1, మే 2017, సోమవారం

మన ఘన వారసత్వం. Heritage Bill

                                                             ప్రవీణ్‌కుమార్ సుంకరి,
                                                                     9701557412

చరిత్ర అంటే శకలాలు కాదు..
భవిష్యత్ తరాల కోసం తాతల తరాలు కన్న కలలు..
చారిత్రక కట్టడాలంటే..
కూలిపోతున్న శిథిలాలు కాదు..
మన ఘన వారసత్వం అక్కడ మొదలైంది అని చెప్పే చారిత్రక శిలలు..
చరిత్ర అంటే పుస్తకాల్లో కనిపించేది మాత్రమే కాదు..
అదొక సజీవసాక్ష్యం.

వారసత్వం అంటే.. తాతలు, తండ్రుల నుంచి వచ్చేది మాత్రమే కాదు.. చరిత్రకు సజీవసాక్ష్యాలుగా, మన మనుగడకు ఆధారాలుగా ఉన్న కట్టడాలు, కళలను కాపాడుకోవడం..
భావి తరాలకు అందించడం, అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత.
అందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నది. గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైన మన చారిత్రక వారసత్వ కట్టడాలకు తిరిగి ప్రాణం పోయడానికి సంకల్పించింది. తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందిన తెలంగాణ హెరిటేజ్ బిల్లు మన గత చరిత్రను భద్రపరుస్తూ, చరిత్ర తాలూకు చిహ్నాలను భావితరాలకు అందించే బాధ్యతను తీసుకోవడమంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. ఇప్పటి వరకు వారసత్వ కట్టడాలు అంటే హైదరాబాద్‌ను మాత్రమే లెక్కలోకి తీసుకునే వారు. కానీ తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని అద్భుతమైన చారిత్రక కట్టడాలను కూడా పరిరక్షించే అవసరం ఉన్నది. అసలు మనం కాపాడుకోవాల్సిన వారసత్వ కట్టడాలు ఎక్కడెక్కడున్నాయి? ప్రస్తుతం అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? వాటిని కాపాడుకోవాల్సిన అవసరం, వాటి చారిత్రక నేపథ్యం ఏంటి? తెలంగాణ హెరిటేజ్ బిల్లు అవసరం ఏంటి? అనే అంశాలపై ఈ వారం ముఖచిత్ర కథనం..

వారసత్వ సంపద అంటే..

