8, ఫిబ్రవరి 2018, గురువారం

మామిడి హరికృష్ణ
మామిడి హరికృష్ణ గారు నిరంతర అన్వేషి.  అధ్యయనశీలి.  ఒంటరి బాటసారిలా సాగుతూ ఇలకోయిల పాటలా పరిమళమై అందరినీ చేరే సహృదయశీలి.  భాషా సాంస్కృతిక సంచాలకులుగా రోజూ 15, 16 గంటల పాట్లు బాధ్యతలు నిర్వహిస్తూనే కళలను శ్వాసించే సృజనాశీలి.  పోయెట్రీ, పెయింటింగ్, ఫిలాసఫీలను మూవీస్, మ్యూజిక్, మేగజైన్లు కలిపితే అది మామిడి హరికృష్ణ అవుతారు అని చమత్కారంగా చెబుతూ సాగే బహుదూరపు బాటసారి!
మూడేళ్ళ కాలంలో కళాకారులకు ఆప్తుడుగా, భాషకు బాసటగా తెలంగాణ సినిమాకు స్నేహ హస్తం చాపిన అందరి ఆత్మీయుడు. సౌందర్యారాధకుడు. సౌందర్య పిపాసి.!
 పాతికేళ్ళుగా మూతపడిన రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్ ని కొత్త వెలుగులతో ‘పైడి జయరాజ్’ ప్రివ్యూ థియేటర్ గా మార్చినా, కళా ఉత్సవాలకు కొత్త ఊపిరి పోసినా, భాషా సాంస్కృతిక శాఖను దేశంలో అగ్రగామిగా నిలిపినా ఆ ఖ్యాతి తెలంగాణ నేలది అని వినమ్రంగా చెప్పే ఈ సృజనశీలి రాబోయే ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ‘పాలపిట్ట’ తో  మనసులోని మాటను విహంగంలా రెక్కలు విప్పి పాలపిట్టంత అందంగా పంచుకున్నారు. వారి ఆలోచనల అంతరంగాన్ని అక్షరతోరణంగా అందిస్తున్నాం...

హరికృష్ణ గారూ, రవీంద్రభారతి రెండవ ఫ్లోర్ లో మీరు ‘పైడి జయరాజ్’ ప్రివ్యూ థియేటర్ గా తీర్చిదిద్దారు.  సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.  దాని గురించి చెప్పండి...

రవీంద్రభారతి 1961 లో ఏర్పాటయింది కదా.  ఇదే సెకండ్ ఫ్లోర్ లో ప్రివ్యూ థియేటర్ నిర్మించి 1982 varaku సినిమాలు ప్రదర్శించే వారట! తర్వాతి కాలంలో దాన్ని ఉపయోగించడం మానేశారు.  సినిమా అనేది సంస్కృతిలో అంతర్భాగం కాబట్టి రవీంద్రభారతిలో శాస్త్రీయ, జానపద నృత్యాలతో పాటు సినిమాను కూడా ప్రదర్శిస్తే బావుంటుందని ఆలోచించినప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్ గుర్తుకొచ్చింది.  24 ఏళ్ళ క్రితం మూతబడిపోయిన ఈ ప్రదేశాన్ని తిరిగి ఒక కొత్త శోభనిచ్చే ప్రయత్నం చేశాం.  ‘బతుకమ్మ’ ఫిలిం ఫెస్టివల్ ని 2015 లో నిర్వహించినప్పుడు కొంచెం శుభ్రం చేసి యంగ్ ఫిలిం మేకర్స్ తో పది రోజుల పాటు బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ చేశాం.  అలా సినిమాకు వేదికగా దీన్ని తయారు చేయాలన్న ఆలోచనకు అంకురార్పణం జరిగింది.  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.  చక్కటి ప్రొజెక్టర్, dolby surround system, 150 మంది చూసేందుకు వీలుగా వసతి, అనువైన స్క్రీన్ ఏర్పడడానికి రెండేళ్ళు పట్టింది.  25 ఏళ్ల తర్వాత రవీంద్రభారతిలో పూర్తి స్థాయిలో సినిమాల ప్రదర్శన మొదలయింది.

ఈ ప్రివ్యూ థియేటర్ కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించినప్పుడు ‘పైడి జయరాజ్’ పేరు తప్ప మరో పేరు గుర్తుకురాలేదు.  కరీంనగర్ నుంచి 1920 – 30 లలో బొంబాయికి వెళ్లి 50 కి పైగా చిత్రాలలో కధానాయకుడిగా నటించిన తెలుగువాడు.  తెలంగాణ బిడ్డ.  ఒక విస్మృత నటుడు.  మన భారత ప్రభుత్వం గుర్తించింది కానీ, సినిమా ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు.  వారికి నివాళిగా ఈ ప్రివ్యూ థియేటర్ కు వారి పేరు పెట్టాలని ప్రభుత్వం G.O. కూడా విడుదల చేసింది.

