8, ఫిబ్రవరి 2018, గురువారం

పరుసవేది


ప్రతాపరుద్రుని మరణం గురించి జనశ్రుతిలో ఉన్న కథనాన్ని బట్టి ఆయన వద్ద పరుసవేది ఉండేదని తెలుస్తోంది. ఓరుగల్లు పేరు రావడానికీ పరుసవేదే కారణమనీ అర్థమవుతోంది. అంతకుమించి, పరుసవేది కోసం అన్వేషణలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఊపిరి పోసుకుందా అని పరిశీలిస్తే ఆశ్చర్యం, అద్భుతం. ప్రతాపరుద్రుని మరణోదంతం, పరుసవేది భూమికగా పరిశీలిస్తే చరిత్ర సరికొత్తగా ఆవిష్కారం కావడం అసలు విశేషం.


ఈ అనంత కాలగమనంలో మహా సామ్రాజ్యాల ప్రస్థానంలో ఏదో ఒకరోజు... ఏదో ఒక క్షణం... చీకటి అలుముకుంటుంది. ఆ కాల నిశీధి ఎన్నో రహస్యారహస్యాలను తనలో కప్పి పెట్టుకుంటుంది. ఆ చరిత్ర పొరల్ని తవ్వుకుంటూ పోతుంటే.. యుద్ధాలు.. జయజయ ధ్వానాలు.. జయ కేతనాలు.. జయ స్తంభాలు.. పతనాలు.. రక్తపాతాలు.. మరణాలు.. సమాధులు.. ఎన్నో శిథిలాలు. శతాబ్దాల నిశ్శబ్ధం. ఆ తరతరాల నిశీధి గురించి మున్ముందు తరాలకు తెలియజెప్పేందుకు చిరు వేకువ జాడగా ఏదో ఒకరోజు ఓ శిల కనిపిస్తుంది. ఓ శిథిలం ఉదయిస్తుంది. ఎన్నో రహస్యాల గుట్టు విప్పి చెబుతాయవి. ఇదీ అలాంటి ఒక శిల, మరొక శిథిల గాథే. వెయ్యి సంవత్సరాల సుదీర్ఘమైన మహోన్నత కాకతీయ సామ్రాజ్య పతనం నాటి వాస్తవాలను, సందేహాలను, అపోహలను తట్టి లేపే పరుసవేది కథే ఇది.


ఇదే నిజమైన చరిత్ర అని చెప్పడం కాదు. అలాగనీ ఇది అసలు చరిత్ర కాదు అని ఒప్పుకోవడం కూడా కాదు. అందుకే, ఈ కథని ప్రతాపరుద్రుని జననం నుంచి కాకుండా.. అతని మరణ రహస్యం నుంచి.. జనబాహుళ్యంలో ఉన్న అతని పరుసవేది లింగం నుంచి మొదలెడదాం..

అప్రతిహత విక్రమచక్రులై, చలమర్తిగండ బిరుదాంకితులై దాయగజకేసరులై కాకతీయ వంశమండనులై యావదాంధ్ర దేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి తెలుగు జాతి చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని సృష్టించి, తెలుగు వారి రాజకీయ సాంస్కృతిక జీవన చైతన్యానికి నిత్యదీప్త ప్రతీకలుగా నిలిచిన అచ్చ తెలుగు చక్రవర్తుల గురించి మనకు తెలిసింది ఎంత? తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఖగోళ శాస్త్రం మొదలు కామశాస్త్రం వరకు అన్ని శాస్త్ర, సాహిత్య ప్రక్రియలలో మౌలికం, ప్రామాణికం అయిన రచనలు చేసిన ప్రాచీన భారతీయులు.. శాస్త్ర నిబద్ధమయిన, ప్రామాణికమైన చరిత్ర రచన చేయలేకపోయారు అంటారు కొందరు చరిత్రకారులు. నిజమే! కాకతీయుల అసలు చరిత్ర కోసం అన్వేషిస్తున్నప్పుడు ఇది అణువణువునా తెలియవస్తున్నది.