అసలు చారిత్రక వారసత్వ సంపద అంటే ఏంటి? ఏ ప్రాతిపదిక మీద వారసత్వ సంపదను గుర్తిస్తారు? తెలంగాణ హెరిటేజ్ బిల్లు పరిధిలోకి వచ్చే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వారసత్వ సంపద, కట్టడాల ప్రాధాన్యం ఎలా ఉండనున్నది? అనే అంశాల పట్ల పలువురు పలు రకాల అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దక్కన్ అకాడమీ చైర్మన్, ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వేదకుమార్ చారిత్రక సంపదను గుర్తించే క్రమంలో మూడు రకాల పద్ధతులను పాటిస్తారు. సాంస్కృతిక వారసత్వ సంపద, చారిత్రక వారసత్వ సంపద, సహజ వారసత్వ సంపద అని మూడు రకాలుగా విభజిస్తారు. అనాదిగా వస్తున్న కళలు, వేడుకలు, సంస్కృతి, పాటలు, గ్రామీణ, జానపద కళలు, పండుగలు, జాతరలు, వేషధారణ, మాట, పాట ఇలాంటివి సాంస్కృతిక వారసత్వ సంపదలోకి వస్తాయి. చారిత్రక వారసత్వ సంపద అంటే.. రాజులు, వారు కట్టించిన కట్టడాలు, ఎన్నో ఏళ్లనాటి భవనాలు చరిత్రతో సంబంధం ఉన్న వస్తువులు, పురాతన వస్తువులు ఇలాంటివన్నమాట. ఇక సహజ వారసత్వ సంపద అంటే.. చెరువులు, అటవీ ప్రాంతం, సహజంగా ఏర్పడ్డ మైదానాలు, ఖనిజ సంపద ఇలా ప్రకృతికి సంబంధించినవి. అయితే.. కొన్నిసార్లు సహజ వారసత్వ సంపద చారిత్రక వారసత్వ సంపద అయ్యే అవకాశమున్నది అని చెప్పారు. ఇదే అంశం గురించి ప్రముఖ చరిత్ర పరిశోధకులు ద్యావనపల్లి సత్యనారాయణ కనీసం వంద సంవత్సరాలు నిండిన చారిత్రక కట్టడాలను మాత్రమే చారిత్రక వారసత్వ సంపదగా గుర్తిస్తారు. సహజ వారసత్వ సంపద, చారిత్రక వారసత్వ సంపదగా మారే క్రమంలో రాజులు దాన్ని అభివృద్ధి చేయడం కానీ, సహజ వారసత్వ సంపదను పరిరక్షించుకునే క్రమంలో తీసుకునే చర్యల కారణంగా ఆ సంపద సహజ, చారిత్రక వారసత్వ సంపద అవుతుంది. ఆ క్రమంలో వారసత్వ సంపద పరిధి పెరుగుతుంది అన్నారాయన. మన గత చరిత్రకు సంబంధం ఉన్న, మన మూలాలను అన్వేషించే క్రమంలో లభించే ఆధారాలన్నీ వారసత్వ సంపద కిందికే వస్తాయి. ఆదిమ కాలం నుంచి రాజుల పరిపాలన, వారి పాలనా తాలూకు కట్టడాలు, శాసనాలు, రాజ్యస్థాపన, కోటలు, స్వాతంత్య్ర పోరాటం, నిజాం పాలన, నిజాం హయాంలో కట్టిన నిర్మాణాలు వంటివన్నీ తెలంగాణ వారసత్వ సంపదే. ఆ కాలంలో జనజీవనాన్ని ప్రతిబింబించిన జానపదాలు, సాహిత్యం, కళలు, పండుగలు కూడా తెలంగాణ వారసత్వ సంపద కోవలోకే వస్తాయి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అవన్నీ తెరమరుగై, మన మనుగడను, మన వైభవం మనకు తెలియకుండా పోయింది. ఇప్పుడు మన మూలాల్ని, మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని మనం తెలుసుకోవాలి. కాపాడుకోవాలి. భావి తరాలకు.. ఇదీ మన గొప్పతనం.. ఇదీ.. మన ఘనచరిత్ర అని చెప్పగలగాలి. వారికి ఆ వారసత్వాన్ని అందివ్వగలగాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం వేసిన తొలి అడుగే.. తెలంగాణ హెరిటేజ్ బిల్లు. ఈ బిల్లు పరిధిలోకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలన్నీ వస్తాయి.
పరిరక్షణ చర్యలంటే ఏం చేస్తారు.?

తీవ్ర నిర్లక్ష్యానికి గురై, శిథిలావస్థకు చేరుకున్న కట్టడాలను, కళలను కాపాడుకోవడం, పునరుద్ధరించడమే పరిరక్షణ చర్యలు. వాటిని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు కూలిపోతున్న భాగాలను పాతకాలం పద్ధతిలోనే పునర్నిర్మించడమా లేదా ఆధునిక పద్ధతులు, టెక్నాలజీ ద్వారా పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకురావడమా? అనేది అక్కడున్న పరిస్థితిని, అవకాశాలను బట్టి నిర్ణయిస్తారు. ఆ కాలంలో వాటిని నిర్మించేటప్పుడు పాటించిన జాగ్రత్తలు, మెళకువలు మళ్లీ పాటించి చారిత్రక కట్టడాలు శిథిలం కాకుండా జాగ్రత్త పడతారు. చరిత్రను వర్గీకరించుకుని వారసత్వ సంపదను పరిరక్షించుకునేందుకు ప్రణాళికలు రచిస్తే చేయదగ్గ కార్యం సులభతరమవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వారసత్వ సంపదను డిజిటల్ రూపంలోకి కూడా పొందుపరచాల్సిన అవసరం ఉన్నది. దేశంలోని కొన్ని రాష్ర్టాల వారు తమ రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకుని, అభివృద్ధి చేసుకొని, తద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేసుకున్నారు. అలాంటి అవకాశాలు మనకు చాలా ఉన్నాయి. గ్రామీణ తెలంగాణంలోని చారిత్రక వారసత్వ కట్టడాలకు గుర్తింపు లభిస్తే.. తెలంగాణలోని ఎన్నో ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారే అవకాశం ఉన్నది. తత్ఫలితంగా స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. 31 జిల్లాల్లో ఉన్న చారిత్రక సంపదను గుర్తిస్తే.. దాదాపు వెయ్యికి పైగా కొత్త చారిత్రక వారసత్వ సంపద గల కేంద్రాలు వెలుగు చూస్తాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి చారిత్రక వారసత్వ సంపదనూ గుర్తించి కొత్త జాబితాలో చేర్చే ప్రయత్నం చేశారు. అయితే.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ, నిర్వహణ, అభివృద్ధికి ప్రత్యేక చట్టం రూపొందించి దీనికి బడ్జెట్ కేటాయించడమనేది ఇదే తొలిసారి. దీనివల్ల వారసత్వ సంపదల పరిరక్షణ, నిర్వహణ, అభివృద్ధి సులభతరమవుతుంది. ఒక ప్రదేశంలో తవ్వకాలు జరపాలన్నా, చారిత్రక ఆధారాలు సేకరించాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆ సమయంలో కేంద్రం దగ్గర నిధులుంటే అనుమతినిచ్చి, నిధులు కేటాయిస్తది. లేకపోతే లేదు. కానీ, తెలంగాణ హెరిటేజ్ బిల్లు ద్వారా కేవలం కేంద్రం అనుమతి లభిస్తే చాలు.. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి సులభంగా తవ్వకాలు, ఆధారాల సేకరణ, చారిత్రక ప్రదేశాల గుర్తింపు కార్యక్రమం మొదలుపెట్టవచ్చు.
బిల్లు అవసరమేంటి?