2017 సెప్టెంబర్ 22వ తేదీన ‘బతుకమ్మ’ ఉత్సవాలలో భాగంగా గౌరవ మంత్రివర్యులు ఈ థియేటర్ ను ప్రారంభించారు.  కొత్త తరం వారికి, కొత్త ఆలోచనలున్న యంగ్ జనరేషన్ కు ఫిలిం మేకర్స్ కు, డాక్యుమెంటరీ నిర్మాతలకు ఇదో వరం. ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాన్ని మేం కల్పిస్తున్నాం.  దర్శకులు శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి, సంకల్ప రెడ్డి, హాస్యనటులు శ్రీనివాస రెడ్డి లాంటి వారందరూ వచ్చారు.  వారందరూ ఆశ్చర్యపోయారు.  ఒక informal film training institute చూసిన అనుభూతి కలిగిందన్నారు.  నాకు మళ్ళా Howard Film Institute గుర్తుకొస్తోందని శేఖర్ కమ్ముల అన్నారు.  సినిమా మేకింగ్ కు సంబంధించి, టెక్నిక్కు సంబంధించి ఒక మేథో మధనం జరగాలని అనుకుంటా వుండే వాడిని.  అలాంటి స్పేస్ ఉండాలని అనుకునే వాడిని.  ఈ ప్రివ్యూ థియేటర్ ఆ లోటు భర్తీచేసిందని అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి చిత్ర దర్శకులు అన్నారు.   

న్యూవేవ్ చిత్ర నిర్మాతలకు, దర్శకులకు ‘సినివారం’ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒక కొత్త గాలికి, కొత్త తరానికి ఆహ్వానం పలుకుతున్నాయి.  ఇదంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లోంచి పుట్టిందని చెప్పటానికి నాకెంతో సంతోషంగా వుంది.  సినిమా రంగంలో తెలంగాణ ప్రతిభను చాటేందుకు ఇదో అడుగుగా నేను భావిస్తున్నాను.  ఒక్క ప్రదర్శనలే కాకుండా టీజర్స్ లాంచ్, సినిమా పోస్టర్ల ఆవిష్కరణ, సినిమా పుస్తకాల ఆవిష్కరణ... ఇలా వీటన్నింటికీ ఇప్పుడీ ప్రివ్యూ థియేటర్ ఒక వేదికగా నిలుస్తోంది.  Main Stream సినిమాకు ప్రత్యామ్నాయ వేదికగా ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నిలుస్తోందని మాత్రం చెప్పగలను.  సినివారంలో ఈ దాదాపు 160 మంది దర్శకుల కొత్త చిత్రాలను, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలను మేం ప్రదర్శించాం.  ఒక్క ఆస్కారే కాకుండా బెర్లిన్, కొరియన్, చైనీస్ ఫిలిం ఫెస్టివల్స్ వంటి వాటిపై నాకు అవగాహన వుంది.  ఇంకా కేన్స్ బ్రిటిష్ ఫిలిం ఫెస్టివల్ ఇలా ఎన్నో వున్నాయి.  ఆ pattern అనుసరించే ప్రయత్నం చేస్తాం.

ముందుగా ఫిల్మ్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఫిల్మ్ crew వేదిక మీదకు వస్తారు. అప్పుడు వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.  అందులో సినిమా మేకింగ్స్, సీనిక్ ఆర్డర్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ ఇలా ఎన్నో అంశాలపై చర్చ వుంటుంది.  అనంతరం ‘అతిధి దేవో భవ’ అన్నది మన తెలంగాణ సాంప్రదాయం.  వాళ్ళని సత్కరిస్తాం కూడా.  పెళ్లిచూపులు దర్శకులు తరుణ్ భాస్కర్ కి తొలి సన్మానం జరిగిందీ ఇక్కడే.  ఈ 160 మంది దర్శకులనీ శాలువాతో సత్కరించి, మొమెంటో యిచ్చి గౌరవించడం జరిగింది.

ప్రశ్న : సినిమాపై మీకు మంచి అవగాహన, పరిజ్ఞానం వున్నాయి.  కొన్ని డాక్యుమెంటరీలు మీరూ తీశారు కదా ...