క్రీ.శ. 1206 తర్వాత భారతదేశంలో ముస్లిం రాజుల అధికారం స్థిరమయ్యాక వారి గురించి అరబిక్, పర్షియన్ భాషల్లో చారిత్రక వృత్తాంతాలను ముస్లిం చరిత్రకారులు నమోదు చేశారు. వారి రచనల్లో తమ సుల్తానుల గురించి కాస్త అతిశయంగా రాసినా, అభూత కల్పనలకు అద్భుత వృత్తాంతాలకు తావీయలేదు. కానీ, హిందూ రాజులకు సంబంధించి కల్హణుని రాజతరంగిణి తర్వాత చరిత్ర అని అన్ని విధాలా చెప్పదగ్గ గ్రంథాలు సంస్కృత భాషలోగానీ, మరియే ఇతర భాషలలోగానీ రాయబడలేదు. అలాంటి ఒక చరిత్ర రచనా ప్రయత్నాన్ని తెలుగుభాషలో తొలిసారిగా చేసిన ప్రథమాంధ్ర చరిత్రకారుడు ఏకామ్రనాథుడు. అతడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రము నుంచే మనకు తొలి తెలుగు చక్రవర్తులు, తెలుగు జాతి వెలుగులు అయిన కాకతీయుల గురించి అంతో ఇంతో తెలుస్తున్నది.

ఏకామ్రనాథుడు తన చరిత్ర రచనకు ఆధారంగా పేర్కొన్న కథలు, నాటికి కాకతీయ రాజులను గురించి జనబాహుళ్యంలో ఉన్న జనశ్రుతులు. ఒక చారిత్రక సత్యం కొంతకాలం తర్వాత మనకు జనశ్రుతిగా స్థానిక వృత్తాంతంగా చేరడంలో, ఆ చారిత్రక సత్యం చుట్టూ లేదా ఓ చారిత్రక వ్యక్తి చుట్టూ అనేక అద్భుత వృత్తాంతాలు, అభూత కల్పనలు పేరుకుంటాయి. చారిత్రక పురుషులు జనశ్రుతిలో పురాణ పురుషులుగా మారిపోతారు. ఇది చరిత్ర గతిలో నిత్యం జరిగే విషయమే. ఈ దృష్టితో చూసినప్పుడు ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రములో అభూత కల్పనలు, అద్భుత వృత్తాంతాలు చాలా తక్కువే. హేతువాద దృష్టికి అందే చారిత్రక విషయాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అద్బుత వృత్తాంతాలు చారిత్రక విషయాలను అర్థం చేసుకోవడానికి అడ్డంగా కూడా లేవు.

ఏకామ్రనాథుడు చెప్పిన చారిత్రక విషయాలలో కొన్ని కాలవ్యతిరిక్తాలు, అసంబధ్ద విషయాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత బయటపడ్డ శాసనాధారాలతో అసలు చరిత్రను సమన్వయ పరచడంలోనే నేటి చరిత్ర పరిశోధకులు పాటవాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది అంటారు ప్రతాపరుద్ర చరిత్ర (1984) పీఠికలో సి.వి.రామచంద్రరావు. ఇదీ అలాంటి ఒక చిరు ప్రయత్నమే.

ప్రతాపరుద్రునికి సంబంధించి జనబాహుళ్యంలో ఉన్న కథలను.. వెలుగులోకి వచ్చిన శిథిలాలు, శాసనాల ఆధారంగా కాస్త సమన్వయ పర్చడమే తప్ప.. ఇదే నిజమైన చరిత్ర అని చెప్పడం కాదు. అలాగనీ ఇది అసలు చరిత్ర కాదు అని ఒప్పుకోవడం కూడా కాదు. అందుకే, ఈ కథని ప్రతాపరుద్రుని జననం నుంచి కాకుండా.. అతని మరణ రహస్యం నుంచి.. జనబాహుళ్యంలో ఉన్న అతని పరుసవేది లింగం నుంచి మొదలెడదాం..

ప్రతాపరుద్రుని మరణ రహస్యం

ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో కాకుండా కొంతకాలం గోదావరి తీరంలోని కాళేశ్వరం సమీపంలో నివసించాడనే అనుమానం కలుగక మానదు. దీనికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అవి..
ఏకామ్రనాథుడు చెప్పిన శంభులింగం, జనబాహుళ్యంలో ఉన్న పరుసవేది కథ..

ప్రత్యక్షంగా ఇప్పటికీ కనిపిస్తున్న ఓ భారీ కట్టడం కూడా.

