ప్రాజెక్ట్‌ టైగర్‌' 1973 నుంచి అమలులోకి వచ్చింది. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి 2006లో సవరణ తెచ్చి, జాతీయ పులుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో మా పులుల కోసం 47 అభయారణ్యాలు ఉన్నాయి. అటవీశాఖ అధికారులు నిత్యం పులుల జాడల కోసం యత్నించాలి. ఇందుకోసం 'టైగర్‌ ట్రాకర్స్‌'ను నియమించారు. ఇది మా పులుల జాడ చెప్పే ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ. సాధారణంగా స్థానిక గిరిజనులను ఇందుకు ఏర్పాటు చేసుకుంటారు. మా పులుల అడుగుజాడలు గుర్తించే విధంగా వారికి శిక్షణ ఇస్తారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో కెమెరాలు అమర్చి సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఒక్కోసారి మా పులులకు కేంద్రమైన అభయారణ్యానికి తరలించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ టైగర్‌ ట్రాకర్స్‌ వ్యవస్థ కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు.

మా విలాపం.. విన్నపం...
అడవుల్లో ఎక్కడ చూసినా మృగ విలాపమే. ఏ పులీ గాండ్రించడంలేదు. విలపిస్తోంది... వణికిపోతోంది. రాజసం ఉట్టిపడే బెబ్బులిలాంటి నాకే రక్షణ కరవైంది. గాండ్రింపుతో అడవిలో ఇతర జంతువులను హడలెత్తించే నేను ఇపుడు నిలువునా వణికిపోతున్నా. మానవ మృగాల ధాటికి గుండెలవిసేలా విలపిస్తోన్నా. జాతీయ జంతువునైనా నా ఉనికే ప్రమాదంలో పడింది. ఇక సాధారణ జంతుజాలం పరిస్థితి చెప్పనలవికాదు. రాజసం ఉట్టిపడే బెబ్బులికే ఇపుడు రక్షణ కరువైంది. వేటగాళ్ల భారినపడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మా కోసం ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లోనూ రక్షణ లేకుండా పోతోంది. అధికారులు నిఘా పెడుతున్నా... వేటాగాళ్లకు కళ్లెం పడటంలేదు.
ఒకప్పుడు నేను జాతీయ జంతువునని పొంగిపోయేదాన్ని. ఆ హౌదా వల్ల ఒరిగిందేమీ లేదని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఒక్క గాండ్రింపుతో మదపుటేనుగును సైతం పరుగులు పెట్టించే నేను... ప్రాణభయంతో అల్లాడిపోతున్నాను. మూడేళ్ల వయసు రాగానే మగ పులి సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అడవులు అంతరించడం, అరణ్యాలలో సరైన మదుగు లేకపోవడం వల్లనే మేము ఊళ్లలోకి రావాల్సి వస్తోంది. పెరుగుతున్న పట్టణీకరణ ప్రభావంతో అడవులు క్షీణించిపోతున్నాయి. ప్రస్తుతం 93 శాతం పులులు కేవలం అడవుల నరికివేత వలన అంతరించిపోతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీటితో పాటు అనేక రకాల జంతువులూ అంతరించిపోతున్నాయి. నేనే కాదు అటవీ ప్రాంతాల్లోని అనేక జీవ జాతులు అంతరించిపోతున్నాయి. నా కళ్ల ముందే ఎన్నో జాతులు కనుమరుగయ్యాయి. ప్రాణం ఉగ్గబట్టుకొని బతుకున్న నా జాతిని కొంతవరకైనా సంరక్షించే ప్రయత్నం చేయబట్టే మిణుకుమిణుకుమంటున్న దీపంలా మేమైనా మిగిలాం. అలాగే మిగతా జంతు జాతులను కూడా సంరక్షించాలి. అడవులను వృద్ధి చేయాలి. అప్పుడే ప్రకృతిలో పర్యావరణ సమతౌల్యం వర్థిల్లుంది. లేకపోతే మేము కూడా అంతరించిపోయే ప్రమాదం వుంది. వేటగాళ్లు, స్మగ్లర్లు రెచ్చిపోతుండటంతో.. వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతోంది. విద్యుత్‌ షాక్‌ ఇచ్చి మరీ పులులు, ఇతర వన్య ప్రాణులను హతమార్చుతున్నారు. మమ్మల్ని దారుణంగా వేటాడటానికి, స్మగ్లింగ్‌ చేయటానికి కారణం చర్మం, గోర్లు, దంతాల విలువే కాదు.. అనేక నాటు వైద్యాల్లో మా ప్రతి భాగాన్ని వాడతారు. ఇవి అశాస్త్రీయ పద్ధతులు. ఫలితాలు లేనివి. అందువల్ల మాకు హాని కలగకుండా రక్షణ ఏర్పరచాలి. ప్రభుత్వం వాటి మా మనుగడ కోల్పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకనైనా టైగర్‌ ట్రాకర్స్‌ వ్యవస్థను పటిష్టపరచాలి. నా పరిస్థితి ఏ ఒక్క హృదయాన్ని కదిలించినా... తనువులు వంచండి...తరువులు పెంచండి.. తరుగులు పూడ్చండి.
జాతీయ జంతువుగా 
1972 నవంబర్‌ 18 నాకెంతో ప్రతిష్టాత్మకమైన రోజు. భారత జాతీయ జంతువుగా నాకు ఓ ప్రతిష్టను కట్టబెట్టిన రోజు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కి కూడా జాతీయ జంతువుగా మమ్మల్నే ఎంచుకోవడం మాకు మరింత గర్వకారణం. మన దేశంలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జాతి. సైంటిస్టులు రాణా టైగర్‌గా వ్యవహరిస్తారు. అందుకే మన ప్రభుత్వం నన్ను జాతీయ జంతువుగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకూ జాతీయ జంతువుగా వున్న నన్ను కాదని వేరొక జంతువును ఆ స్థానంలో కూర్చోబెట్టాలని కొందరు ప్రయత్నించడం దురదృష్టకరం. 

