30, మే 2017, మంగళవారం

నీటిపై తేలే ఇటుకలు.

రామప్ప ఆలయం  మొత్తం రాతితో నిర్మాణం చేయడం వలన ఆలయ
బరువు ఎక్కువగా ఉంటుందని భావించిన కాకతీయులు..
ఆనాడే ఈ బరువును తగ్గించాలని, లేకపోతే గుడికి కూలిపోతుందని గ్రహించారు.
అలా పుట్టిందే ఈ తేలికపాటి ఇటుక ఆలోచన..
రామప్ప దేవాలయ విమాన శిఖరం పైన  వాడిన ఇటుకలు
ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా.
మన చుట్టూ ఎన్నో ఇటుకలున్నాయి. కానీ వాటిలో వేటికి
లేని గుణం రామప్ప గోపురాల్లో ఉండే ఇటుకలకు ఎలా వచ్చాయనేది ఆశ్చర్యం.
దగ్గర్లో ఉన్న చెరువు లోని ప్రత్యేక రకమైన మట్టి , ఏనుగు పేడ, అడవి మొక్కల జిగురు,దాంతో పాటు పొట్టు, జనపనార ఊకపొట్టు,  మరికొన్ని పదార్ధాలు కలిపి ఇటుకల్ని తయారు చేశారు కాకతీయులు.
దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
సాధారణ ఇటుక సుమారు కిలో బరువు ఉంటుంది.
కానీ కాకతీయులు ఆ కాలంలో తయారుచేసిన ఇటుక కేవలం 300 గ్రాములుంటుంది.
ఈ ఇటుకలో సాంద్రత 0.9 ఉండటం, బరువు తేలికగా ఉండటంతో తేలిగ్గా నీటిలో తేలియాడే గుణం వచ్చింది.

శాస్త్రీయంగా చెప్పాలంటే నీటి సాంద్రత 1gm/cc అయితే ఈ ఇటుకల సాంద్రత కేవలం 0.9gms/cc
మాత్రమే అదే మనం సాధారణంగా ఇప్పుడు వాడే ఇటుకలు 2.2 గ్రామ్స్ /cc వుంటాయి.
అంతే కాకుండా ఈ ఇటుకలకు స్పాంజిలో వున్నట్లు లోపటంతా బోలుతనం వుంటుంది.
ఈ పోరస్ నెస్ వలన కరిగించిన సున్నం బెల్లపు పాకం లాంటి వాటిని పీల్చుకుని దృఢంగా వాటిలోపల భద్రపరచుకోగలుగుతుంది.

రామాయణంలో ప్రస్తావించినట్లు రామసేతు నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లు ఉంటాయా?-

తులసీ రామాయణం, కంద రామాయణం గ్రంథాల్లో నలుడు, నీలుడు అనే వానర సాంకేతికులు నీటిపై 'తేలియాడే' రాళ్లతో రామసేతును నిర్మించినట్లు ప్రస్తావన ఉంది. నీటి సాంద్రత కన్నా తక్కువ సాంద్రత ఉన్న వస్తువేదైనా నీటిపై తేలుతుందని ప్లవనసూత్రాలు (laws of floatation చెబుతున్నాయి.పైగా సముద్రపు నీటి సాంద్రత సాధారణ నీటి సాంద్రత కన్నా ఎక్కువ కాబట్టి మామూలు సరస్సులో మునిగే రాళ్లు కూడా కొన్ని సముద్ర ఉపరితలంపై తేలియాడే అవకాశం ఉంది. ప్రస్తుతం రామేశ్వరం, శ్రీలంక మధ్య సముద్రపు పీఠంపై ఉండే 'ఆడమ్స్‌ బ్రిడ్జి'ని రామసేతుగా కొందరు విశ్వసిస్తున్నారు. దానిపై విభిన్నమైన వాదనలు ఉన్నాయి.అయితే నీటిపై తేలియాడే రాళ్లు లేకపోలేదు. కృత్రిమంగా తయారుచేసే రాళ్లల్లో గాలి బుడగలు ఎక్కువ ఉండేలా సరంధ్రీకరణం (porosity)చేసినట్ల యితే అలాంటి రాళ్ల నికర సాంద్రత (net density)) నీటి సాంద్రతకన్నా తక్కువగా చేయవచ్చును. సముద్ర కోరల్స్‌, అగ్నిపర్వతాల లావా ఎండిపో యిన తర్వాతా అవినీటిపై తేలియాడే లక్షణాల్ని సంతరించుకొంటాయి.
A. Ramachandraiah . Professor NITW.
#AAP
#RAMAPPA
#floatingbrick

