8, ఫిబ్రవరి 2018, గురువారం

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణంలో సాటిలేని కౌశలాన్ని గౌరవించడం కోసం.. వారసత్వ సంపదగా గుర్తించడం కోసం మెట్లబావులను పునర్నిర్మించాల్సిన అవసరమున్నది. వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెలికి తీసిన మెట్లబావులు.. వాటి విశిష్టతలు, వీక్షణం గురించి ఈవారం సింగిడి స్పెషల్ స్టోరీ!  

ప్రజావసరాలను గుర్తించి పాలనచేసిన వారిలో ముఖ్యంగా కాకతీయుల గురించి చెప్పుకోవచ్చు. పదే పదే కాకతీయులను గుర్తుచేసుకుంటున్నామంటే వారు చేసిన యుద్ధాలు.. రాజ్య విస్తరణ వల్లనే కాదు. వారు తవ్వించిన చెరువులు.. కట్టించిన మెట్లబావులూ ఒక కారణమే.. వారు ప్రజల సామాజిక శ్రేయస్సు కోసం వాపీ.. కూప.. తటాకాలను నిర్మించారు. కానీ ఇప్పుడవన్నీ శిథిల చరిత్రగా మారిపోయాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించిన మెట్ల బావుల గురించి తెలుసుకుందాం. మెట్ల బావులంటే? : నీళ్లను చేరడానికి మెట్లుకట్టిన బావులు లేదా కొలనులు. పసులను కట్టి తాడుతో బొక్కెనను లాగించేబావులో లేక చక్రానికి పాత్రలు కట్టి బంతికట్టించి పసులను తిప్పే రాట్నం బావులో (నేమి, త్రికాలు) వ్యవసాయానికి వాడేవారు. మానవచరిత్రంతా నదీలోయ నాగరికతే. రుగ్వేదం.. సామవేదం.. యజుర్వేదం.. అధర్వణవేదాల్లో నీటిని నిలువచేసే పద్ధతులకు వివిధ పేర్లు వున్నాయి.

