10, జనవరి 2018, బుధవారం

రాయగిరి

రాయగిరి
నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిది ఒక విస్మృత చరిత్ర. ఆ వూరెందుకు రాయగిరయిందో తెలియదు.రాయగిరి రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని తిరుమలగిరి తండ అని పిలిచేవారట వెనకటికి.అక్కడ వున్న గుట్టకు వెంకటేశ్వర్లు వెలిసినందువల్ల ఆ ప్రాంతం తిరుమలగిరి అయిందేమో.అక్కడ గుట్ట మీద వెంకన్న కింద అనంతపద్మనాభుడు, ఆంజనేయుడు,ధ్వజస్తంభాలు రైలుపట్టాల ఆవల అద్భుతమైన కొలను వుంది. కొలను అవతల శివలింగం, పానవట్టాలు, చామరగ్రాహుల శిల్పాలు పడివున్నాయి. దేవుడి కళ్యాణమంటపం వుందక్కడ.రథోత్సవానికి రథాన్ని నిలిపే షెడ్డు వంటి నిర్మాణం వుంది.ఒకప్పుడు ఆర్కియాలజీ వారు,బ్రిటిష్ వారు చేపట్టిన తవ్వకాల వల్ల సింధునాగరికతతో సరిపోలె నాగరికసంస్కృతి అక్కడి సమాధులలో బయటపడింది.
రాయగిరి చరిత్ర అసంపూర్ణంగానే వుంది.తిరుమలగిరి గుట్టకు పడమట వున్న మల్లన్న గుట్ట మీద ఒక పురాతన చరిత్ర మరుగునపడి వుంది. మాకివాళ ఆ చరిత్రను సందర్శించే అవకాశం కలిగింది.రాయగిరి రైల్వే స్టేషన్ కు పడమరగా,ఫ్లై వోవర్ మొదలయేచోట వున్న మల్లన్నగుట్ట వుంది.మేం, నేను,సహాయకుడు చంటి, మిత్రుడు వినోద్, రాయగిరి గ్రామస్తులు మైలబోయిన శ్రీశైలం,వీసం ప్రభాకర్ రెడ్డి కలిసి మల్లన్న గుట్ట ఎక్కాం ఈరోజు. మల్లన్నగుట్ట ఒక అద్భుతం.పురాతనస్మృతుల విషాదం.తూర్పు దిశ మధ్యలోనే కోట గోడ కనిపిస్తుంది.ఇది మట్టిగోడ.చిన్న చిన్న రాళ్ళని కడుపులో పెట్టుకున్న పెద్దరక్షణ కవచం. అక్కడికి దగ్గరలో చేదబాయికోట వుంది.కోటగోడ మూడు ప్రాకారాలుగా వుంది. ఒకటిః మట్టిగోడ, రెండవదిః చెక్కిన పెద్దరాతిబండలతో రెండవ వరుస కోటగోడ.మూడవది చక్కగా గోడలకోసం చెక్కిన రాతిబిళ్ళలతో కట్టిన గోడ.సరిగా కోట మధ్యలో మల్లన్నగుడి.మల్లన్నగుడి రాతిద్వారం రెండు శేరలమీద కలశాలు వున్నాయి.ఇది జైనబసది లేదా గుడికి వుండే గుర్తులు.అంటే మొదట జైనదేవాలయంగా వున్న ఈ గుడి తర్వాత శివాలయంగా మార్చబడిందన్నమాట.గుడి ముందు వినాయకుడు,తలలేని నంది,ఆంజనేయుడు వున్నారు.గుడికి దగ్గరలో రెండు సహజసిద్ధమైన నీటికుండాలున్నాయి.ఒకదానిలో నిరంతరం తామరలు వుండేవి.వర్షాభావం వల్ల తామరలను చూడలేకపోయాం.అట్లే అక్కడికి దగ్గరలో వుండే ‘దూసరి వడ్లు’ పండే మరో కుండం చూసాం.నీళ్ళులేక ఆ కుండం కళతప్పింది.
కోటకు నైరుతిలో రెండురాతిగుండ్ల నడుమ చిన్నసొరికెలో వెలసివున్న నరసింహస్వామిని చూసాం.
