10, జనవరి 2018, బుధవారం

హైదరాబాద్‌

హైదరాబాద్‌. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్‌ షా దీనిని నిర్మించాడు. కుతుబ్‌ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్‌, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్‌ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్‌ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
భౌగోళిక పరిస్థి తులు  దక్కన్‌ పీఠభూమిలో సముద్ర మట్టానికి 536 మీటర్లు(1607 అడుగుల) ఎత్తులో హైదరాబాద్‌ నగరం ఉంది. ఎక్కువ శాతం రాతి నేలలే. నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయం ఉంది. మూసీనది ఒడ్డున హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించారు. నగరంలో చాలా భాగం నదికి ఉత్తర భాగంలో కేంద్రీకృతమై ఉంది. హుస్సేన్‌సాగర్‌కు దక్షిణ భాగంలో ఎక్కువ ప్రభుత్వ భవనాలు, కట్టడాలు వెలిశాయి.
వాతావరణం
నగరంలో అరుదైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పొడి, వేడి వాతావరణం ఉంటూ... ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడాదికి సగటు వర్షపాతం 32 సెంటీమీటర్లు. గరిష్ఠ ఉష్ణోగ్రత 45.5 సెంటిగ్రేడ్‌(జూన్‌ 2, 1966). కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 సెంటిగ్రేడ్‌(జనవరి 8,1946). మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 28 నుంచి 40 సెంట్రిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.
80 శాతం హిందువులే. మరో 16.84 శాతం ముస్లిం, 2.13 శాతం క్రిస్టియన్లు, మిగిలిన ఒకశాతం సిక్కులు, బౌద్ధులు, జైన్లు ఇక్కడ నివశిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని మతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. నగరం ఒక మినీ భారతంగా వర్థిల్లితోంది.
చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్‌ సొబగులతో, డిజిటల్‌ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్‌ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి. ఇంతటి మహత్తర గతాన్ని గురుతు చేసుకోవడం మన విద్యుక్త ధర్మం. ఎన్నో సంప్రదాయాల సంగమంగా ఎందరో పాలకులకు ఆలవాలమైన ఈ నగరం ఓ దశాబ్దం తర్వాత, ప్రజాస్వామ్య సౌరభాలను గుబాళించే కీలక ఎన్నికలవైపు అడుగులేస్తోంది. ఈ విలువైన తరుణంలో నగరం నలుమూలలా మూగసాక్ష్యాలుగా మిగిలిన శిథిలాల్ని, చరిత్రపుటల్లో దాగిన ముత్యాలను తడిమిచూసే ప్రయత్నమిది. ఇంతటి ఘనచరితం నగరపౌరులుగా మనకు గర్వకారణంగా నిలవడంతోపాటు ఈ నగర పరిరక్షణకు, సముజ్వల భవితకు పాటుపడే పాలకులెంతటి ఘనతరులు కావాలో ఆలోచించుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఓ ఐదువందల ఏళ్లక్రితంనాటికి... ఈ నగరానికి పునాదులింకా పడనంత వెనక్కి... చరిత్రలోకి తొంగిచూస్తే ఇక్కడేం ఉండేది? అక్కడినుంచి ఒక్కో నీటి పాయనూ కలుపుకొంటూ సువిశాల నదీమతల్లిగా ఎదిగిన ఈ భాగ్యనగర సమున్నత చరితను లీలామాత్రంగా తడిమిచూసే ప్రయత్నమిది...
దేశవిదేశాల్లో తన కీర్తిచంద్రికలను వ్యాపితం చేసుకుంటున్న మన 'భాగ్య' నగరం చరిత్ర క్రీస్తు పూర్వమే ప్రారంభమయిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది నిజం... ఎందరో వీరులను, శూరులను, కన్న ఈ గడ్డ, ఎన్నో కళలకు, సంస్కృతులకు నిలయం ఈనేల. హైదరాబాద్‌ నగరానికి 1591లో పునాది పడినప్పటికీ అంతకు పూర్వమే అతి ప్రాచీన కాలంనుంచి కూడా ఈ నగర పరిసర ప్రాంతాలలో జనావాసాలు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి. హస్మత్‌పేట, బేగంపేట, గచ్చిబౌలి, మౌలాలి, బోయినపల్లి, లింగంపల్లి, కూకట్‌పల్లి, గగన్‌పహాడ్‌, ఉప్పల్‌, గుర్రంగూడ, మీర్‌ఆలం టాంక్‌, వంటి స్థలాలలో క్రీస్తుకు పూర్వం 3000-1000సంవత్సరాల మధ్య ఆదిమవాసులు నివసించినట్లు రుజువుచేస్తున్నాయి. వీటన్నిటిలోకి హస్మత్‌పేటలో లభించిన అవశేషాలు మిగతా వాటికంటే ప్రాచీనమైనవని చెప్పవచ్చు. పురావస్తుశాఖ వారు 1934లో మరోసారి ఇక్కడ తవ్వకాలు జరపగా సమాధులలో మానవ శల్యాలు, తదితర వస్తువులు బయటపడ్డాయి. కానీ పాత్రలు కానరాలేదు. దీనిని బట్టి మానవుడు పాత్రలు తయారుచేసే యుగానికి పూర్వమే ఇక్కడ ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా బిర్లా పురావస్తుశాలకు చెందిన శాస్త్రజ్ఞులు మౌలాలిలో జరిపిన తవ్వకాలలో కూడా విలువైన సామాగ్రి లభించింది. గచ్చిబౌలిలోని కేంద్ర విశ్వవిద్యాలయం ఆవరణలో బయల్పడిన అవశేషాలు కూడా హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల ప్రాచీనతను చాటిచెబుతాయి.