తొలి మెట్లబావి : మొదటితరం మెట్లబావులు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నిర్మించబడినవని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే మెట్లబావి తొలిసారిగా సింధూనదిలోయ నాగరికతకు నిలయమైన హరప్పా-మొహంజోదరో నగరాల తవ్వకాల సమయంలోనే బయల్పడ్డది. చిన్న కొండలపై గుహల్లో ఏర్పడ్డ నీటిగుండాలకు రాతిమెట్లు తొలిచివేసిన మెట్లబావి జునాగఢ్‌లోని ఉపర్కోట్ గుహల్లో వుంది. ఇది 4వ శతాబ్దానిది కావచ్చని చరిత్రకారుల భావన. రాజ్ కోట్‌జిల్లా ధాంక్‌లో మెట్లబావులు.. భిన్మాల్‌లోని సరస్సులు క్రీస్తుశకం 600 సంవత్సరంలో కట్టబడినవిగా భావిస్తున్నారు. గుజరాత్ లో 11వ శతాబ్దిగా భావించబడే మాతా భవాని మెట్లబావి బహుళ అంతస్తులతో.. తూర్పు.. పడమర ద్వారాలతో.. శిల్పశోభితంగా ఉన్నది. చక్కని వాస్తు : అందమైన శిల్పకళాంకరణతో చేద బావులు.. దిగుడు బావులు తీర్చిదిద్దారు. ఇట్లాంటి మెట్లబావులు ఎక్కువగా దేవాలయాలతో ముడిపడి వున్నాయి. రాతిస్తంభాలతో, లతలు, హంసలు, మదాలసలు, చక్కని స్త్రీ, పురుష దేవతల శిల్పాలతో ఈ మెట్లబావులు నిర్మించబడ్డాయి. రాజుల కోటలలో స్నానవాటికలుగా జలవిహార వేదికలుగా కూడా ఈ మెట్లబావులు కట్టబడ్డాయి. మెట్లబావులు కరువులో నీరిచ్చే జలదేవతలే కాదు, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక ప్రాధాన్యత కలిగివున్నాయి. ఈ బావులను ధార్మికకార్యాలు, ప్రార్థనలు, నివేదనలకు కూడా అన్ని మతాలవారు ఉపయోగిస్తుంటారు. మెట్ల బావులు రకాలు : రెండు రకాలు. ఒకటి దేవాలయాలకు అనుబంధంగా తవ్విన కోనేర్లకు మెట్లు కట్టినవి. రెండు జనసమ్మర్దాలకు దూరంగా నిర్మించిన మెట్లబావులు. బావుల శోధన: తెలంగాణాలో ఇటువంటి మెట్లబావుల్ని వెతికి వాటి నిర్మాణాలను పరిశోధించడానికి, చరిత్ర రాయడానికి, ది హైదరాబాద్ డిజైన్ ఫోరం అధ్యక్షుడు ఆర్కిటెక్టు యశ్వంత్ రామమూర్తి ఆధ్వర్యంలో 15మంది ఔత్సాహిక ఆర్కిటెక్టుల బృందం పనిచేస్తున్నది. తొలుత జేఎన్‌టీయూ విద్యార్థుల సహాయంతో మెట్లబావుల సర్వే చేపట్టారు. సొంతంగానే 70 బావుల గురించి డాక్యుమెంటేషన్ చేశారు. మరో 30 బావుల గురించి విషయసేకరణ చేస్తున్నారు. గుజరాత్, రాజస్తాన్‌లోనే కాదు తెలంగాణాలోనూ దీటైన మెట్ల బావులున్నాయని నిరూపించడానికి 100 మెట్లబావుల విశేషాలతో కాఫీ టేబుల్ బుక్ తేబోతున్నారు. ఇది తెలంగాణా చరిత్ర నిర్మాణంలో కొత్తకోణం. ఈ ఔత్సాహికులకు రాష్ట్ర పురావస్తుశాఖ తనవంతు సహాయాన్ని అందిస్తున్నది. ఈ బృందం చేస్తున్న సర్వేలు, పరిశోధనలు తెలిసిన ఎన్.సాయికుమార్ అనే ఒక సామాజిక కార్యకర్త దేశ ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన కేంద్రం ఆదేశాలతో రాష్ట్రపురావస్తుశాఖ మెట్లబావుల పరిరక్షణలో పడింది. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు క్షేత్రంలో మూడంతస్తుల మెట్లబావి ఉంది. అత్యంత దృఢమైన నిర్మాణం.దీర్ఘచతురస్రాకారంలో కట్టిన ఈ బావిని పునరుద్ధరిస్తే రామలింగేశ్వరాలయానికి శోభ తెస్తుంది. భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన, దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని కొడుకు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్ల గ్రామంలో విద్దేశ్వరస్వామి పేర శైవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం వెనుక కోనేరు తవ్వించి దానికి విద్యాధరతీర్థమని పేరుపెట్టాడు. శాసనం (క్రీ.శ.1115) వేయించాడు. తర్వాత కాలంతో విద్దేశ్వరాలయ సేవలకు చేసిన భూదానం చేసినట్లు రెండవ చందుపట్ల శాసనం(కాలం తెలియదు) తెలియజేస్తున్నది. . యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాయగిరి రైల్వేస్టేషన్ కు ఉత్తరంగా ఉన్న మైదానంలో అద్భుతమైన చతురస్రాకారపు మెట్లబావి ఉన్నది. ఎకరం నేలలో విస్తరించి ఉండే ఈ బావి ఎదురుగా గుట్ట మీదుండే వేంకటేశ్వరదేవాలయానికి పుష్కరిణి. రెండంతస్తులతో ఉండే ఈ మెట్లబావి పటిష్టమైన నిర్మాణంతో ఉంది. పూర్వం తిరుమలగిరి తండా అని పిలిచే చోటనే ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ ఉంది. అక్కడే అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. . భువనగిరిలో మసీదు మెట్లబావి, యాదాద్రిజిల్లాలోని మన్నెవారి తుర్కపల్లిలో ఉన్న మెట్లబావి, ఈ రెండు ఇస్లామిక్ శైలిలో నిర్మితమైన అందమైన బావులు. తుర్కపల్లి మెట్లబావిలోని ఆర్చీలమీద నిజాం రాజ్య చిహ్నం ఉండడం విశేషం. .పాత మెదక్ జిల్లా ఆందోల్ దగ్గర్లోని కిచ్చనపల్లిలో ఓ మెట్లబావి ఉంది. నాలుగు మండపాలు, మధ్యలో మండపంతో బోర్లించిన పిరమిడ్ ఆకారంలో బావిమెట్లు ఉన్నాయి. అందమైన శిల్పాలతో ఈ మెట్లబావి అపురూప నిర్మాణం.6.కామారెడ్డి జిల్లా లింగంపేటలో మెట్లబావి ఉంది. దీనిని పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాల మేరకు లింగంపేట జక్సానీ నాగయ్య కట్టించాడని స్థానిక కైఫీయతు. 18వ శతాబ్దంలో మూడేండ్లపాటు నిర్మించిన ఈ బావిని ఏనుగుల బావి అని పిలిచేవారట. నాలుగు దారులున్న ఈ బావిలో చుట్టూరా కట్టిన 50 గదులున్నాయి. అందమైన కళాకృతులున్న శిలలతో ఈ బావిని అలంకరించారు..వరంగల్ లోని కాకతీయుల కోటకు సమీపంలో ఒక మెట్లబావి ఉంది. దీర్ఘచతురస్రాకారంలో కట్టిన ఈ మెట్లబావికి దేవాలయ స్తంభాలు, అడ్డదూలాలతో నాలుగువైపుల మంటపాలు. మంటపాలనుండి కిందికి మెట్లదారులు.మూడు అంతస్తుల నిర్మాణం. కాకతీయుల కాలంలో కట్టబడిన ఈ మెట్లబావి కుతుబ్‌షాహీల కాలంలో తిరిగి కట్టారనడానికి సాక్ష్యమిచ్చే ఒక లఘుశాసనం ఉన్నది. దాంట్లో మిరాసీ ప్రస్తావన ఉంది. కుతుబ్ షాహీల కాలంలోని మిరాసీలు కాకతీయుల కాలంలో నాయంకరుల వంటి వారు. అక్కడ మరో స్తంభం మీద చెక్కివున్న ఏకపద శాసనంలో మూలసంఘజీ పేరున్నది. మెట్లబావికి అది మరో యజమాని పేరు కావచ్చు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి మెట ్లబావికి చక్కటి ఉదాహరణ. .సిద్ధిపేటజిల్లాలోని దుద్దెడ, గాలిపల్లిలలో చక్కని నిర్మాణాలతో మెట్ల బావులున్నాయి. శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర కన్వీనర్ సహకారం: కట్టా శ్రీనివాస్ , అరవింద్ ఆర్య

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...