8, ఫిబ్రవరి 2018, గురువారం

తెలంగాణ

అఖండ సంస్కృతి తెలంగాణ సొంతం.. కష్టాలైనా, సుఖాలైనా కలసికట్టుగా ఎదుర్కొనే ఉన్నత భావం.. ఉత్సవాల్లో, ఆచార వ్యవహారాల్లో ఉదాత్తమైన భావనలు, ఆనందదాయకమైన అనుభూతుల సంగమం.. శ్రమను నమ్ముకుని, ప్రకృతితో మమేకమై సాగిపోయే ఈ విశిష్ట సంస్కృతి ఒక్క పది జిల్లాల్లోనే కాదు, దక్షిణ భారతంలోని ఎన్నో ప్రాంతాల్లో కన్నుల పండగ చేస్తుంది. ఇంతటి ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతిపై ఆచార్య జయధీర్ తిరుమలరావు విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం
తెలంగాణ సంస్కృతి అంటే పది జిల్లాలకే పరిమితమైంది కాదు. 1850 దాకా తెలంగాణ కేంద్రంగానే ఆరు రాజవంశాలు స్థాపితమయ్యాయి. తెలంగాణ కేంద్రంగా పరిపాలన సాగింది. అలా పాలన సాగిన ప్రాంతమంతటిలోనూ తెలంగాణ సంస్కృతి కనిపిస్తుంది. ఇది శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాల్సిన అంశం. దక్కన్ పీఠభూమి పరిసర ప్రాంతాలతో కూడుకున్నది తెలంగాణ సంస్కృతి. దీన్ని తెలంగాణ అఖండ సంస్కృతి అనొచ్చు. ఎందుకంటే ఇక్కడి సాంస్కృతిక రూపాలు మిగిలిన ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. 1956 తర్వాతనే ఇతర ప్రాంతాల సంస్కృతి తెలంగాణ మీదికొచ్చింది. మహారాష్ట్ర ప్రాంతంలోని చీరకట్టు, పదాలు, భాషాపరమైన సారూప్యత తెలంగాణలో కనిపిస్తుంటాయి. అలాగే కన్నడ ప్రాంతానికి, తమిళనాడుకి వలస వెళ్లిన జానపద కళాకారుల్లో చాలామంది తెలంగాణవారే. వారి దగ్గర రాగిపత్రాలుంటాయి. ఆరుట్ల రాంచంద్రారెడ్డి పాటలు వాళ్లు పాడుతుంటారు. హోసూరు పక్కన 50 పల్లెల్లోనూ, కోయంబత్తూరు ప్రాంతంలోనూ బతుకమ్మ ఆడుతుంటారు. వాళ్లు పాడే తెలుగు పాట వారికి అర్థంకాదు.. అయినా తెలుగులోనే పాడుతారు. వ్యవహార జీవితం తమిళమైనా వారి పాట మాత్రం తెలుగులోనే ఉంటుంది. అందుకే తెలంగాణ సంస్కృతి ఓ అఖండ సంస్కృతి (ఇతర ప్రాంతాల్లో పరివేష్టితమైన సాంస్కృతిక మూలాలను కలుపుకొని..). అందులోనూ ప్రజా సంస్కృతి ఎక్కువ పాళ్లలో ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతంటే ప్రజల సంస్కృతి, శ్రమ జీవుల సంస్కృతి.
