1, మే 2017, సోమవారం

పిల్లల మర్రి

ఆలయాలకు పుట్టిల్లు.. పిల్లలమర్రి

కళామతల్లి గజ్జెకట్టి నాట్యమాడిన సీమ పిల్లలమర్రి. మామూలుగా అయితే ఏ మనిషి పేరుమీదనో.. కాలం పేరుమీదనో ఊర్లు ఏర్పడతాయి. కానీ ఓ చెట్టు పేరు మీద ఏర్పడిన ఊరు పిల్లలమర్రి. అది ఓ మర్రిచెట్టు. ఇంతా అంతా కాదు.. ఏడెకరాల్లో విస్తరించి ఉండేదట. ఇప్పుడా మర్రిచెట్టు లేదు. కానీ దాని అవశేషాల కింద పిల్లలమర్రిగా ఊరు వర్ధిల్లుతూ చరిత్రలో నిలిచిపోయింది! ఓ మహా సంఘటనకు.. కాకతీయుల రాజ్యపాలనకు.. చిరునామాగా మిగిలి ఉంది. ఈ ఊరుకి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. మర్రిచెట్టు.. గోరెంక పక్షులు.. ఎరుకల వ్యక్తి.. బేతిరెడ్డి అనే రాజు మధ్య జరిగిన సంభాషణలు.. సంఘటనల ఆధారంగా ఎర్కాపురం అనే గ్రామం ఏర్పడిందట. పిల్లలమర్రి మరోపేరే ఎర్కాపురం అని చెప్తుంటారు గ్రామస్తులు. ఊరు:పిల్లలమర్రి మండలం: సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పిన్‌కోడ్: 508376 విస్తీర్ణం: 3043 హెక్టార్లు ఇండ్లు: 2,147 జనాభా: 7000 పురుషులు: 3744 మహిళలు: 3256 అక్షరాస్యత:75శాతం సరిహద్దులు: తూర్పు: సూర్యాపేట పడమర: టేకుమట్ల ఉత్తరం: బల్లెంల దక్షిణం: కేటీ అన్నారం ఎక్కడ ఉంది?: జాతీయ రహదారి 65పై సూర్యాపేటకు పశ్చిమ దిక్కున 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రత్యేకత ఏంటి? : చెక్కతో నిర్మించిన చెన్నకేశ్వరుడి రథం ఉంటుంది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటారు. ఒకప్పుడు పిల్లలమర్రి శారదాపీఠం అనే రాజ్యం. కాకతీయుల కాలం నాటి సుబ్బ సముద్రం.. చెన్నకేశ్వరాలయం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. వేరేపేరు?:ఎర్కాపురం

పేరెలా వచ్చింది? :

క్రీస్తుశకం 1200వ సంవత్సరం నాటి ఊరుగా పిల్లలమర్రిని చెప్పుకుంటారు. మంచినీళ్ల బాయి.. దానిపక్కన పెద్ద మర్రి.. దాని ఏర్లు కూడా పిల్ల చెట్లుగా ఏర్పడి ఏడెకరాల్లో విస్తరించడంతో దానికి పిల్లలమర్రి అనే పేరు వచ్చిందట. అయితే 2వ శతాబ్దంలో ఓ భారీ భూకంపానికి ఈ మర్రి కూలిపోయింది. భూకంపాన్ని ముందుగానే పసిగట్టిన గోరెంక పక్షులు.. కొద్దిసేపట్లో పెద్ద గాలివాన వచ్చి ఈ చెట్టు కూకటివేళ్లతో కూలిపోతుంది. దీనికింద ఏడు కొప్పెర్ల ధనం బయటపడుతుంది అనగా ఓ ఎరుకలి వ్యక్తి విన్నాడట. అదే చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్న బేతిరెడ్డి రాజు కంటపడిన ఎరుకలాయన రాజుకు భయపడి విషయం చెప్పి చనిపోయాడట. ఆ ధనాన్ని సేకరించిన బేతిరెడ్డి రాజు గ్రామంలో ఆలయాలు నిర్మించి.. పిల్లలమర్రి/ఎర్కాపురం గ్రామాన్ని స్థాపించాడని స్థానికులు కథగా

