5, మే 2017, శుక్రవారం

నేడు చలం గారి వర్దంతి.


*లేచింది..
చలం గారి కలం..
దద్దరిల్లింది పురష ప్రపంచం..కాదు.!
కాదు..!!     స్త్రీల ప్రపంచం..
★ చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు.

*■ చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవి తాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి.  ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి.*

*☄జననం - బాల్యం..*

■ చలంగా ప్రసిద్ధి చెందిన గుడిపాటి వెంకట చలం 1894,మే18న మద్రాసు  నగరంలో  జన్మించాడు. చలం తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి 'కొమ్మూరి'సాంబశివరావు. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు. చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించాడు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివాడు.

*◆ తన తండ్రి, తల్లిని వేధించే తీరు ఆ చిన్నవాని హృదయంపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు 'అమ్మణ్ణి' పెళ్ళి ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్ళించింది.*

*☄విద్యాభ్యాసం - వివాహం - ఉద్యోగం..*

*■1911లో పిఠాపురం మహారాజా కళాశాల లో చేరాడు. ఆ సమయంలో బ్రహ్మర్షి  రఘుపతి వేంకటరత్నం నాయుడు నాయ కత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. తరువాత బి.ఎ. చదువు కోసం మద్రాసు వెళ్ళాడు. అంతకు ముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్‌లో చేర్చి, తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆమెను  సైకిల్ పై స్కూల్లో దించేవాడు. దీనిని అంతా వింతగా చూసేవారట. మామగారైతే చలాన్ని తన ఇంటి గడపే తొక్కవద్దన్నాడు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు అయిన తరువాత కాకినాడలో  ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరాడు. తిరిగి బ్రహ్మసమాజ ఉద్యమంలోనూ, 'రత్నమ్మ' తో స్నేహం-ప్రేమ లోనూ బిజీ అయ్యాడు.*

*◆ టీచరుగా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశాడు. తన ఉద్యోగం గురించి తాను రచించిన "మ్యూజింగ్స్" లో(72వ పుట,5వ ముద్రణ 2005) ఈవిధంగా వ్యాఖ్యానం చేశాడు*

“రాతిని, ప్రభుత్వ బానిసను. స్కూళ్ళ తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయవర్గ ప్రాణ మూషికాలకి మార్జాలాన్ని”—చలం.

*☄రచనల ద్వారా సమాజం నుండి వెలి..*

■ చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజంమీద ఎంతగానో ప్రభావంచూపాయి.   కానీ, సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారట. చలం తన కథలు, నవలల్లో వ్రాసిన విషయాలకు అప్పటి సమాజం తట్టుకోలేక పోయింది. అతను తన అనేక రచనల్లో వ్యక్తపరచిన భావాలు, మచ్చుకి కొన్ని, ఈ వ్యాసంలో చలం వ్యాఖ్యలు, అభిప్రాయాలుగా ఉటంకించడం జరిగింది, అక్కడ చూడవచ్చును. దీనికి తోడు, అతని వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తన (స్త్రీ లోలత్వం)కూడా అభ్యంతరకరముగా పరిగణింపబడింది. మొత్తంమీద, అతను సంఘంలో ఒక "విపరీత వ్యక్తి"గా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దీనివలన, అతనితో ఎవరూ మాట్లాడేవారుకాదట.అతనికి ఇల్లు అద్దెకివ్వ డానికి కూడా వెనకాడేవారట. ఇంతెందుకు, చివరకు అతని దగ్గరబంధువులు కూడా అతన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. చలం ముఖ్యంగా తన రచనల వలన మరియు కొంతవరకు తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘంనుండి వేరుపడి ఒంటరివాడ య్యాడు. అతని భార్య కూడా అతని మూలాన బంధువులకు దూరమయ్యింది. ఆతనిని సమర్థించి అతనితోనే ఉండటానికి నిర్ణయించుకోవడం మూలాన ఆమె తండ్రి, ఇతర బంధువులు కూడా ఆమెను దగ్గరకు చేరనిచ్చేవారు కాదు. కాని ఆమె, చలంను కొంతవరకు అర్ధంచేసుకుని, ఆర్యసమాజ భావాలను ప్రచారం చేయడంలో ఉత్సాహంగా అతనికి సహాయం చేసేదట. కాని,కొంతకాలా నికి, ఆమె కూడా చలం ప్రవర్తనతో విసిగి పోయింది. ఇద్దరిమధ్య కీచులాటలు ప్రారంభ మై ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య అన్యోన్యత కరవైంది.

