10, జనవరి 2018, బుధవారం

ఫలక్‌నుమా ప్యాలెస్‌
ఫలక్‌నుమా అంటే 'ఆకాశదర్పణం' అని అర్థం. ప్రపంచంలోని అత్యంత అందమైన, రాజఠీవి ఉట్టిపడే భవనాలలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఒకటి. చార్మినార్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చాంద్రాయణగుట్టవెళ్ళే మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను పైగా వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌వికారుల్‌ ఉమ్రా ఇక్బాదుదౌలా బహదూర్‌ నిజాంమీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు కానుకగా ఇచ్చారు. దీన్ని హైదరాబాద్‌ రాజులు అతిథి గృహంగా వాడారు. బ్రిటిష్‌ ఐదో కింగ్‌ జార్జ్‌, క్వీన్‌మేరీ, ఎనిమిదో కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్రాయ్‌ లార్డ్‌వేవెల్‌, తొలి భారత గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ లోగడ ఈ భవనంలో విడిది చేయడం విశేషం. చిన్నకొండపై నిర్మించిన ఈ భవనంపైనుంచి చూస్తే నగరం సమస్తం కనుచూపుమేర కనిపిస్తుంది. ఈ ప్యాలెస్‌కు 1884 మార్చి 3వ తేదీన పునాది వేసి, 1893 నాటికి నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు ఖర్చయినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భవనాల్లోనే ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషా 1911లో మరణించాడు. మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌ నిర్మాణంలో ఇటాలియన్‌ పాలరాయి, ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించిన కలపను ఉపయోగించారు. సీలింగ్‌ను, కుడ్యాలను ఫ్రెంచి వారితో చేయించారు. డ్రాయింగ్‌ రూంలో ఆభరణాలతో అలంకరించిన అపురూపమైన అద్దం ఉంది. దీని విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా జేడ్‌ కలక్షన్‌ కూడ ఇక్కడే ఉంది. సీలింగ్‌పై, కుడ్యాలపై ఉన్న పెయింటింగ్‌లు, చిత్రాలు, విశాలమైన డైనింగ్‌ హాల్‌లో పెద్ద డైనింగ్‌టేబుల్‌ దాని చుట్టూ నూటరెండు కుర్చీలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లోని ఫర్నిచర్‌ విక్టోరియన్‌ పద్ధతి పనితనానికి ఆనవాళ్ళు. ప్రస్తుతం ప్యాలెస్‌ ఉన్న స్థలంలో లోగడ ఖులీ ఖుతుబ్‌షా 1580-1611లో నిర్మించిన కోహెతూర్‌ భవనం ఉండేది. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ను తాజ్‌ గ్రూప్‌నకు లీజుకిచ్చారు. ఈ ప్యాలెస్‌లో విందులు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...