దాదాపు 150 కి పైగా డాక్యుమెంటరీలు తీశాను.  జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు రావూరి భరద్వాజ గారితో మొదలుకొని, ‘విశ్వంభరుడు’ అనే పేరుతో డాక్టర్ సి.నారయణరెడ్డి గారి పై కూడా తీశాను.  ఇలా ఎన్నో ... ఇంకా వందేళ్ళ భారతీయ చిత్రంపై 60 – 70 ఎపిసోడ్లుగా వివిధ భాషల చిత్రాలపై డాక్యుమెంటరీలను ప్రొడ్యూస్ చేశాను.  క్లాసిక్ సినిమాలను, గొప్ప ఫిల్మ్ పర్సనాలిటీస్ ని పరిచయం చేస్తూ కొన్ని డాక్యుమెంటరీలు.  ఇవన్నీ వివిధ ఛానళ్ళు స్క్రీన్ చేశాయి.  script writing, editing, direction నేనే చేశాను.

ప్రశ్న : పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఎంట్రన్స్ లో మీరు ప్రపంచ సినిమాను ప్రతిబింబించే ఒక ‘collage’ రూపొందించారు.  అదే విధంగా లోపల కూడా చిత్రమాలిక, వివిధ ప్రముఖుల కొటేషన్లు దర్శనమిస్తాయి.  మీ అభిరుచికి దర్పణంగా ఇలాంటి ప్రివ్యూ థియేటర్ మరోటి ఉందా అనిపిస్తుంది.  అంటే ఒక ప్రభుత్వ శాఖ ఈ స్థాయిలో ఏర్పాటు చేసిందా అని ...

లేదు. ఇలాంటి ప్రివ్యూ థియేటర్ మరోటి లేదు. షార్ట్ ఫిలిమ్స్ కోసం, డాక్యుమెంటరీల కోసం, అమెచ్యూర్ ఫిల్మ్ మేకర్స్ కోసం అసలు లేదు.  Its first of its kind in the country.  మంచి మూవీలు అనగానే గుర్తొచ్చే బెంగాల్, కేరళలలో కూడా లేదు.  కేరళలో నాకు మంచి మిత్రులున్నారు.  నేను మలయాళం నేర్చుకున్నాను.  మలయాళంలో రాస్తాను.  అందువలన పరిచయాలు కూడా ఎక్కువే.  కేరళ ఫెస్టివల్స్ ఇక్కడ చేశాను.  వ్యక్తిగతంగా, డైరెక్టర్ గా, ఇది ఒక్క తెలంగాణలోనే, హైదరాబాద్ లోనే సాధ్యమయింది.  తెలంగాణ ప్రభుత్వం పూనికతో మా కల్చరల్ డిపార్టుమెంటుతో జరిగింది.

ప్రశ్న :  హరికృష్ణ గారూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీసు పనుల్లో తలమునకలవుతూ మీ personal space ని కాపాడుకుంటూ సినిమా, సాహిత్యం, పెయింటింగ్ వంటి మీకు నచ్చిన అంశాలలో చేయగలిగినవి చేస్తూ energy unbound అన్నట్టుండే మీ ఉత్సాహం వెనక రహస్యమేమిటి ?

