8, ఫిబ్రవరి 2018, గురువారం

రుద్రమదేవి మరణాన్ని శాసిస్తున్న చరిత్రకారులు


చరిత్రను నిర్మించడానికి ప్రాథమికాధారాలు లిఖిత ఆధారాలు, వస్త్వాధారాలు. చరిత్ర పరిశోధకులు ఈ ఆధారాలను గురించి వ్యాఖ్యానించేటపుడు సత్యాన్ని ప్రకటించడంలో స్వీయ ఆలోచనాధోరణులు చరిత్రకు నష్టం కలిగిస్తుంటాయన్నది చారిత్రకసత్యం. ఉన్నదున్నట్టుగా చెప్తున్నామంటూనే చరిత్రకారులు విపరీతవ్యాఖ్యానాలు చేయడం చరిత్ర చేసుకున్న దౌర్భాగ్యం.
కాకతి రుద్రమదేవి మరణాన్ని తెలుపుతున్న ఏకైక ఆధారం చందుపట్ల శాసనం. ఈ శాసనంలో ‘‘రుద్రమహాదేవి దేవలోకానకు విచ్చేస్తేని శివలోకప్రాప్తిగాను, మల్లికార్జునాయునింగారికి శివలోకప్రాప్తిగాను వారి భృత్యులు పువుముంమడిగారు శా.శ.1211విరోధి సం. మార్గశిర శు. ద్వాదశి(క్రీ.శ.1289 నవంబరు27) రోజున చండ్రుపట్ల సోమనాథదేవరకు, సాగి ఓగిరానకు రాసముద్రము వెనుక’’ వ్రిత్తిగా భూమిని కొంత యిచ్చాడని వుంది.
ఇందులో విచ్చేస్తేని అనే మాట మర్యాదపూర్వకపదం. మహారాణి రుద్రమకు ఆ మాట వాడి మల్లికార్జునునికి ఆ మాట వాడకపోవడం రాచమర్యాదే తప్ప ఇంకొకటి కాదు. ఈ మాటకు విపరీతార్థం తీసి వ్యాకరణ పరిభాషలో అర్థం చెప్పి విచ్చేస్తేని అన్నది అసమాపకక్రియ కనుక రుద్రమదేవి మరణించి స్వర్గానికి వస్తే శివలోకప్రాప్తి జరగాలని పువుల ముంమడి కోరుకున్నాడా? 1295లో చనిపోయే రాణిరుద్రమదేవి చావుకు ముందుగనే వారి పేరుమీద దేవునికి కానుకలు చెల్లిస్తారా ఎవరైనా? ఇదెక్కడి సంప్రదాయం. బతికుండంగ మరణశాసనాన్ని రచిస్తారా? ఒకరు చచ్చివుంటే స్వర్గం చేరాలని, బతికున్నవారు కూడా చనిపోతే స్వర్గానికి వెళ్ళాలని శాసనం వేయిస్తారా? చక్రవర్తి(ని)కదా ఆమె ప్రాణాపాయస్థితినుండి కోలుకోవాలని ప్రతాపరుద్రుడే దానధర్మాలు చేసివుండవచ్చుకదా లేదా పువుల ముంమడే వేరొక శాసనం చెక్కించవచ్చుకదా. చచ్చినవారిని, బతికివున్నవారిని ఒకేశాసనంలో కలుపుతారా? ఇదేం విజ్ఞత? రుద్రమదేవి అసహాయస్థితిలో అంబదేవుని చర్యలవల్ల అపస్మారస్థితిలోపడి వుండొచ్చనే వూహ సినిమాటిక్ విజన్ మాత్రమే.

1295 వరకు రుద్రమదేవి బతికివుంటే... ఏం చేసింది? ఒక విదేశీయాత్రారచనను నమ్మదగిందని, ఇక్కడ దొరికిన శాసనానికేమో విపరీతార్థం తీయడం చరిత్రకారునికి ఏం శోభనిస్తుంది. ఎందుకు రుద్రమదేవి మరణాన్ని వివాదాస్పదం చేస్తున్నట్టు?

రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిని నేనే రాణిగా నిలబెట్టిన అనే గన్నారెడ్డి డైలాగ్ లాంటిదే ఈ వ్యాఖ్యానం కూడా. నిజచరిత్రలో ఎవరిపాత్ర ఎంతదో చెప్పే ఆధారాల అన్వేషణ జరిగిందా? వెతికినదెంత?చరిత్రకు చేర్చినదెంత? ఎందుకింత తొందరపాటులో చరిత్రకారులకు? రుద్రమదేవి మరణాన్నొక వివాదాస్పదం చేయడం పనిలేని చరిత్రకారులు గోర్లుగిల్లుకోవడంవంటిదే.

చరిత్రంటే ఇదేనా అని అసహ్యించుకునేట్లు చేయడానికా? ఇకనన్నా ఈ రాతలు మానండని విజ్ఞప్తి.

ఒక సాధారణ పాఠకుడు

ఎస్.హరగోపాల్

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...