తెలంగాణ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడానికి ప్రత్యేకంగా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి? అనే సందేహం చాలామందికి రావొచ్చు. అయితే.. అదే సమయంలో మన చారిత్రక కట్టడాలు, పురాతన కళలు, తెలంగాణ గత చరిత్రను తెలిపే రాతపూర్వక, చారిత్రక ఆధారాలు భద్రంగా కాపాడబడ్డాయా? ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది? వాటిని ఎందుకు కాపాడుకోవాలి? వంటి సందేహాలు రావాలి. అప్పుడే తెలంగాణ హెరిటేజ్ బిల్లు ఎందుకో అర్థం అయితది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రక, వారసత్వ కట్టడాల జాబితాలో మొత్తం 138 ఉంటే వాటిలో తెలంగాణ నుంచి ఏడు మాత్రమే ఉన్నవి. అవి కూడా హైదరాబాద్‌లో ఉన్నవే. నిజంగా తెలంగాణలో చారిత్రక కట్టడాలే లేవా? అంటే అప్పటికి మన ప్రాంతం స్వతంత్ర భారతదేశంలో కలవలేదు. నిజాం రాజు ఆధిపత్యంలో ఉన్నది. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలను చేర్చొచ్చు కదా! అలా జరగలేదు. ఎందుకంటే.. మన చరిత్రను కాపాడాల్సిన అవసరం గత పాలకులకు లేదు. ఒకవేళ మన వారసత్వ కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు అనిపించినా అవి కేవలం నామమాత్రమే, కానీ.. ఇప్పుడు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఫలితం ఏముంటుంది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే కదా తెలంగాణ పోరాటం చేసింది. మన చరిత్ర మరుగున పడుతున్నదనే కదా మనం ఆవేదన చెందింది. అందుకే తెలంగాణ ప్రాంతానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని, ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అది జరగాలంటే ముందు మన చరిత్రను కాపాడుకోవాలి. మన చారిత్రక ఆధారాలైన కట్టడాలు, ఆలయాలను చట్టపరంగా కాపాడాలి. పురాతన, చారిత్రక ప్రాధాన్యం గల వారసత్వ కట్టడాల పరిరక్షణకు జాతీయ స్థాయిలో నేషనల్ మాన్యుమెంట్ యాక్ట్ ఇంతకు మునుపే ఉన్నది. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న వారసత్వ కట్టడాలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. కానీ, తెలంగాణ జిల్లాల్లోని వారసత్వ సంపద, కట్టడాలు ఈ చట్టం పరిధిలోకి రాలేదు. వాటిని కాపాడుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యల తాలూకు ప్రతిబింబమే తెలంగాణ హెరిటేజ్ బిల్లు.
ఎలగందుల కోట..