ఇదో శ్రమక్షేత్రం
కేవలం లలిత కళలు మాత్రమే సంస్కృతి కాదు. ఆహారపు అలవాట్లు చూస్తే తెలంగాణ సంస్కృతి తెలుస్తుంది. ఇక్కడ కొన్ని పదార్థాలు ప్రత్యేకంగా వండుతారు. ఇక్కడి భౌగోళిక, నైసర్గిక స్వరూపానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లుంటాయి. జొన్నలు తదితర చిరుధాన్యాల వాడకం ఎక్కువ. బతుకమ్మ పండగలో ఎక్కువగా ఉండేవి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలే. చిరుధాన్యాలను గౌరవించడం, పూజించడం, వాటిని గుర్తించడం కూడా ఎక్కువ. ఆయా పండగల్లో, సందర్భాల్లో వీటినే వాడతారు. ఇక్కడ రాజ వంశాల పుట్టుక - రాజ వంశాలు అంతరించడం కూడా ఎక్కువే. ఇది యుద్ధక్షేత్రం. శ్రమక్షేత్రం. సంస్కృతిని ఎప్పుడూ ప్రజలే సృష్టిస్తారు. దానికి శిష్టులు బ్రాండ్ వేసుకుంటారు. వాటికి ఆహార్యాలను కల్పిస్తారు. తల్లివేరు మాత్రం ప్రజల్లోనే ఉంటుంది. రోకలి విసిరేటప్పుడు ఓ లయ, ఓ శబ్దం, ఓ గతి ఉంటాయి. సువ్వి - అందులోంచి వచ్చిందే. రోకలి పోటు కిందికి అనేటప్పుడు 'స', పైకి లేపేటప్పుడు 'హ' అంటారు. అంటే శరీరం చేసే శ్రమలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు శబ్దాన్ని, సంగీతాన్ని సమకూర్చి పాటనిచ్చాయి.
వెండి వన్నెలు
భౌగోళిక అవసరాలకు, శీతోష్ణస్థితి, వాతావరణానికి అవసరమైన రీతిలో ఇక్కడి అలంకరణ, వేషధారణ రూపొందాయి. పురుషులు ధోతీని పైకి దోపుతారు. స్త్రీలు కూడా చీరను అలాగే (గోచీలాగా) పురుషుల తీరులో కడతారు. ఇది గోండుల్లోనూ ఉంది. ఆదివాసీ సంస్కృతి, గోచీకట్టు సంస్కృతి నుంచే నృత్యం, శ్రమ, శ్రమవిధానం ఉంటాయి. యుద్ధానికైనా, శ్రమకైనా గోచీకట్టే. బాహుబలి సినిమాలో కూడా గోచికట్టే కనిపిస్తుంది. ముస్లింల రాజ్యంలోనైనా గోచీకట్టే కట్టారు. తలమీద పాగా చుట్టుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇక్కడి వాతావరణంలో పనిచేసేప్పుడు ఎండ నుంచి తట్టుకోవడానికి తలపాగా తప్పనిసరి. వెండి వాడకం తెలంగాణలో ఎక్కువ.
మహా విశిష్ట సంస్కృతి
మహా రాజవంశాలు, మహానగర సంస్కృతి ఇక్కడ వెల్లివిరిసాయి. కోటిలింగాల అలాంటిదే. బౌద్ధానంతర కాలంలో కొండాపూర్, పెదబంకూరుల్లోనూ మహానగర సంస్కృతి కనిపిస్తుంది. అక్కడ టంకశాలలున్నాయి. ఏ బౌద్ధ క్షేత్రానికి వెళ్లి చూసినా అందమైన గాజులు ఇప్పటికీ కనిపిస్తాయి. మెదక్‌జిల్లా కొండాపూర్‌ను వంద ఎకరాల సాంస్కృతిక గర్భ అనవచ్చు. శాతవాహనులకు పూర్వం కూడా అంధ్ర రట్టాలున్నాయి. రట్టం అంటే రాష్ట్రం. అలాంటి రాష్ట్రాలిక్కడెక్కువ. వాటిలో ప్రధానమైంది కోటిలింగాల. ఇక్కడ నాణేలు, కట్టడాలు ప్రత్యేకం. నాణేల తయారీ కేంద్రం ఉంది. వ్యవసాయ క్షేత్రాలున్నాయి. కేంద్రీకృతమైన రాజ్యవ్యవస్థ మూలరూపాలున్నాయి. శాతవాహనుల కాలంలో కూడా బౌద్ధ క్షేత్రాలకు ఇది ప్రసిద్ధి. బౌద్ధానికి