27, మే 2017, శనివారం

జాఫర్ గఢ్ లో మాల్చగుట్టఃమొన్నటి చరిత్ర అన్వేషణలో జాఫర్ గఢ్ లో దొరుకుతున్న పురాతన ఆనవాళ్ళు కొత్తచరిత్రకు ఆశలు కల్పిస్తున్నాయని మిత్రుడు సహయాత్రికుడు సాదిఖ్ భాయి,మా కొత్తతెలంగాణ  చరిత్రబృందసభ్యులు వేముగంటి మురళీకృఫ్ణ,అరవింద్ అభిప్రాయపడ్డారు.నాకు ఇంటర్ క్లాసుమేట్ రామాంజనేయులు,మిత్రుడు సర్వణ్ నాయక్,నా మాజీవిద్యార్థులు శ్రీనివాసనాయక్,అతని స్నేహితులు ఎన్నిసార్లో ఈ గుళ్ళు,శిల్పాలగురించి చెప్పి జాఫర్ గఢ్ కు పిలిచినా ఇన్నాళ్ళకు కుదిరింది మాకు.
జాఫర్ గఢ్ కు దక్షిణాన వున్న పెద్దచెరువుకు ఉత్తరాన చిన్నరాతిబోడుంది.దాన్ని మాల్ఛగుట్ట అని పిలుస్తారు. గుట్టమీద రెండెకరాల విస్తీర్ణంలో ఇటుకలరాశి పరుచుకుని వుంది.ఇటుకలు జారిపోకుండా అంచుల్లో రాళ్ళకట్ట పేర్చివుంది.గుట్టమీది గుండ్లనే కొన్నిచోట్ల వాడినట్టుంది.ఇటుకలు మెట్లపద్ధతిని కట్టినట్టు తెలుస్తున్నది.ఇటుకలు 14అంగుళాల పొడవు,9అంగుళాల వెడల్పున్నవి.గుండ్రంగా కట్టబడిన ఈ ఇటుకలనిర్మాణంలో అవసరమైన సందుల్లో పెట్టడానికి త్రిభుజాకారంలో,గుండ్రని అంచువున్న ఇటుకలు దొరుకుతున్నాయి.గట్టిగా కాల్చిన ఇటుకలను వాడారు.గుట్టకింద వున్న దశరథం చెలకలో దొరుకుతున్న ఎరుపు,నలుపు పలుచని,మందపు పెంకులు,బూడిదరంగు పెంకులు 1,2 శతాబ్దాలనాటివనిపిస్తున్నాయి.ఇటుకలు కూడా శాతవాహనకాలం నాటివే.ఫోటోలను చూసిన ఈమని నాగిరెడ్డిగారు కూడా శాతవాహనుల నాటివేనని నిర్థారించారు.పోతే,గుట్టమీది ఇటుకలదిబ్బ మేం బౌద్ధస్తూపానిదని అనుకుంటున్నాము.అక్కడ లభిస్తున్న ఇటుకలు,స్తంభాలు నిలిపే చతురస్రాకారపు రాతిదిమ్మెలు,రాతిస్తంభాలు,
            గుట్టకింద చెలకలో వున్న బుద్ధుని రూపంలో వున్న ప్రతిమ(ఇంకా నిర్థారింపబడలేదు కాని, ఆ విగ్రహం జైనతీర్థంకరునిది కాదని దగ్గరగా చూసినపిదప నిర్ణయించగలిగాం.ఆ విగ్రహం తలపై కొప్పుముడి వుండడం బుద్ధునిశిల్ప లక్షణమే అయినప్పటికి వక్షంపై ఎడమభుజంనుంచి వుండాల్సిన వస్త్రం కనిపించడం లేదు.వర్షాతపాలకు విగ్రహం కొంతశైథిల్యం చెందింది.అట్లే విగ్రహం తలవెనుక జుట్టు మెడమీదిదాకా కత్తిరించినట్టుగా వుండడం సందేహపడేటట్టు చేస్తున్నది.)వల్ల కూడా ఈ ఇటుకలరాశి బౌద్ధస్తూపానిదేనని ఆశ కలిగిస్తున్నది.కొత్తతెలంగాణ చరిత్రబృందానికి ఇట్లాంటి ఇటుకరాశులు జనగామజిల్లా కొన్నె గజగిరిగుట్ట మీద, యాదాద్రి జిల్లా రాయగిరి మల్లన్నగుట్టమీద, రఘునాథపురం రామస్వామిగుట్టమీద,వలిగొండనాగారం శంకరంగుట్ట కింద చూసినపుడు కలిగిన సందేహాలే ఇక్కడ కూడా కలిగాయి.పైవన్నీ బౌద్ధస్తూప లక్షణాలనే కలిగివున్నాయి.రెండేండ్ల కింద బయటపడ్డ చాడస్తూపం వద్ద బుద్ధప్రతిమ,స్తూపఫలకాలు లభించాయి.ఇక్కడ మాల్చగుట్టమీద అవి లభించలేదు.
              పై విగ్రహాలను ముందు చూసిన మిత్రుడు ఆర్.రత్నాకర్ రెడ్డి అవి జైనతీర్థంకరులవి అని అభిప్రాయపడ్డాడు.మేం కూడా అంతేననుకున్నాం ఇపుడు చూసేవరకు.