కరీంనగర్ జిల్లాలోని ఎలగందులకోటను కాకతీయుల కాలంలో ఎలిగందులగా పిలువబడింది. కరీంనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కాకతీయుల అనంతరం నిజాం నవాబు అసఫ్ జా ఎల్గందల్ కోటను ఆక్రమించాడు. కరీంనగర్ కంటే ముందు ఎలగందుల జిల్లాగా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. అసఫ్ జా ఆక్రమించిన తర్వాత కరీంనగర్ జిల్లాగా 1905లో పేరు మార్చారు. కాకతీయుల కాలంలో ఈ గ్రామాన్ని తెల్లకందుల, ఎలగందులగా పిలిచేవారని చింతామణి చెరువు దగ్గర ఉన్న శాసనంలో ఉంది. కాకతీయులు పాలనా కేంద్రంగా నిర్మించుకున్న కోట ఇది. ఎత్తయిన గోడలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులతో ఈ కోట నిర్మాణం అత్యంత దృఢంగా ఉండేది. ఆ తర్వాత అసఫ్ జా టర్కీ, ఫ్రెంచి ఇంజినీర్ల ప్రభావంతో మధ్యయుగపు ఐరోపా ఖండాల కట్టడాలను పోలి ఉంటుంది. శత్రువులు లోపలికి రాకుండా కోటగోడ చుట్టూ 15 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల లోతైన నీటి కందకాలు ఏర్పాటు చేసి అందులో మొసళ్లను వదిలేవారు. కాకతీయుల తర్వాత ముస్లిం రాజులు కోటను వశపరుచుకున్నారు.
రాచకొండ కోట..

తెలంగాణలో వెలసిన ఆనాటి ఎన్నో అద్భుత చారిత్రక ఆనవాళ్లలో రాచకొండ ఒకటి. వెలమరాజుల ఏలుబడిలో వైభవంగా వెలుగొంది, శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దిన కోట ఇది. రేచర్ల పద్మనాయకుల వంశానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు ఈ కోట నిర్మాణానికి పునాది వేశాడు. ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా బయటపడ్డట్టు చెబుతున్నారు. రాచకొండలో ఇప్పటి వరకు బయటపడిన 17 గుహలు ఒక్కొక్కటి ఒక్కో చరిత్రను పరిచయం చేస్తున్నది. దాదాపు వందేళ్లు రేచర్ల పద్మనాయకులు రాచకొండను రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత హోరాహోరీగా జరిగిన యుద్ధంలో బహుమనీ సుల్తానులు రేచర్ల పద్మనాయకులను అంతమొందించి రాచకొండను స్వాధీనం చేసుకున్నారు. చారిత్రక వారసత్వంగా నిర్మితమైన రాచకొండలోని పలు చారిత్రక ఆలయాలు బహమనీ సుల్తానుల దాడిలో ధ్వంసమైనా వాటి ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
కౌలాస్ కోట

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నేను సైతం అంటూ కదంతొక్కి బ్రిటీష్ దొరలకు వణుకు పుట్టించిన కోట నిజామాబాద్‌లోని కౌలాస్ కోట. వైభవోపేతమైన చరిత్రకు, ఎన్నో యుద్ధాలు, పోరాటాలకు ఇది వేదికైంది. రాష్ట్రకూటులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాలు, మొఘలాయిలు, రాజపుత్రులు, అసఫ్‌జాహీల పరిపాలనను కళ్లకు కట్టినట్టుగా ఈ కోట చరిత్రను చూపిస్తున్నది. నిజామాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలో జుక్కల్ మండలంలో ఈ కోట ఉన్నది. 1100 సంవత్సరాల క్రితం, 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన అత్యంత పటిష్టమైన కట్టడం ఇది. బోధన్ రాజధానిగా ఇందూరు మండలాన్ని పాలించిన రాష్ట్రకూటుల రాజు మూడవ ఇంద్రుడు ఇందూరు కోటతో పాటు, కౌలాస్ కోటను కూడా కట్టించాడు. కైలాసుడు అనే ముని ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నాడు కాబట్టి.. ఆయన పేరు మీదుగా ఈ ఊరికి కైలాస్ అనే పేరు వచ్చిందంటారు. ఆయుధ భాండాగారాలు, కళాకారులు, సాహిత్యకారుల కోసం ప్రదర్శన శాల, కోట చుట్టూ 52 బురుజులు, రాజముద్రలు, చిహ్నాలు, ఏనుగుపై స్వారీ చేస్తున్న సింహపు గుర్తులు ఆనాటి రాజుల శౌర్యానికి ప్రతీకలు. కోటకు సమీపంలో కౌలస నది ప్రవహిస్తున్నది. కౌలస్ కోటను పాలించిన రాణి సోనే కున్వర్‌భాయి పాలనలో కోటకు సంబంధించిన వ్యవసాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇక్కడ 9 నుంచి 24 అడుగుల ఫిరంగులు ఇప్పటికీ ఉన్నాయి. భూమికి 250 మీటర్ల ఎత్తులో, 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మితమైంది. 18 అడుగుల ఎత్తయిన కోట గోడ శత్రువులను లోపలికి రాకుండా అడ్డుకునేది.
వరంగల్