కోటిలింగాల వద్ద ఉన్న దహేగాంలో బౌద్ధ స్తూపంలాంటి నిర్మాణం ఉంది. దాన్నిప్పుడు కరీంనగర్ మ్యూజియంలో పెట్టారు. జైనం కూడా ఇక్కడి నుంచి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఉత్తర, దక్షిణ భారత భూభాగాలకు ప్రవేశద్వారం (గేట్‌వే) దక్కన్ పీఠభూమి. సంస్కృతి, రాజ్యం, వ్యాపారం తరలి రావడానికి ఇదే ప్రవేశద్వారం. కన్నడ, రాయలసీమ, తమిళనాడుకు ఇది రహదారి. అన్ని సంస్కృతుల సమ్మేళనం ఇక్కడ జరిగింది. అందుకే తెలంగాణ భాషలో అత్యధిక భాషలు కనిపిస్తాయి. ప్రాకృతం, అరబిక్, పర్షియన్, ఉర్దూ (ఇక్కడ పుట్టిందే) సంస్కృతం కనిపిస్తాయి. ఇన్ని భాషల సమాహారం తెలంగాణ తెలుగు. ఇంత వైవిధ్యాన్ని ఇతరులు గుర్తించడం కష్టం. ఇన్ని సంస్కృతులను తట్టుకొని నిలబడగలగడం తెలంగాణ ప్రజల గొప్పతనం. ఇక్కడి పండగల్లోనూ ప్రకృతి ఆరాధన, సమష్టితత్వం కన్పిస్తాయి.
సంక్రాంతి వరకు..
సంవత్సరం పొడవునా పనులు చేసుకుంటూ ఉండే ప్రజలు తమ అవసరాల రీత్యా కొన్ని పండగలను, జాతరలను, ఆటవిడుపు రోజులను ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తులకు, కుటుంబాలకు సంబంధించినవే కాకుండా ఊరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న పండగలు ఇక్కడ ఎక్కువ. వర్షాకాలం నుంచి సంక్రాంతి దాకా వచ్చే పండగలు ప్రధానమైనవి. ప్రతి పండగకూ ఓ పాట, ఆట ఉంటాయి. మొదటి వర్షం పడగానే వచ్చేది ఉసిళ్ల పండగ. తొలకరితో బయటకి వచ్చే లక్షలాది ఉసిళ్లను మొదటి పంట అంటారు. పంట పండిన తర్వాత ఉత్సవం చేసి ఏరువాక ఎలా చేస్తారో.. ఉసిళ్లను భుజించడం కూడా అలాంటిదే. అదే మొదటి పండగ. ఉసిళ్ల కోసమే పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం జరిగిందని ఆదివాసీ భారతంలో ఉంది.
పండగలు.. పూజలు
వానలతో పాటే జబ్బులు కూడా వస్తాయి. అంటు వ్యాధులు ప్రబలిపోతాయి. వాటిని తగ్గించుకోవడం కోసమని ఆనాటి ప్రజలు కొంతమంది దేవతలను పూజించడం అలవాటు చేసుకున్నారు. శరీరంపై ముత్యాల్లా పొంగే చర్మవ్యాధులు ఎక్కువగా వచ్చేవి. దీన్ని ముత్యాలమ్మ దేవతకు ఆపాదించుకున్నారు. ఆమెను శాంతింపజేస్తే ఈ జబ్బులు కూడా శాంతిస్తాయనుకున్నారు. చారిత్రక కథనాలు, సాహిత్యం ప్రకారం - ప్రతాపరుద్రుడిపై దండయాత్ర చేసిన మావురాల ఎల్లమ్మ 'నీ దేశంలో ప్రజలంతా ముత్యాల జబ్బొచ్చి బాధ పడుదురు గాక' అని శపించింది. అలాగే జరుగుతుంది.. తర్వాత ప్రతాపరుద్రుడు ఆమెను శరణు వేడుతాడు. - మౌఖిక సాహిత్యంలో బైండ్ల కథల్లో ఇప్పటికీ చెబుతారిది. అంటే ఊరుఊరంతా అనారోగ్యగ్రస్థం కావడం ఉండేది. దానికి ప్రజలు భయపడేవారు. దానిని తగ్గించడం కోసం దేవతకు ఆదిమ భావన ప్రకారం పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి. బోనాల పండగ ఇలాంటిదే. ఈ పండగ జులైలోనే వస్తుంది. అంటే వానలు మొదలైన రోజుల్లో