30, ఏప్రిల్ 2017, ఆదివారం

కాకతీయుల సామంత సేన కొండపర్తి

                                                 -అరవింద్ ఆర్య పకిడె, 7097270270

కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తర్వాత పట్టణాల అభివృద్దికి ప్రాధాన్యం ఇచ్చారు. మారుమూల గ్రామాలకు సైతం పట్టణరీతులు అందించి అభివృద్ధి పరిచారు. తర్వాత ఆలయాలను అభివృద్ధి చేశారు. కాకతీయులతో పాటు వారి సేనానులు.. సామంతులు.. ఉద్యోగులు.. మతాచార్యులు.. సంపన్నులు కూడా దీనినే అభివృద్ధి సూత్రంగా పాటించారు. అలాంటి వాటిలో కొండపర్తి ఒకటి. కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడికి మంత్రిగా పనిచేసిన కాటమసేనాని.. సైన్యాధ్యక్షుడైన ఆయన కుమారుడు చౌండసేనాని కొండపర్తికి చెందినవారే కావడం వల్ల ఈ గ్రామం చారిత్రక గ్రామంగా పేరు గాంచింది!

గ్రామ స్వరూపం మా ఊరు: కొండపర్తి మండలం: ఐనవోలు జిల్లా: వరంగల్ అర్బన్ జనాభా: 6,439 (2011 జనాభా లెక్కల ప్రకారం) పురుషులు : 3,222 మహిళలు : 3,217 ఇండ్లు : 633 పిన్ కోడ్ : 506003 గ్రామ సరిహద్దులు తూర్పు : ఉప్పుగల్ పడమర: భట్టుపల్లి ఉత్తరం: మామూనూర్ దక్షిణం: ముల్కలగూడెం
ఎక్కడ ఉంది?:

హన్మకొండ నుంచి కాజీపేట వెళ్లేదారిలో దర్గా సమీపంలో ఉన్నది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండపర్తి ఉన్నది.
పేరెలా వచ్చింది?:

రెండు కొండల మధ్య ఉన్న గ్రామం కాబట్టి కొండపర్తి అనే పేరు వచ్చిందని చెప్తుంటారు గ్రామస్తులు.
విశిష్టతలు ఏంటి?:

కాకతీయుల కాలంలో సైనిక కవాతులతో దద్దరిల్లి సామంతసేనగా వర్ధిల్లిన నేల ఇది. రుద్రదేవుడికి మంత్రిగా పనిచేసిన కాటమసేనాని.. ఆయన రెండవ కుమారుడైన చౌండసేనాని కొండపర్తి వాసులే.
కొండపర్తి రాజుల విశేషాలు:

కాకతీయ రుద్రదేవుడు ఆంధ్రదేశపు కోస్తా ప్రాంతంపైన దండెత్తగా.. కాటమసేనాని ఆ ముట్టడిలో అత్యంత కీలక పాత్ర వహించాడు. అతడి ధైర్య సాహసాలకు గుర్తింపుగా రుద్రదేవుడు కోట గెలపాట అనే పిలిచేవాడు. కోటని జయించిన వాడు అని దీనర్థం. రుద్రదేవుని ఆస్థానంలో మంత్రిగా పనిచేశాడు. తర్వాతి కాలంలో కాటమసేనాని రెండవ కుమారుడు చౌండసేనాని మంత్రిగా పనిచేశాడు. కాకతీయులు చందవోలుపై దండెత్తినప్పుడు వెలనాటి పృథ్వీశ్వరుడు ఒక ద్వీపంలో దాక్కుని ఉండగా.. చౌండ సేనాని ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని అక్కడున్న ఖజానాను సైతం కొల్లగొట్టాడు. అతడి సాహసానికి మెచ్చిన గణపతి దేవుడు దివి చరాకర అని పిలిచేవాడు. vishnu-temple

రాజ పాలనా సూత్రం:

చౌండ సేనాని మంచి పరిపాలనాదక్షుడు. కాకతీయుల పాలనాకాలంలో ఉన్నత హోదాలో పనిచేసినప్పటికీ.. కొండపర్తితో మంచి అనుబంధం ఉండేది. కాకతీయుల పాలనా సూత్రమైన ట్రిపుల్ టీని చౌండ సేనాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ట్రిపుల్ టీ అంటే.. ట్యాంక్, టౌన్, టెంపుల్. దీని ప్రకారమే కొండపర్తిలో చౌండ సముద్రం అనే చెరువును తవ్వించి వేలాది ఎకరాలకు నీరందించాడట. ఎన్నో ఆలయాలను నిర్మించాడని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది.
త్రికూటాలయం:

చౌండసేనాని కొండపర్తిలో చౌండేశ్వరాలయం పేరుతో ఒక త్రికూటాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. దీనిని కొండపర్తి శివాలయంగా పిలుస్తారు. ఆలయంలోని శాసనం ప్రకారం దీనిని క్రీస్తుశకం 1125 రుదిరోద్గారి నామ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్షం ఏప్రిల్ 17వ తేదీన ఈ ఆలయంలో శివలింగం, విష్ణుమూర్తి, పోలేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్టించారు. శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించి 814 సంవత్సరాలు అవుతుంది. ఆలయ ధూప దీపనైవేధ్యాల కోసం చౌండ్యపురం అనే అగ్రహారాన్ని.. నారుకుర్కి అనే గ్రామాన్ని దానమిచ్చాడట రాజు. ఈ ఆలయాన్ని ఇసుక పెట్టె పరిజ్ఞానం (Sand Box Technology) ద్వారా నిర్మించినట్లు చెప్తుంటారు. ప్రస్తుతం ఆలయం లేదు కానీ నాటి ఘన చరిత్రకు ఆనవాళ్లుగా మాత్రం మిగిలి ఉన్నది. ఆ పక్కనే రెండు నంది విగ్రహాలు మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి. చౌండసేనాని వేయించిన శాసనం.. గణపతిదేవుడి కాలం నాటి శాసనం.. ఆంజనేయస్వామి విగ్రహం, బైరవమూర్తి వంటి శిల్ప కళాఖండాలు ఉన్నాయి.
సురా భాండేశ్వరాలయం:

కొండపర్తి గ్రామ పంచాయితీ కుడివైపున ఈ ఆలయం ఉంటుంది. ఆలయ ప్రవేశంలో రెండువైపులా ద్వార పాలక విగ్రహాలు ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. లోపలికి ప్రవేశించగానే వివిధ రకాల పరిమాణాల్లో మూడు నందులు ఉన్నాయి. ఇందులో కాకతీయ శైలిలో రెండు ఉండగా.. మరొకటి చాళుక్య శైలిలో ఉన్నది. అంతరాలయంలో శివలింగంపైన ఉన్న పైకప్పుపై సూక్ష్మరాతి విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఇలాంటి సూక్ష్మ విగ్రహాలు వేరే ఎక్కడా లేకపోవడం విశేషం. శివలింగం పైభాగంలో ఉన్న కప్పు మీద గుర్రంపై కూర్చొన్న ఒక యుద్ధవీరుని విగ్రహం కనిపిస్తుంది. ఇది చౌండ సేనానిది. ఆయనెంత పరాక్రమవంతుడో విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆలయంలో పెద్ద ధ్వజస్తంభం ఉండేదని.. పది సంవత్సరాల నుంచీ కనిపించడం లేదని గ్రామస్తులు అన్నారు. ఆలయ ప్రవేశంలో నల్లరాతితో చెక్కిన 3 అడుగుల గణపతి విగ్రహం కూడా ఉన్నది. vishnu-temple1
కొండపర్తిలోని శాసనాలు:

గ్రామంలో మూడు రాతి శాసనాలు ఉన్నాయి. ఊరి చివరన చెరువుగట్టు పక్కన ఉన్న గుట్టమీద కొక్కెరగుండు అని పిలిచే రాతి బండపై ఒక శాసనం ఉన్నది. ఇది క్రీస్తుశకం 9 వ శతాబ్దం నాటి ప్రాచీన తెలుగు లిపిలో రాయబడి ఉన్నది. చౌండ సేనాని నిర్మించిన చౌండ సముద్రం వద్ద వేయించిన శాసనంలో ఇలా రాసి ఉన్నది.. ఈ ధర్మసేతువు నృపులందరికీ ఒకే రకమైనది. కాబట్టి మీతో సదా రక్షించబడాలనీ, భవిష్యత్ కాలాలలో వచ్చే రాజులందరినీ ప్రార్ధిస్తున్నాను. ధర్మం శతృవు-చేసినా సరే కష్టపడి రక్షించాలి. శతృవు శతృవేకానీ ధర్మం ఎవరికీ శతృవు కాదు అని ఈ శాసనంలో పేర్కొన్నారు. మూడవ శాసనం శక సంవత్సరం 1162 (క్రీస్తుశకం 1242)లో అంతకు ముందు నిర్మితమైన పోలేశ్వర ఆలయంలో రుద్రేశ్వర.. కేశవమూర్తులను ప్రతిష్టాపన చేసి ఆలయానికి ప్రాకారాన్ని ఏర్పరిచినట్లు రాయబడింది.
500 స్తంభాల ఆలయం:

కొండపర్తిలో ఉన్న మరొక ఆలయం 500 స్తంభాల ఆలయం. ఇలాంటివి ఇంకా జనగామ జిల్లా నిడిగొండ, సిద్దిపేటజిల్లా నంగునూరు, కరీంనగర్‌జిల్లా ఉప్పరపల్లిలో కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెప్పారు. కొండపర్తిలో ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. ఇక గ్రామంలోని మరో ఆలయం వేణుగోపాలస్వామి ఆలయం. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్నది ఈ గుడి. నల్లరాతితో చెక్కిన పద్మనాభస్వామి, గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి. ఊరికి నలువైపులా బురుజులు.. వాటికింద నుంచి రహస్య సొరంగమార్గం ఉన్నాయి. వేణుగోపాలస్వామి పక్కనే ఉన్న రెండంతస్తుల బురుజు గ్రామానికే ప్రత్యేక ఆకర్షణ.
మ్యూజియం కావాలి..

గతంలో ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సర్వే చేశారు. 150కి పైగా విగ్రహాలను.. శిల్పాలను సేకరించి త్రికూటాలయం ఎదురుగా పెట్టారు. కాబట్టి, కొండపర్తి చారిత్రాత్మక విశిష్టతను కాపాడాల్సిన అవసరం ఉన్నది. -సోమయ్య, మాజీ సర్పంచ్
గత వైభవం రావాలి:

మా గ్రామంలో ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లు.. చారిత్రక కట్టడాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన వరంగల్‌కి అతి సమీపంలో మా ఊరు ఉంది. కాబట్టి గ్రామంలోని ఆలయాలను ప్రభుత్వం పునరుద్ధరించి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.తద్వారా గ్రామానికి గత వైభవం తేవాలి. -మారుపాటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తుడు

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...