నాకు మొదట్నించి ఉన్న వరమేమిటంటే మా అమ్మ నాకిచ్చిన అక్షరం.  అమ్మ వెళ్ళిపోయింది గానీ అక్షరాన్ని నాకు తోడుగా వుంచి వెళ్ళింది.  అప్పటినించి అక్షరమంటే ప్రేమ, తృష్ణ ఏర్పడ్డాయి.  నాకు మొదట చలంతో పరిచయం 9వ తరగతిలో ఏర్పడింది.  ఈనాడు ఆదివారం టాబ్లాయిన్ లో చలం మీద నిమగడ్డ వెంకటేశ్వర రావు ‘చలం – స్మశాన సాహిత్యం’ వ్యాసాలూ వచ్చేవి.  అర్ధం కాకపోయినా చదవటమే నాకు తెలిసింది.  అక్షరమంటే అంత ప్రేమ.  మాది వరంగల్ దగ్గర శాయంపేట.  నాన్న ‘BAMS’ లో డాక్టర్.  ఎప్పుడూ పుస్తకాలు తెస్తూండేవాడు.  తాతది వందల ఎకరాల్లో వ్యవసాయమున్నా ఇంట్లో చదువుకునే వాతావరం ఉండేది.  మా ఊళ్ళో మొదటి బంగ్లా కట్టింది మా తాత.  ఆయన పేరు బంగ్ల వెంకట రాజం అని స్థిరపడిపోయింది.  మాకు కచ్చరముండేది.  ఊళ్ళో తొలి రేడియో మా ఇంట్లోనే.  ఇక మా నాన్న డాక్టర్ అవటం వల్ల అందరితోనూ మమేకమయిపోయేవాడు.  మా అమ్మకి సేవే దైవం.  మా అమ్మకి కొనసాగింపు నేను.  చదువు మీద, పుస్తకం మీద, ఆలోచన మీద, జ్ఞానం మీద ఇంత తృష్ణ రావడానికి కారణం మా అమ్మ.  ఆమె చదివేది, నేను చదివేది, నాతో చర్చ పెట్టేది.  నాకు మా పెద్ద చెల్లాయికి 8 సంవత్సరాల అంతరం వుంది.  ఆ ఎనిమిదేళ్ళు మా అమ్మ నాతోనే, నేను మా అమ్మతోనే. మా చిన్న ప్రపంచం అలా ఉండేది.  పదో తరగతి వచ్చే వరకు శరత్ తెలిశాడు.  ఇంటర్మీడియట్ వచ్చే సరికి నన్నయ్య మహాభారతం, పాల్కు బసవపురాణం, అల్లసాని పెద్దన స్వారోబషమను సంభవం వంటివి చదవగలిగాను.  సిలబస్ కు పరిమితం అయిపోవటం నాకు ఇష్టముండదు.  నేను out of SYLLABUS లో వెళతాను.  నేనో విధ్వంసవాదిని (నవ్వు).  I am an iconoclast.  జీవితం విషయంలో నిబద్ధత ఉండాలి.  జ్ఞాన సమపార్జన విషయంలో చట్రాలు ఉండకూడదని నా నమ్మకం.  నాలో ఆ స్పష్టత వుంది.  చిగురు కనిపించే చెట్టుకు ఎన్నో ఏళ్ళ వేళ్ళు ఉన్నట్టే నాలోని యిప్పటి comprehensive outlook పునాది ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడ్డదే. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ప్రాచీన సాహిత్యంతో పాటు తకళ్ శివశంకర్ పిళ్ళై, బిభితిభూషణ్ బందోపాధ్యాయ , పన్నాలాల్ పటేల్, హరిప్రీత్ సింగ్, మాస్తి వెంకటేశ అయ్యంగార్ ఇలా అన్ని బాషల సాహిత్యాన్ని చదివే అవకాశం దక్కింది.  అయినా ఆ దాహం తీరేది కాదు.  యిప్పటికీ కొనసాగుతోంది.  డిగ్రీ చదివేటప్పటికి ఆక్టేవియాపాజ్ పరిచయం.   పరిచయం మంటే ఆక్టేవియాపాజ్ కవితల్ని తెలుగులోకి అనువాదం చేశాను.  తోమస్ ట్రాన్స్ తోమర్ ని కూడా. 1986 ప్రాంతంలో భోపాల్ లో కవితోత్సవం జరిగింది.  దాని మీద ఆంధ్రజ్యోతిలో వ్యాసాలూ సిరీస్ గా వెలువడ్డాయి.  అవి చదువుతున్నప్పుడు మనో నేత్ర దృష్టి ప్రపంచ సాహిత్య గవాక్షం వైపు మళ్ళింది.  ఒక మేర ప్రపంచ సాహిత్య చదివాను.  ఓలే  సోయంకా, టోనీ మోరిసన్, నోర్డిన్ గోల్డ్ మర్ ఇలా ఎంత మందినో చదివాను.  మార్క్వెజ్, సల్మాన్ రష్దీల మేజిక్ రియలిజం ప్రభావితం చేశాయి.  ఆల్బర్ట్ కేమూ, కాఫ్కా, సోమర్ సెట్ మామ్ లను ఎలా మర్చిపోతాం.  నిజం చెప్పాలంటే నేను వాళ్ళతోనే జీవిస్తున్నా.  క్లాసి శిష్ట్, మోడర్నిష్టులు, కంటెంపొరరీ ఎవరినీ వదలడం నాకిష్టముండదు.  ‘బందిపోట్లు’ రాసిన సావిత్రిని, ‘my stories’ కమలాదాస్, సెకండ్ సెక్స్ రాసిన సైమన్ డిబోవాని అంతే ప్రేమగా చదువుతా.  ఇంత చదవటం వలన విషయ విస్తృతి పెరిగి విస్తారమయిన అవగాహన ఏర్పడటానికి దారితీసింది.  నా  తాత్విక పునాదికి వీరంతా కారణం.  నేను చదివిన, నాకెదురయిన నేను చూసిన జీవితమే ఒక నేను. పెయింటింగ్ కూడా బాగా ఇష్టం.  నా స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ వేస్తాను.  పెయింటింగ్ మీద విస్తృతమయిన స్టడీ చేశాను.  ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఆర్కిటెక్చరు వీటి మీద Encyclopedia of Visual Arts అని 28 వాల్యూమ్స్ వున్నాయి.  ఏ పేజీలో ఏముంది అంటే చెప్పగలుగుతా.  నియోండర్తల్ కాలం నాటి Cave Paintings మొదలుకుని ఇప్పుడు ఆధునిక కాలం నాటి Existential Paintings వరకు impressionism, dadaism, surrealism, expressionism .... విన్వెంట్ వానో గోగ్, రఫెల్, డావిన్సీ, రినోయిర్ వీళ్ళందరి పద్ధతుల నుంచి జతిన్ దాస్ లు మన దామెర్ల రామారావులు, మన కొండపల్లి శేషగిరి రావులు, ఏలె లక్ష్మణ్ లు .... ఎంత విస్తృతమయింది ప్రపంచం అనిపిస్తుంది.