వీరనారి.. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి ఎలా మరణించింది? - ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నవి జనబాహుళ్యంలో ఉన్న కథలే కానీ.. అందుకు తగిన చారిత్రక ఆధారాలు లేవు. ఆమె మరణకాలాన్ని తెలియజేస్తూ నల్లగొండలోని చందుపట్లలో ఒక శాసనం వెలుగులోకి వచ్చింది. కానీ, ఎలా మరణించిందో ఆ శాసనం ద్వారా తెలియలేదు. అలాగే, ప్రతాపరుద్రుని మరణం కూడా రణరంగంలో వెలుగుచూడని ఒక రహస్యమే. ఇప్పటి వరకు కాకతీయుల చరిత్రకు ప్రధాన ఆధారంగా చెప్పుకున్న ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము అతని మరణం గురించి ఏం చెబుతుందంటే..

ప్రతాపరుద్రుండు.. భార్యయగు విశాలాక్షియు స్వర్గస్థులగుట...

గోదావరి యందు స్నానమాచరించి దివ్యాంబరంబులు ధరించి నానా భూషణములు దాల్చి విభూతి రుద్రాక్షమాలికాలంకృతుండై గోదావరి గర్భంబున గూర్చుండి, శంభులింగంబును తన హృదయంబున నిల్పి ధ్యానించెను. అనంతరం రాజు తన పట్టపు దేవియగు విశాలాక్షిని జూడగనే శివదేవయ్య విశాలక్షి కిట్లనియె తల్లీ! నీవు నన్ను జాలకాలంబు పూజించితివి. నీ కిష్టంబైన వరంబిచ్చెద వేడుము అనెను. ఆయమ్మ యాతనికి నమస్కరించి మహాత్మా! తనకు బతిజీవంబు వెంటనే తన జీవంబును జనునట్లు వరంబు దయచేయమనెను. ఆయయ్య యట్లనే యొసంగెను.

- అంటే ప్రతాపరుద్రుని నిర్యాణము పవిత్ర గోదావరి నదిలో జరిగిందన్నమాట. అప్పటి ముస్లిం రచయితలు కాకతీయుల పతనం అవలీలగా జరిగినట్లు రాశారు. కానీ అది భీషణ సంగ్రామం లేకుండా జరిగి ఉండకపోవచ్చు. బందీ అయిన ప్రతాపరుద్రుని తెలుగుదేశంలో ఉంచడం ప్రమాదకరమని ఉలూగ్ ఖాన్ ప్రతాపుడిని పటిష్టమైన సైన్యంతో ఢిల్లీకి తరలించాడని షాంసీ సిరాజ్ ఆఫీఫ్ గ్రంథస్థం చేశాడు. కానీ, ఆయన మరణాన్ని పేర్కొనలేదు.

ప్రతాపరుద్ర నిర్యాణం గౌతమీ గంగాగర్భం (నేటి కాళేశ్వరం)లో జరిగినట్లు సిద్ధేశ్వర చరిత్ర చెబుతున్నది. పూర్వాఖ్యానాలను బట్టి ప్రతాపరుద్రుడు బందీ నుండి విడివడి కాళేశ్వర క్షేత్రంలో కొంతకాలం నివసించాడనే భావం ప్రజల్లో వ్యాపించి ఉన్నది. ముసునూరి ప్రోలయ నాయకుని విలసతామ్ర శానసం (క్రీ.శ. 1330) ప్రతాపరుద్రుడు సోమోద్భవ (నర్మదా) నదీ తీరంలో కన్నుమూశాడని పేర్కొంటున్నది.

క్రీ.శ. 1423 ప్రాంతంలో వెలసిన అనితల్లి కలువచేరు శాసనం ప్రతాపరుద్రుడు స్వచ్ఛందంగా మరణించాడని చెబుతున్నది. వీటిన్నింటిని బట్టి చూస్తే ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో కాకుండా కొంతకాలం గోదావరి తీరంలోని కాళేశ్వరం సమీపంలో ఉన్నాడనే అనుమానం కలుగక మానదు. దీనికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అవి.. ఏకామ్రనాథుడు చెప్పిన శంభులింగం, జనబాహుళ్యంలో ఉన్న పరుసవేది కథ.. ప్రత్యక్షంగా ఇప్పటికీ కనిపిస్తున్న ఓ భారీ కట్టడం కూడా.

ఇప్పటికీ జనబాహుళ్యంలో ఉన్న కథ!

