1, మే 2017, సోమవారం

బమ్మెర

By Sriramoju Haragopal

బమ్మెరః
నేను బమ్మెరను 2,3సార్లు చూసాను.బమ్మెర పోతన ఊరని మనసు ఉప్పొంగింది.అంతలోనే బమ్మెర ఎక్కడివాడన్న వివాదాలు విని,చూసి,చదివి బాధ కలిగింది.
మొన్నీమధ్యన మా కొత్తతెలంగాణచరిత్రబృందం బమ్మెరలో చరిత్రయాత్ర చేసినపుడు బమ్మెర స్మారకమందిర ప్రాంగణంలో ఒక శిథిలాలయ ద్వారం చూసింది. ఆ ద్వారలలాటబింబంగా తిరునామాలున్నాయి.ద్వారానికి ఎడమవైపు రాతిపలకల పీఠం వుంది.పోతన అక్కడ కూర్చొని రాసుకునే వాడని ప్రజలు చెప్పుకుంటారు.ద్వారానికి కుడిపక్కన బారుకత్తులున్న వీరగల్లుఫలకమొకటుంది.నేలమీద ముక్కలై పడివున్న వైష్ణవభక్తుడి శిల్పంవుంది.పాతకాలపు పెద్ద ఇటుకలముక్కలున్నాయి.పోతన సమాధి,పోతనబాయి,పోతన తల్లిపేరన లక్కమ్మచెరువు...పోతన వంశీకులమని చెప్పుకునే వారు...ఇవి బమ్మెరలో పోతన ఆనవాళ్ళు.
గ్రామం చివర శిథిలాలయమొకటి వుంది.ఉత్తరాభిముఖంగా వున్న శివాలయం.గర్భగుడి,అంతరాళం, అర్థమంటపాలతో వున్న గుడి.గర్భగుడిలో వుండవలసిన పాతశివలింగం నేలలో కూరుకుని వుంది.అంచున పార్వతివిగ్రహం(కొత్తది),శివలింగం వున్నయి.బయటొక పాతనంది పడవేసివుంది.గుడిద్వారం మాత్రం తూర్పున వుంది.దానికిరువైపుల వుండాల్సిన ద్వారపలకికలు పక్కనపడవేసివున్నాయి.వాటిమీద కలశాలు చెక్కివున్నాయి. గుడివాలకంవల్ల పునరుద్ధరణకు గురైనట్టు తెలుస్తున్నది.గుడిపక్కన వీరగల్లులు పడివున్నాయి.ఒక వీరగల్లు యుద్ధరంగంలో ఏనుగు శత్రుసైనికుణ్ణి దునుమాడుతున్న శిల్పం.దానిమీద 9,10 శతాబ్దాలకు చెందిన తెలుగులిపిలో చిన్న స్మారకశాసనం వుంది.
బమ్మెర వీరగల్లు శాసనం:

1. స్వస్తిశ్రీ
2. చగళ
3. తి పుత్రహా
4. తం ళగణిల
5. త్ర
6. ధర్మ్యనకుగ
7. ............
8. ............ల
9. ళ.........
10. పఱి.........
11. గ............
12. ...........
13. ..............