గంటల గుడి - జాఫర్ ఘడ్

జాఫర్ గఢ్ అని పిలువబడుతున్న వేల్పులకొండ  లేదా వేముల(వా)డ రాజన్న గుడిగా పిలువబడుతున్న శివాలయం వేల్పులకొండకు దక్షిణనైరుతిలో వుంది.ఇది శైవత్రికూటదేవాలయం.ఇపుడాగుడి అన్నిచోట్ల తవ్వేసివుంది.గుడిలో లింగాలు లేవు.రెండు గర్భగుడుల ద్వారాలకిరువైపుల కాకతీయకలశాలున్నాయి.ఒక ద్వారం మీద లలాటబింబంగా గజలక్ష్మి చెక్కబడివుంది.దక్షిణ ఉపాలయం ముందర గుండ్రని మూడంచుల పానవట్టం వుంది.దానికి నాగుచుట్టివుంది.రెండు గర్భగుడులే వున్నాయి మూడవది మసీదుగా మార్చిన గుడికి ద్వారంగా వుంది.ద్వారం,లోపలిగోడల్లో ఆర్చులున్నాయి.దక్షిణగర్భగుడిమీద తర్వాత కాలంలో కట్టిన ఇటుకలగోపురం సున్నండంగు పూతతో వుంది.దానిమీద ఉర్దూలో రాతలున్నాయి.కొన్ని అంకెలు చెక్కివున్నాయి.ద్వారానికి ముందు రాతిరెయిలింగ్ వుంది.ఎదురుగా 30 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం వుంది.ఈ స్తంభం శిఖరాన అందమైన డిజైన్లతోడి గుండ్రనిరాతిబిళ్ళ అమర్చబడివుంది.దాని పైన మరొక రాతిబిళ్ళ మీద బిగించిన 4చిన్నస్తంభాలపై కప్పుపలక.దానిమీద ఇటుకల గోపురం వుంది.ధ్వజస్తంభంమీది మంటపంలో నాలుగువైపుల నుండి కనిపించే శిల్పం(బ్రహ్మ)వుండేదట.(జైనమానస్తంభం శిఖరాన జైనయక్షుడైన బ్రహ్మ వుంటాడు.from wikipedia: Manastambha "column of honor" is a pillar that is often constructed in front of Jain temples or large Jain statues. In North India, they are topped by four tirthankara images.According to the Jain texts, a huge manastambha stands in front of the samavasarana (divine preaching hall) of the tirthankaras, which causes someone entering a samavasarana to shed their pride.A monolithic manastambha is a standard feature in the Jain temples of Moodabidri. They include a statue of Brahmadeva on the top as a guardian yaksha)దానిని ఎవరు అపహరించారో.ధ్వజస్తంభం వెనక గరుడ,ఆంజనేయుల రాతిపలకల ఉల్బణశిల్పాలున్నాయి.శివాలయం ముందర వైష్ణవచిహ్నాలు.గుడికి తూర్పున దేవతాధిష్టానపీఠం వంటి ఒకరాతిదిమ్మె మీద 3 విగ్రహప్రతిష్టానానికి తొలిచిన తొలులున్నాయి.దానినిబట్టి అది బహుశః నీల,భూదేవీసహిత చెన్నకేశవుని అధిష్టానపీఠం కావచ్చనిపిస్తున్నది.కాని,పీఠం చెక్కడం పూర్తికానట్టుంది.అయితే దానిమీద గరుడుని శిల్పం వుండేది. అవి దేవాలయ పరివర్తనసూచికలేమో.
ఒక్క గుడిలోనే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి.కలశాలు కాకతీయుల జైనమతాభిమానానికి గుర్తులు.గజలక్ష్మి కూడా బాదామిచాళుక్యుల కాలంనుండి ఆలయాల లలాటబింబంగా వుండడం పురాతన సంప్రదాయం.ఎక్కువగా గజలక్ష్మి జైన కూటదేవాలయాల్లో అగుపిస్తుంటాయి.గుడిముందర వున్న గరుడ, ఆంజనేయ శిల్పాలు అక్కడివేనా ఎక్కడనుండైనా తెచ్చిపెట్టారా.శైలిరీత్యా అవి 15,16 శతాబ్దాలనాటివనిపిస్తుంది. దానిని జాఫర్ పాలనాకాలంలో మసీదుగా మార్చినట్టుగా అనిపిస్తున్నది.త్రికూటంలోని ఒక గర్భగుడి ఇట్లా పరివర్తింపబడ్డది.