పరుసవేది దొరికింది.. అని ఫ్రెంచ్ వారు ఆనందిస్తుండగానే.. అంతలోనే ఒక ఆందోళన.. ఒక ప్రళయం.. ఒక ప్రకంపనం.. రివ్వున గాలి వీచింది. పర్యవేక్షణలో ఉన్న ఇంజినీర్లు అక్కడికక్కడే పడిపోయారు.. పనిచేస్తున్న కూలీలు పిట్టల్లా రాలిపోయారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సుమారు వెయ్యి, రెండు వేల మంది.. ఒకే రోజు చనిపోయారన్నది కథనం. ఒక్కసారిగా ప్లేగువ్యాధి వ్యాపించి ఒక్కరోజులోనే ఇంత మంది మరణించడం మహిమగల శివలింగాన్ని
తస్కరించాలని చేసిన ప్రయత్నంపై చూపిన దుష్ప్రభావ ఫలితమేనని తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లా గోదావరి తీరంలోని కాళేశ్వర పుణ్యక్షేత్రం... దానికి సమీపంలో మహదేవ్‌పూర్ వద్ద ప్రతాపగిరి.. తురుష్కులు ఓరుగల్లుపై వరుస దండయాత్రలు చేసినప్పటికీ కాకతీయ సేనానులు యశోవా మృత్యుర్వా అనే స్థిర సంకల్పంతో భయంకర యుద్ధాలు చేశారు. కానీ, వారి శౌర్యాగ్ని వ్యర్థమే అయింది. కోటలో ధాన్యం అంతా అయిపోయి, సామగ్రి తెప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో దుర్గంలో కిక్కిరిసి ఉన్న సైన్యాలకీ, జనాలకీ పదార్థాలు కొరవడి వారు కటకటలాడిపోయారు. జనసంక్షోభం చూడలేక, మరో మార్గం లేక ప్రతాపరుద్రుడు కోట తలుపులు తెరిపించి శత్రువులతో వీరోచితంగా పోరాడాడు. ఈ సంగ్రామాన్ని గురించి సిద్ధేశ్వర చరిత్ర అద్భుత వృత్తాంతాలతో కరుణాత్మకంగా వివరించింది. తరతరాలుగా కాకతీయ సామ్రాజ్యంలో కాపాడుకుంటూ వస్తున్న ఓ మహిమగల శంభులింగం (పరుసవేది) తురుష్కుల చేతికి చిక్కకూడదన్న ప్రతాపరుద్రుని సంకల్పం ముందు శత్రువులు వెనుకడుగు వేయక తప్పలేదు. తన కుటుంబసభ్యులను సురక్షితమైన ప్రాంతంలో ఉంచేందుకు ఓరుగల్లు నుంచి ప్రతాపగిరిపైకి చేర్చాడు. తన వద్ద ఉన్న అపారమైన బంగారం, వెండి ధనరాశులను కూడా ప్రతాపరుద్రుడు తీసుకొచ్చాడు. (అప్పటి నుంచే ఈ కొండకు ప్రతాపగిరి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అటు తర్వాత ఈ కొండపైన చాలామంది వెండి, బంగారు ఆభరణాలు దొరికాయని, ఇప్పటికీ కొందరికి దొరుకుతుంటాయని, చాలామంది వీటికోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారని స్థానికులు చెబుతుంటారు).

ఈ కొండ మీది నుంచే శత్రువులను ఓ కంట కనిపెడితూ, యుద్ధ వ్యూహాలు చేస్తూ తన వారిని కాపాడుకున్నాడు ప్రతాపరుద్రుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతటి సైన్యాన్ని దింపినా లొంగని, శత్రువుకు తలవంచిన ప్రతాపరుద్రునిపై రగిలిపోతున్న తురుష్కులు.. కాకతీయ సామంతుల మధ్యే వర్గ స్పర్థలు తెచ్చి.. ఆశ చూపి ప్రతాపరుద్రుని ఆచూకీ తెలుసుకుని ప్రతాపగిరిని చుట్టుముట్టారు. దీన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు ఇక తప్పించుకోవడం కుదరదని, లొంగుబాటు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు.. ఒకటే నిర్ణయం తీసుకున్నాడట.. సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించి.. తెలుగు జాతి చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన చక్రవర్తిగా.. శత్రువు చేతిలో చిక్కి చిత్రహింసలు అనుభవించడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు.