ఇక చారిత్రక యుగానికి వస్తే హైదరాబాద్‌ నగరానికి కొద్ది దూరంలోనే ఉన్న కొండపూర్‌ వంటి గ్రామాలలో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి ఈ ప్రాంతమంతా తొలుత మౌర్యుల పాలనలోనూ ఆ తర్వాత ఆంధ్ర శాతవాహనుల పాలనలోను ఉన్నట్లు తెలుస్తోంది. శాతవాహన సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఆంధ్రదేశంలో అత్యంత విస్తృతమైన ప్రాంతాలను పరిపాలించిన విష్ణుకుండినులకు హైదరాబాద్‌ నగర శివారులలో గల కీసరగుట్ట కొంతకాలం రాజధానిగా ఉంది. నగరానికి చెందిన చైతన్యపురిలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద బయల్పడిన శిలాశాసనాన్ని బట్టి ఆ స్థలం విష్ణుకుండినుల కాలంలో బౌద్ధారామంగా ఉండేదని తెలుస్తోంది. విష్ణుకుండినుల తర్వాత బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల, కళ్యాణీ చాళుక్యుల శాసనాలు గండిపేట సమీపంలోని చిలుకూరులో లభించాయి. కళ్యాణీ చాళుక్యుల తర్వాత ఆంధ్రదేశాన్ని కాకతీయులు పరిపాలించారు. వీరి రాజధాని ఓరుగల్లు(వరంగల్లు). తెలుగుజాతి నివసించే ప్రాంతాలన్నిటినీ సమైక్యపరిచిన ఘనత వీరికే దక్కుతుంది. ఈ వంశరాజులలో 1116నుంచి 1157వరకు పాలించిన రెండో ప్రోలరాజు కుమారుడూ, యువరాజు అయిన రుద్రదేవుడు నల్లగొండ జిల్లాలోని రాయఘర్‌, భువనగిరి ప్రాంతాలనేగాక హైదరాబాద్‌ ప్రాంతాలను కూడా రాజప్రతినిధిగా పరిపాలించినట్లు తెలుస్తోంది. కర్మాన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయ చరిత్రననుసరించి దానిని 1143లో ప్రాంతంలో రుద్రదేవుడే నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన గోల్కొండ దుర్గాన్ని కూడా తొలుత ఆయనే నిర్మించడం స్థానిక గాథల వివరిస్తున్నాయి. గొల్లలు (యాదవులు) ఆ కొండపై ఆ కాలంలో నివసించేవారని అందుచేతనే దానికి గొల్లకొండ అని పేరు వచ్చిందని అదే ఆ తర్వాత గోల్కొండగా జనశృతిలోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దేవగిరి రాజుల దండయాత్రలను నిరోధించడానికే రుద్రదేవుడు ఇక్కడ దుర్గం నిర్మించి ఉంటాడు. కర్మాన్‌ఘాట్‌ దేవాలయాన్ని, గోల్కొండ కోటను నిర్మించిన ఆయన ఈ నగర ప్రాంతంలో కొంత కాలం నివసించాడని విశ్వసించడానికి వీలుంది. ఆ కాలంలో గోల్కొండ గల గ్రామం పేరు మానుగల్లు. కాకతీయ సామ్రాజ్యాన్ని మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ 1323లో అంతం చేసి ఆంధ్రదేశంపై ఢిల్లీ సుల్తానుల పాలనను నెలకొల్పాడు. కాని ఆయన కింద పనిచేసిన అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమనీ అనే అధికారి తిరుగుబాటు జరిపి దౌలాతాబాద్‌ రాజధానిగా 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాకతీయుల పతనానంతరం ముసునూరి వంశస్తులైన ప్రోలయ, కాపయ, నాయకులు ఆంధ్రదేశాన్ని ఢిల్లీ పాలన నుంచి విముక్తి చేశారు. బీదర్‌ నుంచి బంగాళాఖాతం వరకు గల ప్రాంతం వారి ఆధీనంలోకి వచ్చింది. దక్షిణదిశగా తమ ప్రాంతాలను విస్తరింపజెయ్యాలనే తలంపుగల బహమనీ సుల్తానులకు, ముసునూరి నాయకులకు మధ్య ఘర్షణ తప్పలేదు. బహమనీ దండయాత్రలను తట్టుకొనేందుకు కాపయనాయకుడు గోల్కొండ దుర్గాన్ని మరింత పటిష్టం చేశాడు.

బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్‌ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్‌ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్‌-ఉల్‌-ముల్క్‌'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్‌ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్‌ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్‌, బీరార్‌, బీదర్‌, బీజపూర్‌ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్‌ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు
కులీకుతుబ్‌ షా గోల్కొండకోటను మరమ్మతు చేయించి దానిలోనే రాజభవనాలను నిర్మించాడు. తనను తెలంగాణాకు తరఫ్‌దార్‌గా నియమించిన మహమూద్‌ బహమనీషా పేరుమీదుగా మానగల్లు పట్టణ పేరును 'మహమూద్‌ నగర్‌' గా మార్చాడు. (ఇది ఇప్పుడు అహ్మద్‌నగర్‌గా వాడుకలో వచ్చింది). ఆయన తెలంగాణా ప్రాంతాన్నంతనూ జయించడమేకాక కోస్తా ప్రాంతంలోని కొండపల్లి, ఏలూరు దుర్గాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆయన పేరుమీదగానే ఆయన వంశానికి 'కుతుబ్‌షాహి' వంశమని పేరు వచ్చింది. 1543లో కులీకుతుబ్‌ను ఆయన కుమారుడైన జంషీర్‌ హత్య చేసి అధికారం చేబట్టాడు. ఆయన చర్యను నిరసించిన సోదరుడు ఇబ్రహీం రాజ్యాన్ని వదలి హంపీ విజయనగరంలో అళియరామరాయలిచ్చిన ఆశ్రయంలో ఏడు సంత్సరాలపాటు జీవింవచవలసి వచ్చింది. ఈ తరుణంలోనే ఆయన భగీరథీబాయ్‌ అనే హిందూ వనితను వివాహం చేసుకున్నాడు. 1550లో జంషీర్‌ మరణించిన తర్వాత జగదేవ్‌రావ్‌ వంటి ప్రముఖ సర్కారుల సహాయంతో ఇబ్రహీం కుతుబ్‌షా గోల్కొండ సామ్రాజ్యాధిపతి కాగలిగాడు

ఇబ్రహీం కుతుబ్‌షా (1550-80) తొలుత జంషీర్‌ అనుకూలవర్గాలు జరిపిన తిరుగుబాట్లను అణచివేశాడు. ఆ తర్వాత రాజమండ్రి దుర్గాన్ని కూడా ఆక్రమించి తూర్పు గోదావరి జిల్లా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అళియరామరాయలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించినా ఆ తర్వాత దక్షిణ తెలంగాణా ప్రాంతాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపిన ఫలితంగా అహమ్మద్‌నగర్‌, బీజపూర్‌, బీరార్‌ సుల్తానులతో కలసి 1565 సంవత్సరంలో జరిగిన 'రాక్షసి-తంగడి'యుద్ధంలో పాల్గొని రామరాయలను ఓడించడంలో తన వంతు పాత్ర తాను పోషించాడు.
