28, ఆగస్టు 2016, ఆదివారం

తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది...........

తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది...........

హైదరాబాద్ రాజ్యంలో తెలుగు భాష, సంస్కృతి, సాహితీవేత్తలకు, రచనలకు మొత్తంగా తెలుగు వారికి తగినంత గౌరవం, పోషణ, ఆదరణ దక్కాలనే ఆలోచనలతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పడింది. 1901 సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటలకు పాల్వంచ సంస్థానాధీశులు, నిలయ పోషకులు అయిన రాజ పార్థసారధి అప్పారావు బహదూర్ అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. ఈ నిలయ స్థాపకుల్లో హైదరాబాద్ మన్సబ్‌దార్, సంఘసంస్కర్త రావిచెట్టు రంగారావు, మునగాల జమీందార్, తెలంగాణ భూమిపుత్రుడు రాజా నాయని వెంకటరంగారావు, ఆయన దివాన్, చరిత్రకారుడు, సాహితీవేత్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తదితరుల పూనిక మేరకు ఈ నిలయం పురుడు పోసుకుంది. ఈ ప్రారంభ సమావేశంలో కవి పండితులు ఆదిపూడి సోమనాథరావు, మైలవరం నరసింహశాస్ర్తులు తమ కవితలను వినిపించారు. అలాగే, ఈ సమావేశంలో అప్పటి హైదరాబాద్ ప్రముఖులు ముత్యాల గోవిందరాజులు నాయుడు, మహబూబియా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న బ్రహ్మసమాజీయులు రఘపతి వెంకటరత్నం నాయుడు, కొఠారు వెంకటరావు నాయుడు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రావిచెట్టు రంగారావు ప్రాపకంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఆదిరాజు వీరభద్రరావు సమావేశంలో పాల్గొన్న వారందరికీ తాంబూలాలు అందించారు.
తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసంలో ఈ గ్రంథాలయ స్థాపన ఒక మైలురాయి. దాదాపు తెలంగాణ వైతాళికులందరికీ దీనితో సన్నిహిత సంబంధాలున్నాయి. రావిచెట్టు రంగారావు, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నాయని వెంకటరంగారావు, కొత్వాల్ వెంకటరామారెడ్డి, మాడపాటి హనుమంతరావు తదితరులందరూ ఈ నిలయం అభివృద్ధిలో భాగస్వాములే!
ఈ గ్రంథాలయ స్థాపన మైలురాయి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పుస్తకాలు, ముద్రణ, పాఠశాల, స్త్రీల సమావేశాలు, నాటక కంపెనీ, ఆరోగ్య పరిషత్, పరిశోధక మండలి, గ్రంథమాల స్థాపన -అన్నీ ఈ గ్రంథాలయానికి అనుబంధంగా నడిచాయి. తెలంగాణ సమాజం అభ్యున్నతికి ఇది కూడలిగానూ పనిచేసింది. తెలంగాణ వారి సాహితీ ప్రతిభను బయటి ప్రపంచానికి తెలియజేయడమే గాకుండా మనోహర్ బర్వే, ద్వారం వెంకటస్వామి నాయుడు, కోడి రామ్మూర్తి నాయుడు, కావ్యకంఠ గణపతి ముని, సుసర్ల శ్రీరామమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణ -ఇలా ఎందరో ప్రముఖుల ప్రతిభను హైదరాబాదీయులకు పరిచయం చేసింది. అలాగే 1990 వరకు ఈ గ్రంథాలయంలో సన్మానం అందుకోని ప్రముఖ తెలుగు సాహితీవేత్త లేడంటే అతిశయోక్తి