శత్రువుకు వెన్ను చూపడం తెలియని కాకతీయ చరిత్రను అప్రతిష్ట పాలు చేయడం ఇష్టం లేక.. తరతరాలుగా తమ వంశాన్ని కాపాడుకుంటూ వస్తున్న అత్యంత మహిమగల శంభులింగం శత్రువుల చేతికి చిక్కకూడదని.. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడం తప్పు కాదని.. ఆ పరుసవేదితో పాటు గోదావరి నదీలో దూకాడట. అంతటితో కాకతీయుల చరిత్ర ముగిసిందనుకున్నారు. ప్రతాపరుద్రుడు ఏమయ్యాడో తెలియదు. కానీ, అటు తర్వాత ప్రతాపరుద్రుని సోదరుడు అన్నమదేవుడు గోదావరి నది దాటి (ఇప్పటి) ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో రాజ్యాన్ని స్థాపించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. వారి వారసులు ఇప్పటికీ బస్తర్‌లో ఉన్నారు. కొన్ని శతాబ్దాల నిశబ్ధం తర్వాత... ప్రతాపరుద్రుని పరుసవేది గోదావరిలో ఉందన్న విషయం తెలుసుకున్న ఫ్రెంచ్ వారు దాని కోసం విఫలయత్నం చేశారు. అప్పటి ఐదో నిజాం అఫ్జలుద్దౌలా అసఫ్‌జాను ఒప్పించి ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టేందుకు ఫ్రెంచ్ ఇంజినీర్లు వచ్చారు. నీలంపల్లి వద్ద గోదావరికి ఇరువైపులా పెద్ద పెద్ద కొండలున్నాయి.

ఈ రెండు కొండల మధ్య గోదావరి వెడల్పు సగానికి సగం తగ్గుతుంది. లోతు పెరుగుతుంది. అందుకే ఈ ప్రాంతం ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ఉందని భావించినట్లు ప్రజలు చెబుతారు. కానీ, దీనికి సమీపంలోనే ప్రతాపగిరి ఉంది. కాగా, ఫ్రెంచ్ వారు ప్రాజెక్టు పేరుతో వచ్చింది పరుసవేది కోసమే అని స్థానికులు చెబుతుంటారు. ప్రాజెక్టే కట్టాలంటే దీనికి ఎగువనున్న విశాలమైన మైదాన ప్రాంతంలో కట్టుకోవచ్చు.. కానీ ఈ అభయారణ్యంలో కట్టడం.. ఆ నిర్మాణం కూడా నీటికి అడ్డుకట్టగా రాతి కట్టలు.. నీటిని ఖాళీ చేసేందుకు అటువైపు కొండల మధ్య నుంచి ఏర్పాటు చేసినట్లు ఉండడం దీనికి బలాన్నిస్తుందని చెబుతుంటారు.

అంతేకాదు, ఫ్రెంచ్ ఇంజినీర్లు పరుసవేదిని వెతికేందుకు ఏనుగు కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి నదిలో గాలించినట్లు కూడా చెబుతుంటారు. అలా గాలిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యం.. ఫ్రెంచ్ ఇంజినీర్ల మొహాల్లో అమితానందం.. పట్టరాని సంతోషం. ఎందుకంటే ఏనుగు కాళ్లకు కట్టి ఈడ్చిన ఇనుప గొలుసులు బంగారు గొలుసులుగా మారిపోయాయట. దొరికింది.. పరుసవేది దొరికింది.. అని ఫ్రెంచ్ వారు ఆనందిస్తుండగానే.. అంతలోనే ఒక ఆందోళన.. ఒక ప్రళయం.. ఒక ప్రకంపం.. రివ్వున గాలివీచింది.

పర్యవేక్షణలో ఉన్న ఇంజినీర్లు అక్కడికక్కడే పడిపోయారు.. పనిచేస్తున్న కూలీలు పిట్టల్లా రాలిపోయారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సుమారు వెయ్యి రెండు వేల మంది.. ఒకే రోజు చనిపోయారట. ఒక్కసారిగా ప్లేగువ్యాధి వ్యాపించి ఒక్కరోజులోనే ఇంత మంది మరణించడం మహిమగల శివలింగాన్ని తస్కరించాలని చేసిన ప్రయత్నంపై చూపిన దుష్ప్రభావ ఫలితమేనని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచే ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి మొదలెట్టడానికి ఎవరూ సాహసించలేదనీ స్థానికంగా జానపదులు చెబుతుంటారు. ఇదంతా నిజమే అయి ఉండొచ్చు అనడానికి అక్కడ అర్థాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టు తాలూకు శిథిలాలు, నీటిని మల్లించేందుకు వేసిన రాతిగోడ, శిథిలావస్థలో ఉన్న వారి నివాస గృహాలు, ఆ దారిలో నిర్మించిన ఒక చిన్న బ్రిడ్జి, ఫ్రెంచ్ ఇంజినీర్ల సమాధులు.. ఇప్పటికీ ప్రత్యక్ష సాక్ష్యులుగా కనిపిస్తూనే ఉండటం విశేషం.