ఒక్కటి చెబుతాను దేవుడు గొప్పవాడు. కాళ్ళను నేలమీద పెట్టాడు.  బుద్ధిని తలపై ఉంచాడు.  నా ఊహలు, భావాలు, ఆశలు, ఆశయాలు ఆకాశంలో విహరించొచ్చు, కానీ కాళ్ళు మాత్రం నేలపై వున్నాయి గుర్తుంచుకో అంటూ ఈ రెండింటిని సమన్వయం చేసే గుండెని మటుకు మధ్యలో పెట్టాడు.  ఇది గమనించాలి.  గమనించాను గనక రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళతాను.  ఇదో నిరంతర తృష్ణ.

నా పదవీ బాధ్యతల నిర్వాహణలో, నా కార్య క్షేత్రంలో 14 – 15 గంటలు పనిచేస్తున్నా మిగతా టైం నాదే కదా.  ఇంటికి వెళ్ళాక రాత్రి పదిన్నర నుండి నా టైం మొదలవుతుంది.  మూడే మూడు పనులు చేస్తా.  చదవటమూ, రాయటమూ, చూడటమూ ... ప్రపంచ సినిమా చూస్తాను. లేదా వరల్డ్ లిటరేచర్ చదువుతాను ... లేదా రాస్తాను.  ఇది నా personal space.  A wave neither tires or retires. A soldier has no holidays. నేనూ అంతే.  ఒక్కరోజు కూడా లీవు తీసుకున్న దాఖలాలు లేవు. నాకు పనే పండగ. పనిలోనే పండగ.

ప్రశ్న : కొత్త తరానికి ఆసక్తికర విషయాలు చెబుతున్నారు కదా ... సాహిత్యంలో అనువాదాలు, కవితలు, వ్యాసాలు ఎన్నో చేశారు కదా డిపార్టుమెంటు కోసం పుస్తకాలను ఎడిట్ చేశారు ప్రచురించారు ... మరి స్వంత రచనలను పట్టించుకోకపోవడానికి కారణం ...

దాదాపు పదివేలకు పైగా వ్యాసాలు రాశాను. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ ఇలా ఎన్నో ఎన్నో అంశాలపై వ్యాసాలు అనేక పత్రికలలో వచ్చాయి.  తెలుగు, ఇంగ్లీషు భాషలలో ‘టైమ్’ magazine లో కూడా గెస్ట్ కాలమ్స్ రాశాను.  నా గురించి ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు.  జీవితమనే చెంప మీద ఛళ్ళుమనిపించ నీ లెక్కంత అన్నవాడిని.  ఆనవాళ్ల మీద నా గుర్తులు అన్న దాని మీద నమ్మకం లేనివాడిని.  జాన్ పాల్ సార్త్రే ముద్రలు దేనికి, బ్రాండ్ దేనికి అంటాడు.  శిలాఫలకం వేసుకుని కూచోలేదు వాళ్ళెవ్వరూ. నేనొక రైతుని తోటమాలి కదలుచుకోలేదు.  రైతు విత్తనాలు వేస్తాడు.  సత్తా ఉంటే బతుకుతాయి.  తోటమాలి ఎరువు వేస్తాడు, పెంచుతాడు, పోషిస్తాడు, మందు వేస్తాడు.  ఈ తోట నాది అని బోర్డు పెట్టుకుని వచ్చినోడికల్లా చూపిస్తాడు.

