1, మే 2017, సోమవారం

మన్ కి బాత్ - నరేంద్ర మోడీ 30 - ౦4 -2017

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాశవాణి( All India Radio)లో ప్రసారమైన   మన్ కీ బాత్ - మనసులో మాట తెలుగు అనువాదం..
తేదీ : 30-04-2017

నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! ప్రతి ’మనసులో మాట’ కార్యక్రమానికీ ముందర దేశం నలుమూలల నుండీ, అన్ని వయసుల వారి నుండీ, మనసులో మాట కోసం ఎన్నో సలహాలు వస్తూ ఉంటాయి. ఆకాశవాణి నుండీ, నరేంద్ర మోడీ యాప్ నుండీ, MyGov యాప్ నుండీ, ఫోన్ ద్వారా రికార్డయిన సందేశాలు వస్తూ ఉంటాయి. వీలు చేసుకుని వాటిని చదువుతూ  ఉంటే నాకెంతో ఆనందకరంగా ఉంటుంది. ఎంతో వైవిధ్యమైన సమాచారం ఆ సందేశాల ద్వారా నాకు లభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలలా ఎందరిదో శక్తుల నిధి దాగి ఉంది. ఎందరో అసంఖ్యాక అజ్ఞాన సాధకులు సమాజంలో గోప్యంగా ఉంటూ తమ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఒకోసారి ప్రభుత్వం దృష్టికికూడా రాని ఎన్నో సమస్యలు  వీరి ద్వారా బయటకు వస్తున్నాయి. బహుశా వ్యవస్థా, ప్రజలు కూడా ఈ సమస్యలకు అలవాటు పడిపోయి ఉంటారు. పిల్లల కుతూహలం , యువకుల ఆశయాలు, పెద్దల అనుభవసారం, మొదలైన విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. ప్రతిసారీ ఎన్నెన్ని అభిప్రాయాలు ’మనసులో మాట’కు అందుతున్నాయో, వాటిలో ఎలాంటి సలహాలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి, ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయి మొదలైన వాటన్నింటినీ ప్రభుత్వం విస్తారంగా పరిశీలిస్తుంది. ఎదుటివాడికి సలహాలు ఇవ్వడమనేది మనిషి సహజ లక్షణం. బస్సులోనో, రైల్ లోనో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా దగ్గు వస్తే, వెంటనే ఎవరో ఒకరు వచ్చి ఇలా చెయ్యమంటూ ఏదో ఒక సలహా ఇచ్చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వడమనేది మన స్వభావాల్లోనే ఉన్నాయి. మొదట్లో మనసులో మాట కి సూచనలు అందినప్పుడు, సలహాలు అనే మాట వినేప్పుడూ, చదివేప్పుడూ కనబడేది. చాలా మందికి సలహాలివ్వడమనేది ఒక అలవాటేమో అని మా బృందానికి కూడా అనిపించేది. కానీ సూక్ష్మం గా గమనించే ప్రయత్నం చేసేసరికీ నేనూ ఉద్వేగపడిపోయాను. నన్ను చేరటానికీ, సలహాలందివ్వడానికీ ప్రయత్నించే చాలా మంది ప్రజలు వారి వారి జీవితాల్లో ఏదో ఒకటి చేస్తున్నవారే! ఏదో మంచి చెయ్యాలనే తాపత్రయంతో తమ బుధ్ధినీ, శక్తినీ, సామర్ధ్యాన్నీ, పరిస్థితులకనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. అందువల్ల నా దృష్టికి కొన్ని సలహాలు వచ్చినప్పుడు అవి సామాన్యమైనవి కావని, అనుభవపూర్వకంగా బయటకు వచ్చినవని నాకర్ధమైంది. కొందరు వ్యక్తులు తమ సలహాలను; తాము పని చేసే చోట, మిగతావారు వింటే వాటికొక సమగ్ర రూపం ఏర్పడి ఎందరికో సహాయకరంగా మారతాయనే ఉద్దేశంతో కూడా సలహాలను తెలియచేస్తారు. అందువల్ల స్వభావపరంగా వారు తమ సలహాలు మనసులో మాటలో వినపడాలని కోరుకుంటారు. అందువల్లనే ఇవన్నీ నా దృష్టిలో ఎంతో సానుకూలమైనవి. అన్నింటికన్నా ముందుగా నేను సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తూ తమ సలహానందిచే కర్మయోగులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాక ఏదైనా విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇలాంటి విషయాలు గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. గత నెలలో కొందరు నాకు ఆహారం వ్యర్ధమవడం గురించి తమ బాధను వ్యక్తపరచినప్పుడు, ఆ విషయాన్ని నేను ’మనసులో మాట ’ లో ప్రస్తావించాను. ఆ తర్వాత నరేంద్ర మోడీ యాప్ లోనూ, MyGov లోనూ దేశం నలుమూలల నుండీ చాలా మంది వ్యక్తులు ఆహారం వ్యర్ధమవకుండా చూడడానికి తాము ఎలాంటి సృజనాత్మకమైన ప్రయత్నాలు చేసారో చెప్పుకొచ్చారు. మన దేశంలోని యువత ఎంతో కాలంగా ఈ పనిని చేస్తోందని నాకు తెలియనే తెలియదు. కొన్ని సామాజిక సంస్థలు చేస్తాయన్న సంగతి చాల ఏళ్ళుగా తెలుసు, కానీ యువత కూడా ఈ విషయం పట్ల ఇంతటి శ్రధ్ధని కనబరుస్తున్నారన్న సంగతి నాకు ఇటీవలే తెలిసింది. నాకు కొందరు వీడియోలు కూడా పంపించారు. కొన్ని చోట్ల రోటీ బ్యాంకులు ఉన్నాయి. ప్రజలు తమ వద్ద ఉన్న అధిక రొట్టెలను, కూరలనూ ఆ బ్యాంకుల్లో జమ చేస్తే, వాటి అవసరం ఉన్న వ్యక్తులు వాటిని అక్కడకు వెళ్ళి తీసుకుంటారు. ఇచ్చేవారికీ సంతోషం, పుచ్చుకునేవారికీ చిన్నతనంగా ఉండదు. సమాజం సహకరిస్తే ఎలాంటి పనులు జరుగుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