ప్రతాపరుద్రుని వద్ద పరుసవేది ఉండేదా?

తెల్లారాక చూస్తే బండి చక్రానికి ఉన్న ఇనుపకమ్మి బంగారంగా మారిపోయి, తళతళా మెరవసాగింది. వెంటనే ప్రోలరాజు సపరి వారంగా అక్కడికి చేరుకుని ఆ ప్రదేశంలో తవ్వించాడు. అక్కడ దేదీప్యమానంగా శరత్కాలచంద్రుని కాంతితో జ్యోతిర్మయంగా వెలిగిపోతున్న ఒక పరుసవేది లింగ రూపశిల బయటపడింది. ఒరగల్లు పడిన చోటు కనుక ఆ ప్రదేశానికి ఓరుగల్లు అని నామకరణం చేశారంటారు.

దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం సకల సంపదలతో అలరారుతున్నదని గ్రహించిన ఢిల్లీ సుల్తానులకు కన్నుకుట్టింది. ఇది ముందే పసిగట్టిన ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని, రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుని ముస్లిం దండయాత్రలను ఎదుర్కొన్నాడు. క్రీ.శ. 1303లో ఉప్పరపల్లి వద్ద జరిగిన దండయాత్రలో కాకతీయ సేనలు అల్లావుద్దిన్ ఖిల్జీ పంపిన సేనలను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దీనికి ప్రతీకారంగా అల్లావుద్దిన్ 1310లో మాలిక్ కాఫర్ నాయకత్వంలో తిరిగి సైన్యాన్ని పంపాడు. ఈ దాడిలో ఓడిపోయి సంధి చేసుకున్న ప్రతాపరుద్రుడు 9,600 మణుగుల బంగారం, అపార ధనరాశులు మాలిక్ కాఫర్‌కు సమర్పించుకున్నాడంటారు. ఆ అపార ధనరాశులను కాఫర్ పదివేల ఒంటెలు మోయలేక, మోయలేక ఢిల్లీకి తరలించాడని అమీర్ ఖుస్రో రాశాడు. (కాకతీయుల సంపుటి- పుట. 71) ఇంత బంగారం ప్రతాపరుద్రుడు ఎలా కూడబెట్టాడు? ఆ రోజుల్లో ప్రతాపరుద్రుని ఆదాయం సంవత్సరానికి 44 కోట్లు, వ్యయం కూడా అంతే ఉండేదని ప్రతాపరుద్ర చరిత్ర పు. 47, సిద్ధేశ్వర చరిత్ర పు. 154లలో కన్పిస్తున్నది.

శాతవాహన చక్రవర్తుల తరువాత తులాపురుష దానాలతో తులతూగిన ఘనత కాకతీయ రాజులదే! ప్రతాపరుద్రుడే ప్రయాగ త్రివేణీ సంగమంలో 8 తులాభారాలు, కాశీ క్షేత్రంలో 20 తులాభారాలు, కాళేశ్వరంలో 12 తులాభారాలు, పాకాల సీమలో 8 తులాభారాలు తూగి కోట్ల కొలది విలువైన సువర్ణ దానాలు చేసినట్లు ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్రలో ఉంది. అంతేకాక వారణాసి శ్రీవిశ్వేశ్వరునికి, శ్రీశైల మల్లికార్జునకు, శ్రీరంగంలోని రంగనాథునకు, కాళేశ్వరములోని ముక్తీశ్వరునికి, మరెన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల కొలది విలువైన సువర్ణం ప్రతి సంవత్సరమూ ప్రతాపరుద్రుడు ఇచ్చేవాడట. ఇంత అపారమైన బంగారం స్వయంభూ దేవుని(పరుసవేది) అనుగ్రహం కాక మరేమి అయి ఉండవచ్చు?

పరుసవేది అసలు కథ!

కాకతీయ రాజుల చరిత్రకు ప్రధానమైన ఆధారాలు ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము, కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము. ఈ రెండు గ్రంథాలు 15, 16వ శతాబ్దాలలో విరచితమైనవి. అంటే అప్పటికి కాకతీయ సామ్రాజ్యం పతనమై దాదాపు 150 సంవత్సరాలు అయినప్పటికీ, దాని ప్రాభవ సౌరభాలు పూర్తిగా అంతరించిపోలేదు. ఆనాటికి ప్రత్యక్షంగా ఉన్నవి, జనశ్రుతిలో ఉన్నవి అయిన కథలను విశేషాలను ఆ రెండు గ్రంథాలు ఎంతో హృద్యంగా ఆవిష్కరించాయి.