శాసనం ప్రకారం:

క్రీస్తుశకం 1162 నుంచి 1360 వరకు కాకతీయ ప్రభువులు రాజ్యాన్ని 76 నాయంకర గ్రామాలుగా విభజించారు. అందులో ఒకటి ఈ పిల్లలమర్రి. రెండవ ప్రోలరాజు కాకతీయ రాజ్యాన్ని క్రీస్తుశకం 1110 నుంచి 1158 వరకు పాలించాడు. ఈ రాజు దగ్గర కామిరెడ్డి సైన్యాధిపతిగా పనిచేశాడు. అతని కుమారులు కాట్రెడ్డి.. బేతిరెడ్డి.. నామిరెడ్డి. తండ్రివలె బేతిరెడ్డి కూడా పరాక్రమ సంపన్నుడు. వీళ్లు రేచర్ల రెడ్డి రాజులు. బేతిరెడ్డి కాకతీ రుద్రదేవునికి కుడిభుజంగా మెలిగి యుద్ధ సహకారం అందించేవాడు. వాడపల్లి.. పిల్లలమర్రి శాసనాలలో ఇతణ్ని పిల్లలమర్రి బేతిరెడ్డి అని పేర్కొన్నారు. బేతిరెడ్డి ఎరుకల సానమ్మను పెండ్లాడాడు. పిల్లలమర్రి శాసనం ప్రకారం గ్రామాన్ని బేతిరెడ్డి నిర్మించాడు.

ఆలయాల పుట్టిల్లు :

కాకతీయ కళ ఉట్టిపడేలా.. రెడ్డిరాజుల పాలన పరిఢవిల్లేలా పిల్లలమర్రిలో గుళ్లూ.. గోపురాలు ఉన్నాయి. చరిత్రకు ఆనవాళ్లుగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచివున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఎరకేశ్వరాలయం. రేచర్ల బేతిరెడ్డి క్రీస్తుశకం 1208న తన భార్య ఎరసానమ్మ పేరుమీద ఈ ఆలయం నిర్మించాడు. గ్రామ నడిబొడ్డున ఆలయం ఉంది. బేతిరెడ్డి సోదరుడు నామిరెడ్డి పేరుమీద నామేశ్వరాలయం నిర్మించారు. తల్లి తండ్రి ధర్మార్థం శ్రీ కాచేశ్వర.. శ్రీకామేశ్వర.. శ్రీ నామేశ్వర లింగాలను ప్రతిష్టించి వాటికి సమస్త పూజలు వైభవంగా నిర్వహించేవారట. దీన్నే త్రికూటాలయం అంటారు. ఇందులో ఎటువైపు చూసినా శివలింగం కనిపించడం విశేషం.

ధ్వంసం.. పునఃప్రతిష్టాపన :

క్రీస్తుశకం 1724 తర్వాత దేశ్‌ముఖ్ దేశ పాండ్యులు వెలుగులోకి వచ్చారు. వీరు రాజుకు భూమి పన్ను వసూలుచేసే అధికారులన్నమాట. క్రమంగా జాగీరు జమీందారు పద్ధతి మొదలైంది. పిండారీలుగా ఏర్పడి కొంతమంది ప్రజల నుంచి సొమ్ము దోచుకునేవాళ్లు. ఈ స్థితిలో గ్రామంలోని ఆలయాలు కూడా దోపిడీకి గురయ్యాయి. గ్రామాధికారియైన ఉమ్మెత్తల వరదయ్య విశిష్టా ద్వైతాచార పరులైనప్పటికీ ఆలయాలను బాగుచేయించి అభివృద్ధి చేశారు. పిల్లలమర్రి గ్రామానికి కందూరు రాజులు.. దేశ్‌ముఖ్‌లు.. అన్న సముద్రపు రాజులు.. ఉమ్మెంతలవారు.. గవ్వాలు.. కంచెర్లవారు.. బైరిశెట్టివారు.. సేతి సింధులు అధిపతులై పిల్లలమర్రిని పాలించారట.