కాదు. పోతన మొదలు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాడ, కందుకూరి, పూండ్ల రామకృష్ణయ్య, చెలికాని లచ్చారావు, వంగూరు సుబ్బారావు, పురాణపండ మల్లయ్య, కోపల్లె హనుమంతరావు, చిలకమర్తి, శివశంకరశాస్త్రి, పానుగంటి, రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిరుపతి వేంకటకవులు, కట్టమంచి, జాషువా, మాడపాటి -ఇలా కొన్ని వందల మంది తెలుగు ప్రముఖుల జయంతి, వర్థంతి సభలు ఈ గ్రంథాలయంలో జరిగాయి. కాళోజీ, దాశరథి తదితరుల షష్ఠిపూర్తి ఉత్సవాలను కూడా ఈ సంస్థ నిర్వహించింది. భువన విజయ సప్తాహం (1942), రెడ్డియుగ సారస్వత సప్తాహం (1941), రామాయణ కల్పవృక్ష సప్తాహం (1950), సంపూర్ణ రామాయణ హరికథా సప్తాహం (1950) తదితర వారోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. 1901 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సాహిత్య, సామాజిక, రాజకీయ సభలు, సదస్సులు, సమావేశాలు ఈ నిలయంలో జరిగాయి. ఇప్పటికింకా జరుగుతున్నాయి.
ఈ గ్రంథాలయం తెలుగునాట సాంస్కృతిక, రాజకీయోద్యమాలకు దారి దీపమైంది. రాజరాజ నరేంద్రాంధ్ర భాషానిలయం (1904, హన్మకొండ), ఆంధ్రసంవర్ధినీ గ్రంథాలయం (సికింద్రాబాద్ 1905), మహబూబియా ఆంధ్రభాషా నిలయం (1911, ఎర్రుపాలెం), శ్రీ సిద్ధిమల్లేశ్వర గ్రంథాలయం (రేమిడిచర్ల 1913), శ్రీ ఆంధ్రవిజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం (సూర్యాపేట 1917), ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం (నల్లగొండ 1918), శబ్దానుశాసనాంధ్ర భాషానిలయం (1918) తదితర గ్రంథాలయాలన్నీ హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ప్రభావంతో ఏర్పడినవే!
తెలంగాణలోని వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్‌లో విద్యాభ్యాసానికై వచ్చే వారందరూ ఇక్కడి సభలు, సమావేశాల్లో పాల్గొనడమే గాకుండా, తమ చదువు పూర్తి చేసుకొని సొంత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గ్రంథాలయాలను స్థాపించారు. ఈ గ్రంథాలయాల స్థాపకులు లేదా నిర్వాహకులు తమ ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలను బయటి ప్రాంతాల వారికి తెలియజేసేందుకు తొలిదశలో ఆంధ్ర ప్రాంతంలోని పత్రికలు ముఖ్యంగా ఆంధ్రపత్రికపై ఆధారపడ్డారు. 1902లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి ఆంధ్రప్రకాశిక, రవి, శశిరేఖ, దేశోపకారి, కృష్ణాపత్రిక, మంజువాణి, సరస్వతి, జనానా, హిందూ సుందరి పత్రికలు వచ్చేవి. అలాగే రావిచెట్టు రంగారావు తదితరులు తమ ఇంటికి వచ్చే దక్కన్ పోస్టు ఇండియా రివ్యూ, కళావతి తదితర పత్రికల్ని గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చేవారు. మహబూబ్‌నగర్ నుంచి వెలువడ్డ హితబోధిని (1913) పత్రికతో ఈ గ్రంథాలయంలో తెలంగాణ పత్రికల పరంపర మొదలైంది. ఇప్పటికీ ఈ గ్రంథాలయం అరుదైన పాత పత్రికలకు, పుస్తకాలకు నెలవు.