సమాధులు పిలుస్తున్నాయ్ ...

ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, మల్లూరు అడవుల్లో నా దృష్టికి వచ్చిన అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ పరిశోధనలో సాహసోపేతంగా ఆధారాలు సేకరించిన అరవింద్ ఆర్య,విశ్లేషణలో అడుగడుగునా లాజిక్ ని అప్లై చేసిన జాతీయ స్థాయి జర్నలిస్ట్ అనుదీప్, మా మంచి చెడ్డలు చూసుకున్న మరో సాహసి జొన్నలగడ్డ పరుశ రాం  కు ముందస్తుగా అభినందనలు,ధన్యవాదాలు.

   వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, ఏటూరునాగారం-భద్రాచలం రహదారిలో ,మంగపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో మల్లూరు కొండలున్నాయి. ఆ కొండల మీద సుదూరాల వరకూ కన్పించే కోట గోడలున్నాయి. ఆ కోటలో డోలమైన్లుగా పిలువబడే వేలాది సమాధులు ఉన్నాయి. అలాగే కోట దిగువ భాగంలోనూ లెక్కించటానికి వీలుకానన్ని సమాధులు, వాటిని దాటి వెళితే కన్పించే శిఖాంజనేయుడు ఒక పక్క, అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్న చింతామణి అనే జలధార మరో పక్క, మరికొంచెం దూరం వెళ్తే హేమాచలం గా ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం (స్రవించే విగ్రహం) ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చించబోయే అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించినవే.