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్‌ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్‌) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్‌ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్‌ అని పిలిచేవారు. క్రమంగా అదే నిలిచింది. హుస్సేన్‌షా వలి గొప్ప ఇంజనీరే కాక సుఫీ యోగి. ఇబ్రహీంకు బావమరది. ఆయన దర్గా ఇప్పటికి గోల్కొండ ప్రాంతంలో పాతముంబాయ్‌ రహదారిపై ఉంది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం సుల్తాన్‌ ఇబ్రహీం పేరుమీద వెలసిందే. ఆ పట్టణంలో ఉన్న సరస్సు కూడా ఆయన నిర్మించిందే. ఇబ్రహీం గోల్కొండ కోటకు రెండు ప్రాకారాలను కట్టించి దాన్ని దుర్భేద్యం చేశాడు. లింగంపల్లి భూములను సేరే భూములుగామార్చి వాటి సాగు ద్వారా కోటలోకి ఆహార పదార్ధాలు సరఫరా అయ్యే ఏర్పాటుచేశాడు. లింగంపల్లి చెరువును విస్తృతం చేసి దాని నుంచి గొట్టాల ద్వారా కోటలోకి నేరుగా సరఫరా అయ్యే వీలు కల్పించాడు. పర్షియన్‌ చక్రాలు, చేదల ద్వారా కింది అంతస్థు బావి నుంచి ఎగువ అంతస్తు బావికి నీరు అందేటట్లు, తద్వారా కోటలోని అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేశాడు. ఇది చాలా ప్రయాసతో కూడిన పని అయినందు వలన గోల్కొండ కోటకు అన్ని వేళల నీరు సమృద్ధిగా లభించేది కాదు. అందుచేతనే ఇబ్రహీం మూసీనదికి దక్షిణాన మరో నగరం నిర్మించి యుద్ధ భయం లేనప్పుడు ఆ నగరంలో నివసించాలని నిర్ణయించాడు. దీనికి ప్రాతిపదికగా మూసీనదిపై ఒక వంతెన నిర్మింపజేశాడు. దీనినే ప్రస్తుతం 'పురానాపూల్‌' అంటున్నారు. (తన కుమారుడైన మహమ్మద్‌ కులీకుతుబ్‌ చించలం గ్రామంలో నున్న భాగమతిని కలవడానికి వరదతో ఉన్న మూసీనదిని ఈదుకుంటూ వెళ్లడాన్ని గమనించిన ఇబ్రహీం వెంటనే ఆ నదిపై వంతెన నిర్మించడానికి పూనుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది.) వాస్తవానికి మూసీనదికి దక్షిణంగా ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించి దానికవసరమైన పథకాలను తయారుచేయించింది ఇబ్రహీం కుతుబ్‌షాయే. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో 'బాలా హిస్సార్‌' అనే పర్వత దుర్గం ఉంది. అది వాస్తుకళకు, చక్కటి వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. తామర్లేన్‌, బాబర్‌ వంటి పాలకులు అక్కడ నివసించడానికి ఆసక్తి చూపేవారు. గోల్కొండ కోట శిఖరాగ్రంలో అటువంటి బాలాహిసార్‌నే ఇబ్రహీం తీర్చిదిద్దాడు. ఆయన నిర్మించిన పురానాపూల్‌ పారిస్‌ నగరంలోని 'పోంటో న్యూఫు' (నూతన వంతెన)కు దీటైనదని రాశాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా మరణానంతరం ఆయన కుమారుడు మహమ్మద్‌ కులీకుతుబ్‌షా (1580-1611) అధికారంలోకి వచ్చాడు. ఈయన ఉత్తరాంధ్ర ప్రాంతాలను, రాయలసీమ ప్రాంతాలను జయించి కాకతీయుల తర్వాత మరొక మారు తెలుగు జాతిని సమైక్యం చేశాడు. తన సర్దారులను ఆయా ప్రాంతాలలో సామంతులుగా నియమించి తన పరిపాలనను సుస్థిరం చేశాడు. బొబ్బిలి, అనకాపల్లి , పిఠాపురం, పెద్దాపురం, మొగలితుర్రు, నూజివీడు మొదలైన సంస్థానాలు ఆ సందర్భంలో వెలిసినవే. ఆయన మొగల్‌ చక్రవర్తి అయిన అక్బర్‌కు సమకాలీనుడు. అక్బర్‌ ఉత్తర భారతదేశమంతా జయించి దక్కన్‌పై దృష్టి సారించాడు. అహ్మద్‌నగర్‌ పతనమైతే గోల్కొండ సామ్రాజ్యానికి కూడా ముప్పు తప్పదనే దృష్టితో మహమ్మద్‌ కులీకుతుబ్‌షా మొగలులకు వ్యతిరేకంగా పోరాడిన చాంద్‌బీబీ, మాలిక్‌ యాంబర్‌వలకు సహాయంగా సైన్యాలను పంపి అహమ్మద్‌నగర్‌ స్వతంత్రాన్ని పరిరక్షించడానికి కృషి చేశాడు. పర్షియా (ఇరాన్‌) చక్రవర్తి అయిన అబ్బాస్‌తో స్నేహసంబంధాలను కొనసాగించి ఆయన ద్వారా దక్కన్‌ ప్రాంతంపై దండయాత్రలు చేయకుండా మొగలులపై వత్తిడి తెచ్చేవాడు.
హైదరాబాద్‌ నగర నిర్మాణం మహమ్మద్‌ కులీకుతుబ్‌ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్‌' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా ప్రధానమంత్రి మీర్‌ మొమిన్‌ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్‌'గావర్ణించాడు.
కుతుబ్‌షాహీలు షియా మతస్థులు. అందుకే నూతన నగరానికి కేంద్రమైన చార్‌మినార్‌ను షియా మతస్థుల ఎనిమిదో ఇమామ్‌ 'హజ్రత్‌ అలి రాజా' స్మారక సమాధి రూపంలో నిర్మించారు. ఇమామ్‌ హుస్సేనీ కర్బలా యుద్ధానికి తీసుకువెళ్లిన అలం (పతాకం) ప్రతిరూపం కూడా ఈ నిర్మాణంపై కనపడుతుంది. నగరంలో వ్యాపించిన ఒక జాడ్యాన్ని నివారించినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా చార్మినార్‌ను నిర్మించాడనే గాథ వాడుకలో ఉన్న మరో కథ. చార్మినార్‌ను నాలుగు రహదారుల కూడలిలో నిర్మించారు. దీనినుంచి తూర్పు వైపు వెళ్లే దారి మచిలీపట్టణానికి చేరుతుంది. దక్షిణ దిశగా వెళ్లే దారి కృష్ణానది వరకు విస్తరించి ఉండేది. ఉత్తరదిశకు వెళ్లే దారి మూసీనదిని తాకేది. పశ్చిమ దిశనున్న దారి గోల్కొండ దుర్గానికి చేరేది. మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా చార్మినార్‌కు ఈశాన్య దిశన జామా మసీదును, వాయవ్య దిశన అనేక భవంతులను నిర్మింపజేశాడు. ఉత్తర దిశన 'చార్‌కమాన్‌' అనే నాలుగువైపులా ద్వారాలున్న మధ్య విశాలమైన ప్రదేశం, జలయంత్రం ఉండే కట్టడాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన భవనాలలో చార్మినార్‌ , జామామసీదు కాక లాల్‌మహల్‌, దార్‌మహల్‌, జినాన్‌మహల్‌, కుతుబ్‌ మందిర్‌, సాజన్‌మహల్‌, ఖుదత్‌మహల్‌ ముఖ్యమైనవి. దార్‌మహల్‌ను ఆయన తన దర్బార్‌కు ఉపయోగించేవాడు. పరిపాలనా నిర్వహణ ఇక్కడ నుంచే జరిగేది. ఫిర్యాదులపై ఇక్కడ ఆసీనుడయ్యే తీర్పులు చెప్పేవాడు. కుతుబ్‌మందిర్‌ ఆయన నివాస భవనం. మహమ్మద్‌ కులీకుతుబ్‌షా తాను రచించిన గీతాలలో ఖుదత్‌ మహల్‌, సాజనత్‌ మహల్‌, హైదర్‌ మహల్‌, కుతుబ్‌ మందిర్‌లను కొహితూర్‌ మహల్‌, నదీమహల్‌లను ప్రశంసిస్తాడు. ఖుదత్‌ మహల్‌ ఎనిమిది అంతస్తుల భవనం. కొహితూర్‌ మహల్‌ చార్మినార్‌కు దక్షిణ దిశగా వెళ్లే రహదారిపై కొద్ది దూరంలో నిర్మించిన భవనం. దాని చుట్టూ చక్కటి ఉద్యానవనం కూడా ఉండేది. అది ఇప్పుడు కనుమరుగైంది. అది ఉండే ప్రదేశంలోనే ఫలక్‌నూమా భవంతి నిర్మితమైనదని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. నదీమహల్‌ మూసీ నది తీరాన నిర్మితమైన విశ్రాంతి మందిరం. మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా హుస్సేన్‌సాగర్‌కు ఆగ్నేయదిశగా ఉన్న కొండపైన చక్కటి భవనం నిర్మించాడు. దీనిచుట్టూ విస్తృతమైన ఉద్యానవనం ఉండేది. ఆ వనం నేటి బషీర్‌బాగ్‌, ఫతేమైదాన్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, సైఫాబాద్‌ ప్రాంతాలదాకా విస్తరించి ఉండేది. అందుకే ఆ కొండను అప్పట్లో నబత్‌ ఘాట్‌ (వన పర్వతశిఖరం) అనేవారు. దాని చిహ్నంగా ప్రస్తుతం పబ్లిక్‌ గార్డెన్స్‌ మాత్రం మిగిలింది. అసఫ్‌జాహీ పరిపాలన కాలంలో నబత్‌ ఘాట్‌పై నొబత్‌ (ఢంకా)ను మోగించేవారు. అందుచేత దానికి ఆనాటి నుంచి 'నౌబత్‌ పహాడ్‌' అనే పేరు వచ్చింది. హైదరాబాద్‌ నగరంలో దాని పరిసరాల్లో ఇంకా అనేక ఉద్యానవనాలుండేవి. మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా బార్షాహి అషుర్‌ ఖానా, దౌలత్‌ఖాన్‌-ఇ-అల్లాఖి, దారుల్‌-ఐ-షిఫాలను 1595లో నిర్మించాడు. అఘర్‌ఖానాను ఇప్పటికీ షత్తర్‌ఘట్టీలో చూడవచ్చు. దారుల్‌-ఐ-షిఫా విద్యాలయంగానూ, వైద్యశాలగానూ ఉపయోగపడేది. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. చార్మినార్‌ రెండో అంతస్తులో కూడా ఒక విద్యాలయాన్ని నిర్వహించేవారు. హైదరాబాద్‌ నగర నిర్మాణం తర్వాత సుల్తానులు ఆ నగరంలోనే నివసించడం ప్రారంభమైంది. యుద్ధ సమయాలలో మాత్రం గోల్కొండ కోటలోకి తరలిపోయేవారు. రాజ్యంపేరు మాత్రం గోల్కొండ రాజ్యంగానే చలామణీ అయింది.
మహమ్మద్‌ కులీకుతుబ్‌షా తాను నూతనంగా నిర్మించిన నగరానికి భాగ్యనగర్‌ అని నామకరణం చేశాడని చారిత్రక ఆధారాలు తెలుపుతాయి. ఆయన భార్యలలో అత్యంత ప్రీతిపాత్రురాలైన భాగమతి పేరు నగరానికి పెట్టాడని అత్యధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం. హైదరాబాద్‌ దర్శించిన ఫెరిష్టా, టెవెర్నియర్‌, ధెవమో, మనుక్కే వంటి విదేశ యాత్రీకుల రాతలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తాయి. ఇప్పటికీ 'భాగ్యనగరపు వారు' అను ఇంటి పేరు కలవారున్నారు. ఆ పేరుతో ఒక గ్రామమో పట్టణమో లేకపోతే ఆ ఇంటిపేరు రాదు. భాగ్యనగరం మరెక్కడా లేదు. హైదరాబాద్‌ గురించి ప్రస్తావించిన తొలి రచనలలో బాగ్‌నగర్‌ అనే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌ అనే పేరు కనిపిస్తుంది. భాగమతికి మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా హైదర్‌ మహల్‌ అనే బిరుదు ఇచ్చి భాగ్యనగర్‌ పేరును హైదరాబాద్‌గా మార్చాడని చరిత్రకారుల అభిప్రాయం. ఆయన నిర్మిచిన హైదర్‌ మహల్‌ భాగమతి కోసం నిర్మించిందే అయి ఉంటుంది. భాగమతి వర్ణ చిత్రాలున్నాయి. మహమ్మద్‌ కులీకుతుబ్‌ షాయే కాదు ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన మహమ్మద్‌ కుతుబ్‌షా ప్రియురాలు అయిన తారామతి పేర తారానగర్‌, అబ్దుల్లా కుతుబ్‌ షా ప్రేయసి ప్రేమావతిపేర ప్రేమావతి పేట వెలిశాయి. కుతుబ్‌షాహీ సమాధులలోనే వారి సమాధులూ ఉన్నాయి. గోల్కొండకు కొంచెం దూరంలో వారు నాట్యం చేసిన మందిరం ఉంది. అటువంటప్పుడు మహమ్మద్‌ కులీకుతుబ్‌షా తాను నిర్మించిన నగరానికి తాను అత్యంత గాఢంగా ప్రేమించిన భాగమతి పేరు పెట్టాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భాగమతి సమాధి కుతుబ్‌షాహీ సమాధులలోని కుల్సుంబేగం సమాధి వద్ద ఉందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
మహమ్మద్‌ కులీకుతుబ్‌షాకు కుమారులు లేరు. హయత్‌బక్షీ బేగం అనే కుమార్తె ఉంది. ఆమెను తన సోదరుని కుమారుడైన మహమ్మద్‌ కుమారుడైన మహమ్మద్‌ కుతుబ్‌షాకు ఇచ్చి వివాహం చేశాడు. మొహ్మద్‌ కులీకుతుబ్‌ షా మరణానంతరం మహమ్మద్‌షా (1611-26) అధికారంలోకి వచ్చాడు. ఆయన పరిపాలనాకాలంలోనే హైదరాబాద్‌ తొలిసారిగా మొగల్‌ దండయాత్రకు గురయింది. మొగల్‌ చక్రవర్తి జహంగీర్‌ (1605-27) పరిపాలనాకాలంలో ఆయన కుమారుడు ఖుర్రమ్‌ (తర్వాత షాజహాన్‌) హైదరాబాద్‌పై దాడి చేసి మహమ్మద్‌ కుతుబ్‌షానుంచి పెద్దమొత్తంలో పేష్కస్‌ (కప్పం) వసూలు చేశాడు. గోల్కొండ రాజ్యం విదేశ దండయాత్రను నిలువరించలేకపోవడం ఇదే ప్రథమం. ముహమ్మద్‌ కుతుబ్‌షా 1617లో మక్కామసీదు నిర్మాణం ప్రారంభించాడు. నగరానికి తూర్పు దిశగా 'సుల్తాన్‌నగర్‌' అనే మరొక నగరాన్ని నిర్మించడానికి పథకాలు తయారుచేయించాడు. కాని ఈ రెండు నిర్మాణాలు ఆయన పరిపాలనా కాలంలో పూర్తి కాలేదు. మొహమ్మద్‌ మహల్‌, దాద్‌ మహల్‌ నిర్మాణాలు మాత్రం పూర్తయ్యాయి. నగరానికి ఉత్తరదిశన ఇరాకీ వాస్తుశైలిలో చార్‌బజార్‌ అనే వాణిజ్యకేంద్రాన్ని నిర్మించాడు. తన తల్లి పేర మాసాబ్‌ట్యాంక్‌ను నిర్మించాడు.