వస్తుంది. ఊరుఊరంతా కలిసి చేసుకుంటారు. ఇది ఊరి పండగ. దేవుళ్లు, దైవాలకు సంబంధించిన పండగల్లో ఈ ఊరి పండగ విలక్షణమైంది. ఆరోగ్యం దీని పరమార్థం. నిజానికి చాలా పండగల్లో ఆరోగ్యమే అంతర్లీనమైన అంశం. పండగ పరమార్థం పరిశుద్ధత! వ్యక్తిగతంగా, ఇంటి పరిసరాల్లో, వాడకట్టులో, గ్రామంలో.. ఇలా ప్రతిచోటా పరిశుభ్రత నెలకొల్పడం. ఇలా అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ పండగను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి పండగలో ఆట, పాట, సంభాషణ, భోజనం ఉంటాయి. వీటివల్లే తెలంగాణలోని పండగల్లో ప్రత్యేక ఆహార సంస్కృతి కనిపిస్తుంది. దీంతో పాటు ఆహార్యం కూడా భిన్నమే!
శుభానికి 'రంగం'
బోనాల్లో మరో కీలకాంశం 'రంగం'. రాబోయే రోజుల్లో కష్టనష్టాలు, సుఖాలు, వ్యవసాయం, వర్షాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం కోసం 'రంగం' చేస్తారు. పూనకం వచ్చిన స్త్రీ ఈ 'రంగం'లో భవిష్యవాణి చెబుతుంది. హైదరాబాద్‌లో ప్రధానంగా కనిపించినా తెలంగాణ అంతటా ఏదో రూపంలో ఈ బోనాలు ఉంది. ప్రజల మాటలు, పాటలు, వ్యవహారాల్లో.. ఎంతో ఉన్నతమైన భావన, మంచి జరగాలన్న ఆకాంక్ష ఈ పండగలో కనిపిస్తుంటుంది. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని.. అందరికీ శుభం జరగాలనే సామూహిక ఆకాంక్షలు కనిపిస్తాయి.
వ్యాధులు రాకుండా..
1868లో ప్లేగు వచ్చినప్పుడు ఉస్మానియా ఆస్పత్రిలో నిజాం రాజు ఉర్దూలో ఓ శాసనఫలకం వేయించాడు. 'ప్లేగు వచ్చిన సందర్భంగా సేవ చేసిన ప్రజలకు.. గ్రామదేవతలను శాంతింపజేయడానికి వారు చేసిన క్రతువులు, పాటించిన పరిశుభ్రత నియమాలు భేష్. ఇందులో పాలుపంచుకున్న వారందరినీ అభినందిస్తున్నాను.' అని అందులో నిజాం రాజు రాయించాడు. అలాంటి భావనతో కూడిన రాతి ఫలకమే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కూడా ఉంది. అంటే విధివిధానాలే కాకుండా అంటు వ్యాధులు రాకుండా ఉండే చేసే క్రతువు ఇది. దొంతి పెట్టే ఘటాల్లో (కుండల్లో) నీరు, ఆహారం ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడాన్ని రతిపోయడం, కుంభం పోయడం, పొంగళ్లు పెట్టడం.. అని కూడా అంటారు. ఇందులో చిరుధాన్యాలు ఎక్కువగా ఉండేవి. ఈ మొత్తం క్రతువులో స్త్రీ ప్రధాన బిందువు. పురుషుడు సహాయకారిగా ఉంటాడు. తన బిడ్డలు, కుటుంబ ఆరోగ్యాన్ని కోరుకుంటుంది తల్లి. అంతే కాకుండా పిల్లలు కలగాలని కూడా దేవతను కొలుస్తారు. అందుకోసం తొట్టెల రూపంలో ప్రభలు కడతారు. అంటే సంతానం కోసం చేసే ఆవాహన ఇది. ఆదిలాబాద్ సరిహద్దుల్లోని మహారాష్ట్ర మాహోర్‌లో ఉండే దేవతను మావూరి ఎల్లమ్మ, మావురాల ఎల్లమ్మగా పిలుస్తారు. అక్కడ శిరస్సు మాత్రమే ఉంటుంది. కిందిభాగం కర్ణాటకలో ఉంటుంది. జానపదాల్లో వీటికి సంబంధించిన పాటలన్నీ ఉన్నాయి.