ఈ గ్రంథాలయానికి అనుబంధంగా 1906లో విజ్ఞానచంద్రికా గ్రంథమాల రావిచెట్టు, కొమర్రాజు, నాయని వెంకటరంగారావుల పూనికతో ఏర్పాటైంది. తెలుగు వారికి మొట్టమొదటిసారిగా అబ్రహాం లింకన్‌ని పరిచయం చేసిన ఘనత ఈ గ్రంథమాలకు దక్కింది. నవలలు, విజ్ఞానశాస్త్ర విషయాలను, జీవిత చరిత్రలు తదితర అంశాలపై దాదాపు 30 విలువైన పుస్తకాలను ఈ గ్రంథమాల ప్రచురించింది. మొదట హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రచురణ ప్రారంభమైనప్పటికీ తర్వాతి కాలంలో హైదరాబాద్ పోస్టల్ స్టాంపులు, బ్రిటీష్ వారి పోస్టల్ స్టాంపుల్లో తేడాలుండి, పుస్తకాల బట్వాడాలో ఇబ్బందులు తలెత్తాయి. అలాగే హైదరాబాద్‌లో గ్రంథమాల నిర్వహణ, ప్రచురణ ఇబ్బంది కావడంతో దాని కార్యాలయం మద్రాసుకు మారింది. అక్కడ వీరికి ఆచంట లక్ష్మీపతి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు తోడ్పడ్డారు.
శేషాద్రి రమణకవులు 1920వ దశకంలో తెలంగాణలోని మారుమూల పల్లెలు సైతం పర్యటించి కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు సేకరించారు. వీటినన్నింటినీ ఈ భాషానిలయంలోనే భద్రపరిచేవారు. వీటికి తోడు ఆంధ్రపరిశోధక మండలిని ఏర్పాటు చేసిండ్రు. దీని తరఫున అనేక కొత్త శాసనాలు సేకరించి పత్రికల్లో ప్రచురించేవారు. తర్వాతి కాలంలో అంటే 1923లో ఈ సంఘం కొమర్రాజు మరణానంతరం ఆయన పేరిట లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారింది. తెలంగాణ శాసనాలు మొదటి భాగాన్ని ఆదిరాజు వీరభద్రరావు ఈ సంఘం తరఫున్నే వెలువరించారు.

