8, ఫిబ్రవరి 2018, గురువారం

బెక్కంటి రామాచల గుట్ట


చుట్టూ పచ్చని చెట్లు,పంట పొలాలు,పిల్ల కాలువలు,పల్లె పరిసరాలు,నట్టనడుమ ఎత్తైన బండరాతి గుట్ట-గుట్ట పైన గుంభనంగా ఉన్న గుడి.!
ఆ గుడి దగ్గర ఎటువంటి హంగూ లేదు...ఆర్భాటమూ లేదు.!
చాంతాడంత భక్తుల లైనూ లేదు.,
భక్తుల కొరకు వెలసిన దుకాణాలూ లేవు.!
ఆ గుడి పరిసరాల్లో కట్టిన చిన్న గదుల్లో ఉన్న ఎందరో దీర్ఘ వ్యాధి గ్రస్తులు-గ్రహ పీడితులు,కొంత మంది భక్తులు,పూజారి కుటుంబ సభ్యులు,వాటం చూసి కడుపు నింపుకోవడానికి ఎదురు చూసే వానర సైన్యంతో...అంతా ఆధ్యాత్మికత నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం..!
ఆ పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, కొన్ని రోజులు ఆరాధిస్తూ,ప్రశాంత వాతావరణంలో,రోజూ వచ్చి పోయే భక్తులు చేసే అన్నదానమే,భగవంతుని ప్రసాదంగా తీసుకుంటే తమ కష్టాలు తొలగి పోతాయని అక్కడున్న దీర్ఘవ్యాధి గ్రస్తులు, గ్రహ పీడితులు,పూజారి పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆ క్షేత్ర విశిష్టతను తెలియజేస్తుంది..!
==వరంగల్ జిల్లా,చేర్యాల పాత తాలూకా,మద్దూర్ మండలం,వీర బైరాన్ పల్లి పక్కనే ఉన్న 'బెక్కల్' ఊరి దగ్గరి గుట్ట పైన ఉన్న శ్రీ రామ లింగేశ్వర స్వామి,శ్రీమల్లికార్జున
స్వామి వారి దేవాలయాలు అతి ప్రాచీనమైనవి.అక్కడికి సుమారు 60కి.మీ.దూరంలోని ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల కాలంలో దేవాలయ ప్రతిష్టాపన జరిగింది.
క్రీ .శ. 1117వ సం;స్వస్తిశ్రీ రాక్షస నామ సం#ర వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు కాకతీయ రుద్రమదేవి శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని ప్రతిష్టించి,చిన్న గుడిని కట్టించినారు.ఈ గుడికి శ్రీ విశ్వేశ్వరజీని పూజారిగా నియమించి,ఆయన జీవనోపాధికై వంశపారంపర్యంగా సంక్రమించేలా కొంత భూదానం ఇచ్చినట్లు దేవాలయ శాసనం వాళ్ళ తెలుస్తున్నది.
కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడికి సామంతుడిగా భద్రంగపురం కేంద్రంగా ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 1163 నుండి 1195 వరకు శ్రీ మల్లిరెడ్డి పరిపాలించాడు.ఆయన కాలం లోనే శ్రీ రుద్రదేవుడు నిర్మించిన చిన్న గుడి చెక్కు చెదరకుండా గర్భాలయంలో ఉండునట్లు ఒక త్రిముఖ దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు.శ్రీ మల్లిరెడ్డి పేరున మరికొంత విశాలంగా శ్రీ గుండోజి అనే శిల్పి చేత 'శ్రీ మల్లికార్జున స్వామి'దేవాలయము అద్భుతంగా నిర్మించినట్లు శ్రీ మల్లిరెడ్డి గారి వంశావళి కావ్యము రాయబడిన శాసనము ద్వారా తెలుస్తున్నది.
శ్రీ మల్లిరెడ్డి తమ పూర్వజులైన కేతన, భీరంరెడ్డి, పున్నిరెడ్డి,చందిరెడ్డి మరియు దేవిరెడ్డి మొదలైన 21 మంది పేరున 21శివాలయాలు ఈగుట్ట మీదనే కట్టించి,వాటిలో శివలింగ ప్రతిష్టాపన చేయించి,శ్రీ విశ్వేశ్వరజీ వంశానికి పూజా,నైవేద్యాలకై మరికొంత భూమిని, మామిడి తోటను దానమిచ్చినట్లు రాయబడ్డది.దేవాలయం లోపలి గోడల మీద సురక్షితంగా భద్రపరచబడ్డ శాసనాల మీద ఉన్న లిపిని కూలంకషంగా పరిశోధిస్తే మరింత విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది.2017 సం.నికి 900 సం.లు నిండే ఈ క్షేత్రాన్ని పురాతత్వ,దేవాదాయ శాఖలవారు శ్రద్ధ తీసుకొని అంతరించిపోతున్న తెలంగాణా సంస్కృతీ,సంప్రదాయ సంపదలను భావి తరాలకు అందించి,'కొత్త తెలంగాణా చరిత్ర' నిర్మాణానికి బాటలు వేయాలని, భగవంతుని ఆశీస్సులతో ఆర్ధిక పరిపుష్టి గల భక్తులు ఆలయ అభివృద్ధికి సహకారం అందించి,భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుతూ.....!

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...