ఆశలు.. ఆవిర్లు...
ఇటీవల కాలంలో పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు కొంతమేరకు సత్ఫలితాలని స్తున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో పులులు అధికంగా ఉన్న తాడోబా పులుల అభయారణ్యంతోపాటు పెంచ్‌, సహ్యాద్రి, మెల్ఘాట్‌, నగ్‌జీరా నవేగామ్‌, బార్‌ అభయారణ్యాల్లో 190 పులులున్నాయి. 2010లో అభయారణ్యాల్లో 169 పులులుండగా వీటి సంఖ్య 190కి పెరిగాయి. అసోం రాష్ట్రంలోని కజిరంగ జాతీయ వనంలో పులుల సంఖ్య పెరిగిందని తాజా పులుల గణనలో వెల్లడైంది. 860 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కజిరంగ అడవిలో 83 ఉన్న పులుల సంఖ్య మూడేళ్లలో 104కు పెరిగిందని తాజా గణనలో తేలింది. అసోం రాష్ట్రంలోని కజిరంగతోపాటు మనాస్‌, ఆరంగ్‌, నమేరీ పులుల అభయారణ్యాల్లోనూ పులుల సంఖ్య పెరిగిందని వెల్లడైంది. గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్న పులుల సంఖ్య ఎట్టకేలకు పెరిగింది. ఏడేళ్ల కింద 1400 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతం 2,226గా నమోదయినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2010 నుంచి పులుల సంఖ్య 30 శాతంపైగా పెరిగింది. 2010నాటి గణన ప్రకారం 1,706 పులులు ఉన్నట్లు నిర్ధారించారు. 2014లో చేపట్టిన లెక్కింపులో పులుల సంఖ్య బాగా పెరిగినట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులులలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయని పర్యావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పులుల సంఖ్య 1,945 నుంచి 2,491 మధ్య ఉండొచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. కర్ణాటకలో అత్యధిక పులులు ఉన్నాయి. 406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్‌లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్‌లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్‌లో 76 పులులు ఉన్నాయి. వేటగాళ్లు, అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠాలు, పులుల నివాస ప్రాంతాల కనుమరుగు లాంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 20వ శతాబ్దం ప్రారంభంలో దాదాపు లక్ష పులులు ఉండగా 2008 సంవత్సరంలో ఈ సంఖ్య 1411కి పడిపోయింది. 2004లో పులుల సందర్శనకి పేరొందిన సరిస్కా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక్క పులి కూడా లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి పులుల పరిరక్షణ కోసం అప్పటి నుంచి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

టాప్‌-5 రిజర్వ్‌లు 
పులుల సంరక్షణ వ్యవహారంలో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర రంగాలకు చెందిన వారి పాత్ర కూడా ఉంది. పులుల సంఖ్య పెరగడం ద్వారా ఎకో సిస్టమ్‌లో మంచి మార్పులు సంభవించడమే కాకుండా, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే, మన దేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉండే టాప్‌-5 టైగర్‌ రిజర్వ్‌లు ...
నటడోబా అంథారి టైగర్‌ రిజర్వ్‌, మహారాష్ట్ర
నపెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌, మధ్యప్రదేశ్‌
నబందీపూర్‌ నేషనల్‌ పార్క్‌, కర్నాటక
నపన్నా నేషనల్‌ పార్క్‌, మధ్యప్రదేశ్‌
ననాగర్హోల్‌ నేషనల్‌ పార్క్‌, కర్నాటక

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...