మహమ్మద్‌ కుతుబ్‌షా తర్వాత ఆయన కుమారుడైన అబ్దుల్లా కుతుబ్‌షా (1626-72) అధికారంలోకి వచ్చాడు. ఈ దశలో మహమ్మద్‌ కులీకుతుబ్‌షా కుమార్తె, మహమ్మద్‌ కుతుబ్‌షా భార్య , అబ్దుల్లాకుతుబ్‌షాకు తల్లి అయిన హయత్‌ బక్షీ బేగం (ఆమె పేరునే హయత్‌నగర్‌ వెలిసింది.) రాజ్యపాలనలో ప్రముఖపాత్ర వహించింది. అబ్దుల్లా పరిపాలనా కాలంలో మొగల్‌ దండయాత్రలు ఉధృతమయ్యాయి. షాజహాన్‌ పరిపాలనా కాలంలో (1627-58) జరిగిన మొదటి దండయాత్రను (1626) ప్రతిఘటించలేక అబ్దుల్లా భారీమొత్తంలో కప్పం చెల్లించి మొగలులకు లోబడి ఉండడానికి అంగీకరించాడు. ఆనాటినుంచి గోల్కొండ రాజ్య అంతరంగిక పరిపాలనలో మొగలుల జోక్యం తీవ్రమైంది. దానిని నిరసించినందుకు ఆగ్రహించిన ఆనాటి దక్కన్‌ రాజప్రతినిధి ఔరంగజేబ్‌ తన కుమారుని ఆధ్వర్యంలో 1656లో మరోసారి దండయాత్ర జరిపించాడు. అబ్దుల్లా తలవంచి మళ్లీ భారీమొత్తంలో నష్టపరిహారం, కప్పం చెల్లించి తన ప్రథమ కుమార్తెను ఔరంగజేబు పెద్దకుమారుడైన మహమ్మద్‌కిచ్చి వివాహం చేశాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా తర్వాత ఆయన మూడో అల్లుడైన అబుల్‌ హసన్‌ (తానాషా) (1672-87) అధికారం చేపట్టాడు. ఆయన చార్మినార్‌ సమీపంలో చార్‌మహల్‌ను నిర్మించాడు. మొగలుల అడుగులకు మడుగులొత్తలేక, మాదన్నను ప్రధానమంత్రిగాను, అక్కన్నను సైనికాధికారిగాను నియమించి ఆనాటి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు (1658-1707) ఆగ్రహానికి గురయ్యాడు. దీనికితోడు మహారాష్ట్ర రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీతో ఆయన చేసుకున్న సంధి మరింత ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో తిరిగి మొగలుల దండయాత్ర మొదలైంది. అబుల్‌ హసన్‌ గోల్కొండ ముట్టడి 1627 జనవరి 28న ప్రారంభమై సెప్టెంబరు 21వరకు సాగింది. చివరకు దుర్గ రక్షణకు నియమితుడైన అబ్దుల్లాఖాన్‌ ఔరంగజేబు ఇచ్చిన లంచానికి ఆశపడి దుర్గం ద్వారాన్ని తెరవడంతో గోల్కొండ కోట మొగలుల వశమైంది. అబుల్‌ హసన్‌ దౌలతాబాద్‌ దుర్గంలో 13 సంవత్సరాలపాటు బందీగా జీవించి 1700లో అక్కడే మరణించాడు. ఇలా వైభవోపేతమైన కుతుబ్‌షాహీల చరిత్ర ముగిసింది
మొగల్‌ దండయాత్రా కాలంలో హైదరాబాద్‌ అనేక ఇబ్బందులకు గురయింది. కుతుబ్‌ షాహీలు అనుసరించిన మత సహన వైఖరి అంతమైంది. కాని దీనికొక మినహాయింపు ఉంది. 1687లోనే ఔరంగజేబు కర్మాన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయానికి లాతూర్‌ జిల్లాలోని కొన్ని భూములను, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ధారూర్‌లో 72 ఎకరాల భూమిని దానం చేశాడు. మత దురభిమానంతో అనేక దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు ఇటువంటి దానాలు చేశాడంటే హైదరాబాద్‌ ఉదార సంస్కృతీ ప్రభావం ఆయనను కూడా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మక్కామసీద్‌ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది 1794 నాటికి పూర్తయింది. ఔరంగజేబు హైదరాబాద్‌ నగరం పేరును 'దారుల్‌జిహాద్‌'గా మార్చాడు. అయితే గోల్కొండ -హైదరాబాద్‌ ఒక స్వతంత్ర రాజ్యరాజధానిగా అంతమై తన ప్రాభవాన్ని కోల్పోయింది. రాజ్యం అరాచకం పాలయింది. 'సవాయ్‌ పాపన్న' అనే సామాన్య వ్యక్తి తిరుగుబాటు చేసి విచ్చలవిడిగా దోపిడీలకు పూనుకోగలిగాడంటే ఆనాటి పరిస్థితులెంత అధ్వానంగా ఉన్నాయో అర్థమవుతుంది. మొగల్‌ సామ్రాజ్యం కూడా ఔరంగజేబు మరణానంతరం (1707) క్షీణదశలో పడింది. పరిస్థితులను అదుపులో పెట్టగల పరిపాలనా దక్షులు కరవయ్యారు.
