7, మే 2017, ఆదివారం

ప్రపంచంలో మూడో ఆకుపచ్చ రంగు కలిగిన దర్గా


మతసామరస్యానికి ప్రతీకగా కాజీపేట దర్గా నిలుస్తోంది. హిందూ, ముస్లిము, క్రిస్టియన్‌, సిక్కుల సమైక్యతతో ప్రార్ధించే ఏకైక దర్గాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అణగారిన వర్గాలను దొరల బందీఖానా నుండి విముక్తి కలిగించి సామాజిక భద్రత కల్పించడంలో ప్రత్యేకత కనబర్చి సూఫీజాన్ని ప్రజల్లోకి చేర్చడంలో వారధిగా నిలిచిన హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దర్గా

జిల్లాలోని కాజీపేట రైల్వేస్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలోనే హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దర్గా ఉంది. క్రీస్తు శకం 1795లో కాజీపేట వాస్తవ్యుడైన సయ్యద్‌ గులాం మొహియుద్దీన్‌ బియాబానీ-ఖాసీం బీ దంపతులకు హజ్రత్‌ సయ్యద్‌ అఫ్జల్‌ బియాబానీ జన్మించారు. 1856 సఫర్‌ మాసంలో 26న హజ్రత్‌ షా అఫ్జల్‌ బియాబానీ భగవంతుడిలో లీనమైన రోజున దర్గాను నిర్మించి ఏటా సహర్‌ మాసంలో దర్గా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముల్తాన్‌కు చెందిన హజ్రత్‌ సయ్యద్‌ షా జియావుద్దీన్‌ బియాబానీ రిఫాయి-అల్‌-ఖాదిరీ అనే వ్యక్తి 1423లో జన్మించిన బియాబానీ మూలపురుషుడని చరిత్ర చెబుతోంది. దేవుడి భక్తిలో తపస్సు కొరకు ఎడారి, అడవుల్లో సంచరించినందుకుగాను వీరికి బియాబానీ అని పేరు వచ్చింది. ఉర్దూలో బియాబానీ అనగా ఎడారి లేదా అడవి అని అర్ధం. మస్లబుల్‌ తాలిబిన్‌, బహరుల్‌ ఇన్సాఫ్‌ అను సూఫీ గ్రంథాలను రచించిన ప్రత్యేకత ఆ వంశ మూలపురుషుడిది. ఇతని సమాధి మహారాష్ట్రలోని జాల్నా రైల్వేస్టేషన్‌ సమీపంలోని అంబడ్‌ షరీఫ్‌లో ఉంది. అలాగే తన కుమారుడు హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్రష్‌ బియాబానీ 1478లో జన్మించగా ఇతని సమాధి కూడా అంబడ్‌ షరీఫ్‌లోనే ఉంది. వీరి సమాధుల చుట్టూ ఉన్న వేపచెట్ల ఆకులు తియ్యగా ఉండడం వీరి భక్తి భావన, సమాజ శ్రేయస్సు యొక్క ప్రత్యేకతను చాటుతాయి. బియాబానీ వంశంలో 6వ తరంవాడైన హజ్రత్‌ ఫాజిల్‌ బియాబానీ ఔరంగాబాద్‌ నుండి హైదరాబాద్‌లో చదువులు పూర్తి చేసిన అనంతరం రాజమండ్రి జాగీర్ధారుకు దివాన్‌గా విధులు నిర్వర్తిస్తూ తదనంతరం దైవ భక్తితో సన్మార్గంలో పయనించేందుకు సూఫీగా మారుతాడు. పంచ్‌గంధ్‌ అను గ్రంథాన్ని పార్శీలో అతను రచించాడు. ఇస్లామ్‌ మత ఆసక్తిని పెంచుకుని హైదరాబాద్‌ నిజామ్‌ కాజీపేట జాగీర్ధార్‌తోపాటు ఖాజీ అధికారాలను వీరికి అప్పగించారు. నాటి నుండి ఖాజీ హోదాలో కొనసాగడంతో ఈ స్థలానికి ఖాజీపేటగా పేరు వచ్చింది. ఇస్లామ్‌ అనగా అరబ్బీలో ధర్మ మార్గమని, సూఫీజం ఇస్లామ్‌ మతానికి చెందిన మత విలువలను, మానవతావాదాన్ని ప్రాధాన్యతనిస్తూ సూఫిజంను నమ్మిన వారు ప్రలోభాలకు గురి కాకుండా దైవ సన్నిధిలోనే సామాన్య జీవనాన్ని గడుపుతారు. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం సఫర్‌ మాసంలో ఏటా 26, 27 తేదీల్లో దర్గా ఉత్సవాలు నిర్వహిస్తారు. సఫర్‌ మాసంలో 26న హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దైవ సన్నిధిలోకి ప్రవేశంచిన రోజు. కనుక ఏటా ఉర్సు ఉత్సవాలను ఆ రోజు నిర్వ హిస్తారు. 26 అర్ధరాత్రి దర్గా పీఠాధిపతి గంధంను తీసుకొచ్చి సమాధిపై లేపనంగా పూసి ప్రార్ధ నలు చేశారు. 27న దర్గా ఉర్సు ఉత్సవాలను వైభవోపేతంగా ప్రారంభి స్తారు. ఆ రోజు తెల్లవారుజాము వరకు ఖవ్వాలి వినిపిస్తారు. చివరి రోజు బదావా పేరుతో ఉర్సు ముగింపు ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో ఒళ్లు గగుర్పొడిచేలా పకీర్ల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇస్లామ్‌ మత సాంప్రదాయంలో మహిమాన్వితుల సమాధులపై దర్గాలను నిర్మిస్తారు. వారి ప్రత్యేకతను చాటుకుంటూ ఆకుపచ్చ రంగును వేస్తారు. ఈ విధంగా ప్రపంచంలో మొదటి దర్గాగా మదీనా, రెండోదిగా బాగ్ధాద్‌, మూడోదిగా కాజీపేటలోని హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దర్గా నిలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏకైకు ఆకుపచ్చ రంగు దర్గాగా వరంగల్‌ జిల్లాలో ఉండడం గర్వకారణం. హజ్రత్‌ అఫ్జల్‌ బియాబానీ వంశంలో జన్మించిన హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ చిన్నతనం నుండే భక్తిభావనలో సమయాన్ని వెచ్చించారు. 