500 పైగా కవితలు పబ్లిష్ అయ్యాయి.  వ్యాసాలు పుస్తకాలుగా వేస్తే 60 బుక్స్ అవుతాయి.  దాంట్లో అనువాదాలున్నాయి. కవిత్వం వేయదలచుకున్నాను. కవిత్వంలో ఏం జరుగుతుందంటే బయట ప్రపంచం గురించి కవి స్పందిస్తాడు.  కవి అంటే ఒక దుఃఖం జరిగింది, సంఘటన జరిగింది స్పందిస్తాడు.  కానీ అంతరంగంలో కూడా ఒక ప్రపంచముంది మనసులోని ప్రపంచంలోకి తొంగి చూడటమనేది నా కవిత్వంలో ఎక్కువగా నేను ప్రయత్నించాను.  అందుకే నాది అంతర్వీక్షణం.  అంతర్లోకాల్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక తాపత్రయముంది.  రెండవది ఒక ఫిలాసఫికల్ జర్నీ వుంటుంది.  మూడవది తెలంగాణ పట్ల ప్రేమ, ఆకాంక్ష.

ఈ నేల చాలా గొప్పది.  ప్రపంచ సాహిత్యమంతా చదివిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతికథా, ప్రతి కవితా, ప్రతి నవల, ప్రతి అంశమూ కూడా ప్రపంచ సాహిత్యానికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నదన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు.  మార్క్విజ్ రాసిన దానికి, అరుంధతీరాయ్ రాసిన దానికీ, మన దగ్గరున్న తెలంగాణ రచయిత రాసింది అన్నీ ఒకే నేపథ్యంలో ప్రతిబింబం సమస్థాయిని కలిగి ఉంటాయి.  లోపం ఏమన్నా ఉంటే మనకు చెప్పే విధానం తెలియకపోవడం. Exposure లేకపోవటం.

ఇది గమనించి మన తెలంగాణ కవితల్ని ఇంగ్లీషులో translate చేశాను.  ప్రచురించే ప్రయత్నం చేయాలి.

నా వాక్యంలో గానీ, నా రచనల్లో గానీ multi cultural influence ఎక్కువ.  ఆఫ్రికన్ కల్చర్, లాటిన్ అమెరికన్ కల్చర్, కొరియన్ కల్చర్, జపనీస్ కల్చర్ ... వీటన్నిటి సమాహారంగా నా కవితలు ఉంటాయి.  పక్కా తెలంగాణ భాషలో 95లోనే కవిత్వాన్ని రాశా.  అప్పుడు మాండలీక ఇప్పుడు భాష. ఇటు నేటివిటీని, అటు యూనివర్సల్ కాస్మోస్ ని, కంట్రీని అన్నింటిని కలగలిపే అప్రోచ్ శైలి నాది.
****************************************************

ఫ్యూజన్ షాయరీ

నేను ప్రవేశ పెట్టిన ప్రకియ ఫ్యుజన్ షాయరీ.  చాలా మంది దాని గురించి రాశారు.  ఆ స్టైల్ లో రాశారు.  దానికో గ్రామర్ ని దిద్ది రాసిన వాళ్ళు లేరు. ఫ్యుజన్ షాయరీ అంటే మనం నివసిస్తున్న ప్రదేశాలు, ప్రపంచం ... కానీ ప్యూర్ కల్చర్ గా ఉన్న సందర్భం లేదు.  ఇందులో మల్టీ కలర్స్ వున్నాయి.  మల్టీ లింగ్యువల్, మల్టీ లైవ్స్ వున్నాయి.  మల్టీ లైవ్స్ మనం గడుపుతున్నాం.  బహుముఖీన జీవితాన్ని బహు జీవితాలని మనం గడుపుతున్నాం.  ఒక జీవితంలో బహు జీవితాలను గడుపుతున్నప్పుడు ఒక్క జీవితంలోని ఒక్క పార్శ్వాన్ని చూపిస్తాననడం సంపూర్ణం కాదు కదా.  బహుముఖీన జీవితాన్ని, బహు భాషాతత్వాన్ని, బహు సంస్కృతుల సందేశాన్ని అలాగే రీప్రెజెంట్ చేయాలని నా తపన.  ‘గోస’ అనే తెలంగాణ పదాన్ని Agony అనో Pain అనో ఇంగ్లీషులో చెప్పినా అందులో సాంద్రత రాదు, impact ఉండదు.  ఒక భాషలో ఆలోచించి రాస్తున్నప్పుడు ఒక ఫీల్ తో ఉన్న ఆ భాష పదాన్ని సమానార్ధాలు వెతకకుండా ఆ పదాన్ని అలాగే వుంచేయాలి.  అది ‘ఫ్యూజన్ షాయరీ’ అనుకుని డానికి కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నాను.