ఆనాటి మొగల్‌ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్‌, తమిళనాడు, గుల్బర్గా, బీదర్‌, బీరార్‌ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్‌ సుభాదార్‌ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్‌ చక్రవర్తి ఫరూక్‌ సియార్‌ మీర్‌ కమ్రుద్దీన్‌ చింక్‌ లిచ్‌ఖాన్‌ అనే సర్దార్‌ను దక్కన్‌ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్‌ హుస్సేన్‌ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్‌ కమ్రుద్దీన్‌ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్‌ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్‌ చక్రవర్తి అయిన మహమ్మద్‌ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్‌-ముల్క్‌' అనే బిరుదు పొందారు. కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్‌ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్‌ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్‌ -ఉల్‌-ముల్క్‌ దక్కన్‌ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్‌ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్‌ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్‌-ఉల్‌-ముల్క్‌ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్‌ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్‌ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్‌ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
నిజామ్‌-ఉల్‌-ముల్క్‌ క్రీ.శ. 1748లో మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు ఘాజీ ఉద్దీన్‌ ఖాన్‌ ఢిల్లీలో మంత్రిగా ఉండేవాడు. అందుచేత ఆసఫ్‌జా రెండో కుమారుడైన నాజర్‌జంగ్‌, మనవడైన ముజిఫర్‌ జంగ్‌లు అధికారం కోసం అంతర్యుద్ధం ప్రారంభించారు. ఇది అవకాశంగా తీసుకొని ఇంగ్లిష్‌, ఫ్రెంచి తూర్పు ఇండియా కంపెనీలు తమ ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకొనేందుకు ప్రయత్నించాయి. ఆంగ్లేయులు నాజర్‌ జంగ్‌ను, ఫ్రెంచివారు ముజఫర్‌ జంగ్‌ను బలపరిచారు. వీరి కుట్రలలో వారిద్దరూ హతమయ్యారు. చివరకు ఫ్రెంచివారి మద్దతుతో ఆసఫ్‌ జా కుమారులలో ఒకడైన సలాబత్‌జంగ్‌ ఔరంగాబాద్‌ గద్దెనెక్కాడు. దీనికి కృతజ్ఞతగా ఆయన కృష్ణానది నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా ప్రాంతాలను 1753లో ఫ్రెంచ్‌ వారికి ధారాదత్తం చేశాడు. కాని కొద్దికాలంలోనే ఫ్రెంచి సేనాధిపతి కర్నల్‌ బుస్సీ తలబిరుసు వైఖరిని ఆయన సహించలేక తన రాజ్యం వదిలిపొమ్మని ఆజ్ఞాపించాడు. అయితే బుస్సీ హైదరాబాద్‌లోని చార్‌మహల్‌లో మకాం పెట్టి సలాబత్‌ సైన్యాలను, ఆయనకు సహాయంగా వచ్చిన మహారాష్ట్ర సైన్యాలను ఎదుర్కొన్నాడు. 1755లో జరిగిన ఈ చార్‌ మహల్‌ యుద్ధంలో హైదరాబాద్‌ నగరంలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. చివరకు గత్యంతరం లేక సలాబత్‌ జంగ్‌ ఫ్రెంచివారితో రాజీపడి వారికి గతంలో తానిచ్చిన ప్రాంతాలను మళ్లీ ఇచ్చేశాడు. అయితే 1756లో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి రంగంనుంచి నిష్క్రమించడంతో సలాబత్‌ జంగ్‌ ఫ్రెంచివారికి గతంలో తానిచ్చిన ప్రాంతాలను ఆంగ్లేయులకు బదిలీ చేసి వారితో స్నేహసంబంధాలను ఏర్పరచుకున్నాడు. దీని ఫలితంగా కాకతీయులు, కుతుబ్‌షాహీలు సాధించిన తెలుగుజాతి సమైక్యత విచ్ఛిన్నమైంది. కోస్తా జిల్లాల ప్రజలు తోటి తెలుగు ప్రజలకు దూరమై ఆంగ్లేయుల ప్రత్యక్ష బానిసత్వంలోకి వెళ్లిపోయారు. 1762లో సలాబత్‌ జంగ్‌ను హతమార్చి అధికారంలోకి వచ్చిన ఆయన సోదరుడు నిజాంఆలీ ఆంగ్లేయులతో సంబంధాలను ధృఢతరం చేసుకున్నాడు. సలాబత్‌జంగ్‌ ఆంగ్లేయులతో చేసుకున్న సంధిని 1767లో ధ్రువపరిచాడు. 1780 నుంచి 1784వరకు జరిగిన మూడో మైసూరు యుద్ధంలోనూ, 1799లో జరిగిన నాలుగో మైసూరు యుద్ధంలోనూ ఆంగ్లేయులతోనూ, మహారాష్ట్రులతోను చేతులు కలిపి, టిప్పు సుల్తాన్‌ పతనానికి కారణభూతుడయ్యాడు. (శ్రీరంగపట్టణం కోటలో నుంచి నిజాం ఆలీ అనుచరులు తీసుకువచ్చిన కొన్ని అమూల్య వస్తువులను ఈనాటికీ సాలార్‌జంగ్‌ మ్యూజియంలోను, ప్రభుత్వం మ్యూజియంలోనూచూడవచ్చు.) 1798లో సైన్య సహకారసంధులపై సంతకం చేసి దక్కన్‌ సుబేదారీపై ఇంగ్లిష్‌ వారి పరోక్ష ప్రాబల్యం ఏర్పడడానికి కారణభూతుడయ్యాడు. దీని ఫలితంగా నవాబు సైనిక శక్తి కోల్పోయి తన మనుగడకు ఇంగ్లిష్‌ సైన్యాలపై ఆధారపడవలసివచ్చింది. తన రాజ్యంలో తిష్టవేసిన ఇంగ్లిష్‌ సైన్యాల వ్యయభారాన్ని తానే మోయవలసి వచ్చింది. దీనివలన ప్రభుత్వ ఖజానా గుల్లయింది. గత్యంతరం లేక నిజాం ఆలీ ఇంగ్లిష్‌ సైన్యాల ఖర్చు నిమిత్తం రాయలసీమ జిల్లాలను వారికి ధారాదత్తం చేశాడు. ఫలితంగా తెలుగు జాతి మరొకమారు విచ్ఛిన్నమైంది. నిజాంఆలీ దక్కన్‌ సుభా రాజధానిని ఔరంగాబాద్‌నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1687లో కుతుబ్‌షాహీ సామ్రాజ్యం పతనమైన అనంతరం దాదాపు హైదరాబాద్‌ తిరిగి ఒక ప్రముఖ రాజ్యానికి రాజధాని అయ్యింది. ఆనాటి నుంచి దక్కన్‌ సుభాకు హైదరాబాద్‌ రాజ్యం అనే పేరు వచ్చింది. అదేవిధంగా నిజాం ఆలీ పేరు మీదుగానే హైదరాబాద్‌ నవాబులకు నిజాం నవాబులనే పేరు వచ్చింది.