ఇవాళ్టితో ఏప్రిల్ నెల అయిపోతుంది. ఇదే ఆఖరు తేదీ. మే ఒకటి, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల స్థాపన జరిగిన రోజు. ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకూ అనేకానేక శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాలూ ఎన్నో కొత్త కొత్త అభివృధ్ధి శిఖరాలను దాటే నిరంతర ప్రయత్నాన్ని చేసాయి. దేశ ప్రగతికి తమ సహకారాన్ని అందించాయి. రెండు రాష్ట్రాల్లోనూ మహాపురుషుల నిరంతర ప్రయాస, సమాజంలోని ప్రతి రంగం లోనూ వారి జీవితాలు మనకు స్ఫూర్తినందిస్తూ ఉంటాయి. ఈ మహాపురుషులను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర అవతరణ జరిగిన రోజున స్వాతంత్ర్యం వచ్చిన డెభ్భై ఐదేళ్ళకి, అంటే 2022 నాటికి, మనం మన రాష్ట్రాలనీ, మన దేశాన్నీ, మన సమాజాన్నీ, మన నగరాన్నీ, మన కుటుంబాలనీ ఎక్కడికి చేర్చగలమన్న సంకల్పాన్ని చేసుకోవాలి. ఆ సంకల్పాన్ని సిధ్ధించుకోవడానికి ప్రణాళికను తయారుచేసుకోవాలి. ప్రజలందరి సహకారంతోనూ ముందుకు నడవాలి. మరోసారి ఈ రెండు రాష్ట్రాలకూ నా అనేకానేక శుభాకాంక్షలు.

ఒక సమయంలో వాతావరణంలో మార్పు విద్యాప్రపంచం తాలూకూ విషయంగా ఉండేది. సదస్సులలో అంశంగా ఉండేది. కానీ ఇవాళ ప్రకృతి తన ఆట నియమాలన్నీ ఎలా మార్చేస్తోందో మన రోజూవారీ జీవితాల్లో అనుభవపూర్వకంగా చూస్తూ ఆశ్చర్యపోతున్నాం. మన దేశంలో మే, జూన్ నెలల్లో ఉండే వేసవి తీవ్రత ఈసారి మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే అనుభూతి చెందాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఈ సారి మనసులో మాట కోసం నేను సలహాలను సేకరిస్తున్నప్పుడు, ఎక్కువశాతం సలహాలు ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైన సలహాలను అందించారు. ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నవే. కొత్తవేమీ కాదు కానీ సరైన సమయానికి వాటిని గుర్తుచేసుకోవడం కూడా మంచిదే.

శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్ర, శ్రీ టి.ఎస్. కార్తీక్ మొదలైన మిత్రులందరూ పక్షుల గురించి విచారపడ్డారు. బాల్కనీ లోనూ, డాబా పైనా, పక్షుల కోసం నీళ్ళు పెట్టి ఉంచాలని అన్నారు. చాలా కుటుంబాల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పనిని చెయ్యడం నేను చూశాను. ఒక్కసారి వాళ్ళ దృష్టిలోకి ఈ పని వచ్చేస్తే, ఇంక రోజుకి పదిసార్లు పక్షులు వచ్చాయా లేదా, పెట్టిన గిన్నెలో నీళ్ళు ఉన్నాయో లేదో అని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. మనకిదొక ఆటలా తోస్తుంది కానీ నిజంగా పసిమనసుల్లో సానుభూతిని రేకెత్తించే అద్భుతమైన అనుభూతి ఇది. మీరు కూడా గమనించండి, పశుపక్ష్యాదులతో కాస్తంత అనుబంధం ఉన్నా అదొక కొత్త ఆనందాన్ని మనకు అందిస్తుంది.