ఈ గ్రంథాలయానికి అనుబంధంగా 1907లోనే తెలుగు మాధ్యమంగా బోధించే ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే 1908లో మూసీకి వరదలు రావడంతో లైబ్రరీతో పాటు సగం హైదరాబాద్ మునిగిపోయింది. దీనికి తోడు మద్రాసులోని అర్బత్తునాట్ కంపెనీ(బ్యాంకు) దివాళ తీయడంతో అందులో దాచుకున్న లైబ్రరీ సొమ్ముకూడా పోయింది. దీంతో ఈ పాఠశాల కేవలం 14 నెలలు మాత్రమే సాగింది.
ఈ గ్రంథాలయం తెలంగాణలో మహిళా చైతన్యానికి పాదులు వేసింది. వివిధ సభలు, సమావేశాలు జరిగినప్పుడు స్త్రీలు కూడా వినేందుకు వీలుగా వారికోసం ప్రత్యేకంగా ఒక బాల్కనీని నిర్మించారు. తన భర్త మరణానంతరం గ్రంథాలయం నిర్మాణానికి ఆర్థికంగా ఆదుకుంటామని వాగ్దానం చేసిన వారు ముందుకు రాకపోవడంతో రావిచెట్టు లక్ష్మీనరసమ్మ పూనుకొని మూడు వేల రూపాయల్ని విరాళంగా లైబ్రరీ కమిటీకి అందించింది. ఈ సొమ్ములో 1700ల రూపాయలని వెచ్చించి ఇప్పుడున్న స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ 1918లో గ్రంథాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అది 1921లో పూర్తయ్యింది. ఈ భవనాన్ని కట్టమంచి రామలింగారెడ్డి 29 సెప్టెంబర్ 1921 నాడు ప్రారంభించారు. నాటక రంగానికి చేయూత నిచ్చేందుకు గ్రంథాలయానికి అనుబంధంగా ఆంధ్రభాషోజ్జీవని నాటక మండలిని ఏర్పాటు చేశారు. దీని తరఫున రామదాసు నాటకాన్ని ప్రత్యేకంగా రాసి ప్రదర్శించారు. తొలిదశలో ధర్మవరం రామకృష్ణచార్యులు, ఆయన సోదరులు గోపాల కృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవులు ఈ మండలి తరఫున అనేక ప్రదర్శనలిచ్చాడు.
ఇంగ్లండ్‌లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసి హైదరాబాద్‌కు వచ్చిన వేలూరి రంగధామనాయుడు తాను స్వయంగా ప్రముఖుల పెయింటింగ్స్‌ని వేసి లైబ్రరీకి బహూకరించారు. అంతేగాదు, ఈ గ్రంథాలయం నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. అలాగే ఈ గ్రంథాలయం వృక్షంగా నిలబడి నీడనీయడానికి, పండ్లు ఇవ్వడానికి నీరు పోసిన వారిలో అనేక మంది ఉన్నారు. వారిలో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, వడ్లకొండ నరసింహారావు, ఆదిరాజు వీరభద్రరావు, భాగ్యరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కె.వి.రంగారెడ్డి, బిరుదురాజు రామరాజు, కాళోజీ, కోదాటి, దాశరథి కృష్ణమాచార్యులు, నందగిరి ఇందిరాదేవి, ఎం.ఎల్. నరసింహారావు, కె.వి. రమణాచార్య ఇట్లా అనేకమంది ఉన్నరు.
ఇటీవల ముంబైలో డేవిడ్ సాన్సున్ లైబ్రరీకి పునర్వైభవం కల్పించేందుకు అక్కడి ప్రజలు, ప్రముఖులు కంకణబద్ధులై ప్రయత్నిస్తున్నారు. 1847లో ప్రారంభమైన ఈ లైబ్రరీ గురించి ప్రచారం చేసేందుకు చాయ్‌పే చర్చలు చేస్తున్నరు. ప్రభుత్వం అండదండలు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, తెలుగువారి ముఖ్యంగా తెలంగాణ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న మన చారిత్రక గ్రంథాలయాన్ని కూడా అందరూ ఓన్ చేసుకోవాల్సిన అవసరముంది. ఇది మాది... మా సాంస్కృతిక పతాక అని తెలంగాణ సోయితో వ్యవహరించాలి. ఇందులోని పాత పత్రికలన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ, అవేవి పాఠకులకు అందుబాటులోకి రాలేదు. లైబ్రరీలోని అరుదైన పుస్తకాలు, పత్రికలు అందరికీ అందుబాటులోకి రావాలంటే వాటన్నింటినీ భాషానిలయం తమ వెబ్‌సైట్‌ని ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న పరిశోధకులకు ఈ సమాచారం అందుబాటులోకి వచ్చినట్లయితే మరింతగా తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై కొత్త వెలుగులు ప్రసరింప జేయడానికి వీలవుతుంది.
ఇప్పుడీ లైబ్రరీ పేరు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంగా మారింది. పేరులోని ఆంధ్ర మాయమైంది. అయితే, ఆ ఆంధ్ర స్థానంలో తెలంగాణ సోయిని నింపుకొని లైబ్రరీ మరింతగా పాఠకులకు చేరువ కావాల్సిన అవసరముంది. తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది. దీన్ని కాపాడుకోవాలె!
వ్యాసకర్త ప్రముఖ పరిశోధకులు.
వారి ఈ మెయిల్: sangishettysrinivas@gmail.com
- సంగిశెట్టి శ్రీనివాస్
#sangeshettisrinivas