   ఈ కొండల్ని రెండేళ్ళ క్రితం తొలిసారిగా సందర్శించా. మళ్ళీ మొన్న మా బృందంతో కలిసి వెళ్లి చూశా. అక్కడికి వెళ్ళడానికి ముందు 30 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న దామర వాయి లోని 145 ఆదిమానవులవి అని చరిత్రకారులు చెప్తున్న సమాధులు (డోలమైన్లు) కూడా చూసొచ్చా. మల్లూరు కొండలను చేరుకోవటానికి కిలోమీటర్ దూరం నుంచే ఆ కొండలు, వాటి మీద చుట్టూ కోటగోడలు కన్పిస్తుంటాయి. అవి చూడ్డానికి తిరుమల కొండ శిఖరాల్లా కన్పిస్తుంటాయి కానీ, సహజ సిద్ధంగా కాకుండా మానవ నిర్మితం లా ఉన్నాయి. దగ్గరిగా వెళ్తే కానీ ,వాటి మర్మం మనకు అర్ధం కాదు. వాటి గురించి కూడా ఇదే వ్యాసంలో మున్ముందు రాస్తా. వీటి గురించి రాసే ముందు కొండలు,గుట్టల విషయంలో నా పూర్వానుభవం కొంచెం చెప్తాను. అది చెప్పకపోతే నేను చెయ్యబోయే విశ్లేషణకు క్రెడిబిలిటీ ఉండదు. గతంలో నేను హిమాలయాలు,ఆరావళి పర్వతాలు,పశ్చిమ కనుమలు,మదుమలై అడవులు, దండకారణ్యం,నల్లమల అడవుల్లో పలుమార్లు సంచరించాను. ఇకపోతే తిరుమల సప్తగిరుల్లో ఎన్ని వందలసార్లు తిరిగానో నాకే లెక్కలేదు. ఈ అనుభవాలన్నీ మల్లూరు కొండల్లో నేను చూసిన, చేసిన పరిశోధనల్లో బాగా ఉపకరించాయి.
హేమాచల నారసింహ  ఆలయానికి వెళ్ళేదారిలో కిలోమీటర్ ముందుగానే ఎడమవైపున శిఖాన్జనేయ స్వామీ ఆలయానికి వెళ్ళడానికి అడవిలో కాలిబాట ఒకటి ఉంటుంది. ఆ బాటలో 200 మీటర్లు లోపలికి వెళ్ళగానే సమాధులు మొదలవుతాయి.సమాధుల మీద గుండ్రటి రాళ్ళు పరిచి ఉంటాయి. అలాగే దారిపొడవునా పెద్ద రాళ్ళ గుట్టలు ఉంటాయి. ఆ రాళ్ళు పట్టుకొని ఎక్కడం మొదలు పెడ్తే అలా అలా ఎక్కుతూ ఉంటే కొండ శిఖరాన ఉన్న కోట గోడల వరకు చేరుకుంటాం.సరిగ్గా ఇక్కడే మిస్టరీ మొదలవుతుంది. సమాధుల మీద పరచిన రాళ్ళు, కొండలా ఏర్పడిన రాళ్ళు ఒకేలా ఉన్నాయి. అలాంటి
రాళ్ళను నా జీవితకాలంలో ఎక్కడా,ఏ అడవిలోనూ చూడలేదు. మల్లూరు చుట్టుపక్కల కానీ,వరంగల్ జిల్లాలో కానీ ,తెలంగాణాలోని ఏ ఇతర జిల్లాలో కానీ ఎప్పుడూ చూడలేదు.

   చిన్న చిన్న గులకరాళ్ళు  ముద్దలు ముద్దలు గా,కుప్పలు కుప్పలుగా సిమెంటు లోనో, సున్నంలోనో కలిపి (కాంక్రీటు చేసినప్పుడు సిమెంట్,ఇసుక,కంకర కలిపి ముద్ద చేసి ఎండ పెడితే ఎలా ఉంటుందో అలా) కృత్రిమంగా రాయిలా తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి.ఈ గులక రాళ్ళు నదీ పరివాహక ప్రాంతాల్లోనో,సముద్ర తీరాల్లోనో తప్ప మరెక్కడా కన్పించవు. చిత్రంగా రాళ్ళే తప్ప ఎలాంటి గవ్వల ఆనవాళ్ళు లేవు. మరో విశేషం ఏమిటీ అంటే , ఈ బండలకు మధ్యమధ్యలో రంధ్రాలు ఉన్నాయి. వాటి మధ్యలో మట్టిని కాల్చి తయారు చేసిన గొట్టాల లాంటివి ఉన్నాయి. అవి కూడా కొన్ని అంగుళాల పరిమాణంలోనే ఉన్నాయి. ఈ మల్లూరు గుట్టలను ఆనుకొని కిలోమీటర్ దూరంలో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంటుంది.ఇప్పుడు కిలోమీటర్ దూరంలో ఉందీ అనుకుంటే ,కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితం అది ఖచ్చితంగా ఈ కొండలను అనుకునే ప్రవహించింది అనుకోవాలి.అలాంటప్పుడు ఈ కొండరాళ్ళలో కన్పించే గులకరాళ్ళు ఆ నదీ ప్రవాహంలోంచి వచ్చినవే అనుకోవచ్చు.

