8, ఫిబ్రవరి 2018, గురువారం

పాములతో జర జాగ్రత్త


వర్షాకాలంలో అప్రమత్తత అవసరం
నాటువైద్యాన్ని నమ్ముకోవద్దు
అందుబాటులో మందులు
అన్ని సర్పాలూ విషపూరితం కాదు
జాగ్రత్తలు పాటిస్తే పాము కాటుకు దూరం

వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు కావస్తోంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు ఇది పాములకు అనువైన కాలం. జూన్, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. ఇది గమనించక పలువురు పాముకాటుకు గురవుతున్నారు. జిల్లాలో విష సర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటువేసిన పాము విషపూరితమైందో కాదో ముందు తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట కట్టుకట్టి దవాఖానకు తీసుకెళ్లాలి. ఎలాంటి పాము కాటువేసినా వెంటనే దవాఖానకు తీసుకెళ్తే 99 శాతం బతికించే అవకాశముంది. జిల్లాలోని రిమ్స్, ఉట్నూర్, బోథ్ ఏరియా వైద్యశాలలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉం టుంది. కానీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. చల్లదనానికి పాములు వాటి వాసాల నుంచి బయటకు వస్తాయి. రాత్రివేళల్లో నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి. వా నాకాలం పంట సీజన్‌లో సాగుకు సిద్ధమవుతున్న సమయంలో పాములు బయటకు రావడంతో రైతు లు, వ్యవసాయ కూలీలు అప్రమంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా పాముకాటుకు గురై ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కట్లపాము కాటేసిన క్షణాల్లో విషం రక్తకణాల్లో ప్రవేశించి మృతి చెందే అవకాశం ఉంటుంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఆందోళనకు గురికాకుండా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. నాగు పాము కాటేసిన 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తర్వాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ట పాము కాటేసినా విషం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి దవాఖానకు తీసుకెళ్లాలి. పాములు ఎన్నో రకాలు ఉంటాయి. ఏపాము కాటు వేస్తే ఆందోళనకు గురికాకుండా కాటేసిన దగ్గర కట్టు కట్టి దవాఖానకు తీసుకెళ్లాలి.
ఆందోళన అవసరం లేదు

పాము కాటుకు గురైనప్పుడు ఆందోళనకు గురి కావద్దు. ఇది గుండె పోటుకు దారిదీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసిన ప్రదేశం పై భాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి. పాము కాటుకు గురైన వారు దవాఖానకు వెళ్లి స్పష్టంగా చెప్తే దానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అక్కడ యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్ అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటే దానికి ఈ ఇంజక్షన్ పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా ఈ మందు ఉపకరిస్తుంది. రెండో రకం నరాలపై పనిచేసి మెదడుపై ప్రభావం చూపి మృతి చెందడానికి అవకాశం ఉంటుంది.
మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు

గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ. దీంతో వైద్యులను సంప్రదించకుండా మంత్రగాళ్లను ఆశ్రయిస్తుంటారు. పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించవద్దు. విషసర్పం కాటేసినప్పుడు దవాఖానకు తీసుకెళ్లకుండా నాటు వైద్యుడిని ఆశ్రయిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. విషం లేని పాము కాటుకు గురైన వారు ప్రాణాలతో బయటపడి మంత్రగాళ్ల మహిమతోనే అని నమ్ముతుంటారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతుంది. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే పామును బట్టి చికిత్స చేస్తారు.
అందుబాటులో మందులు


విష సర్పాలు రెండు రకాలు

న్యూరోటాక్సిల్ రకం నాగుపాము, కట్ల పాము, రెండో రకం హిమోటాక్సిన్ అంటే రక్తపింజర పాము వంటి పాములు ఉంటాయి. న్యూరోటాక్సిల్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాస ఆడక మృతి చెందే ప్రమాదముంది. ఇది గుండెపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. హీమోటాక్సిన్‌తో రక్తనాళాల్లో కణజాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుంది. కాటేసింది ఎలాంటి పాము తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పక్కపక్కన రెండు దంతాలు కాటు వేస్తే అది కచ్చితంగా విషసర్పమే. పాము కాటుతో ఉన్న భాగం నుంచి శరీరంలోకి రక్త ప్రసరణలో విషం వ్యాప్తిచెందే అవకాశం ఉంది. ఎటువంటి పాము కాటువేసినా దవాఖానకు వెళ్తే రెండు రకాల చికిత్సలు నిర్వహిస్తారు. తీవ్రతను బట్టి ఇంజక్షన్ వేస్తారు. యాంటీ స్నేక్ వీనం, యాంటీ పాలి వీనం అనే రెండు రకాల మందులు ఉంటాయి. ప్రస్తుతం మన జిల్లాలోని అన్ని దవాఖానల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
పాముకాటు లక్షణాలు

వ్యక్తిని విషపూరితమైన పాము కరిస్తే శరీరమంతా నీలం రంగుగా మారడం, రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగ వస్తుంటుంది. ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే దవాఖానకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వారికి 99 శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి

సాధ్యమైనంత వరకు పాములు, విష కీటకాల బారిన పడకుండా ఉండాలి. రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లేవారు కర్ర, టార్చ్‌లైటు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్నచోట పాములు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంపచెట్టు, పిచ్చిమొక్కలు, రంద్రాలు, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇళ్లలో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులు రాళ్లు, చెట్ల పొదల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రాత్రి పూట పొలాలకు వెళ్లే వారు వారు సాధ్యమైనంతవరకు పొడువాటి బూట్లుధరించడం ఎంతో మంచిది. ఏదో ఒక సర్పం కాటువేసిందనగానే ఎక్కువ శాతం భయాందోళనకు గురై మరణించే వారు అధికంగా ఉంటారు. పాము కాటువేసిన వారికి ధైర్యం చెప్పి వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...