ప్రకృతి పండగ బతుకమ్మ
బొడ్డెమ్మ తర్వాత వచ్చేది బతుకమ్మ. మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఇది పూలతో కూడిన ప్రకృతి పండగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలను ఏరుకొని వచ్చి బతుకమ్మను కళాత్మకంగా (పిరమిడ్ రూపంలో) పేరుస్తారు. ఇది పూర్తిగా ఊరి పండగ. ప్రతివాడకట్టులోనూ బతుకమ్మ కనిపిస్తుంది. పువ్వులు, నీరు, ప్రకృతి ఇందులో ప్రధాన అంశాలు. స్త్రీ చుట్టూ ఈ మూడూ, ఈ మూడింటి చుట్టూ స్త్రీ ఉంటుంది. పౌష్టికతను కలిగించే శక్తి... పంటల్లో ఈ పువ్వుల ద్వారా వస్తుంది. నీటిని శుద్ధి చేసే క్రియగా కూడా బతుకమ్మను గుర్తించొచ్చు. ప్రకృతి పర్యావరణాన్ని గుర్తించిన పండగ. అంతా కలసి సామూహికంగా చేసుకునే పండగ. ఆట, మాట, పాట కలగలిపి ఉంటాయి. సంగీతం, సాహిత్యం రెండూ ఉన్నాయి. సామరస్య ధోరణిని పెంచేలా పాటలుంటాయి. రాజస్థాన్ లాంటి చోట్ల కూడా పూల పండగుంది. కానీ పూలను పేర్చడంతో పాటు ఆట, పాట అనేవి తెలంగాణ ప్రత్యేకత. ఇందులో నిషిద్ధమైన పూవంటూ (విషపుపూలు తప్ప) లేదు. గ్రామం వెలుపల, గ్రామం లోపల ఉండే పువ్వులన్నీ ఇందులో భాగమే. ప్రతి పువ్వులోని గుణాలు నీటిని శుద్ధి పరిచి నీటికి శక్తినిస్తాయి. ఈ శక్తిమంతమైన నీరు పొలాల్లోకి పారి పంటలు పచ్చగా ఉంటాయనేది భావన. ఎరువులు తదితరాలు లేనికాలంలో నీటికి శక్తినివ్వడానికి పెట్టుకున్న ఏర్పాటిది. గడ్డిపూలు, పిచ్చిపూలు అనుకునే వాటిలోని ఔషధ గుణాలు పొలానికి చీడ పట్టకుండా కాపాడతాయి. గునుగు పూవు, తంగేడు, గుమ్మడి పూలు ప్రధానం. రుద్రాక్ష, చంద్రకాంత పూలు కూడా ఉంటాయి. పొట్లకాయ పూలు, బీరకాయల పువ్వులను కూడా పెడతారు. గునుగు పూవులాంటి వాటిలో ఔషధ గుణాలున్నట్లు పెద్దలు చెబుతుంటారు. అందుకే దాన్ని చేరుస్తారు. రంగులద్దడం వచ్చాక ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. తంగేడు లేనిది బతుకమ్మ లేదు. దడులు, అడవుల వెంట తిరిగి వీటన్నింటినీ మగవారు ఏరుకొని వస్తారు. అలా సాయం చేస్తారు. బతుకమ్మలో బోలెడంత సాహిత్యం ఉంది. మ్యూజిక్ కాని మ్యూజిక్.. చప్పట్లతో పాటపాడటం మరో ప్రత్యేకత. వర్తులాకారంలో పువ్వును ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం అంతా సాగుతుంది. మధ్యలో ఈ బతుకమ్మలను పెట్టి వంగుతూ లేస్తూ మంగళకరమైన శబ్దాలు చేస్తారు. భ్రమరాలు వచ్చి ఝుమ్మని చేసే ఝాంకారంలా ఈ చప్పట్లుంటాయి. పువ్వులు ముడుచుకొని విచ్చుకున్నట్లుగా వీరు వంగి లేస్తుంటారు. పువ్వులోని పుప్పొడి సంతాన సాఫల్యానికి ప్రతీక. బతుకమ్మలో మళ్లీ పసుపు ఉంటుంది. అన్ని రకాల చిరు ధాన్యాలను ఈ పండగలో వాడతారు. రోజుకోరకం చిరుధాన్యంతో ప్రసాదం చేస్తారు. చివరి రోజు చేసే సద్దులన్నీ ఈ చిరుధాన్యాలతో తయారయ్యేవే. ఇది పుష్టికరమైన ఆహారం.
బతకమ్మకు తంగేడు పూవు ప్రధానమైంది. పూలల్లో శ్రేష్టమైంది మాత్రం గుమ్మడి పువ్వని అంటారు. ఎందుకంటే గుమ్మడిలోని కేసరాలు పసుపులాంటి గౌరమ్మకు ప్రతీక. గుమ్మడి కాయ, పువ్వును సంతాన సాఫల్యతకు ప్రతీకగా చూస్తారు. బతుకమ్మ పాటల్లో కూడా చాలావరకు సంతాన సాఫల్యం, కలిగిన సంతానాన్ని కాపాడుకునే భావనలు కనిపిస్తాయి. దైవచింతన ఉన్నప్పటికీ చాలా పాటల్లో సామాజికపరమైన ఆలోచనలు కనిపిస్తాయి. మానవవీయమైన ఆశలు, ఆశయాలకు దగ్గరగా ఉంటాయి.
పొలాల అమావాస్య
ఇది పశుపోషణ పండగ. పశు సంపదను గౌరవించడం, పశువులకు, మనుషులకు ఉండే అనుబంధాన్ని తెలియజేసే పండగ ఇది. పశువులను అలంకరించి గౌరవిస్తారు. చిన్నపిల్లలు బంకమట్టితో అన్ని రకాల పశువులను తయారు చేసి వాటికి చిరుధాన్యపు గింజలను అతికించి అలంకరిస్తారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్‌లోనైతే ఆరోజు పశువులను చూడటానికి రెండు కళ్లు చాలవు. అంత కళాత్మకంగా అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు, అలంకరణలు ప్రత్యేకంగా చేస్తారు. ఏడాదంతా కష్టపడి ప్రత్యేకంగా పశువులకు దుస్తులను కుట్టించడం, చేతులతో అల్లడం.. ఇదంతా పశుసంపద పట్ల మనకున్న గౌరవాన్ని, అనుబంధాన్ని చాటేవే. ఈ సందర్భంగా తమ వద్ద పనిచేసేవారికి కొత్తదుస్తులు పెడతారు. ఇంట్లో ఈశాన్య దిక్కున పోచమ్మ గూడు పెడతారు. గూడు లేనిచోట గోడకే బొమ్మ గీసి పూజ చేస్తారు. అన్ని పశువులను అలంకరించి ఊరంతా నలువైపులా తిప్పుతారు. ఓచోట ఉట్లుకట్టి కొడతారు. కోలాటాలాడుతారు. ఇందులోనూ బోలెడంత సాహిత్యం.
