Header Ads

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

ప్రభుత్వానికి ఉండే మూడు అంగాల (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్యవ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ.
అందుకే దాన్ని నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా పేర్కొన్నారు.
ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే పత్రికలులేదా ప్రసార మాధ్యమాలు. 1729-1797 సంవత్సరాల మధ్య జీవించిన ఆంగ్లోఐరిష్‌ పొలిటికల్‌ థియరి ఎడ్మండ్‌ బ్రూక్‌ మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ మీడియా నిర్వహించే పాత్ర కీలకమైంది. మీడియా శక్తిమంతమైందనడానికి దాని మీద జరిగే దాడులే నిదర్సనం.
అనేకదేశాలలో మీడియా మీద ఇంకా ఆంక్షలున్నాయి. ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియాముఠాలు పెంచే ఒత్తిడి ఇంకొకెత్తు.
టెర్రరిస్టు గ్రూపులూ, డ్రగ్‌ మాఫియా మీడియాపై ఎప్పుడూ కత్తిగట్టే ఉంటాయి. విధినిర్వహణలో బలైన జర్నలిస్టులెందరో ఉన్నారు.
వారంతా పత్రికాస్వేచ్ఛకు పట్టిన దివిటీలు.
యూనివర్సల్‌ డిక్లరేష న్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛని గురించి చెబుతుంది. పత్రికాస్వేచ్ఛకు అదే ఆధారభూమిక.
పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 105 వ స్థానములో ఉంది.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, స్వాతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధీకాభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్నిడిసెంబర్ 1993లో ప్రకటించింది


ఐక్య రాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. (మన రాజ్యాంగం‌లో కూడా ప్రాధమిక హక్కులను చర్చించింది 19అధికరణం‌లోనే)  


రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి. 

పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి.


ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదపుటంచుల్లో వార్తలు సేకరించే విలేకరులకు (లేదా మరిణించిన విలేకరులకు) యునెస్కో/ గ్యూలెర్మో కనో ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతిని ప్రదానం చేస్తారు. కొలంబియాకు చెందిన గ్యూలెర్మో కనో అనే విలేకరి డ్రగ్ మాఫియాను ఎండగడుతూ 1986లో తన పత్రికా కార్యాలయం ఎదుటనే హత్యకు గురయ్యాడు. గ్యూలెర్మో కనో సంస్మరణార్ధం ఏర్పాటుచేసిన ఈ బహుమతి విలువ $25000 (అమెరికా డాలర్లు). ఈ సంవత్సరపు బహుమతి గ్రహీత ఐజర్‌బైజాన్‌కు చెందిన మహిళా పాత్రికేయురాలు ఖడీజా ఇస్మాయిలోవాకు ఫిన్‌లాండ్‌లో ప్రదానం చేయనున్నారు . 


ఐజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్, అతని కుటుంబసభ్యుల అవినీతినీ, లంఛగొందితనాన్ని ఎండగడుతూ ఆమె 2010నుండి ఒక సంవత్సవరకాలం ఫ్రీ రేడియో యూరప్‌లో కధనాలు రాసింది. ప్రభుత్వమామెను 2014లో నిర్బంధించి పన్ను ఎగవేత నేరారోపణపై ఏడున్నర సం. కఠిన కారాగార శిక్షను అంతర్జాతీయ సమాజం ప్రతిఘటించింది.  


ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ,  అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం.


Source : journalism 3 rd year text book.