కాకతీయుల చరిత్రకు, పరిపాలనకు చిరునామాగా నిలిచిన వరంగల్ జిల్లాది వారసత్వ సంపదలో మొదటిస్థానం. 8 నుంచి 13వ శతాబ్దం వరకు వరంగల్ రాజధానిగా తెలంగాణను పరిపాలించిన కాకతీయులు ఈ గడ్డ చరిత్రకు వన్నె తెచ్చారు. 15 మంది కాకతీయ రాజులు పాలించిన వరంగల్ కోట ఏడుకోట గోడలతో శత్రు దుర్భేద్యమై వందల ఏళ్ల పాటు వైభవంగా కొనసాగింది. వరంగల్ చుట్టూ నిర్మితమై 8 కి.మీ. మట్టికోట, 5 కి.మీ. రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కోటగోడ చుట్టూ 18 అడుగుల లోతైన కందకాలు శత్రువులను కోట లోపలికి రాకుండా ఆపేవి. రాజులు మారినా.. రాజ్యాలు చెక్కు చెదరొద్దు.. యుగాలు మారినా కాకతీయ రాజుల పేరును ప్రజలు మరువొద్దు అన్నది ఓరుగల్లు నేలిన కాకతీయ రాజుల ఆకాంక్ష. దానికి నిదర్శనమే ఆనాటి కట్టడాలు, శిలాశాసనాలు. ఓరుగల్లు కోటకు కూతవేటు దూరంలో ఒకప్పుడు 17 స్నానాల బావులుండేవని చరిత్ర. అక్కాచెల్లెల్ల బావి, కోడిపుంజు బావి, భోగంబావి, గుర్రాలబావి అనే నాలుగు బావులు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కోటకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నాలుగంతస్థుల బావికి రాణిరుద్రమబావిగా పేరు. ఇది నాలుగు అంతస్థ్తులతో, అనేక స్నానపు గదులతో నిర్మించారు. ఓరుగల్లు కోటలోని స్వయంభూ శివాలయం విశిష్టమైంది. శతాబ్దాల పాటు తెలుగు జాతిని ఏకం చేసి పాలించిన కాకతీయులకు, వరంగల్ కోటకు చరిత్రలో ప్రత్యేకస్థానం ఉన్నది. ఇప్పటికే ఈ కోటను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు పరిరక్షణ చర్యలు, అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉన్నది.
రాజాపేట కోట..

యాదగిరి గుట్టకు 20 కిలోమీటర్ల దూరంలోని రాజాపేట కోట అలనాటి మహోన్నత వైభవానికి సజీవసాక్ష్యం. రాజారాయన్న అనే రాజు కోట నిర్మాణం కోసం తగిన ప్రదేశాన్ని వెతుకుతూ ఆలేరు సమీపంలోని రాజాపేట గ్రామానికి వచ్చాడు. అక్కడ రాజారాయన్నకు కనిపించిన ఓ అమ్మవారి గుడి, అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు కనిపించారు. వారు కోట నిర్మాణానికి సరైన స్థలాన్ని చూపించారు. ఆ ప్రాంతంలోనే కోట, నగరాన్ని నిర్మించి రాయన్నపేటగా నామకరణం చేశాడు. ఆ తర్వాత రాజాపేటగా మారింది. నిజాం నవాబుల పాలనలో అనేక సంస్థానాలుండేవి. అందులో సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్ రాజాపేటలను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని వారు పాలన నిర్వహించేవారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కోట లోపలినుంచి సొరంగమార్గాలు తవ్వించారు. రాజు నివాసం, అంతఃపురం, అద్దాలమేడ, అతిథి స్నానవాటిక, ఎత్తయిన బురుజులు, కారాగారం, కొలను, సైనికుల శిక్షణ స్థలం వంటి వాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. దర్వాజాలు, బాల్కనీ, బురుజుల నిర్మాణ రీతి, గదుల్లో చెక్కిన శిల్పాలు, సింహాసనాలు, కోటలోపలి శిల్పకళ అద్భుతం. ఎంతో చరిత్ర గల రాజాపేట కోట నేడు శిధిలావస్థలో ఉన్నది.