కొన్ని రోజుల క్రితం గుజరాత్ కు చెందిన సోదరుడు శ్రీ జగత్ ‘Save The Sparrows’ అనే ఒక పుస్తకాన్ని నాకు పంపాడు. అందులో తక్కువైపోతున్న పిచ్చుకల సంఖ్యను గురించి విచారాన్ని వ్యక్తం చేస్తూనే, mission mode లో వాటి సంరక్షణార్థం స్వయంగా చేస్తున్న ప్రయోగాలను గురించిన చాలా మంచి వర్ణన అందులో ఉంది. అయినా మన దేశంలో పశుపక్ష్యాదులతో, పకృతితో సహజీవనం గురించిన విషయాలు అందరికీ బాగా తెలిసినవే కానీ సామూహికంగా ఇలాంటి ప్రయత్నాలకు బలాన్నివ్వడం అవసరం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు "దావూదీ బోరా సమాజ్" ధర్మ గురువు సైయదనా గారికి వంద సంవత్సరాలు వచ్చాయి. వారు నూట మూడేళ్లు జీవించారు. వారి వందవ పుట్టినరోజు ఉత్సవాల నిమిత్తం బొహ్రా సమాజం తమ బుహ్రానీ ఫౌండేషన్ ద్వారా పిచ్చుకలను పరిరక్షించడానికి చాలా పెద్ద ఉద్యమాన్నొకదాన్ని నడిపారు. దానిని ప్రారంభించే శుభావకాశం నాకు లభించింది. దాదాపు ఏభై రెండు వేల బర్డ్ ఫీడర్స్ ను ప్రపంచం నలుమూలలకీ వారు పంపారు. Guinness book of World Records లో కూడా ఈ విషయం నమోదైంది.

అప్పుడప్పుడు మనం ఎంత తీరుబడి లేకుండా అయిపోతామంటే పేపర్ వేసేవారు, పాలవారు, కూరగాయలమ్మే వారు, పోస్ట్ మేన్, ఇలా ఈ వేసవి రోజుల్లో గుమ్మంలోకి ఎవరొచ్చినా కాస్తంత మంచినీళ్ళతాగుతారా అని అడుగుదామన్న ధ్యాసే లేనంత విధంగా అయిపోతాం.

