1, మే 2017, సోమవారం

వరంగల్ లో జైనం

ఓరుగల్లు, తెలంగాణా రాష్ట్ర  సాంస్కృతిక , ఆధ్యాత్మిక రాజధాని. రుద్రమ ధీరత్వం , ప్రతాపరుద్రుడి వీరత్వం , జైనం , శైవం ,బౌద్ధం , వైష్ణవం ల ప్రాభవాన్ని ,
ప్రాచీన కాలం నాటి  వైభవాన్ని కళ్లారా చూడాలంటే వరంగల్ నగరాన్ని ఓసారి దర్శించాల్సిందే.

వరంగల్ అనగానే మనకు కాకతీయులు, వారి పరిపాలనా దక్షత, వీరత్వం గుర్తుకొస్తాయి. అంతకన్నా కొంచెం వెనక్కిపోతే రాష్ట్రకూటులు ,చాళుక్యులు గుర్తుకొస్తారు.

కానీ,వరంగల్ కు అంతకు మించి  గొప్ప నేపధ్యం ఉంది. కాకతీయుల

కన్నా ముందు వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. మోక్ష సాధన కోసం జైనులు ధ్యానం చేసిన కేంద్రం. సత్యం, అహింస వంటి ధర్మాలను బోధించిన, అనుసరించిన కర్మభూమి. జ్ఞాన భూమి. జైన మతానికి కీలక స్థావరం.

దక్షిణ భారతదేశం లో సంభవ నాధుడి 40 అడుగుల శిల్పం ఉన్న ఏకైక ప్రాంతం.

  రెండువేల సంవత్సరాలకు పూర్వమే వరంగల్ లో జైనం విలసిల్లింది.

వరంగల్ నడిబొడ్డున 3 గుట్టలు ఉన్నాయి. పద్మాక్షి గుట్ట ,సిద్ధుల గుట్ట ,అగ్గలయ్య గుట్ట అనే గుట్టలలో ఉన్న ప్రతి రాయి గత చరిత్ర ని గుర్తు చేస్తాయి.  హనుమకొండ పట్టణం పద్మాక్షి ఆలయం దగ్గరలో స్థానికులు అగ్గలయ్య గుట్ట అని పిలిచే ఎత్తైన కొండ ఉంది. దాదాపు 35 నుంచి 40 అడుగుల  ఎత్తైన దిగంబర తీర్దంకరుడి విగ్రహం ఒక బండ రాయి ఫై చెక్కబడి ఉంది. ఆ విగ్రహం పక్కన 13 అడుగుల మరో తీర్దంకరుడి విగ్రహం కన్పిస్తుంది. రెండూ చూడ్డానికి ఒకేలా ఉన్నా, రెండింటికీ తేడా  ఉంది . ఆ విగ్రహాలూ, వాటి చుట్టూ ఉన్న గుర్తులను  బట్టి పెద్ద విగ్రహాన్ని మూడో తీర్దంకరుడైన సంభవ నాదుడిగా, చిన్న విగ్రహాన్ని 23 వ తీర్దంకరుడైన పార్శ్వనాదుడి గా చెప్పవచ్చు.  అదెలా అంటే, మొత్తం జైన తీర్దంకరులు 24 మంది. అందరి విగ్రహాలు ఒకేలా ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కో చిహ్నం ఉంటుంది. వాటిని బట్టి ఆ తీర్ధంకరులను గుర్తించవచ్చు. మూడో వాడైన సంభవనాదుడి చిహ్నం గుర్రం. ఈ గుట్ట మీద ఉన్న పెద్ద విగ్రహం పాదాల దగ్గర  ఉన్నది గుర్రం చిహ్నం . దాంతో ఆ విగ్రహం ఎవరిదో తెలిసిపోతుంది. అలాగే. దేశంలోని వివిధ జైన ఆలయాల్లో ఉన్న సంభవనాదుడి విగ్రహాల పాదాల చెంత ఈ గుర్రం చిహ్నం కన్పిస్తూ ఉంటుంది. అలాగే, ఈ తీర్దంకరుడు కాయోత్సర్గ భంగిమలో ధ్యానం చేసి మోక్షం పొందాడు అని ఆ మత గ్రంధాలు రాశాయి. ఈ విగ్రహం కూడా అదే భంగిమలో ఉంది.

  పక్కనే ఉన్న  చిన్న విగ్రహం పార్శ్వనాదుడిదే అని చెప్పటానికి చాలా స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. విగ్రహం తలపైన ఏడు పడగల సర్పం ఉంది. అతని చిహ్నం కూడా సర్పమే. అంతేకాక ప్రపంచంలోని ఏ జైన దేవాలయంలో నైనా అతని విగ్రహం అలాగే ఉంది. అలాగే, అది కూడా కాయత్సర్గ భంగిమలోనే ఉంది. ఆ రకంగా ఈ విగ్రహాన్ని 23 వ తీర్దంకరుడిగా చెప్పవచ్చు.

సంభవ నాథునికి తూర్పుగా రాతిగోడకే చెక్కిన 7 జైనతీర్థంకరుల అర్థ శిల్పాలున్నాయి.వీరిలో పార్శ్వనాథున్ని తేలికగా గుర్తించవచ్చు.