బమ్మెర ప్రాచీనతకు నిదర్శనాలెన్నో వున్నాయి.గూడూరు శాసనం 12 శతాబ్దానిదే కాని,అక్కడక్కడ గ్రామం బయట క్రీస్తుపూర్వపు మెగాలిథిక్ సమాధుల ఆనవాళ్ళు,మెన్హర్లు అగుపిస్తున్నాయి.
 పోతన బమ్మెరవాడు కాడని, ఒంటిమిట్టవాడని కట్టా నరసింహులుగారు  నిరూపించే ప్రయత్నం చేసారు. బుక్కరాయలు తాను ఓరుగల్లును స్మరించి ఒంటిమిట్టను ఏకశిలానగరం అనివుంటాడని ఒక వూహ చేసారు. ‘కాటుకకంటినీరు పద్యాంతంలో నిను నాకటికింగొనిపోయి అల్ల కర్ణాట కిరాటకీచకుల కమ్మ త్రిశుద్దిగ నమ్ము భారతీ’ అన్న మాటలో ఆ కర్ణాట కిరాటకీచకులెవ్వరు? సంగమవంశం చివరికాలంలో వ్యసనపరుడైన విరూపాక్షుడై వుంటాడని సంభావించారు.పోతన విరూపాక్షునితో వేగలేకే బమ్మెరబాట పట్టివచ్చాడని,దారిలో జారిపోయిన భాగవతంలోని 4స్కంధాలను ఓరుగల్లువారైన గంగన,సింగన,నారయ్యలు పూరించారని అభిప్రాయపడ్డారు కట్టా నరసింహులుగారు. పోతన నాచనసోముని(బుక్కరాయల ఆస్థానకవి) అనుకరించాడని కొన్ని పద్యాలను ఎత్తిచూపించారు.
పోతన ఒంటిమిట్ట రఘురాముణ్ణే స్మరించాడని క్రింది ఉదాహరణలిచ్చారు.
ద్వితీయ స్కంధం- రాఘవరామా
‘‘   ‘‘ రాఘవా
చతుర్థ    ‘‘ రాఘవరామా
సప్తమ ‘‘ రఘుకులతిలకా(480)
అష్టమ ‘‘ రాఘవరామా(740)
పోతనలు రచనలు కాని స్కంధాల్లో రఘు సంబోధనలు లేవు.
(పోతన ఒంటిమిట్టవాడే...బ్లాగు రచనఃవిద్వాన్ కట్టా నరసింహులుగారు.రిటైరైన భాషాపండితులు.సిపి బ్రౌన్ భాషాపరిశోధనకేంద్రబాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. మెకంజీ కైఫీయత్తులకు సంపాదకత్వం వహిస్తున్నారు.)
పోతన బమ్మెరవాడు కాడా?ఒంటిమిట్టవాడా??
ఒంటిమిట్టలో జీవించిన పోతన రాజు విరూపాక్షునితో బాధలు పడలేక బమ్మెరకు వచ్చి స్థిరపడ్డారంటారు కట్టా నరసింహులుగారు.బమ్మెరలోనే ఎందుకున్నాడన్నదానికి కారణం వుండాలి కదా.బంధువులా,రాజాశ్రయమా ఏది కారణం?రాజాశ్రయమైతే ఓరుగల్లులోనే వుండాలికదా.మరి పోతన రాసిన భోగినీదండకం,వీరభద్రవిజయం ఎక్కడ, ఎపుడు రాసివుంటాడు.పరమమాహేశ్వరవ్రతుడైన పోతన భాగవతం ఎట్లా రాసాడు.పోతన పూర్వజీవితమక్కడిదే అని చెప్పడమెట్లా?బొమ్మిడిగడ్డలో వుండవచ్చన్నదానికి ఆధారమేది?అక్కడనుండి ఒంటిమిట్టలో కాపురంపెట్టి వుంటాడన డానికి తగిన నిదర్శనం లేదు.
1975 ఏప్రిల్ 12(ఉగాది) మొదలుగా జరిగిన ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా అకాడమీ ప్రకటించిన లఘుగ్రంథాల వరుసలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు రచించిన ‘పోతన’ గ్రంథంలో పోతన బమ్మెరవాడనే నిరూపించబడింది.
అంతకు పూర్వం విద్వాన్ ఖండవల్లి సూర్యనారాయణశాస్త్రిగారు రచించిన ‘భక్తపోతన’ అనే విమర్శాగ్రంథంలో ఏకశిలానగరమంటే కడపలోని ఒంటిమిట్ట కాదని,పోతన బమ్మెరలోనే పుట్టి అక్కడ జీవించాడనే చెప్పడానికి పోతన భాగవతాన్ని అంకితమడిగిన సింగభూపతి ఓరుగంటిప్రాంతవాసే కావడం,భాగవత శిథిలభాగ పూరణ చేసిన నారయ మొదలైనవారు ఓరుగంటిప్రాంతవాసులు కావడం వల్లనే ఆయనకు శిష్యులవడం,60,70యేండ్ల క్రితంవరకు పోతన సగోత్రీకులు బమ్మెరలో,ఓరుగంటిప్రాంతంలో వుండడం వంటి నిదర్శనాలున్నాయన్నాడు.