27, ఆగస్టు 2016, శనివారం

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్

కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ బహు భాషా కోవిదుడు... రచయిత...
పాత్రికేయుడు.
హైదరాబాద్ నగర తొలి మేయర్‌గా ఎనలేని సేవలందించిన పరిపాలనాధక్షుడు.
పిక్టోరియల్ హైదరాబాద్ పేరుతో నగర చరిత్రను అందించినవాడు.
నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన ఆచరణను జోడించినవాడు.
అన్నివర్గాల ప్రజల మన్ననలందుకున్న కృష్ణస్వామి సేవలు మరువలేనివి.
నగరంపై ఆయన తనదైన ముద్రను వేశాడు.
నేడు కొర్వి కృష్ణస్వామి 123వ జయంతి.
ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
ఔరంగాబాద్ జిల్లా జాల్నాలో జన్మించిన కృష్ణస్వామి బాల్యం అక్కడే గడిచింది. తండ్రి ఎల్లయ్య సైనికుడు. పంజాబ్, బర్మా యుద్ధాల్లో పాల్గొన్నాడు. తండ్రి నుంచి ధైర్య,సాహసాలను అలవర్చుకున్నాడు కృష్ణస్వామి. చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఇంటర్‌మీడియట్ పూర్తిచేసిన కృష్ణస్వామి హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యం సాధించాడు. కృష్ణస్వామి ప్రతిభను గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ తన ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నాడు. రచయితగా.. కృష్ణస్వామి మంచి రచయిత. హైదరాబాద్ నగర చరిత్రను అధ్యయనం చేయాలంటే.. కృష్ణస్వామి రచనలు చదవాల్సిందే. హైదరాబాద్ నగర నిర్మాణ చరిత్ర, హైదరాబాద్ మున్సిపల్ పరిపాలన వ్యవస్థ చరిత్ర, హైదరాబాద్ రాజ వంశీయులు-నవాబులు- జాగీర్దారుల చరిత్ర (పిక్టోరియల్ హైదరాబాద్), హైదరాబాద్ రాష్ట్ర 30 సంవత్సరాల పోరాటం, ముదిరాజ్ జాతి చరిత్ర, గోవా రాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమం, బయోగ్రఫీ ఆఫ్ నవాబ్ జంగ్ బహదూర్ వంటి పలు గ్రంథాలను రచించారు. రచయితగా, పాత్రికేయులుగా కృష్ణస్వామి సేవలు విశేషమైనవి. దక్కన్ స్టార్, ముసావత్, ది న్యూ ఎరా వంటి పత్రికలకు ఆయన సంపాదకత్వం వహించారు. నిజాంప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించినప్పుడు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశారు. మేయర్‌గా.. 1933లో తొలిసారి చుడీ బజార్ నియోజకవర్గం నుంచి కృష్ణస్వామి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1940లో ప్రభుత్వం తరుపున నాయంబు మీర్ మజ్లిస్‌గా నియమితులయ్యారు. 1955లో నగర ఉప పాలకులుగా ఎన్నికయ్యారు. 1956లో నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించిన కృష్ణస్వామి.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని కోరుకున్నారు. అందుకు మాస్టర్ ప్లాన్ అవసరమని భావించారు. అందుకోసం విశేష కృషి చేశారు. ఆయన సేవలను గుర్తిస్తూ బేగంబజార్ నుంచి జుమ్మెరాత్‌బజార్ రహదారికి కృష్ణస్వామి ముదిరాజ్ పేరు పెడుతూ 1996 నవంబర్ నాల్గో తేదీన జీఓ నం.996ను జారీ చేసింది. నగరంలో విద్యావ్యాప్తికి సైతం ఆయన విశేష కృషి చేశారు. నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల, కన్య పాఠశాలను స్థాపించారు