నల్లరాతిపై నాగుపాము :

నామేశ్వరాలయంలో.. త్రికూటాలయానికి ఎడమవైపున నాగేంద్రుని పుట్ట ఉంది. అందులో నాగేంద్రుడు కొలువై కోరికలు తీర్చేవాడని గ్రామస్థుల నమ్మకం. ఈ పుట్ట కూడా చాలా ఏళ్ల నాటిది. నల్లరాయిపై నాగుపాము రూపంతో తీర్చిదిద్ది ఉంది. ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఇక్కడ విశేష పూజలు చేస్తారు. క్రీస్తుశకం 1202లో నామేశ్వరాలయం ప్రతిష్టించినప్పుడు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి సొరంగమార్గం తవ్వించారు. ఇది నామేశ్వరాలయం నుంచి సూర్యాపేటలోని బొడ్రాయి వద్దగల రాపోలు గుడి వరకు ఉన్నదట. నిజాం పాలనలో.. బ్రిటీష్ పాలనలో ప్రజలపై వివిధ రకాల పన్నులు విధించి శిక్షలు వేసేవారు. వాటి నుంచి రక్షింపబడటానికి ఇది చాలా సహాయపడిందని అంటారు. అయితే ప్రస్తుతం ఈ సొరంగం మూసుకుపోయింది.

జైమినీ భారతం:

పుస్తకాల్లో చాలాసార్లు పినవీరభద్రుడి గురించి చదివే ఉంటాం. పిల్లలమర్రి పినవీరభద్రుడిగా ఆయన మనకు సుపరిచితుడే. అయితే పినవీరభద్రుడిది ఈ పిల్లలమర్రియే. ఆయన రచించిన సాళువ నారసింహరాజుకు అంకితమిచ్చిన జైమినీ భారతంలో తన జన్మస్థానం గురించిన పినవీరభద్రుడు ప్రస్తావించాడని చెప్తుంటారు. పిల్లలమర్రి గురించి పినవీరభద్రుడితో పాటు బంగారు రంగప్ప.. గువ్వా పిచ్చిరెడ్డి.. గువ్వా అమృతరెడ్డి.. గువ్వా జానకిరెడ్డి.. ఉమ్మెత్తల కేశవరావు వంటి రచయితలు కూడా చాలా రచనలు చేశారట. సరసులు.. శారదాపీఠం.. గురించి పినవీరభద్రుడు జైమినీ భారతంలో చెప్పారట.

ముత్యాలమ్మ బాయి:

పిల్లలమర్రిలోని మంచినీటి బాయికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఇది సుమారు 2వ శతాబ్ది కాలంలోనే నిర్మించారు. బాయి పక్కన చిన్న శాసనం ఉండేది. కానీ ఇపుడు కనిపించడం లేదు. ఇది అప్పటి నల్లగొండ జిల్లాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మంచినీటి బాయి. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఈ బాయి నీరు తరిగిపోదు. అదే దీని ప్రత్యేకత. ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉండటం వల్ల దీన్ని ముత్యాలమ్మ బాయి అని పిలుస్తుంటారు. రాతిపై వెలసిన చెన్నకేశ్వరస్వామి కూడా పిల్లలమర్రిలో ఉన్నాడు. ఇది మట్టితో నిర్మించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీకి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

సుబ్బ సముద్రం :

పిల్లలమర్రిలోని చెరువు పేరు సుబ్బ సముద్రం. ఇది సుమారు 540 ఎకరాలలో విస్తరించి ఉంది. నామేశ్వరాలయానికి సమీపంలో ఈ సముద్రం ఉంది. మూసీనది ద్వారా దీనికి నీరు చేరుతుంది. జలకళ ఉట్టిపడేలా ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఉన్నప్పటికీ తదనుగుణంగా ప్రచారం లేదని చెప్పొచ్చు. పురాతన కాలంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పడవల్లో షికారు చేసేవారట. కాలక్రమంలో ఈ చెరువును కబ్జాదారులు ఆక్రమించుకోగా ఆఖరికి 150 ఎకరాలే మిగిలాయి. రాతిపై చెక్కిన ఆంజనేయస్వామి ప్రతిమ కూడా ఇక్కడ ఉంది. రామదండు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి తరలివెళ్లినప్పడు అఖండ దీపాన్ని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి 24 గంటలు దీపం వెలిగేలా పూజలు నిర్వహిస్తూ కాపాడుకునేవారట. 