యువ మిత్రులారా, మీతో కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మన యువతలో చాలా మంది కంఫర్ట్ జోన్ లోనే జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారని అప్పుడప్పుడు ఆందోళనగా ఉంటుంది నాకు. తల్లిదండ్రులు కూడా ఒక రక్షణాత్మక వాతావరణంలోనే వారి ఆలనా పాలనా చేస్తున్నారు. దీనికి భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు కానీ ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో ఉండేవాళ్ళే కనపడతారు. ఇప్పుడు పరీక్షలయిపోయి, శెలవులను ఆస్వాదించేందుకు పథకాలు వేసేసుకుని ఉంటారు. వేసవి శెలవులు ఎండాకాలం అయిపోయిన తర్వాతే కాస్త బావుంటాయి. నేను ఒక స్నేహితుడిలా మీ వేసవి శెలవులు ఎలా గడపాలో చెప్పాలనుకుంటున్నాను. కొందరైనా తప్పకుండా ప్రయోగపూర్వకంగా చేసి, తెలియజేస్తారన్న నమ్మకం నాకు ఉంది. వేసవి శెలవులను ఎలా గడపాలో మూడు సలహాలు ఇస్తాను. ఆ మూడింటినీ పాటిస్తే చాలా బావుంటుంది కానీ వాటిల్లో ఒక్కటైనా మీరు పాటించడానికి ప్రయత్నించండి. ఏదైనా కొత్త ప్రతిభ సహాయంతో కొత్త అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించండి. ఇదివరకూ వినని, చూడని, ఆలోచించని, తెలియని చోటుకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు, కొత్త ప్రతిభ కోసం ప్రయత్నించండి. అప్పుడప్పుడు దేని గురించైనా టి.విలో చూడ్డానికీ, పుస్తకంలో చదవడానికీ, పరిచయస్తుల ద్వారా వినడానికీ, దాన్ని స్వయంగా అనుభవించడం, ఈ రెంటి మధ్యన నింగీ-నేలా మధ్యనున్నంత అంతరం ఉంటుంది. నేను కోరుకునేదేమిటంటే, ఈ వేసవి శెలవుల్లో మీ ఆసక్తి ఎందులో ఉంటే వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.కొత్త ప్రయోగాన్నిచెయ్యండి. ప్రయోగం పాజిటివ్ గా ఉండాలి. మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని బయటకు తెచ్చేదిగా ఉండాలి. మనం మధ్యవర్గానికి చెందినవాళ్ళం. సుఖవంతమైన కుటుంబాలకు చెందినవాళ్ళం. రిజర్వేషన్ లేకుండా రైల్లో సెకెండ్ క్లాస్ బోగీలో ఎక్కాలని ఎప్పుడైనా అనిపించిందా మిత్రమా? కనీసం ఒక రోజంతా అలా ప్రయాణిస్తే ఎంత అనుభవం వస్తుందో. ఆ ప్రయాణీకుల సంగతులేమిటి, వారు స్టేషన్లో దిగి ఏం చేస్తారు? ఏడాది మొత్తంలో నేర్చుకోలేని ఎన్నో విషయాలను అలాంటి రిజర్వేషన్ లేని ఇరవైనాలుగు గంటల రైలు ప్రయాణంలో, పడుకోవడానికి కూడా చోటు లేనంత జనంతో కిక్కిరిసిన రైల్లో నిలబడి ప్రయాణిస్తే నేర్చుకోగలరు. ఒక్కసారన్నా అలాంటి అనుభవాన్ని పొందండి. ఎప్పుడూ అలానే ప్రయాణించమని నేను అనడం లేదు. ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నించండి. సాయంత్రాల్లో మీ ఫుట్ బాల్ తోనో, వాలీ బాల్ తోనో లేదా మరేదైనా ఆట వస్తువులతో తక్షణం నిరుపేద బస్తీల్లోకి వెళ్లండి. ఆ పేద పిల్లలతో స్వయంగా ఆడండి, అప్పుడు చూడండి ఆ ఆటలో జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి ఆనందం మీకు లభిస్తుంది. సమాజంలో ఇలాంటి జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు మీతో ఆడే ఆవకాశం దొరికినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా? మీకు కూడా ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందని నేను విశ్వాసంతో చెప్పగలను. ఈ అనుభవం మీకు చాలా నేర్పిస్తుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సేవాకార్యక్రమాలను చేపడుతూ ఉంటాయి. మీరు గూగుల్ గురువు గారితో కలిసి ఉంటారుగా, అందులో వెతకండి. అలాంటి ఏదో ఒక సంస్థతో ఒక పదిహేను ఇరవై రోజులు గడపండి.వారితో వెళ్ళండి. అడవుల్లోకైనా వెళ్లండి. అప్పుడప్పుడు కొన్ని వేసవి సిబిరాలు ఉంటాయి, వ్యక్తిత్వ వికాసం కోసం, మరెన్నో రకాలైన అభివృధ్ధి కోసం ఏర్పాటైన వాటిల్లో చేరండి. కానీ దానితో పాటే ఇలాంటి సమ్మర్ కేంప్ లో చేరినట్లు,  వ్యక్తిత్వ వికాసం కోర్సు చేసినట్లు ఎప్పుడైనా అనిపించిందా? ఇలాంటి కేంపుల అవసరం ఉన్నా కూడా చేరలేని వారి వద్దకు వెళ్ళి మీరు నేర్చుకున్నది వారి వద్ద డబ్బు తీసుకోకుండా నేర్పించండి. ఏది ఎలా చెయ్యాలో మీరు వాళ్ళకి నేర్పించగలరు. సాంకేతికత దూరాలను తగ్గించేందుకు, సరిహద్దులను చెరిపేందుకు వచ్చింది కానీ దాని దుష్ప్రభావం ఎలా మారిందంటే ఒకే ఇంట్లో ఉండే ఆరుగురు మనుషులు ఒకే గదిలో ఉన్నా కూడా వారి మధ్యన ఉన్న దూరాలు ఊహించడానికి కూడా అందనంతగా ఉంటున్నాయన్న విషయం నన్నెంతో ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. ఎందుకనీ? ప్రతి ఒక్కరూ సాంకేతికత వల్ల మరెక్కడో తీరుబడి లేకుండా ఉన్నారు. సామూహికత కూడా ఒక సంస్కారమే. సామూహికత ఒక శక్తి. నేను చెప్పిన రెండవది నైపుణ్యం. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని మీకు అనిపించదా? ఇవాళ మనది పోటీ యుగం. పరీక్షల్లోనే మునిగిపోయి ఉంటూంటాం. ఎక్కువగా మార్కులు సంపాదించాలనే తపనలో మునిగిపోయి ఉంటాం. శెలవుల్లో కూడా ఏదో ఒక కోచింగ్ క్లాసుల్లో, తరువాతి పరీక్షల గురించిన ఆలోచనలో ఉంటాం. మన యువతరం రోబోలుగా మారిపోయి యంత్రాల్లాగ జీవించడం లేదు కదా అని భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.