     ఇక్కడ కొంచెం విరామం ఇచ్చి ఒకసారి చరిత్రలోకి తొంగి చూద్దాం. హేమాచల నరసింహ స్వామి క్షేత్రం గురించి చెప్పే సందర్భంలో శాతవాహన వంశానికి చెందిన దిలీప శాతకర్ణి 76 వేలమంది సైనికులతో ఈ కొండ మీద కోటలో నివాసమున్నాడని చెప్తారు. అలాగే ఆరో శతాబ్దం నాటికి చిన్న చోళ చక్రవర్తి ఇక్కడ రాజ్యం ఏలాడూ అంటారు.ఇక కాకతీయుల కాలంలో గోన గన్నారెడ్డి ఇక్కడ స్థావరం ఏర్పర్చుకున్నాడని చరిత్రకారులు చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవమో కాని,వందల,వేల ఏళ్ళ క్రితమే ఇక్కడ మానవ సంచారం,నివాసం,కోట ఉన్నాయనేది మాత్రం నిర్వివాదాంశం.

   మరో కీలకమైన అంశం ఏమిటీ అంటే,1323 వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల వరుస దాడులు,ఓటమి తర్వాత  వరంగల్ కోటను విడిచి పెట్టిన కాకతీయులు చత్తీస్ గడ్ కు వలస వెళ్లే క్రమంలో కొంతకాలం మల్లూరు కొండల్లో నివాసమున్నారా? తాత్కాలిక ప్రాతిపదికన కోటను నిర్మించారా?లేక శిధిలమైన కోటను పునన్ర్నిర్మించారా?అనేది ఒక ప్రశ్న.తక్కువ వ్యవధిలో కొండరాళ్ళతో కోటను నిర్మించటం సాధ్య కాదు కాబట్టి గులకరాళ్ళతో కలిపి మిక్సింగ్ బండలు తయారు చేసి తాత్కాలిక ప్రాతిపదికన కోటను నిర్మించారా? అసలు వాళ్ళేనిర్మించారా? లేక మరెవరైనా నిర్మించారా? అలా అయితే ఏ కాలంలో నిర్మించారు? ఈ రాళ్ళను చూస్తే మాత్రం అవి సహజ సిద్ధమైనవి కావనీ,కృత్రిమంగా తయారు చేసినవనీ స్పష్టంగా అర్ధమవుతుంది. మరి అలాంటప్పుడు అక్కడున్న వేలాది సమాధులు ఎవరివి? చరిత్రకారులు భావిస్తున్నట్లు ఆదిమ మానవులవీ, 5 వేల ఏళ్ళ క్రితం నాటివీ కావా? ఒకవేళ ఆ కాలం నాటివే అనుకుంటే గులక రాళ్ళ మిశ్రమంతో కృత్రిమ కొండలు,రాళ్ళు సృష్టించే విద్యను అప్పటికే వాళ్ళు నేర్చుకున్నారా?

   ఎక్కడ గుండ్రటి రాళ్ళతో సమాధులు కన్పించినా అవి ఆదిమ మానవుల సమాధులే అని చెప్తున్న చరిత్రకారులు మల్లూరు సమాధులకు ఏ రకమైన వివరణ ఇస్తారు?అసలు మన దగ్గర దీర్ఘ చతురస్త్రాకారపు సమాధులు ఎప్పుడు మొదలయ్యాయి? పైన రాళ్ళు కప్పే సమాధుల ఆచారం ఏ కాలం వరకు కొనసాగింది?ఇలా అనేకానేక ప్రశ్నల సమాహారమే ఈ పోస్ట్ సారాంశం. చరిత్ర అధ్యయనంలో మరో కోణం అవసరం అని భావిస్తూ ఈ పోస్ట్ ముగిస్తున్నాను.దీనిపై మిత్రులు స్పందించాలని కోరుకుంటున్నాను.

మెట్ల బావి

వరంగల్ లో  వెలుగులోకి వచ్చిన వందల ఏళ్ల నాటి దిగుడు బావి

శతాబ్దాలనాటి అపురూప కట్టడం శివనగర్  సమీపంలో పురాతన బావి. ఇప్పటికీ పుష్కలంగా జలం.
ఏడు శతాబ్దాల కిందటి దిగుడు బావులు ఎలా ఉండేవో చూడాలని ఉందా?