■1920లో టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి  వెళితే 'చెడిపోయినవాడు' అని ఎవరూ ఇల్లే ఇవ్వలేదు. చివరకు ఒక పశువుల పాకలో తలదాచుకొన్నాడు. గోదావరి ఒడ్డున గడిపిన సాయంకాలాల్లో అతను అనుభవించిన సంఘబహిష్కరణను తనతోబాటు పాట్లు పడుతున్న రంగనాయకమ్మపట్ల జాలిని వ్యక్తంచేస్తాడు చలం.

◆అతని మాటల్లోనే:"ఆమెకు(తన భార్యకు) కావలసింది జాలి మాత్రమేనా -' నా మీద ఎంత కోపం వుండనీ, నన్ను నమ్మి ఈ నిర్భాగ్య జీవితంలో నాతో నిలిచి వుంటుంది రంగనాయకమ్మగారు(భార్య). లోపల పిల్ల కదిలే పెద్దపొట్టతో అన్నిపనులు చేసుకుం టోంది. వెలిపడ్డ మాకు దాసీ వుండదు,చాకలి వుండదు, కొన్ని సమయాల్లో విరోధం తక్కువగా వున్నప్పుడు నవ్వుకుంటూ యిద్దరం అంట్లు తోముకునేవాళ్లం. బట్టలు వుతుక్కునేవాళ్లం. స్నేహంగా పలకరింపులు లేకుండా అర్థం చేసుకునే చూపైనా లేకుండా బతుకుతున్నాము. ఏటిపొడుగునా మమ్మల్ని పలకరించేవాళ్ళులేరు. మమ్మల్ని విజిట్ చేసేవాళ్ళు అసలు లేరు. తను వొంటరి. నన్ను వొదిలిపోదామంటే తనకీ ఎవరూలేరు తన బంధువుల్లో. నన్నునమ్మి నాతో తనూ వెలిపడ్డది. నాకు మాత్రం ఎవరు తోడు? నాకు దేవుడూ లేడు".

*☄జీవితంలో చివరిఅంకం..*

*■ చలం వ్యక్తిగత జీవితంలో పెద్దగా సుఖపడ లేదని చెప్పవచ్చు. భార్య అతని ప్రవర్తనతో విసుగెత్తి, అతనితో ఉండలేక బంధువులదగ్గరకు  వెళ్ళలేక  మానసిక క్షోభ అనుభవిం చిందట. కొంతకాలానికి, ఆమె తీవ్ర విచారంలో (Depression)మునిగిపోయిం దట. పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణిం చాడు.రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. కూతురు సౌరిస్ వివాహం చేసుకోలేదు, సన్యాసినిగా మారింది. పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద "బిడ్డల శిక్షణ" అనే పుస్తకం వ్రాసిన చలానికి ఈ పరిస్థితి ఎదురు కావటం విచిత్రం!*