మిత్రులారా, జీవితంలో ఎత్తుకు ఎదగాలన్న కల మంచిదే. ఏదన్నా సాధించాలన్న ఆలోచన మంచిదే. అలా చెయ్యాలి కూడా. కానీ మీలో ఉన్న మానవత మెద్దుబారిపోతోందేమో గమనించండి! మనం మానవీయ విలువలకు దూరంగా వెళ్ళిపోవట్లేదు కదా అని గమనించుకోండి. ప్రతిభను పెంచుకోవడానికి ఈ అంశాలపై కాస్త దృష్టిసారించగలమా? ఆలోచించండి! సాంకేతికత కు దూరంగా మీతో మీరు సమయం గడపడానికి ప్రయత్నించగలరా? ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకోండి. ఏదైనా కొత్త భాష లో ఐదు నుండి ఏభై దాకా వాక్యాలు నేర్చుకోండి. తమిళమో, తెలుగో, అస్సామీ, మరాఠీ, పంజాబీ ఏదైనా. ఎన్నో వైవిధ్యాలతో నిండిన దేశం మనది. కాస్త దృష్టి పెడితే మన చుట్టుపక్కలలోనే ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఈత రాకపోతే ఈత నేర్చుకోండి. డ్రాయింగ్ వెయ్యండి, ఉత్తమమైన బొమ్మ రాకపోయినా కాయితంపై ఏదో ఒకటి వెయ్యడానికి ప్రయత్నించండి. మీలో దాగి ఉన్న మానవత బయటపడుతుంది. చిన్న చిన్న పనులే అనిపించినా మనం అప్పుడప్పుడూ అనుకునే కొన్ని పనులయినా మనసు పెడితే మనం నేర్చుకోలేమా? మీకు కారు నడపడం నేర్చుకోవాలనిపించచ్చు కానీ ఎప్పుడైనా ఆటో రిక్షా నడపడం నేర్చుకోవాలని అనిపించే ఉంటుంది కదా? మీకు సైకిల్ నడుపడం వచ్చే ఉండచ్చు కానీ ప్రజలను తీసుకువెళ్ళే త్రీ వీలర్ ని నడపాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు చూడండి, ఈ కొత్త ప్రయత్నాలు, కొత్త నైపుణ్యం మీకు సంతోషాన్ని ఇవ్వడమే కాక, ఒకే పరిధికి కట్టిపడేసి ఉంచిన మీ జీవితాన్ని అందులోంచి బయటకు లాగగలదు కూడా. Out of box కూడా ఏదన్నా చేసి చూడండి మిత్రులారా! జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలంటే ఇవే మరి. పరీక్షలన్నీ అయిపోయి, వృత్తిపరంగా కొత్త మజిలీకి చేరుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాంలే అని మీరనుకోవచ్చు కానీ అలాంటి అవకాశం రాదు. అప్పుడు వేరే ఏదో జంజాటంలో పడతారు. అందుకే మీతో చెప్తున్నాను, మీకొకవేళ ఇంద్రజాలం నేర్చుకోవాలనే సరదా ఉంటే, పేకలతో చేసే ఇంద్రజాలాన్ని నేర్చుకోండి. మీ స్నేహితులకి ఇంద్రజాలాన్ని చూపిస్తూ ఉండండి. మీకు తెలియని ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. దాని వల్ల మీకు తప్పకుండా లాభం కలుగుతుంది. మీలో దాగి ఉన్న మానవతా శక్తులకు చైతన్యం లభిస్తుంది. అభివృధ్ధికిది చాలా మంచి అవకాశం. నా అనుభవంతో చెప్తున్నాను, ప్రపంచాన్ని చూడడం వల్ల ఎంతగా నేర్చుకుని, ఎంతగా తెలుసుకోవడానికి వీలవుతుందో మనం ఊహించలేరు కూడా. కొత్త కొత్త ప్రదేశాలూ, కొత్త కొత్త ఊర్లు, కొత్త కొత్త పట్టణాలు, కొత్త కొత్త పల్లెలు, కొత్త కొత్త ప్రాంతాలు చూడండి. కానీ వెళ్ళేముందర ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ అభ్యాసానికి వెళ్ళి, అక్కడ ఒక జిజ్ఞాసువు లాగ చూడడం, తెలుసుకోవడం, ప్రజలతో చర్చించడం, వాళ్లను అడగడం మొదలైన ప్రయత్నాలు చేస్తే, ఆ ప్రదేశాలను చూసిన ఆనందమే వేరుగా ఉంటుంది. మీరు తప్పకుండా ప్రయత్నించి, నిర్ణయించుకోండి. ప్రయాణాలు ఎక్కువ చేయద్దు. ఒకే ప్రదేశంలో మూడు రోజులు,నాలుగు రోజులు ఉండండి. అప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ మరో మూడు,నాలుగు రోజులు గడపండి. దీనివల్ల మీకు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీరు వెళ్ళేప్పుడు మీ ఫోటో కూడా నాకు షేర్ చేయ్యడం మంచిది. ఏమేమి చూశారో, ఎక్కడెక్కడికి వెళ్లారో Incredible India అనే హేష్ ట్యాగ్ ను ఉపయోగించడం ద్వారా మీ అనుభవాలను పంచుకోండి.