12వ ఏట పవిత్ర ఖురాన్‌ను కంఠస్తం చేశాడు. హఫీజ్‌ సయ్యద్‌ సద్రుద్దోన్‌, మౌల్విక్‌ ఖుద్భుద్దీన్‌ వద్ద ఖురాన్‌-సున్నత్‌, షరియత్‌ అనే ఇస్లామ్‌ మత ఆచారాలను 20 ఏళ్ల వరకు నేర్చుకుని సయ్యద్‌ గులాం అలీ ఖాద్రీ ఇస్లామ్‌ మత రహస్యాలతో ప్రేరేపితుడై 28వ ఏట ఇళ్లు వదిలి మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లోని గుట్టల్లో 12 ఏళ్లపాటు తపస్సు చేసి కాజీపేట సమీపంలోని బంధం చెరువు ఒడ్డున మోదుగు అడవిలో జ్ఞానోదయాన్ని పొందుతాడని అఫ్జలుల్‌ కరామత్‌ అనే గ్రంథంలో పేర్కొనబడింది.
హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ మహిమలు
  క్రీస్తు శకం 1822లో జిల్లా మొత్తం అనావృష్టి బారిన పడగా హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ దోగానా నమాజ్‌ చేయగా వర్షం కురిసి చెరువులు నిండాయి. దీంతో జిల్లా మొత్తంలో పంటలతో సుభిక్షంగా మారిందని చరిత్ర చెబుతోంది. హరిజనుల వెట్టిచాకిరీని వ్యతిరేకిస్తూ నాటి రెవెన్యూ సిబ్బంది ఓ హరిజనుడిని కాజీపేట నుండి మడికొండ వరకు సామాను మోయమనగా హరిజనుడి వేషధారణలో హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ తన తలపై కాకుండా కొంత దూరంలో వస్తుండగా మహిమలు గమనించి నాటి రెవెన్యూ సిబ్బంది ఆయనకు శిష్యులుగా మారి నాటి నుండి హరిజనులతో వెట్టిచాకిరీ చేయించడాన్ని మానేశారు. ఈ విధంగా హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీకి 2 వేల మందికిపైగా శిష్యులు ఏర్పడ్డారు. వారిలో ఒకరైనా మీర్జా అఫ్జల్‌ బేగ్‌ దమ్ము రోగ పీడితుడై తీవ్ర ఇబ్బందుల పాలౌతున్న సమయంలో ఒక గ్లాసు నిండా చల్లటి నీటితో రోగాన్ని నయం చేసి మహిమను చాటాడు. హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ సామాజిక వాదాన్ని గుర్తించి నాటి బ్రిటీష్‌ అధికారి కర్నల్‌ డేవిడ్‌సన్‌ మూడుగ్రామాల జాగీర్ధారీని కానుకగా అందించాడు. దాన్ని హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ సున్నితంగా తిరస్కరించాడు. తాను ప్రలోభాలకు దూరమని చెప్పకనే తెలిపాడు. ఈ విధంగా సామాన్య జీవితం గడిపే సూఫీలు జీవితాంతం ప్రజలకు సేవలు అందిస్తూ వారి మరణానంతరమూ ప్రజల శ్రేయస్సు కోసం తోడ్పడతారు. సూఫీల సమాధులపై దర్గాలు నిర్మించి ఉర్సూలు నిర్వహించి కోర్కెలు తీర్చుకుని కష్టాలను దూరం చేసుకోవడం నేటికీ ఆనవాయితీగానే కొనసాగుతోంది.
నేటికీ అదే ఆనవాయితీ...
  హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియాబానీ ఆశయ సాధనలో నేటికీ వారి 41వ తరం వంశస్తులైన ఖుస్రూ పాషా దర్గా ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. ఏటా సందర్శకుల రాక పెరుగుతూ ప్రస్తుతం 2 లక్షల మంది వివిధ దేశాల నుండి కాజీపేట దర్గాను సందర్శించడానికి వచ్చే స్థాయికి చేరింది. కోర్కెలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు. నేడు సూఫీజాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఇస్లామిక్‌ లైబ్రెరీని ఏర్పాటు చేసి 1500 సంవత్సరాల నాటి 5 వేల పుస్తకాలను ఖుస్రూ పాషా అందుబాటులోకి తెచ్చాడు. నేటికీ మత సామరస్యానికి ప్రతీకగా కాజీపేట దర్గా నిలుస్తూ వివిధ మతాల వారు ఐక్యంగా జీవించాలని దర్గా ఉత్సవాల ద్వారా ప్రజలు తెలుసుకుని పరమత సహనంతో జీవించాలని ఆశిద్దాం...

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...