తరాలుమారినా, శతాబ్దాలు గడిచినా,
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెక్కు చెదరని నాటి అద్భుత రాతి కట్టడాన్ని చూడాలనుకుంటున్నారా?

కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశల్యానికి నిదర్శనంగా, నేటికీ రాజఠీవితో నిలచిన దిగుడు బావిని చూడాలని ఉందా..!
అయితే ఇంకెందుకు ఆలస్యం.
వరంగల్ కి రండి...

మరిన్ని వివరాలకు
https://www.facebook.com/nivas.katta74/posts/1192188270805689

వీడియో కోసం.

https://www.facebook.com/nivas.katta74/videos/1192155934142256/
చూడండి.
#ARAVINDARYAPAKIDE #AAP #HERITAGE #WARANGAL #KAKATIYA

Aravind Arya Pakide

24, మే 2017, బుధవారం

రాగి జావ

* ఎందుకు తీసుకోవాలి.. 5 కారణాలు... ఇలా తయారు చేస్కోండి...*

రాగి జావ అనగానే కొందరు తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి.

1. క్యాల్షియం... 

ఇతర గింజల్లో వేటిలో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా వుండాలంటే రాగి జావ ఇస్తుండాలి. 

2. అధిక బరువును అడ్డుకుంటుంది...

రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది. అమినో ఆసిడ్లు వుండటం వల్ల అధిక బరువు వున్నవారు బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం వుంటుంది.

3. బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది...

అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ వండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.

4. అనీమియాను అడ్డుకుంటుంది...

సహజసిద్ధంగా కావల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటుంటే మంచి ఫలితం వుంటుంది. విటమిన్ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.

5. చిన్నపిల్లలకు చక్కని ఆహారం...

28 రోజులు నిండిన పిల్లలకు రాగి జావను పెడుతుంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందటం ద్వారా ఆరోగ్యంగా వుంటారు. ఐతే మోతాదుకు మించి రాగి జావను ఇవ్వరాదు. 

ఈ తీపి రాగి జావను ఎలా తయారు చేయాలో చూద్దాం...

*కావలసినవి:*

రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు - రెండున్నర కప్పులు, పంచదార- రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి- రెండు టీ స్పూన్లు, యాలకల పొడి, శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమపువ్వు చిటికెడు, నెయ్యి లేదా వెన్న ఓ టీ స్పూన్.

*తయారు చేయడం...*

సాస్ పాన్లో నెయ్యి వేడి చేసిన తర్వాత రాగి పిండి వేసి ఓ మాదిరి మంటపై వేగించాలి. పిండి రంగు మారి వేగించిన వాసన రాగానే మంట తగ్గించి అందులో నీళ్లు పోయాలి.

* పిండి వుండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ వుండాలి.

* రాగి పిండి మిశ్రమం చిక్కపడేవరకూ రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పాలు పోసి గరిటెతో తిప్పుతూ వుండలు కట్టకుండా తిప్పుతూ వుండాలి.

* పంచదార, యాలకల పొడి, కుంకుమ పువ్వు, బాదం పొడి వేసి ఓ మాదిరి మంట మీద మిశ్రమం మరికాస్త చిక్కబడేవరకూ ఉడికించాలి.

* ఈ తీపి రాగి జావను వడగట్టి తాగేయాలి.

🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍵

*

22, మే 2017, సోమవారం

ఇప్పపూలు

ఇప్పనూనె ఫలధికరణ తరువాత రెండు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి.
జూన్‌, జూలై నాటికి కాయలు పూర్తిగా పండి, విత్తనాలు ఏర్పడుతాయి. కాయ ఆండాకారంలో చిన్నకాయాలా ఉంటాయి. పండు లోపలి భాగంలో గుజ్జు, దాని దిగువన గింజ ఉంటుంది.
ఒక చెట్టు నుండి ఏడాదికి 60 నుండి 80 కిలోల విత్తనం లభిస్తుంది.
పెద్ద చెట్లు నుండి అయితే 100కిలోల వరకు విత్తనాలు లభిస్తాయి. ఈ విత్తనాలలో 30 నుండి 35శాతం వరకు నూనె ఉంటుంది.
విత్తనంలో రెండు పిక్కలు ఉండగా 46 నుండి 50 శాతం వరకు నూనె ఉంటుంది.పండ్లు పక్వానికి వచ్చిన తరువాత రాలి కిందపడుతాయి. పండిన పండ్లను గిరిజనులు, సమీప గ్రామస్తులు సేకరించి ట్రైబల్‌ కో ఆపరేటివ్‌ సంస్థలకు, వ్యాపారులకు విక్రయిస్తుంటారు. విత్తన సేకరణ జూన్‌ నుండి ఆగస్టు వరకు కొనసాగుతుంది. స్థానికంగా గిరిజనులు సేకరించిన ఇప్పకాయలను తొక్క తొలచి ఎండబెట్టి ఎక్కువ శాతం మధ్య దళారులకు అమ్ముతుంటారు. కొంత మంది ఈ గింజలతో నూనె తీసి వంటకాలలో వాడుతారు. మరికొంత మంది ఈ నూనెను చిన్న చిన్న మిల్లుల వద్దనే అమ్మేస్తుంటారు. ఈనూనెలో ఔషధ గుణాలున్నాయని గిరిజనులు పేర్కొంటున్నారు.
గిరిజనులు చెట్ల కింద పడిన పూలను ఏరి ఆరుబయట నేలపై ఆరబెడుతారు. భద్రాచలం పుణ్య కేత్రాన్ని సందర్శించిన భక్తులకు ఇప్పపూలను సీతమ్మ ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ.

ఇప్ప పూలతో జామ్  తయారీ విధానం :

ఇప్ప పూల పొట్టు తొలగించి శుభ్రమైన నీటితో మూడు సార్లు కడికి కుక్కర్లో వేసి ఉడక బెట్టాలి. ఉడక బెట్టిన పూలను కొద్దిసేపు చల్లబడే వరకు ఉంచి మిక్సీలో వేసి ఫేస్ట్‌లా రుబ్బాలి. అదేవిధంగా బొప్పాయి. జామ, అరటి, యాపిల్‌ పండ్ల గుజ్జును కూడా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ రకాల పండ్లు, ఇప్ప పూల గుజ్జును తూకం వేసి తూనికానికి సగం పంచదార కలిపి సన్నని సెగపై కింద అడుగు అంటకుండా మెదుపుతూ సుమారు 2 గంటల పాటు కాయాలి. కొంచెం తీసి నీళ్లలో వేసినప్పుడు ఆ కొంచెం నీళ్లలో కలవకుండా నేరుగా కిందికి దిగిపపోయినప్పుడు జామ్‌ తయారు అయినట్లుగా గుర్తించాలి.

ఇప్ప కేక్‌ :  మైదా పిండిలో బేకింగ్‌ పౌడర్‌, కోడి గుడ్డు, సోడా, వేసి అందులో 200 మిల్లిలీటర్ల పాలు పోసి కలపాలి. బాగా కడిగి, ఉడకబెట్టి రుబ్బిన ఇప్ప పూల పేస్ట్‌ని కలపాలి. 300 గ్రాముల నూనెలలో అర కిలో పంచదార పౌడర్‌ వేసి బాగా కలపాలి. రెండు ఫేస్ట్‌లను కలిపి బాగా సాగేలా పూర్తిగా అన్నీ కలిసేలా కలిపాలి. మిశ్రమాన్ని బాగా ఒక గంట వరకు కలిపి, అరగంట వరకు అలాగే ఉంచాలి. బాగా కలిపిన మిశ్రమాన్ని కావాల్సిన సైజ్‌లో గల కప్పులలో నింపాలి. వాటిపై పల్లీలు, జీడిపపప్పు,బాదం అలంకరించి మైక్రో వోవెన్‌లో ఉంచాలి. 600 హీట్లో 15 నిమిషాలు ఉంచి ఆతరువాత తీసి భద్రం చేసుకోని కావాల్సినప్పుడు తినవచ్చు.

ప్రభుత్వం స్పందించి తమకు ఆర్థికతోడ్పాడు అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అదే విధంగా ప్రభుత్వమే ఇప్పపూవు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే తాము ఆర్థికాభివృద్ధి సాధిస్తామని ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట ప్రాంతాల్లోని గిరిజనులు కోరుతున్నారు.
#IPPAPULU #TADVAI #FOREST #TRIBAL
#AAP.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...