మిత్రులారా, ఈసారి భారత ప్రభుత్వం కూడా మీకొక మంచి అవకాశాన్నిచ్చింది. కొత్తతరాల వారు నగదు వాడకం నుంచి దగ్గర దగ్గరగా విముక్తి పొందితున్నారు. వారికి నగదుతో అవసరం లేదు. వారు డిజిటల్ కరెన్సీ ని నమ్మడం మొదలుపెట్టారు. మీరు కూడా నమ్ముతున్నారు కదా! కానీ ఈ ప్రణాళిక ద్వారా మీరు సంపాదించుకోవచ్చని కూడా మీరెప్పుడైనా అనుకున్నారా? భారత ప్రభుత్వం ఒక ప్రణాళిక చేసింది. మీరు భీమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉండే ఉంటారు కదా. దానిని మరొకరికి పంపించండి.
మీరు జతపరిచిన మరొకరు ఆ యాప్ ద్వారా మూడు లావాదేవీలు గనుక చేస్తే, ఆర్థిక వ్యాపారం మూడుసార్లు చేస్తే, ఆ పని చేసినందుకు గానూ మీకు పది రూపాయిల సంపాదన లభిస్తుంది. మీ ఖాతాలో ప్రభుత్వం తరఫునుండి పదిరూపాయిలు జమా అవుతాయి. ఒకవేళ రోజులో మీరు ఇరవైమందితో గనుక చేయిస్తే సాయంత్రానికల్లా మీరు రెండొందల రూపాయిలు సంపాదించుకుంటారు. వ్యాపారస్థులకి కూడా సంపాదన ఉంటుంది. విద్యార్థులకి కూడా సంపాదన ఉంటుంది. ఈ ప్రణాళిక అక్టోబర్ పధ్నాలుగు వరకూ అమలులో ఉంటుంది. ఈ విధంగా ’డిజిటల్ ఇండియా’ను తయారుచేయడంలో మీ సహకారం ఉంటుంది. న్యూ ఇండియాకి మీరొక కాపలాదారు అయిపోతారు. శెలవులకి శెలవులూ, సంపాదనకి సంపాదనా. refer & earn.

సాధారణంగా మన దేశంలో వి.ఐ.పి.కల్చర్ పట్ల దురభిప్రాయ వాతావరణం ఉంది. కానీ అదెంత లోతైనదో నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇప్పుడింక భారతదేశంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, తన కారుపై ఎర్ర లైటు పెట్టుకుని తిరగకూడదని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఒకరకంగా అది వి.ఐ.పి కల్చర్ కి గుర్తుగా మారింది కానీ నా అనుభవంతో చెప్పేదేమిటంటే ఎర్ర లైట్ వాహనంపై ఉంటుంది, కారుపై ఉంటుంది, కానీ నెమ్మది నెమ్మదిగా అది మెదడులోకి చొచ్చుకుపోయి, మానసికంగా వి.ఐ.పి కల్చర్ వృధ్ధి చెందింది. ఇప్పుడు వాహనాలపై ఎర్ర లైట్ పోయినా కూడా, మెదడులోకి చొచ్చుకుపోయిన ఎర్ర లైటు బయటకు పోయిందని గట్టిగా చెప్పలేము. నాకొక ఆసక్తికరమైన ఫోన్ కాల్ వచ్చింది - ఆ ఫోన్ లో ఆయన తన భయాన్ని కూడా వ్యక్తపరిచారు కానీ ఈ ఫోన్ కాల్ వల్ల సామాన్య మానవులకు ఇలాంటివి నచ్చవనీ, ఇలాంటి వాటి వల్ల వారు దూరాన్ని మాత్రమే అనుభూతి చెందుతున్నారన్న అంచనా మాత్రం నాకు లభించింది.


"నమస్కారం ప్రధానమంత్రి గారూ, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుండి నేను శివ చౌబే ని మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వ నిర్ణయమైన red beacon light ban గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నాను. వార్తా పత్రికలో నేనొక వాక్యం చదివాను. అందులో "“every Indian is a VIP on a road”   అనే వాక్యం రాసి ఉంది. అది చదివి నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు నా సమయం కూడా అంతే ముఖ్యమైనది కదా అని ఆనందం కలిగింది. నాకు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలని లేదు. మరొకరి కోసం ఆగాల్సిన పనీ లేదు. ఈ నిర్ణయానికై నేను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఇంకా మీరు నడిపిస్తున్న స్వఛ్ఛ భారత్ ఉద్యమం ద్వారా మన దేశం మాత్రమే శుభ్రపడటం లేదు, మన రోడ్లపై ఉన్న వి.ఐ.పి దాదాగిరీ కూడా శుభ్రపడుతున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు."

ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఎర్ర లైటు రద్దు అనేది వ్యవస్థలో ఒక భాగం. కానీ మనసులోనుండి కూడా దీనిని ప్రయత్నపూర్వకంగా తొలగించాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి అప్రమత్తంగా ప్రయత్నిస్తే ఇది తొలగిపోగలదు. దేశంలో వి.ఐ.పి. ల స్థానంలో ఈ.పి.ఐ ల ప్రాముఖ్యత పెరగాలన్నదే ’న్యూ ఇండియా భావన’. వి.ఐ.పి. ల స్థానంలో ఈ.పి.ఐ అంటున్నానంటే నా భావం స్పష్టంగానే ఉంది- Every person is important. ప్రతి వ్యక్తికీ ప్రాముఖ్యత ఉంది, ప్రతి వ్యక్తికీ గొప్పదనం ఉంది. 125కోట్ల  దేశవాసుల ప్రాముఖ్యాన్ని మనం స్వీకరిస్తే, 125కోట్ల దేశవాసుల గొప్పదనాన్నీ స్వీకరిస్తే, గొప్ప కలలను సాకారం చేయడానికి ఎంత పెద్ద శక్తి ఏకమౌతుందో కదా! మనందరమూ కలిసి ఈ పని చెయ్యాలి.