ఐదు నుంచి ఎనిమిది stanza లు ఉండాలి.  అది లైన్ బై లైన్ గా కాకుండా పేరాలుగా ఉన్నా ఫరవాలేదు.  Prose లో poetry చొప్పించటం.  ప్రతి stanza కు ఒక కొస మెరుపు వుంటుంది. అలా ఒక ప్రయోగం చేశాను.  దాదాపు ముప్పై కవితలు రాశాను.  ఇరవై కవితల వరకు ప్రచురించబడ్డాయి.  ఇది నాదైన కోణంలో కవిత్వాన్ని చూసే దృష్టి.  ఇప్పుడు కన్పించే ప్రయత్నానికి మూలాలు ఎక్కడో ఉంటాయి.  నేను రూపాన్నిచ్చే ప్రయత్నం నాది. ముత్యాల సరాల్లాగా .... sonnet, octave లాగా ... నియమం ఉంటే రీతి ఉంటుందన్న గ్రామర్ నాది.
*********************************************************
ప్రశ్న : ఇక్కడ్నించి మీ జర్నీ ఎలా ఉండబోతోంది ?  విస్తృతమయిన కేన్వాసుతో కూడిన మీ వైయక్తిక జీవితం ...

ఒక విత్తనం నేల తల్లి చీల్చుకుని తల పైకి పెట్టి బయటకు వచ్చింది, పెరిగింది. పూత పూసింది.  పరిమళాన్నిచ్చింది.  కాయకాసింది. రాలిపోయింది.  ఎంత సహజంగా జరిగింది.  ఇంతే సహజంగా వెళ్లిపోవాలి.  No strings attached. అతిధి వోలె వచ్చాను ... అతిధి వోలె వెళ్ళానన్నట్టుగా ... నేను ఈ లోకం నుంచి నిష్క్రమించిన మరుక్షణం నన్ను తలుచుకోకూడదు (philosophical గా).  ఆనవాళ్ల వ్యవస్థను ధిక్కరించేవాడిని.  ఓషో  ఫిలాసఫీలో ఒక మాట చెబుతారు. ఓషో ఈ లోకాన్ని ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు సందర్శించారు.  యిదొక జర్నీ.  ఈ జర్నీతో వచ్చాము, వెళ్తున్నాం ... ముందేముందో వెనకేముందో తెలీదు.
************************************************************
మర్రి చెట్టు నాకాదర్శం

ప్రాకృతిక నియమాలను సంతులనం చేయడంలో ప్రతి జీవి ఒక పాత్ర పోషిస్తుంది.  Positive purposivism అంటారు కదా.  ప్రతి కార్యానికి ఒక purpose ఉంటుంది.  ఆ purpose వుందని నమ్ముతాను.  నాకు మర్రి చెట్టు అంటే ఇష్టం.  గడ్డి మొక్క నుంచి మహా వృక్షం వరకు దాని నిరంతర తపన ఆకాశం వైపే వుంటుంది.  ఆకాశం వంక ఆశగా చూస్తుంది.  ఎదగాలి ఎదగాలి అని.  ఒక్క మర్రి చెట్టు మాత్రమే ఎదిగే క్రమంలో చేతులను ఊడలుగా చేసి నేలతల్లికి వందనమంటుంది.  అమ్మా తల్లీ నా ఎదుగుదలకు కారణమయిన నీకు వందనం అంటుంది.  నేల తల్లి చుబుకాన్ని చుంబించడం కోసం ఊడలతో ప్రయత్నం చేస్తూ వుంటుంది.  అది ఆ చెట్టు చెప్పే జీవన సందేశం.  అలాగే దేవుడు కూడా నేలను మించిన ఆలోచనలు చేయొద్దని కాళ్ళను నేలమీదుంచాడు. హ్యూమన్ ఇంజనీరింగ్ మించిన వండర్ మరొకటి లేదని అన్పిస్తుంది.
**********************************************************
ప్రశ్న  : ప్రపంచ తెలుగు మహాసభల్లో మీ పాత్ర  :

ఇక్కడ రెండు అంశాలున్నాయి.  తెలంగాణలో చాలా గొప్ప సాహిత్య కృషి జరిగింది.  అది పద్యం కావచ్చు. వచన కావచ్చు.  నన్నయ్య కంటే ముందే జరిగింది.  ఇంతవరకు గత అరవై ఏళ్ల కాలంలో సాహిత్య చరిత్ర ఒక perspective లో రాయబడింది.  తెలంగాణలో అంతకు ముందు జరిగిన కృషిని విస్మరించారు.  నన్నయ్య కన్నా వందేళ్ళ ముందున్న పంపన ప్రస్తావన ఎక్కడా కనబడదు.  మల్లినాధ సూరిని మర్చిపోయారు.  పాల్కురికి సోమన్న ఎన్నెన్నో ప్రక్రియలకు ఆద్యుడు.  నామ మాత్రపు ప్రస్తావన ఉంటుంది.  ఇలా అసంపూర్ణ ప్రాధాన్యతా క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది.  తెలంగాణ మలిదశ ఉద్యమంలో అధ్బుతమయిన సాహిత్యమొచ్చింది.