పోతన క్రీ.శ.15వ శతాబ్దిలోని వాడైన రావు సర్వజ్ఞసింగభూపాలుడు కాలంవాడేనని చారిత్రకనిర్ణయం జరిగిందన్నాడు.
పోతన ఇవటూరి సోమనారాథ్యుల వల్ల శైవదీక్షను పొందినవాడైనందుననే ‘ఇవటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదపద్మారాధక,కేసనామాత్యపుత్ర పోతయప్రణీతంబయిన వీరభద్రవిజయంబను కావ్యాన్ని, తర్వాత రాజకారణాంతరాల వల్ల ‘భోగినీ దండకం’ రచించివుంటాడు.ఆ పిదప ప్రౌఢవయస్సులో చిదానందయోగివల్ల తారకమంత్రోపదేశం పొంది వైష్ణవానుయాయుడై మహాభాగవతం రాసివుంటాడు పోతన.
జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసే అనుములు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు 1957లో ‘బమ్మెర పోతన’ జీవితచరిత్రను గురించి పరిశోధనాత్మక గ్రంథాన్నిరచించాడు.తన గ్రంథంలో పోతనజీవితకాలం,రచనలు, నివాసము, భాగవతరచన- పరిస్థితులను గురించి పోతనరచనలు
1.వీరభద్రవిజయం
2.భోగినీదండకం
3.భాగవతం ఆధారంగా సత్యసమీక్షణం చేసినవాడు అనుముల గారు.
వీరభద్రవిజయాన్ని తాను బాల్యంలోనే రచించానని,గ్రంథపీఠికలో తన గురువుగురించి కూడా పోతన రాసుకున్నాడు.గురువు తనను ‘మత్ప్రసాద దివ్యమహిమచే నెంతైన  కవిత చెప్పలావుగలదు నీకు’ దీవించాడని రాసుకున్నాడు.తండ్రి దగ్గరే చదువుకున్నానని ‘జనక శిక్షితాక్ష రాభ్యాసుండనై’ చెప్పుకున్నాడు.
అట్లే ఒంటిమెట్టలో వుండి అయ్యలరాజు రామభద్రుడు శ్రీరాముని పేరన శతకం రాసినట్లు అతని‘రామాభ్యుదయము’లోని పీఠికలో,తుదిగద్యములో ‘ఒంటిమెట్ట రఘువీరశతక కర్మఠ’ అని తన గురించి తెలుస్తున్నది.కాని, ఎక్కడా ఏకశిలనగరమనే పర్యాయపదం కనపడదు.అట్లే భాగవతంలో పోతన తాను గంగకు ‘జని క్రుంకులిడి వెడలి మహనీయ మంజులపులినశోభితప్రదేశంబున మహేశ్వరధ్యానంబు సేయుచుండగా’ ఒంటిమెట్ట దగ్గరున్న పెన్నానదా కాదు గంగ అని పిలుచుకునే గోదావరి.ఓరుగల్లుకు సమీపంలోనే వుందికదా.
రాచకొండరాజులలో అనపోతానాయని కుమారుడైన రెండవ సింగమనాయడు రసార్ణవసుధాకర కర్త.అతని మనుమడు కుమార సింగమనాయనిని ‘రావు సింగక్షమానాధపౌత్రున్’ సమీచీన రేచర్ల గోత్రాంబు జాతాత్మమిత్రున్ మహోదార చారిత్రు సర్వజ్ఞ సింగోర్వరాధ్యక్షు నీక్షించి’ అని భోగినీదండకంలో పోతన వర్ణించినట్లు తెలుస్తున్నది.
బమ్మెర ప్రాచీనతను తెలిపే శాసనమొకటుంది.బమ్మెర పొరుగునవున్న గూడూరు గ్రామంలోని ప్రసిద్ధ‘గుముడూరు’ శాసనంలో ‘గుముడూర మల్లేశ్వర దేవర గుడిగ రంగభోగసెడె సర్వబాధాపరి(హార) సర్వసమశ్యవాగి వేల్పుగొండ,వీరబడియ,బమ్మరిగయ ధారాపూర్వకం మాడిదరు’ అనివుంది.ఇందులో పేర్కొన్న బమ్మరిగయనే బమ్మెర.(క్రీ.శ.1124,క్రోధి సం.పుష్యబ పాడ్యమి బుధవారం చాళుక్య పేర్మాడి కుమార సోమేశ్వరుని ఆనతితో అతని ప్రధాని మానెవ్రెగ్గడ(కొలనుపాక నుండి)చేసిన దానశాసనం)