*■ సమాజం తన పట్ల చూపుతున్న ఏహ్యభావం, తన రచనల పట్ల వచ్చిన వివాదం, చివరకు అతనికి ఎంతగానో దగ్గరైన వదిన (వొయ్యిగా పిలుచుకున్న పెద్ద రంగనాయకమ్మ, అతని భార్య సవతి సోదరి. ఈమె బెజవాడలో వైద్యురాలు, ఆమెకు వైద్య విద్య చలమే చెప్పించాడు) మరణం చలాన్ని కుంగతీసి, ఆంధ్ర దేశం నుండి వెళ్ళిపోయి ఏదైనా ప్రశాంత వాతావరణంలో బతుకుదా మన్న నిర్ణయం తీసుకునేలా చేసాయి. 1950 ఫిబ్రవరి 9న చలం బెజవాడలోని తన సొంత ఇంటిని అమ్మివేసి, తన కుటుంబముతో  అరుణాచలం వెళ్ళిపోయాడు. అప్పటివరకు ధార్మిక విషయాలమీద విముఖత చూపిన చలం, ఒక్కసారిగా రమణ మహర్షి ఆశ్రమా నికి  వెళ్ళటం చర్చనీయాంశమయ్యింది. చలాన్ని రమణ మహర్షి దగ్గరకు, అతని మిత్రుడు, సహోద్యోగి దీక్షితులు 1930లలో  తీసుకుని వెళ్ళాడు. అప్పటి నుండి చలం అప్పుడప్పుడు రమణాశ్రమానికి వెళ్ళివస్తూం డేవాడట.*

*■ ప్రముఖ సినీ రచయిత పింగళిగారితో సంభాషణలు బట్టిచూస్తే,చలం ఎంతో క్షోభపడి, ఎన్నిరకాలుగానో ఆలోచించి, సమాజంలో జరుగుతున్న కనపడని అన్యాయాల గురించి మధనపడి తన రచనలు సాగించాడనిపిస్తుంది. చివరకు తన మధనకు, బాధకు సరైన స్పందన రాకపోవటం అతని అరుణాచల యాత్రకు ఒక కారణమయ్యిందనవచ్చును.*

*■ చలం తన చివరికాలంలో, తన కూతురు సౌరిస్ లో ఈశ్వరుణ్ణి చూసుకున్నాడట. ఏపని చేసినా 'ఈశ్వరుడు చెప్పాలి' అనేవాడట. "ఈశ్వరుడు" అంటే అతని దృష్టిలో సౌరిస్. ఆమె ప్రభావంలోనే చలం 1961లో "ప్రళయం" వస్తుందని ప్రచారం చేసాడు. తెలిసిన వారందరికి ఉత్తరాలు వ్రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని, లేదా అరుణాచలం వచ్చేయమని సలహా ఇచ్చాడు. అతని అభిమానులు కొంతమంది సహాయ శిబిరాలను కూడా ఏర్పరిచారట. కాని, అటువంటి ప్రమాదం ఏమీ జరగక పోవటంతో, చలం నవ్వులపాలైన మాట నిజం.*

■ ఈయన వెళ్ళిన అతికొద్ది కాలానికే రమణ మహర్షి ఇహలోక యాత్రను చాలించారు. చలం అక్కడి ప్రశాంత వాతావరణంలో కొంత ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే భగవద్గీతకు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజులలో అతని కూతురు సౌరిస్, ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో మూడు దశాబ్దాలు జీవించి, 1979 మే 4న అనారోగ్యంతో చలం మరణించాడు. అతని అంత్యక్రియలు కూతురు సౌరిస్ జరిపించింది. ఆతని మరణం తరువాత కొన్ని నెలలపాటు, ఆతని రచనల గురించి దిన/వార పత్రికలలో తీవ్ర చర్చలు జరిగాయి.

*☄చలం - రచనా వ్యాసంగం..*

*■ చలం తన రచనలను 1920 చివరి ప్రాంతాలలో మొదలుపెట్టాడు.1930-40లలో  ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఏ రచయిత కూడా తెలుగులో ఇంతగా స్త్రీలగురించి వ్రాయలేదు. స్త్రీ రచయితలుకూడా, ఆయన వ్రాసినదాంట్లో శతసహస్రాంశం కూడా ఇంతవరకు వ్రాయలేక పొయ్యారు.ఈ మధ్యకాలంలో (1920-1950  మధ్య) చలం రచనలు తెలుగు దేశమంతటా పెనుతుఫానులాగా ముసురుకొన్నాయి. అతని స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీ నెది రించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. చలం రచనలను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు. ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి 1950లో తమిళనాడులోని  అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు.*