పిల్లలమర్రి-దేవాలయాలుః

 పిల్లలమర్రి సూర్యాపేటకు 7కి.మీ.ల దూరంలో వుంది.ఇది రేచెర్లరెడ్ల మూలస్థానమైన ఆమనగల్లుకు చేరువగా వున్నది పిల్లలమర్రి.కాకతీయులకు నమ్మినబంట్లుగా ఉన్న రేచెర్లనాయకుల ముఖ్యపట్టణంగా ఉన్నది పిల్లలమర్రి.కాకతి రుద్రదేవునిచేత నియమింపబడిన ప్రసిద్ధసేనాని రేచెర్ల నామిరెడ్డి పిల్లలమర్రిలో కోటను,దేవాలయాలను  నిర్మించాడు. నామసముద్రమనే చెరువును తవ్వించాడు.12వ శతాబ్దం చివర,13వ శతాబ్దం తొలిదశలో పిల్లలమర్రి నామేశ్వర,కామేశ్వర,ఎరుకేశ్వర,బేతేశ్వర,కొమరేశ్వర,కాచేశ్వర,అయితేశ్వరాలయాలు నిర్మించబడ్డ నగరంగా ప్రసిద్ధి పొందింది.

పిల్లలమర్రి శాసనాలుః

01.క్రీ.శ,1195లో కాకతిరుద్రదేవుని కాలంలో ‘రేచెరువుల నామ’(రెడ్డి) పిల్లలమర్రిలో ‘కామేశ్వర,కాచేశ్వర,నామేశ్వర’ త్రికూటం నిర్మింపజేసాడు.సబ్బి,విశ్వనాథ,గరుడ(కుడికుడి)సముద్రాలనే చెరువులు తవ్వించబడ్డాయి.

02.క్రీ.శ.1202లో నామిరెడ్డి,భార్య ఐతమ,కొడుకు విశ్వనాథుడు,మేనల్లుడు ప్రోలుడు శివలింగాలను ప్రతిష్టించి, రెండు చెరువుల కింద భూములను ఇచ్చిన దానశాసనం

03.క్రీ.శ.1208లో రేచెర్ల బేతిరెడ్డి భార్య ఎర్రప లేదా ఎరుకసానమ్మ ఎరకేశ్వర దేవాలయాన్ని నిర్మింపజేసింది.ఎరుకపురంలో ఎరుకసముద్రం,ఉప్పరిపాడులో ఎర్రంరాజుకుంట,పిల్లలమర్రిలో లక్ష్మీసముద్రం కింద చేసిన భూదానశాసనం.బొమ్మకుంట కాలువకింద,తన తమ్ముడు నూంకనాయని పేర నూంకకాలువ కింద కొమరేశ్వర,ఎరకేశ్వర దేవాలయాలకు భూదానం చేయబడింది.

04.క్రీ.శ..... నామిరెడ్డి నామేశ్వరదేవర స్థానాపతికి,రంగభోగము వారికి పిల్లలమర్రికోటలో ఇండ్లు దానం చేసిన సందర్భంలో వేసిన శాసనం.

05...... ఎరుకసముద్రం కింద సత్రనిర్వహణకు,వంటవారికి,విద్యార్థులభోజనవసతికి,చలివేంద్రం నిర్వహించువారికి ఇచ్చిన భూదానశాసనం.

06.క్రీ.శ.1357లో ముసునూరి కాపయనాయకుని నమ్మినబంటు ఎరపోతులెంక అల్లావుద్దీన్ చేత శిథిలపర్చబడిన ఎరకేశ్వరాలయాన్ని పునప్రతిష్ట చేసాడు.


స్వర్ణలత గడ్డం, 94944 44870

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...