తన తలపై 7పడగలసర్పం గొడుగుపట్టి నేలదాక మెలికలు తిరిగి నిలిచివుంటుంది.వారిలో చాలామంది పురాణపురుషులే.సంభవనాథునికి కుడివైపు 10అడుగులు కిందుగా పార్శ్వనాథుని శిల్పం సంపూర్ణంగాను,జినదేవుని శిల్పం అసంపూర్ణంగాను చెక్కివున్నాయి.ఈ శిల్పాలు 9,10 శతాబ్దాలనాటివి. వీటికి జనగాం దగ్గరి సిద్ధంకిగుట్టకు చెక్కిన అర్ధశిల్పాలకు పోలికలున్నాయి.
వరంగల్లు కైఫియతు ప్రకారం వేంగిప్రాంతంలో దాడులకు గురవుతున్న జైనులు హన్మకొండకు వలసవచ్చారు. కాకతీయరాజు రెండోప్రోలుడు జైనమతాభిమాని.అతని మంత్రి చేతన భార్య మైలమ పద్మాక్షిగుట్టమీద ‘కడలాలయబసది’ని కట్టించింది.అక్కడ పార్శ్వనాథ,వర్థమాన మహావీరుని,పద్మావతి  విగ్రహాలు చెక్కబడివున్నాయి.కుబేరుని విగ్రహం, చౌవిస(24) తీర్థంకరులున్న రెండు శిల్పాలు,కూడా వున్నాయి.అక్కడ జైనశాసనం వుంది.పడమటిరాతిగోడకు చెక్కివున్న శిల్పాలలో ఒక జైనగురువు,ఇద్దరు శిష్యులు వారి నడుమ వ్యాసపీఠం వున్నాయి.వ్యాసపీఠం పుస్తకగచ్ఛకు గుర్తు.

   అగ్గులయ్య గుట్టమీద మరో విశేషం ఏమిటంటే ఎత్తైన ఆ గుట్ట ఎక్కడానికి కిందకానీ, పైనకానీ మెట్లు లేవు. చిత్రంగా మధ్యలో ఒక పెద్ద బండరాయి మీద రెండు అంచెల్లో 54 మెట్లు రాతిలో తొలిచి ఉన్నాయి.(ఇలాంటివే మెట్లు మనం శ్రావణ బెలగోళ లో చూడొచ్చు. అదీ గొప్ప జైన క్షేత్రం). వీటిలో ఐదు మెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ మెట్ల మీద ఏనుగు, వరాహం చిహ్నాలు చెక్కి ఉన్నాయి.

హన్మకొండే కాదు వరంగల్లు కూడా జైన విద్యాకేందంగాను,అపురూపమైన 24మంది తీర్థంకరుల దేవాలయ ప్రాంగణంతోను విలసిల్లిందని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయి. వరంగల్లుకోట శిథిలాల సందర్శనప్రాంగణంలో ఆగ్నేయదిశలో మూలమట్టం లేదా ఎల్ ఆకారంలో ఒక శిథిలనిర్మాణం కనిపిస్తుంది.

తెలంగాణా లోని కొలనుపాక,జనగాం,వరంగల్ ప్రాంతాలకు చేరిన జైనం వందల ఏళ్ళపాటు ఈ నేల మీద విలసిల్లింది.రాష్ట్రకూటులు,చాళుక్యులు,తొలితరం కాకతీయులు జైనాన్ని ఆదరించి,అనుసరించారు.హనుమకొండలోని అగ్గులయ్య గుట్ట,పద్మాక్షి గుట్ట,సిద్ధుల గుట్ట తో పాటు వరంగల్ కోట,కాజీపేట గుహల్లో కూడా ఈనాటికీ  కూడా అనేక జైన ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి.

కాకతీయులు తమ పరిపాలనా కాలంలో ముందు జైన మతాన్ని అవలంబించారు.

10 వ శతాబ్దానికి చెందిన ఆలయం ఇది.

ఆలయం ముందు ఉన్న శాసనం క్రి. శ 1117 వ సంవత్సరం లో వేయబడింది. ప్రస్తుతం ఈ ఆలయం లోని పద్మాక్షి అమ్మవారు జైన , హిందూ మతాల ప్రజలచే  పూజలు అందుకుంటు ఉంది. ఆలయం పక్కన అనేక జైన తీర్థంకరుల శిల్పాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఈ గుట్ట ఒక జైన విద్యా కేంద్రం గా ఉండేది .

పద్మాక్షి ఆలయానికి  ఎదురుగా ఉన్న మరో గుట్ట పేరు సిద్ధుల గుట్ట . సిద్ధులు తపస్సు చేసుకున్న పుణ్య భూమి ఇది. ఈ గుట్ట పై  కాలభైరవాలయం ఉంది.

దాంతో పాటు గుట్ట చుట్టూ అష్టభైరవుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
 భైరవులు ఎనిమిది మంది. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు - శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు.

భారత దేశ వారసత్వ నగరాల్లో ఒకటిగా  ఎంపిక అయిన వరంగల్ కి ఈ ప్రాంతం మరొక మణిహరంగా  చెప్పవచ్చు.

ఆధ్యాత్మికం కేంద్రం గా అభివృద్ధి చేసినట్లయితే భారత దేశంలో ని ప్రముఖ జైన ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...