*☄మహా ప్రస్థానానికి ముందుమాట..*

■ చలం, శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానంకు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానం లోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది."యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి(పదును) ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి. అందులో కొన్ని వాక్యాలు క్రింద ఉదహరింపబడినాయి-

*■ ఇది మహా ప్రస్థానం సంగతి కాదు.ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాధంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గుస్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి....శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు." ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని,  భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.*

*☄చలం ప్రఖ్యాత రచనలు..*

★ మైదానం,దైవమిచ్చిన భార్య,ప్రేమ లేఖలు,స్త్రీ,మ్యూజింగ్స్,హరిశ్చంద్ర నాటిక
వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి.

■ చలం తన భావాలను వ్యక్త పరచడానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడా ఉన్నాయి, కానీ అందులో వ్యంగ్య నాటికలు ఎక్కువ. హరిశ్చంద్ర నాటికలో భార్యను వేలంవేసి అమ్ముతున్న హరిశ్చం ద్రునికి పిచ్చిపట్టిందని ప్రజలు కట్టేసి తన్నే సీను ఉంటుంది.  ఈజాబితాలో  ఉదహరిం చినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

*☄చలం రచనలు - సినిమాలు..*

■ తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు, ముఖ్యంగా పరిశ్రమ తొలి దశల్లో, కన్యాశుల్కం వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా దృశ్యరూపం పొందినప్పటికీ

■ చలం కథలుగాని, నవలలుగాని సినిమాగా తియ్యడానికి ఎవరూ సాహసించలేదు. అయితే 2005 వ సం"లో  చలం 'దోషగుణం  కథ 'ఆధారంగా, ఇంద్రగంటి మోహనకృష్ణ  దర్శకత్వంలో గ్రహణం చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికంగా లాభాలు ఆర్జించలేదు. అయినప్ప టికీ విమర్శకుల ప్రశంసలు,పలు పురస్కార ములు పొందింది. ఆ తర్వాత చలం  మైదానం నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు తనికెళ్ళ భరణి ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడట.

*☄చలం పై విమర్శలు..*

◆చలం దృష్టిలోని లోపం ఏమిటంటే, ప్రేమనూ, ప్రేమవివాహాలనూ సమర్థించడంతో ఆయన ఆగలేదు. ప్రేమలేని వివాహాలు విచ్ఛిన్నం కావలసిందే అని ఉద్ఘాటించడం...
◆ స్త్రీలు లేచిపోవడాన్ని సమర్థించడం... వంటి వెన్నో..
◆చలం ఒట్టి సెక్సురచయిత, స్వేచ్ఛాప్రవక్త, విశృంఖల ప్రణయవాది, సుఖవాది, రెబెల్, స్వాప్నికుడు,పురుషాధిక్య నైతికత పెత్తనం నుంచి విముక్తి కలిగిన స్త్రీల కంపానియన్ షిప్ ఒక ఆనందమయజీవితం అంటాడు.
◆చలం తన చేతులు చూపి ఈ చేతుల స్పర్శ కోసం ఎన్నివేల స్త్రీల గుండెలు తపించేవో... అంటాడు.