నా ప్రియమైన దేశప్రజలారా, మనం మన చరిత్రనీ, మన సంస్కృతినీ, మన పరంపరనీ మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలని నేను ఎప్పుడూ చెప్తాను. అందువల్ల మనకి శక్తి , ప్రేరణ లభిస్తాయి. ఈ సంవత్సరం మన 125కోట్ల దేశవాసులందరమూ కలిసి స్వామీ రామానుజాచార్యుల వారి వెయ్యవ జయంతి జరుపుకుంటున్నాం. ఏదో ఒక కారణంగా మనం ఎంతగా తీరుబడి లేకుండా ఉన్నామంటే, ఎంత చిన్నగా ఆలోచిస్తున్నామంటే ఎక్కువలో ఎక్కువ ఒక శతాబ్దం వరకే ఆలోచిస్తున్నాం. ప్రపంచంలోని తక్కిన దేశాలకి శతాబ్దం అంటే ఎంతో గొప్ప. కానీ భారతదేశం ఎంత ప్రాచీన దేశం అంటే, తన అదృష్టంలో వెయ్యేళ్ళు, ఇంకా ఎక్కువ సంవత్సరాల పురాతన జ్ఞాపకాలతో పండుగ చేసుకునే అవకాశం మనకు లభించింది. ఒక వెయ్యేళ్లకు పూర్వపు సమాజం ఎలా ఉండేది? అప్పటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? కాస్త ఊహించండి. ఇవాళ కూడా సమాజిక సంకెళ్ళను తెంచుకుని బయటకు రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదే వెయ్యేళ్ల ముందరైతే ఎలా ఉండి ఉండేది? రామానుజాచార్యులు తన సమయంలో అప్పటి సమాజంలోని చెడు, వర్ణభేదాలూ, అంటరానితనం, జాతిభేదాలు మొదలైనవాటికి వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటమే చేసారన్నది చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారు తన స్వీయ ఆచరణ ద్వారా సమాజం ఎవరినైతే అంటరానివాళ్ళుగా పరిగణిస్తుందో, వారందరినీ ఆలింగనం చేసుకున్నారు. వెయ్యేళ్లకు పూర్వమే వారికి గుడిలో ప్రవేశాన్ని ఇవ్వడానికి ఆయన ఉద్యమించి, వారందరికీ గుడిలోకి ప్రవేశానికి అనుమతి సంపాదించారు. ప్రతి యుగంలోనూ ఆ కాలపు సమాజంలోని చెడును అంతమెందించేందుకు మన సమాజం నుండే మహాపురుషులు పుడుతూ ఉండడం మన అదృష్టం.

భారత ప్రభుత్వం కూడా రేపు మే ఒకటవ తారీఖున స్వామి రామానుజాచార్యుల స్మృత్యర్థం ఒక తపాలా బిళ్లను విడుదల చెయ్యబోతోంది. స్వామి రామనుజాచార్యులకు నేను ఆదరపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, నివాళులర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, రేపు మే ఒకటవ తారీఖున మరొక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల "శ్రామికుల రోజుగా" దీనిని జరుపుకుంటారు. శ్రామికుల రోజు అనే మాట వచ్చినప్పుడు శ్రామికుల గురించిన చర్చ జరుగినప్పుడు, నాకు బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తుకురావడం స్వాభావికమే. శ్రామికులకు లభించిన సౌకర్యాలు, వారికి దక్కిన ఆదరణలకు మనం బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఋణపడి ఉన్నామన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రామికుల మేలు కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన సహకారం చిరస్మరణీయం. ఇవాళ నేను బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి, స్వామీ రామానుజాచార్యుల గురించీ చెప్తుంటే, కర్ణాటక కు చెందిన పన్నెండవ శతాబ్దపు సాధువు, సమాజ సంస్కర్త "జగద్గురు బసవేశ్వర"గారు కూడా గుర్తుకు వస్తున్నారు. నిన్ననే నాకొక సభకు వెళ్ళే అవకాశం లభించింది. వారి వచనామృత సంగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అది. పన్నెండవ శతాబ్దంలో వారు కన్నడ భాషలో, శ్రమ - శ్రామికుల విషయంపై లోతైన ఆలోచనలు చేసారు. కన్నడ బాషలో ఆయన "కాయ్ కవే కైలాస్" అన్నారు. దాని అర్థం ఏమిటంటే, "మీరు మీ పరిశ్రమతోనే శివుడి ఇల్లైన కైలాస ప్రాప్తిని పొందగలరు" అని. అంటే కర్మ చెయ్యడం వల్లనే స్వర్గం ప్రాప్తిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే శ్రమే శివుడు. నెనెప్పుడూ శ్రమయేవ జయతే అని చెప్తూంటాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెప్తుంటాను. నాకు బాగా గుర్తుంది, భారతీయ మజ్దూర్ సంఘం వ్యవస్థాపకుడు, ఆలోచనాపరుడు, శ్రామికుల గురించి ఎంతో ఆలోచించిన దత్తోపంత్ ఠేంగ్డీ ఏమనేవారంటే - ఒకవైపు మావో వాదం తో ప్రేరితులైనవారి ఆలోచన ఏమిటంటే "ప్రపంచ శ్రామికులారా ఏకం కండి". ఇంకా దత్తోపంత్ ఠేంగ్డీ ఏమనేవారంటే "శ్రామికులారా రండి, ప్రపంచాన్ని ఏకం చేద్దాం". ఒకవైపు అనేవారు - ’‘Workers of the world unite’ .  భారతీయ ఆలోచన నుండి వచ్చిన ఆలోచనాసరళిని గురించి దత్తోపంత్ ఠేంగ్డీ ఏమనేవారంటే ’Workers unite the world ’. ఇవాళ నేను శ్రామికుల గురించి మట్లాడుతున్నప్పుడు దత్తోపంత్ ఠేంగ్డీ గారు గుర్తుకురావడం స్వాభావికమే.

నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల్లో మనం బుధ్ధపూర్ణిమ జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా  బుధ్ధ భగవానుడి అనుయాయులందరూ  ఉత్సవాలు జరుపుకుంటారు. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలైన హింస, వినాశనం, యుధ్ధం, అస్త్రాల పోటీ లాంటి వాతావరణం చూసినప్పుడు బుధ్ధభగవానుడి ఆలోచనలు చాలా ఉపయుక్తంగా అనిపిస్తాయి. భారతదేశంలో బుధ్ధుడి జీవన యాత్రకు అశోకుడి జీవిత యుధ్ధం అద్దం పడుతుంది. బుధ్ధపూర్ణిమ రోజున సంయుక్త రాష్ట్రాల ద్వారా "vesak day " జరుపుకోవడం నా అదృష్టం. ఈ ఏడాది శ్రీలంకలో ఇది జరిగుతుంది. ఈ పవిత్రమైన రోజున నాకు శ్రీలంకలో బుధ్దభగవానుడికి నివాళి అర్పించటానికి అవకాశం లభిస్తోంది. వారి జ్ఞాపకాలను పున:స్మరణ చేసుకోవడానికి అవకాశం లబిస్తోంది.

నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశంలో ఎప్పుడూ కూడా ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ మంత్రంతోనే ముందుకు నడవడానికి ప్రయత్నించాము. భారతదేశంలో  ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ అన్నప్పుడు అది కేవలం భారత దేశం వరకే కాక ప్రపంచవ్యాప్త పరిధిలోకి కూడా వస్తుంది. ముఖ్యంగా మన ఇరుగుపొరుగు దేశాలకు కూడా వర్తిస్తుంది. మన ఇరుగుపొరుగు దేశాలతో సహకారమూ ఉండాలి, అభివృధ్ధి వారికీ జరగాలి. అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. మే ఐదున భారత దేశం దక్షిణ-ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం సామర్థ్యమూ, దీనితో ముడిపడిఉన్న సౌలభ్యాలు దక్షిణ-ఆసియా తాలూకూ ఆర్థిక, అభివృధ్ధిపరమైన ప్రాధమికతలను పరిపూర్ణం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. సహజ వనరుల రేఖాచిత్రణ చేయడమైనా,  టెలీ మెడిసిన్ ఐనా, విద్యారంగం ఐనా, అధిక సాంద్రత కలిగిన సాంకేతిక పరిజ్ఞాన అనుసంధాన విషయమైనా, ప్రజల మధ్య పరస్పర సంప్రదింపుల ప్రయత్నాలకైనా ఈ ఉపగ్రహం సహకరిస్తుంది. దక్షిణ ఆసియాకు చెందిన ఈ ఉపగ్రహం దక్షిణ-ఆసియా ప్రాంతం మొత్తం అభివృధ్ధి చెందటానికి ఎంతో సహాయపడుతుంది. దక్షిణాసియా ప్రాంతం అంతటిలో సహకారం పెంపొందించుకోవడానికి ఇది భారతదేశం వేస్తున్న గొప్ప అడుగు - ఒక వెలకట్టలేని కానుక. దక్షిణ-ఆసియా  ప్రాంతం పట్ల మనకున్న అంకితభావానికి ఇదొక  సరైన ఉదాహరణ. దక్షిణ-ఆసియా శాటిలైట్ తో సంబంధం ఉన్న దేశాలన్నింటినీ ఈ ముఖ్యమైన ప్రయోగానికి స్వాగతిస్తున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మీ వారిని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...