బమ్మెరలో ఒకప్పుడు దొరలని పిలువబడిన భూస్వాములు నెల్లుట్లలో వైష్ణవం పుచ్చుకొన్నందున తమ ఇంటిపేరు నెల్లుట్లవారిగా మారినట్లు తెలుస్తున్నది.బమ్మెరలోని ఒక చెరువు పోతన తల్లి లక్కమాంబ పేరన లక్కమ్మచెరువని పిలువబడుతున్నది.
లభిస్తున్న కావ్యాలవల్ల చారిత్రకసంఘటనల ఆధారంగా  పోతన తన 50యేండ్ల వయస్సులో దాదాపు 1460 ప్రాంతంలో భాగవతరచన చేసివుంటాడని చెప్పొచ్చు.ఆ సమయంలో మహమ్మద్ షా-2 రాజ్యానికి వచ్చాడు.తెలంగాణా మహమ్మదీయుల వశమైంది ఈ కాలంలోనే.మహమ్మద్ షా రాజులనే కాక బ్రాహ్మణులననేకమందిని కొండపల్లి కోటద్వారంలో అతిక్రూరంగా చంపించినట్లు చరిత్రకారుల రాతలు.పోతన కూడా ఈ ఈతిబాధలకు గురైవుంటాడేమో.ఆ సందర్భాన్నే భాగవతాన్ని భూస్థాపన చేసినందువల్ల గ్రంథం నష్టమైపోయివుంటుంది.ఈ ప్రభువులనే పోతన కర్ణాటకిరాటకీచకులన్నాడేమో.అప్పటికి సర్వజ్ఞసింగభూపాలుడున్నాడో లేడో.
కొరవిగ్రామానికి దగ్గరలో వున్న వేముగల్లువాసియైన కసవయ్య కొడుకు కొరవిగ్రామం పేరు ఇంటిపేరైన కొరవి గోపరాజు పినతండ్రులు,సాళువ నరసింహునికి జైమినిభారతము నంకితమిచ్చిన పిల్లలమర్రి పినవీరభద్రుడు పోతనకు సమకాలికులుగా వుండే అవకాశాలున్నాయని అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రాసారు.

పోతన వంశక్రమం
I
      మల్లయ్య
I
        భీమన్న
I
అన్నయమంత్రి భార్య గౌరమాంబ
I
సోమన్న భార్య మల్లమ్మ
I
1.రేచన్న 2.అన్నయ్య 3.ఎల్లన్నభార్య మాచాంబ 4.అయ్యలన్న 5 మాచయ్య
I
1.కేసన్న భార్య లక్కాంబ 2.మాధవుడు 3.ఇమ్మడి
I
1.తిప్పన్న 2 పోతన్న
   I
కేసన్న(ప్రౌఢసరస్వతి)
1.అప్పలమ్మ 2.వీరమ్మ
I
దాక్షాయణీపరిణయకర్త 1.కేసన్న 2.ఎల్లమ్మ.............3 మల్లన్న
ఈమె అజ్జరపు పేరలింగం భార్య
వీరనరసమ్మ,గంగన్న
(సశేషం)

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...