*☄చలంగురించి ఇతర ప్రముఖులు..*

*★ కొడవటిగంటి కుటుంబరావు ప్రముఖ రచయిత*

◆ వ్యక్తిగా చలం కవి. కవిత్వంకోసం బతికినం తగా, కవిత్వాన్ని ప్రేమించాడు. కవిత్వం చలం కంట నీరు తెప్పించటం నేనెరుగుదును.
◆ఇతర మనుషుల్లో ఉండే దౌర్బల్యాలు చలంలో ఉండవచ్చు. కానీ, అనేక విషయాల లో ఆయన విశిష్ట వ్యక్తి.
◆ఆయన కీర్తికోసం తానై పాటు పడలేదు. ఏ సాహిత్య ఉద్యమంలోనూ చేరలేదు. సాహితీసమితిని "మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ" (పరస్పర పొగడ్తల సంఘం) అన్నాడు.
◆కాని కీర్తి తనను వెతుక్కుంటూ వస్తే దాన్ని పరీక్షించకుండా కావలించుకున్నాడు. ◆అప్పుడప్పుడూ కనువిప్పు కలిగేది."నన్ను మెచ్చుకునేవాళ్ళంతా, నా రచనలు అర్థం చేసుకున్నారని భ్రమ పడ్డాను"అన్నాడాయన ఒకసారి.
◆ఒంటరితనం, స్నేహితులు బంధువులతో నైనా గాఢమైన సంబంధాలు లేవు. ఒంటరితనం ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా సోకిందేమోనను కుంటాను. అదే ఆయన్ను రమణాశ్రమం చేర్చింది.
◆చలం ఎంత ఒంటరివాడో, చలం రచనలు అంత బాగా జనాదరణ పొందాయి. చిత్రం!

*★ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచయిత, సంపాదకులు. ఈయన చలం మీద "తెలుగు వెలుగు-చలం" అనే పుస్తకం వ్రాశారు. అందు లోనుండి--*

◆ చలం ఎవరు అనేది, నేనెవరు అనే ప్రశ్న అంత జటిలం. బాల్యంలో చలం వేరు. బ్రహ్మ సమాజంలో తిరిగిన చలం వేరు. ఛిత్రాంగి, పురూరవ, జయదేవ, హరిశ్చంద్ర వ్రాసిన చలం వేరు. మైదానం, బ్రాహ్మణీకం హంపి కన్యలు-ఇత్యాది నవలలూ కథలూ వ్రాసి ఆంధ్ర దేశాన్ని మంచికో చెడుకో, అటూఇటూ తీవ్రంగా వూపించి, సంచలనంరేపిన చలంవేరు.
◆అయినప్పటికీ, అతని జీవితం, అతని సాహిత్యం, అతని అలోచనలు, అతని ప్రణయ తత్వం, అతని స్త్రీ వ్యామోహం, అతని ఆదర్శాలు, అతని విసుగు, అతని కోపం, అతని నిరాశ, అతని నిస్పృహ, అతని ఆనందం, అతని విషాదం అన్నీకూడా నలుగురితో పంచుకుని జీవించాడు.
◆చలం నైతికంలోనూ, ఆధ్యాత్మికంలోనూ కూడా తీవ్రవాదే.
◆మహా ప్రస్థానానికి పీఠిక వ్రాసిన చలానికి, భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసిన చలానికి తేడా లేదనుకోవడం వెర్రితనం.
◆కొన్ని నియమాలకు, కొన్ని సూత్రాలకు, కొన్ని పడికట్టు రాళ్ళకి, కొన్ని ప్రమాణాలకి నిలవలేకపోయినంత మాత్రాన అతను 'అనార్కిస్ట్' కాదు. ఉన్నతమైన స్వేచ్ఛ కోసం కలలుగని, తపించి బాధపడినవాడు.......

*● మొత్తం మీద చలం గారు ఓ విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు.మంచి-చెడులు రెండు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. స్త్రీల పట్ల ఒక్కోసారి కామంతో తక్కువగానూ,మరోసారి వారి పరిస్థితులు మార్చడానికి పరితపించే రచనలు ఉన్నతంగాను కనిపిస్తాయి..*

●ఇక్కడ మనకు కాకి-హంస కథ గుర్తు
కొస్తుంది .హంసలా చూసినట్లయితే..అతనో రాజా రామ్మోహన్ రేయ్ ,కందుకూరి గానో కనిపిస్తాడు..అదే మరోలా చుస్తే, అతనో సహజ మానవుడి గా కనిపిస్తాడు..అందుకే ఆయన ఓ విశిష్ట వ్యక్తి

జ:మే18, 1894 -మ:మే4,1979

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...