మనల్ని మనం re discover చేసుకునేలా చేసింది.  14 ఏళ్ళ ఉద్యమం ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగింది.  దాని కొనసాగింపు కావాలి.  మన మధ్య consolidate అయిన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.  అందుకని ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు భాష సుసంపన్నతలో సాహిత్య శోభతో ఇక్కడి కవులు, రచయితలు పోషించిన పాత్రను ప్రపంచానికి తెలియ చెప్పాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఈ సంకల్పాన్ని తీసుకున్నారు. దాన్ని సమర్ధంగా అందించే బాధ్యతలో అన్ని శాఖలతో పాటు మా భాషా సాంస్కృతిక శాఖ కీలకపాత్ర పోషిస్తుంది.  తెలుగు బాష, సాహిత్యం, పద్యం, అవధానం ప్రధానంగా వుండే అంశాలే అయినప్పటికీ వాటిని ముందుకు తీసుకువెళ్ళటంలో మా కృషి వుంటుంది.  పద్యాన్నొక సాంస్కృతిక రూపంగా ప్రదర్శింపచేస్తే అది మరింత రంజింప చేస్తుంది.  పంపన యొక్క పద్యాన్ని, జనవల్లభుడి శాసన ప్రశంసాన్ని, పాల్కురికి సోమన కవిత్వాన్ని నాటకీకరించి ఆ పద్యాలను పాత్రల ద్వారా నాటకీయంగా పలికిస్తే అది జన బాహుళ్యానికి చేరుతుంది.  మేం చేస్తున్న ప్రయత్నం అది.  తెలంగాణ సాహితీకారుల తెలుగు సాహిత్య సేవను సాంస్కృతిక రూపాల ద్వారా జనరంజకంగా ప్రదర్శింపజేయ బోతున్నాం.  మేము చేసే ప్రయత్నం అదీ.

ప్రధాన వేదికలయిన రవీంద్రభారతి, LB స్టేడియం, లలిత కళాతోరణంలో ఈ ప్రదర్శనలుంటాయి.  ప్రపంచ తెలుగు మహాసభలు ఒక జీవితకాలపు అనుభూతిని మిగల్చాలన్న లక్ష్యంతో మేం కృషి చేస్తున్నాం. ఇది తెలుగు పండగ.  అందరి పండగ.  భాషా పండగ.  తెలంగాణ జాతి పండగ.  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  నందిని సిధారెడ్డి గారు, డాక్టర్ కె.వి.రమణాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, బుర్రా వెంకటేశం గారూ వీరందరి సారధ్యంలో పండగ జరగబోతోంది.  సాంస్కృతికంగా, శాఖాపరంగా మేం కృషి చేస్తున్నాం.  పది పుస్తకాల వరకు ఆవిష్కరణలుంటాయి.  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేశాం.  ఇటీవల ఆకాశవాణి ప్రసారం చేసిన తెలంగాణ వైతాళికులు, కళల గురించి ధారావాహిక ప్రసంగాలను పుస్తక రూపంలో తెస్తున్నాం. అలాగే ‘TELANGANA HARVEST’ పేరుతో తెలంగాణ కధా సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువాదంగా తెస్తున్నాం.  ప్రొఫెసర్ దామోదర రావు గారు వారి బృందం దాని కోసం సంవత్సరన్నర కాలం బట్టి కృషి చేస్తున్నారు.  ఆ గ్రంధాన్ని కూడా ఈ సందర్భంగా తెస్తున్నాం.  50 అత్యుత్తమ కధలు ఇందులో ఉంటాయి.  ‘కొత్తసాలు’ గ్రంధాన్ని హిందీలో ‘నయాసాల్’ పేరుతో తెస్తున్నాం.

ప్రశ్న : మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారంటే ఏమని చెబుతారు ?

నేను 3 P’s, 3 M’s అని చెబుతాను. 3 P’s అంటే Poetry, Painting and Philosophy.  3 M’s అంటే Movies, Magazines and Music. ఇవన్నీ కలిపితే నేను అని చెబుతాను.  Solitude is my attitude.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...