ఈ గ్రంథాలలో కొన్ని అసంబంద్ధ విషయాలు కన్పిస్తున్నప్పటికీ, వాటిని వదిలివేస్తే అవి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తూ, చరిత్ర నిర్మాణానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవేకాక కాకతీయుల కాలంలో వచ్చిన దేశీయ, విదేశీయ పర్యాటకులు మార్కోపోలో, ఇబన్ బటూటా, జియావుద్దీన్ బరానీ, అమీర్ ఖుస్రో, ఇసిమీ మొదలైన వారి రచనలు కూడా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర, కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రల ఆధారంగా ఈ కింది విషయాలు తెలుస్తున్నాయి.

రెండవ ప్రోలరాజు అనుమకొండ రాజధానిగా కాకతి పురాన్ని పాలిస్తున్న రోజుల్లో నగర ప్రజల కోసం ఒక బండి మీద ధాన్యం తెస్తూ ఉండగా అనుమకొండకు ఆగ్నేయ భాగంలో.. రెండు క్రోశముల (సుమారు నాలుగు మైళ్లు) దూరంలో ఒక రాయికి తగిలి ఆ బండి ఆగిపోయింది. ఆ బండిని తీసుకొస్తున్న రక్షకభటులు ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దీంతో రాత్రి అక్కడే బండికి కాపలాగా ఉన్నారు. తెల్లారాక చూస్తే బండి చక్రానికి ఉన్న ఇనుపకమ్మి బంగారంగా మారిపోయి, తళతళా మెరవసాగింది. అది చూసి ఆశ్చర్యపడిన రక్షకభటులు, అనుమకొండకు వెళ్లి ఈ విషయాన్ని ప్రోలరాజుకు తెలియపరిచారు. వెంటనే ప్రోలరాజు సపరివారంగా అక్కడికి చేరుకుని ఆ ప్రదేశంలో తవ్వించాడు. అక్కడ దేదీప్యమానంగా శరత్కాలచంద్రుని కాంతితో జ్యోతిర్మయంగా వెలిగిపోతున్న ఒక పరుసవేది లింగ రూపశిల(ఒరగల్లు) బయటపడింది.

ఒరగల్లు పడిన చోటు కనుక ఆ ప్రదేశానికి ఓరుగల్లు అని నామకరం చేశారట (సిద్దేశ్వర చరిత్ర పు. 95) ఏకామ్రనాథుడు తన ప్రతాపచరిత్ర (పుట 23)లో పరుసవేది లింగం విషయంలో కాళేశ్వరం నుంచి శ్రీ రామరణ్య పాదులను, మహేంద్ర శ్రీపాదులను, హిండింబాశ్రమ (నేటి మెట్టుగుట్ట) నివాసులైన త్రిదండి రుషులను పిలిపించి వారిని సంప్రదించాడని పేర్కొన్నాడు. వీటన్నింటినీ సమన్వయించి పరిశీలిస్తే..కాకతీయుల కాలంలో నిర్మితమైన వందల శివాలయాలలోని ఏ శివలింగమూ స్వయంభూ అని వారు పేర్కొనలేదు. ఈ ఒక్క పరుసవేది లింగాన్నే భగవాన్ శ్రీ స్వయంభూః అని మల్కాపూర్ శాసనం, శ్రీ స్వయంభూనాథ దేవర అని ఖుష్‌మహల్ శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాలలో, సాహిత్యంలో ఇలా పేర్కొనడం గమనార్హం.

పరుసవేది శిలలు స్వయంగా తయారయ్యేవి కానీ మానవ నిర్మితాలు కావు. కనుక - ఒరగల్లు అనే పరుసవేది శిల కథ వాస్తవమేనని, దాని వల్లనే నగరానికి ఓరుగల్లు అనే పేరు వచ్చిందని ఒప్పుకోవడం తప్పుకాదు అంటారు శాసనాల ఆధారంగా ఓరుగల్లు అసలు చరిత్ర రాసిన ఆచార్య హరి శివకుమార్.
అలాగే, శ్రీరామారణ్య పాదులు ఆ శంభు లింగ ప్రభావాన్ని చెబుతూ నిత్యమూ ఈ శంభులింగమును పూజించిన తరువాత, ఒక బారువు ఇనుమును దానికి తగిలిస్తే అది శుద్ధ సువర్ణమవుతుందని బారువ లెక్క కూడా చెప్పారట. నూట ఇరువై గురిజలయెత్తు ఒక్క తులం, నూట ఇరువై తులాలు ఒక్క వీసె, నూట ఇరువై వీసెలు ఒక బారువ అని.. ప్రతాప చరిత్రలోని 24వ పేజీలో.. సిద్ధేశ్వర చరిత్రలోని 97వ పేజీల్లో ఒకే విధంగా ఉండటం గమనార్హం.