దేవరకొండ కోట

దేవరకొండ కోట. ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ అలరారుతూ, చుట్టూ ఇరవై మంచినీటి బావులు, 53 మెట్లమార్గం కలిగిన బావులతో అలరారింది. చుట్టూ ఏడు కొండలు పెట్టని కోటగోడలా మధ్యలో ఉన్న కొండపై కోట ఉంది. రేచర్ల వెలమ రాజులు నిర్మించిన ఈ కోట శత్రు దుర్భేద్యమైన బలమైన కోటల్లో ఒకటి. కాకతీయుల దగ్గర సేనానిగా పనిచేసిన పద్మనాయక వంశస్తుడు భేతాళ నాయకుడు, ఆయన సంతతి దేవరకొండ రాజ్య స్థాపకులు. దేవరకొండ ప్రాంతాన్ని పరిపాలించిన పద్మనాయకుల్లో మాదానాయుడు కాలంలో ఈ దేవరకొండ కోట నిర్మించినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. శ్రీశైలం వరకు రాజ్య విస్తరణ చేసి సువిశాల రాజ్యాన్ని స్వర్ణయుగంలా పాలించారు పద్మనాయకులు. దేవరకొండ గ్రామానికి 500 మీటర్ల ఎత్తులో నిర్మితమైన ఈ కోట 520 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 290 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలో ఉన్నది. ఈ కోటలో ధాన్యాగారం, సైనిక శిబిరాలు, ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి. కోట గోడ కొంతవరకు శిథిలం అవుతున్నది. కోటలోకి వెళ్లడానికి తొమ్మిది ప్రధాన ప్రాకారాలు, 30 చిన్న ప్రాకారాలు కోటలో ఉన్నాయి. శత్రువులు కోటను చుట్టుముట్టినా కోటలోని ప్రజలకు నీటి కొరత రాకుండా 20 మంచినీటి బావులు, 53 మెట్ల బావులు, ఆరు డ్యాములు, ఐదు చెరువులు నిర్మించారు. అప్పటి కట్టడాల్లో ఇలాంటి కట్టడం ఇదొక్కటే అని చరిత్రకారుల అభిప్రాయం.
జోగుళాంబ, సిర్పూర్ కోట

అష్టాదశ శక్తిపీఠాలలో జోగుళాంబ అమ్మవారి దేవాలయం ఐదవది. క్రీ.శ ఆరవ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు భారతీయ వాస్తు శిల్పాలలో చోటు చేసుకున్న పరిణామాలను తెలియజెప్పే దేవాలయాలలో ఇదొకటి. శాతవాహనులు, ఇక్ష్వాకులు అభివృద్ధి చేసిన జోగుళాంబ క్షేత్రం అద్భుతమైన వారసత్వ కట్టడం. చాళుక్యుల కాలంలో నిర్మితమైన నవబ్రహ్మ ఆలయం ఇక్కడ ప్రత్యేకం. జోగుళాంబకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాల కోసం పురావస్తు శాఖవారు జరిపిన పరిశోధనలో క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా అక్కడ లభించిన శాసనాల ద్వారా తేలింది. తెలంగాణ కాశ్మీర్‌గా భావించే అడవుల జిల్లా ఆదిలాబాద్‌లోని సిర్పూర్ కోట గిరిజనుల పరిపాలనా నైపుణ్యానికి చిరునామా. దేశంలోనే మొట్టమొదటి గోండు రాజ్యస్థాపన ఇక్కడే జరిగింది. అటవీ ప్రాంతంలో బతుకుతున్న గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు భల్లాలుడు. సిర్పూర్ రాజధానిగా గోండుల రాజ్యస్థాపన చేసి గోండు సామ్రాజ్య స్థావరంగా కోట నిర్మించాడు. 9వ శతాబ్దంలో ఈ సిర్పూర్ కోటను భీమ్ భల్లాల సింగ్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 18 అడుగుల ఎత్తయిన మట్టిగోడ, 12 అడుగుల కందకం, ఎత్తయిన బురుజులు ఉండేవి. కాలక్రమేణా విలువైన నిధినిక్షేపాల కోసం కోటలో జరిపిన తవ్వకాల వల్ల ధ్వంసమయ్యాయి. గోండుల రాజ్యంగా విలసిల్లి చరిత్రకెక్కిన సిర్పూర్ కోట కాలక్రమేణా చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, మరాఠాలు, మొఘలాయిలు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల చేతుల్లోకి వెళ్లింది.
త్వరలో జాబితా

తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను రక్షించుకునే క్రమంలోనే ఈ కొత్త బిల్లు తీసుకువచ్చింది. చారిత్రక కట్టడాలు, కళలు, సాంస్కృతిక అంశాలు, సహజ కట్టడాలు, సహజ సంపద అన్నీ కూడా తాజా తెలంగాణ హెరిటేజ్ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థల సహకారం కూడా తీసుకునే అవకాశమూ ఉన్నది. ఇందులో చాలా డిపార్టుమెంట్లు కలిసి పనిచేస్తాయి. ప్రీలాన్స్‌గా ఎంతోమంది నిపుణులను కూడా వాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఒక కమిటీ నియమిస్తుంది. ఆ కమిటీ ద్వారా కొత్తగా చేరే కట్టడాలు, ప్రదేశాల జాబితాను ప్రకటిస్తాం. -ఎన్.ఆర్. విశాలాచ్చి, డైరెక్టర్,తెలంగాణ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్
అడ్డంకులేం లేవు!

వంద సంవత్సరాలు పూర్తయిన ప్రతీ సైట్ చారిత్రక సంపదగా పరిగణించబడుతుంది. తెలంగాణ వేసిన ఈ ముందడుగు తెలంగాణ చరిత్రను, అస్తిత్వాన్ని కాపాడే దిశగా పడింది. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను గుర్తించాలంటే కేంద్ర ప్రభుత్వమే అనుమతినిచ్చి, నిధులివ్వాల్సిన ఉంటుంది. నిధులు మనమే సమకూర్చుకుంటున్నం. కేవలం కేంద్రం అనుమతి ఇస్తే సరిపోతుంది. సో.. అనుమతి లభించే విషయంలో అడ్డంకులేం లేవు. కాబట్టి, తెలంగాణ వారసత్వ సంపద జాబితా త్వరలో తెలంగాణ ప్రజల ముందుకు రాబోతున్నది. 31 జిల్లాల ప్రాతపాదికగా తీసుకుంటే వెయ్యి వరకు కొత్త చారిత్రక ప్రదేశాలు ఎంపికయ్యే అవకాశం ఉన్నది. -ద్యావనపల్లి సత్యనారాయణ, చరిత్ర పరిశోధకులు
ఆహ్వానిస్తున్నాం!

తెలంగాణ హెరిటేజ్ బిల్లు వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని చారిత్రాత్మక అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తద్వారా శాతవాహనుల కాలం నుంచి నిజాం కాలం దాకా ఉన్న ఎన్నో చారిత్రక అవశేషాలను కాపాడుకునే అవకాశం లభిస్తున్నది. చరిత్రకు సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లు, వారు నడయాడిన ప్రాంతాలు కూడా వారసత్వ సంపదగా లెక్కించబడుతాయి. ఆ కాలం నాటి గడీలు, పురాతన భవనాలను తిరిగి వాడుకలోకి తీసుకురావడం వల్ల వాటి లైఫ్‌టైమ్ పెంచవచ్చు. తెలంగాణలోని కొన్ని వందలాది చారిత్రక ప్రదేశాలు వెలుగులోకి వచ్చే అవకాశాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. -ఎం. వేదకుమార్, డెక్కన్ అకాడమీ చైర్మన్ ముగింపు : తెలంగాణ ఎప్పటికీ బంగారమే. రారాజులు ఏలిన నాటి తెలంగాణ బంగారు తెలంగాణగా వర్ధల్లింది. గత పాలకుల నిర్లక్ష్యానికి, వివక్షకు గురై శిథిలపడుతున్న సమయంలోనే ఎన్నో పోరాటాల ఫలితంగా స్వరాష్ట్రంగా అవతరించింది. ఇక తిరిగి ఆనాటి బంగారు తెలంగాణగా పునరుద్ధరింపబడటమే మిగిలింది. అందుకు పునాదిరాళ్లే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాలు, పథకాలు. మన ఘన వారసత్వాన్ని మనకు గుర్తు చేయడం ద్వారా అందరినీ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాముల్ని చేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తున్నది.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...