నిజాం ఆలీ మరణానంతరం ఆయన కుమారుడు సికిందర్‌ జా (1803-29) నవాబయ్యాడు. 1806లో సైన్యసహకార పద్ధతిననుసరించి కర్నల్‌ లాంగ్‌ నాయకత్వాన హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన సందర్భంలో సికిందర్‌ జా తన పేర వారి నివాసం కోసం సికింద్రాబాద్‌ను నిర్మించాడు. ఆ నగరంలోనే బ్రిటిష్‌ రెసిడెంట్‌ నివసించేందుకు బొల్లారంలో ఒక పెద్ద భవంతిని నిర్మించారు. దానినే రెసిడెన్సీ అనేవారు. సామాన్య ప్రజలు సికింద్రాబాద్‌ను లష్కర్‌ (సైనిక శిబిరం) అనేవఖీతి
అనేక భాషలతో అలరారుతున్న భాగ్యనగరంలో సందడిగా ఉండే ఏ ప్రధాన కూడలిలో నుంచున్నా... ఒక్కసారిగా లెక్కలేనన్ని భాషలు మన చెవిని తాకుతాయి.... ఏదో కొత్త రాగం మనసుని తట్టిన అనుభూతి హైదరాబాద్‌ అన్నింటా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉపాధి కోసం కొందరు, వ్యాపారం కోసం కొందరు, ఇక్కడి వాతావరణం నచ్చి మరికొందరు భారత ఉపఖండంలో నెలకొన్న సాంఘిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇంకొందరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. దీంతో హైదరాబాద్‌ విభిన్న భాషలు, సంస్కృతుల నిలయంగా మారింది. భినత్వంలో ఏకత్వానికి దర్పణంగా విలసిల్లుతోంది. దేశంలోని మరే నగరంలోనూ ఇన్ని భాషలు, సంస్కృతులు కనిపించవంటే అతిశయోక్తి కాదు. తెలుగు, ఉర్దూ భాషలతో పాటు కన్నడం, మరాఠీ, గుజరాతి, రాజస్థానీ (మార్వాడీ), పంజాబీ, బెంగాలీ, హిందీ, ఒరియా భాషలు నగరంలో వినిపిస్తాయి. విదేశీ భాషలైన అరబిక్‌, ఇరానీ (పార్సీ), పష్తు, సింధీ మాట్లాడే ప్రజలు సైతం నగరంలో గణనీయంగా ఉన్నారు. స్వల్ప సంఖ్యలో నేపాలీ, చైనీస్‌ మాట్లాడేవారు ఉన్నారు. కుతుబ్‌ షాహీల పాలనలో ధనధాన్యాలతో అలరారిన నగరానికి దేశం లోని అనేక ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు. నగర నిర్మాణానికి ఇరాన్‌ నుంచి నిపుణులను రప్పించారు. కుతుబ్‌షాహీ వంశానికి ఇరాన్‌లో మూలాలున్నాయని చరిత్రకారులఅభిప్రాయం. కుతుబ్‌షాహీలు పార్సీని అధికార భాషగా ప్రకటించారు. దీని ప్రభావం వల్ల 400ఏళ్ల క్రితమే అనేక మంది ఇరానీలు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అనేకమంది స్థానికులు సైతం పార్సీ భాషను నేర్చుకొన్నారు. ఆరో నిజాం మీర్‌ మహమూబ్‌ ఆలీఖాన్‌ పాలనాకాలంలో (1869-1911)అనేక ప్రాంతాలు, భాషల ప్రజలు నగరంలో స్థిరపడ్డారు. పాలనా సౌలభ్యం కోసం మహబూబ్‌ ఆలీఖాన్‌ వివిధ ప్రాంతాలనుంచి భిన్నరంగాల్లో నిపుణులను హైదరాబాద్‌ రప్పించారు. అరబ్బు దేశాల నుంచి యువకులను, ఉత్తరాది నుంచి పఠాన్లను, సిక్కులను రప్పించి సైన్యంలో చేర్చుకొన్నారు. వ్యాపారంలో నిష్ణాతులైన మార్వాడిలను ఆహ్వానించి వాణిజ్య రంగంలో నిలదొక్కుకొనేలా చర్యలు తీసుకొన్నారు. నాటి నిజాం సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న బీదర్‌, గుల్బర్గా, రాయచూర్‌ జిల్లాలనుంచి కన్నడం మాట్లాడేవారు, ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌, నాందేడ్‌ జిల్లాల నుంచి మరాఠీ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగల నిమిత్తం, ఉపాధి కోసం హైదరాబాద్‌ ఆచార వ్యవహారాల ప్రజలు అధిక సంఖ్యలో సహజీవనం చేస్తున్న హైదరాబాద్‌ను పలువురు 'మినీ భారతదేశం' గా వ్యవహరిస్తారు. పాతనగరంలోని అనేక బస్తీలను చుట్టివస్తే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పర్యటించిన అనుభూతి కలుగుతుందని సందర్శకులు అంటుంటారు. పాతనగరంలోని శాలిబండ, సుల్తాన్‌ షాహి, బీబీకా చష్మ, కాలాపత్తర్‌, ఛత్రినాక, ఉర్దూ, తెలుగుతోబాటు మరాఠీ, కన్నడం, తమిళం మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. షంషీర్‌గంజ్‌, కబూతర్‌ఖానా, హుసేనిఆలం, చేలాపురా, ఘాంసీ మియాబజార్‌, బస్తీల్లో గుజరాతి, మార్వాడి, బెంగాలి, హిందీ మాట్లాడేవారి సంఖ్య అధికంగా ఉంది. కిషన్‌బాగ్‌, సిఖ్‌ చవునీ ప్రాంతాల్లో పంజాబీ, సింధీ మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తారు. దారుల్‌షిఫా, యాకుత్‌పురా, నూర్‌ఖాన్‌ బజార్‌ బస్తీలలో ఇరాని, ఫష్తు భాషలు మాట్లాడే వారి సంఖ్య అధికం. బార్కాస్‌, గోల్కొండ, మొఘల్‌పురాతోబాటు కొత్తనగరంలోని కింగ్‌కోఠి బస్తీలలో అరబ్బి మాట్లాడేవారి సంఖ్య అధికం. స్వాతంత్య్రానికి ముందే వలస వచ్చిన చైనీయులు చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో కనిపిస్తారు. పళ్లతోటలు, పరిశ్రమల్లో పనిచేసేందుకు వలస వచ్చిన ఒరియా మాట్లాడే ప్రజలు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బెంగాలీలైన స్వర్ణకారులు పాతనగరంలోని గుల్జార్‌హౌజ్‌, పురానాపూల్‌డివిజన్‌లలో అధిక సంఖ్యలో ఉన్నారు.
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.
ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ , మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!