ఈ పరుసవేది లింగం ప్రతాప రుద్రుని చివరి రోజుల వరకూ కూడా లోహాన్ని బంగారం చేస్తూ వచ్చిందట. మహిమగల ఈ పరుసవేది లింగాన్ని అపహరించడానికి ప్రతాపరుద్రుని కాలంలోనే కొందరు దుష్టులు ప్రయత్నించారని అంటారు. అప్పుడు ప్రతాపరుద్రుడు దేవీదత్తమైన ఖడ్గఖేటకములను ధరించి ఆ స్వయంభూ లింగాన్ని రక్షించాడట (ప్రతాప చరిత్ర 78వపుట). అయితే, ఇంత ప్రశస్థమైన చారిత్రక నేపథ్యం కలది, ఓరుగల్లు అని పేరు రావటానికి కారణమైన పరుసవేది స్వయంభూ లింగం విషయాన్ని చారిత్రకులు నమ్మినట్లుగా కనిపించదు. ప్రత్యక్ష ప్రమాణాలతో కాని నమ్మని హేతువాదులు, ఈ లింగవృత్తాంతం కేవలం పుక్కిటి పురాణంగా తోసి వేసి ఉంటారు.

చెక్కు చెదరని సాక్షాలు!

ప్రకృతి శక్తులు ఉంటాయని కాకతీయుల కాలంలో బాగా నమ్మేవారు అనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఆ కాలానికే చెందిన పాల్కురికి సోమనాథుని రచనల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి కూడా. చనిపోయిన వారిని బతికించడం.. వంగ కాయలను లింగ కాయలను చేయడం వంటి మహిమల గురించి కూడా సోమనాథుని రచనల్లో ఉంది. గడియ గడియకు ఒక పుష్పాన్ని కిందికి విడిచే చెట్లు, మధ్యకు నరికి వేసినా వెంటనే మళ్లీ పెరిగే చెట్లు శ్రీశైల పర్వత ప్రాంతాల్లో ఉండేవని పండితారాధ్య చరిత్రలో సోమనాథుడు పేర్కొన్నాడు (కాకతీయ వైభవం- పుట. 51). మనకు తెలియని ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నమ్మదగినవి కావా? నమ్మొచ్చు.. నమ్మకపోవచ్చు. ఎవరి ఇష్టం వారిది? కానీ, ఓరుగల్లుకు ఆ పేరు రావడానికి శ్రీ స్వయంభూ దేవాలయం స్థానంలో లభించిన స్పర్శవేది స్వయంభూ శంభులింగ శిలయే అని శ్రీ.శ. 1264 నాటి చింతలూరి తామ్ర శాసనం ధ్రువీకరిస్తున్నది. ఈ స్పర్శవేది శిల కాకతీయ సామ్రాజ్య వైభవానికి చింతామణి (కోరికలు తీర్చేది) వంటిదని చిత్తాఫుఖాన్ శాసనం పేర్కొంటున్నది.

పరుసవేది శిలలు నేడు మనకు కన్పించవు. కాబట్టి కొందరు నమ్మకపోవచ్చు. కానీ, అలాంటిది ఒకటి ఉండి ఉంటేనే కదా మన శాస్ర్తాల్లో, నిఘంటువుల్లో రాశారని నమ్మేవారు లేకపోలేదు. నమ్మకం అపనమ్మకాలను పక్కన పెడితే, 1867లో కాకులు దూరని కారడవిలో, కాలిబాట కూడా సరిగా లేని ఆ రోజుల్లో.. మహాకుడ్యంగా పునాదులేసుకున్న రాతి కట్టడం కాలానికి ఎదురీది ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉందనేది మాత్రం నిజం. ఫ్రెంచ్ ఇంజినీర్ల సమాధులూ ఆ నిజాన్ని చెబుతూనే ఉన్నాయి?

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...