10, జనవరి 2018, బుధవారం

పురానాహవేలి

ఛత్తాబజార్‌, డబీర్‌పురా ప్రధాన రోడ్డు మధ్యలో పురానాహవేలి ఉంది. ఒకప్పుడిది కులీకుతుబ్‌షా కాలంలో హైదరాబాద్‌ ప్రధానమంత్రిగా ఉన్న మీర్‌ మొమిన్‌ నివాసం. సుమారు మైలు పొడవునా ఎత్తయిన గోడ ఉండడంవల్ల ఈ భవన శోభ బయటికి కనిపించదు. 1717లో రెండో నిజాం మీర్‌ నిజాం అలీఖాన్‌ మోమిన్‌ వంశానికి చెందిన రుకునుద్దౌలా నుంచి మీర్‌ఆలం సేకరించాడు. ప్రధాన భవనం పద్దెనిమిదో శతాబ్దపు యూరోపియన్‌ వాస్తు శిల్పానికి ప్రతీక. సికిందర్‌జా కొంతకాలం ఇక్కడ ఉండి, తన నివాసాన్ని ఖిల్వత్‌ మహల్‌కు మార్చడంతో ఈ భవనాలకు పురానా హవేలీ అనే పేరు వచ్చింది. ఈ భవన సముదాయంలో ఐనా ఖానా (అద్దాల నిలయం), చినిఖానా (చీనా గ్లాసు నిలయం) నిర్మించాడు. నాలుగో నిజాం నసీరుద్దౌలా ఈ భవనాల్లోనే జన్మించాడు. ఆ తరువాత ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషా ఈ భవనాలపై మోజుపడి, వీటిని తన నివాసంగా మార్చుకున్నాడు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ భవనాల్లో అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఇందులో విశాలమైన తోట కూడా ఉంది. దీని వైశాల్యం లక్షా నలభై ఐదు వేల చదరపు గజాలు. 1971లో ఈ భవన సముదాయాన్ని మీర్‌ బర్కత్‌ అలీఖాన్‌ ముఖరంజా ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. ఈ భవన సముదాయంలోని మొదటి భవనంలో గ్రంథాలయం, ట్రస్టు కార్యదర్శి నివాసం ఏర్పాటుచేశారు. రెండో భవనంలో ప్రిన్స్‌ అజమత్‌ జా గ్రంథాలయం నడుస్తోంది. మూడో భవనంలో అన్వరులూం మహిళా కళాశాల, ఆరోభవనం అజ్మత్‌ జా భవన సముదాయంలో సెట్విన్‌ కార్యాలయం, ఏడో భవనంలో నిజామియా మహిళల విద్యాసంస్థ నడుస్తోంది. అసఫ్‌జాహీ రాజుల పాత ఫర్నీచర్‌ ఈ భవనాల్లో ఉంది. పురానా హవేలీ మొత్తం ముఖరంజా ట్రస్ట్‌ ఆధీనంలో ఉంది. తూర్పువైపు పైఅంతస్తులో జూబ్లీ పెవిలియన్‌ మ్యూజియం, పశ్చిమ వైపు పైఅంతస్తులో ముఖరంజా సాంకేతిక విద్యాసంస్థ ఉన్నాయి.


మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...