1500వ శతాబ్దంలో కుతుబ్‌షాహీ వంశస్థుడు సుల్తాన్‌ ఇబ్రహీం గోల్కొండ కోటని రాజధానిగా చేసుకొని మధ్య భారతంలోని సువిశాల దక్కన్‌ పీఠభూమిని పాలించాడు. అప్పటికే కోట కిక్కిరిసిపోవడంతో మరో నూతన నగరాన్ని నిర్మించాలని సుల్తాన్‌ ఇబ్రహీం కలలు కన్నాడు. కానీ తన స్వప్నం ఫలించకముందే అతను దివంగతుడయ్యాడు (జూన్‌ 5, 1580). దాంతో ఒక సుందర మహానగరాన్ని నిర్మించాల్సిన బాధ్యత అతని వారసులపై పడింది.
కానీ కుతుబ్‌షాహీ వంశ వారసులుగా సింహాసనాన్ని అధిష్టించవలసిన వారిలో చాలామంది మానసిక లేదా శారీరక వైకల్యంతోనో ఉండేవారు. ఒక్కోసారి రెండు వైకల్యాలూ ఉండేవి. అటువంటి వారి చేతుల్లో సామ్రాజ్యాన్ని ఉంచడం అంత క్షేమకరం కాదని సుల్తాన్‌ ఇబ్రహీంకి అత్యంత విశ్వాసపాత్రులు, మంత్రి 'రాయ్‌రావు' భయపడ్డాడు. అందుకే అతను ఇబ్రహీం చిన్న కుమారుడు సమర్థుడు, మేధావి 'మొహమ్మద్‌కులీ'కి సింహాసనం కట్టబెట్టాలని భావించాడు. ఇబ్రహీం పెద్దతమ్ముడినీ అందుకు ఒప్పించాడు. దాంతో ఇబ్రహీం పెద్ద కొడుకు చరిత్రలో కలిసిపోగా మొహమ్మద్‌ కులీ రాజ్యపాలన చేపట్టాడు.
సుల్తాన్‌ కులీకుతుబ్‌షా తన పూర్వీకులకన్నా భిన్నమైన వాడు. రాజ్యకాంక్ష, యుద్ధప్రియత్వం లేనివాడు. అప్పటికే కుతుబ్‌షాహి వంశస్తులు సామ్రాజ్యాన్ని పటిష్టంగా తీర్చిదిద్దారు. సౌందర్యదృష్టి, కళలపట్ల ప్రేమ ఉన్న కులీ వాటికి ప్రాధాన్యం ఇస్తూనే వీలుచిక్కినప్పుడల్లా, చదువుకొనేవాడు. మత నిబంధనలు, ఆచారాలనూ కచ్చితంగా పాటించేవాడు. ఈ విషయంలో మిగిలిన కుత్‌బ్‌షాహీ వంశస్తులందరికన్నా 'కులీ'కి పట్టింపు ఎక్కువే.
1565 ఏప్రిల్‌ 4న జన్మించిన కులీ అతని తండ్రి సుల్తాన్‌ ఇబ్రహీం చనిపోయే నాటికి పదిహేనేళ్ళవాడు. రాజనీతిజ్ఞుడు, గోల్కొండ సామ్రాజ్యానికి విశ్వసనీయుడు అయిన మంత్రి 'రాయ్‌రావు' ఎటువంటి తిరుగుబాట్లూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అదేరోజు మొహమ్మద్‌ కులీని సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఎంత సౌందర్యపిపాస ఉన్నా కులీ తన బాధ్యతలను మాత్రం మరవలేదు. అనుభవజ్ఞులు, మేధావులైన అధికారుల సహాయంతో తనపై పడిన భారాన్ని సులువుగానే మోయగలిగాడు.
రాచరిక పగ్గాలు చేతబట్టి పదేళ్ళు దాటకముందే తన తండ్రి కన్న కలల్ని నిజం చేయడానికి ఉపక్రమించాడు కులీ. గోల్కొండ కోటకు తూర్పున పదకొండు కిలోమీటర్ల దూరంలో అప్పటి భారతదేశంలోనే కొత్తదైన ఓ మహానగర నిర్మాణానికి పునాది పడింది. ఆ నగరానికి 'హైదరాబాద్‌' అని పేరు పెట్టాడు కులీ కుతుబ్‌షా.
అప్పటికి దక్కన్‌ రాజ్యాలన్నింటిలోకి గోల్కొండ సంపన్నమైన, సుభిక్షమైన రాజ్యం. దైనందిన రాజ్యపాలన, విదేశీ వ్యవహారాలు వంటి వాటిని సమర్థంగా నిర్వహిస్తూనే కళలనూ పెంచి పోషించేవాడు కులీ. నృత్యగానాలతో గోల్కొండ ప్రతిధ్వనిస్తూ ఉండేది. అదేవిధంగా తన కొత్త హైదరాబాద్‌ నగరాన్ని సంస్కృతికి కేంద్రంగా రూపుదిద్దడంలోనూ కులీ శ్రద్ధ వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులూ, కళాకారులను హైదరాబాద్‌ను సందర్శించేందుకు ప్రోత్సహించేవాడు. కుతుబ్‌షాహీ వంశానికీ పర్షియాకు సాంస్కృతిక, మత, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పటిష్టమైన అనుబంధం ఉంది. దాంతో పర్షియన్‌ కవులు, కళాకారులు హైదరాబాదును తరచూ సందర్శించేవారు.
విదేశీ కళాకారులను ఎంత గౌరవించినా కులీ తన దేశాన్ని, రాజ్యాన్నీ, తన వారినీ ముఖ్యంగా హిందువులను ఎక్కువగా ప్రేమించేవాడు, అభిమానించేవాడు. సాహిత్యం, కళలపట్ల కులీకున్న వ్యామోహం అతని పాలనలో మేధోవికాసానికి దోహదపడింది. కొత్త నగరంలో కులీకుతుబ్‌షా కీర్తి నలుదిశలా వ్యాపించింది. దాంతో పాటే భారతీయ చరిత్రలో అతనికో సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టింది.
సుల్తాన్‌ కులీకుతుబ్‌షా పాలనలో హైదరాబాద్‌ కళలకు, విభిన్న సంస్కృతులకూ కేంద్రంగా భాసిల్లింది. హైదరాబాదును కళలకు విజ్ఞాన సముపార్జనకు కేంద్రంగా రూపుదిద్దాలన్న కులీ ఆశయం ఫలించింది. తూర్పు దేశాలలో సైతం హైదరాబాద్‌ నగర పేరు ప్రఖ్యాతులు మార్మోగాయి. చార్మినార్‌ పైనున్న మినార్ల మధ్య ఈ విధంగా లిఖించి ఉంటుంది.
''నేను విజ్ఞాన నగరాన్నిఅలీ ఆ నగరానికి ప్రవేశద్వారం వంటివాడు''.
దక్కను భూభాగంలో వాడుకలో ఉన్న ఉర్దూ భాషపై కులీకుతుబ్‌షా పట్టు సంపాదించాడు. ఆయనిలా రాసుకున్నాడు.
''ప్రపంచం ఒక ఉంగరం వంటిదైతే
దక్కను విలువైన రత్నం వంటిది
విలువైన రాయి
ఉంగరానికే గౌరవాన్నిస్తుంది''

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...