కోటగోడ దాదాపు 30 కిలోమీటర్లవిస్తీర్ణంలో కట్టబడివుంది.కాని ఇపుడు కనిపించేవి కోట శిథిలాలే.7 లేదా8 కి.మీ.పొడవు,5 కి.మీ.ల వెడల్పుండే గుట్టపై మైదానప్రాంతం 40 కి.మీ.ల వైశాల్యంతో వుంది.నాలుగుకొలనులు,ఎన్నో నివాసగృహాల ఆనవాళ్ళు కనిపించాయక్కడ.అంతేకాదు, శాతవాహనులవా లేక విష్ణుకుండినులవా ఇటుకలు దొరికాయక్కడ.స్తూపనిర్మాణం వుండవచ్చనిపించే ఇటుకలతో కట్టిన తొట్లు,ఇతర నిర్మాణాలు అక్కడక్కడ కనిపించాయి.
రాయగిరికోట భువనగిరికోట కన్నా ముందే నిర్మాణం చేసినకోట.ఇక్కడి కోట నిర్మాణం,భవనాల కట్టుకం, కుండాల నిర్వహణ, దేవాలయాలు,స్తూపాలవంటి నిర్మాణాలు...ఇవన్నీ ఈ రాయగిరి కోట విష్ణుకుండినుల కాలం లేదా అంతకన్నా ముందే ఇక్కడ కట్టివుంటారని తెలుస్తున్నది.
గ్రామంలో నిజాంల నాటి గడి,బురుజులు, అతి పురాతనమైన,ఆళ్వార్లు గుడి ద్వారపాలకులుగా వున్న వేంకటేశ్వర్ల గుడి వుంది వూరిలో.ఇదొక చరిత్రే.
రాయగిరికోటలో శిథిలాలతో పాటు నైవాసికప్రాంతాలలో కుండపెంకులు చాలా లభించాయి. వాటిలో వంటపాత్రలు,నీటిపాత్రలు, కర్మకాండలకు వాడే పాత్రలు,ప్రమిదల వంటి వాటి పెంకులున్నాయి.వాటిలో అంగుళం మందం,3 రకాల మట్టిపొరలతో కొన్ని, చిక్కని,పలుచని ఎరుపురంగు ముక్కలు,బూడిదరంగు,నలుపురంగువి,వాటిపై చక్కని డిజైన్లు కనిపిస్తున్నాయి.ఆ పాత్రల రకాలను బట్టి, మందాలను బట్టి,రంగులను బట్టి అవి వేరు వేరు కాలాలకు చెందినవిగా తెలుస్తున్నది.
అక్కడ లభించిన ఇటుకలు,కుండపెంకులు,శిథిలగృహాల ఆనవాళ్ళు శాతవాహన కాలం నాటివనిపిస్తున్నది.రాయగిరి ఈ ప్రాంతంలో అత్యంతపురాతనమైన రాచ దుర్గమని, మూడు,నాలుగు రాజవంశాలు ఇక్కడి నుండి పాలించివుంటాయని తెలుస్తున్నది. ఇక్కడ తవ్వకాలు,పరిశోధనలు జరిపితే మరిన్ని విశేషాలు బయట పడతాయని తెలంగాణచరిత్రకు కొత్తపుట చేరుతుందని మా కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆశిస్తున్నది.
భువనగిరిలో కోటకట్టక పూర్వం ఇక్కడే ముందుగా కోటకట్టారని,నచ్చక వదిలేసి భువనగిరిలో తర్వాతకాలంలో కోటనిర్మాణం చేసారని జనంలో ఒక కథ ప్రచారం వుంది.అది నిజమవునో లేదో కాని రాయగిరి మల్లన్నగుట్ట అంత సులువుగా ఎక్కేందుకు వీలు కాదు.ఇక్కడ గండ్రశిలలెక్కువ.భువనగిరిఖిల్లాలెక్క నునుపుగా వుండదు.ఏకశిల కాదు.కాని,రాయగిరి కోట విస్తీర్ణం చాలా ఎక్కువ.చాలా గొప్పగా వ్యూహాత్మకంగా కట్టింది రాయగిరికోట.కాని, నేడది శిథిలచరిత్ర.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...