బొడ్డెమ్మ
ఇది బతకమ్మకు ముందు జరుగుతుంది. బొడ్డి అంటే చిన్నపిల్ల అని అర్థం. దీన్ని చిన్నపిల్లలు మాత్రమే ఆడతారు. భాద్రపద పున్నమినే బొడ్డెమ్మల పున్నమ అంటారు. వాడవాడలో మూడు దొంతరల్లో గద్దె ఏర్పాటు చేసుకొని ఈ బొడ్డెమ్మను తయారు చేస్తారు. పసుపుబెట్టిన దేవతారూపాన్ని బొడ్డెమ్మ అంటారు. అక్కడే వెంపలి చెట్టు మొక్క పెడతారు. (కాలంగాని కాలంలో వెంపలి చెట్టుకు నిచ్చెన వేస్తారని ఓ సామెత కూడా ఉంది. ఇది ఓ వృక్షజాతి మొక్క.) దానిచుట్టూ సాయంత్రం తపుకుల్లో (చిన్న ప్లేటు) లేదా తడికలు అల్లేవారు చేసే సిబ్బిల్లో పూలను పేర్చుకొని వచ్చి ఆటాడుతారు. వీరికి కూడా పాటలుంటాయి. బొడ్డెమ్మను కూడా నీళ్లలోనే అనుపుతారు.
ఆరోగ్య 'బోనాలు'
బోనాల పండగలో అమ్మవారి ప్రతిమ ఉన్న ఘటం ఊర్లోని అన్ని ఇళ్లకు వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ భక్తితో ఘటం ముందు నీళ్లను పోస్తారు. అంటే ప్రతి ఇల్లు శుభ్రమైతే వాడ శుభ్రమైనట్లు.. వాడలన్నీ శుభ్రమైతే ఊరంతా శుభ్రమవుతుంది.. ఊరంతా శుభ్రమైతేనే ఆరోగ్యం పరిఢవిల్లుతుంది. దైవభావన సంగతి అలా ఉంచి - అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాల నుంచి కాపాడుకోవడం అంతస్సూత్రంగా కనిపిస్తుంది. ధాన్యాన్ని సామూహికంగా సేకరించడం కూడా ఇందులో భాగమే. ఊరుఊరంతా కలసికట్టుగా అనారోగ్యాన్ని ఎదుర్కొంటుంది. ఇది స్త్రీ పురుషులు కలసి చేసే పండగ. ముత్యాలమ్మకు తమ్ముడైన పోతరాజు సారథ్యంలో ఈ పండగ జరుగుతుంది. పోతరాజు సంస్కృతి మరాఠీ, చత్తీస్‌గఢ్‌ల్లోనూ ఉంది.  స్త్రీ దైవానికి అంగరక్షకుడిగా పోతరాజు ఉంటాడు. పోతరాజు దైవం కాదు. అటు స్త్రీలతో పాటు పులి వేషధారణతో పోతరాజులు కూడా ఒళ్లంతా పసుపు రాసుకోవడంలోనే చర్మవ్యాధులు రాకుండా ఉండాలనే భావన ఉంది. ఈ పండగలో కుమ్మరి ప్రధాన పూజారి. బైండ్లవారు లేనప్పుడు కుమ్మరే ఇక్కడ పూజారి. కుండ లేకుండా మన సమాజం లేదు. కుండ గర్భానికి కూడా సంకేతం. కుండ ద్వారానే గ్రామం శుద్ధి! బావిలోని నీటికి, ఊరి అవసరాలకు కుండే ఆధారం. బోనం పెట్టడం - అమ్మవారిని శాంతింపజేయడమనే అలౌకిక భావనలో అంతా కలసి వ్యాధులను ఎదుర్కొనే సౌహార్ద్రత దాగుంది. మూడోరోజు పెట్టే ఫలహార రథంలో పెట్టే పదార్థాలు కూడా ఆరోగ్యాన్ని పెంచేవే! చిరుధాన్యాలతో చేసేవే. మరింత ఆరోగ్యవంతంగా తయారయ్యేలా, పుష్టినిచ్చేలా, రోగనిరోధక శక్తిని పెంచేలా ప్రసాదాలుంటాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...