#AAP

ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌


ప్రాచీన వారసత్వ సంపదకు రాజధానిగా విలసిల్లుతున్నవరంగల్ నగరంలో ఇవాళ పురాతన లాకర్‌ ఒకటి బయటపడింది. హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పక్కన ఉన్న సుబేదారి ఉన్నత పాఠశాలలో శిధిలావస్థకు చేరిన నిర్మాణాలను కూల్చివేస్తుండగా అందులోంచి తుప్పుపట్టిన పెద్ద వస్తువు ఒకటి బయటపడింది. సిబ్బంది దానిని పరిశీలించగా..సుమారు మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో ఉన్న భారీ లాకర్‌గా గుర్తించారు. ఈ లాకర్‌ను 1942వ సంవత్సరంలో ఆల్విన్ కంపెనీ తయారు చేసినట్టు నిర్థారించారు. ఈ సమాచారాన్ని పాఠశాల హెడ్‌మాస్టర్ డీఈవోకు, తహసీల్దార్‌కు అందించారు. లాకర్ బాగా బరువుగా ఉండటంతో దానిలో ఏముందోనని స్థానికులు, అధికారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌
పరిశీలించిన ఆర్‌డీఓ, తహసీల్దార్, అధికారులు
ఉన్నతాధికారుల అనుమతితో తెరిచిన వైనం
బయటపడిన నిజాం కాలం నాటి పత్రాలు, పహణీలు, కొన్ని చెక్కులు
హన్మకొండలోని డీఈవో కార్యాల యం పక్కనే ఉన్న సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశా ల పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఓ గది గోడ తొల గించగా ఐరన్‌ లాకర్‌ బాక్స్‌(త్రిజోరి) బయటపడిం ది. అయితే, రెండు రోజుల క్రితం ఇది బయటపడినా శుక్రవారం విషయం వెలుగుచూసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఉదయం అధికారులు పరిశీలించి లాకర్‌ను సీజ్‌ చేశారు. అయితే, రకరకాల పుకార్లు రావడంతో జిల్లా అధికార యం త్రాంగం ఆదేశాల మేరకు సాయంత్రం త్రిజోరి తలుపులు తెరవగా నిజాం కాలం నాటి పత్రాలు, పహణీలు, కొన్ని చెక్కులు బయటపడ్డాయి. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి.
పాత భవనం కూల్చివేతలో..
సుబేదారి ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనాల్లోని గదుల కూల్చివేతకు ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వగా ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. రెం డు రోజుల క్రితం కూల్చివేతలు ప్రారంభం కాగా.. ఆ భవనంలోనే హెచ్‌ఎం గది ఉంది. అయితే, ఈ గది కూడా కూల్చివేయాల్సి ఉండడంతో అందులోని సామగ్రిని హెచ్‌ఎం ఇజ్రాయల్‌ బయటికి తీయిస్తున్నారు. ఈ మేరకు గదిలో ఓ మూలకు గోడలో ఐరన్‌ లాకర్‌ బాక్స్‌ బుధవారం బయటపడినా ఎవరికీ చెప్పలేదు. కానీ శుక్రవారం ఉదయం ఆ బాక్స్‌ను ఫిజికల్‌ డైరెక్టర్‌ వెంకన్న, ఇద్దరు విద్యార్థులు కలిసి మరో గదిలోకి తీసుకువెళ్లారు. దీనిని గమనించిన అదే ఆవరణలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌నాయక్‌ విషయాన్ని డీఈఓ రాజీవ్, ఎంఈఓ వీరభద్రనాయక్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా విష యం బయటకు పొక్కడంతో అందులో గుప్తనిధులు ఉన్నాయంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి.
ఈ మేరకు వరంగల్‌ ఆర్‌డీఓ వెంకటమాధవరెడ్డి, హన్మకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్, హన్మకొండ ఎంఈ వో వీరభద్రనాయక్, ఎమ్మార్వో రాజకుమార్, సీఐ సతీష్, ఎస్‌ఐ సుబ్రమణ్యేశ్వర్‌రావు, కార్పొరేటర్‌ కేశిరె డ్డి మాధవి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు హెచ్‌ఎం ఇజ్రాయిల్, పీడీ వెంకన్నతో పాటు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లాకర్‌ బాక్స్‌పై హైదరాబాద్‌ ఆల్విన్‌ మెటల్‌ వర్క్స్‌ లిమిటెడ్‌ అని రాసి ఉంది. కాగా, ఇప్పటి సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థానంలో దశాబ్దాల కిందట డిప్యూటీ డీఈవోల ఈస్ట్, వెస్ట్‌ కార్యాలయాలు ఉండేవని తెలుస్తోంది. అప్పట్లో విలువైన పత్రాలు, నగదు దాచేందుకు ఈ లాకర్‌ ఉపయోగించినట్లు సమాచారం. అయితే, లాకర్‌ బయటపడిన విషయా న్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకపోవడంపై టీటీయూ జిల్లా జనరల్‌ సెక్రటరీ నరేందర్‌నాయక్, టీయూటీఎఫ్‌ జిల్లా బాధ్యులు బాబు తదితరులు అనుమానాలు వ్యక్తం చేశారు.
నిజాం నాటి పత్రాలు..
పాత సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనం గోడలో బయటపడిన త్రి జోరి(ఐరన్‌ లాకర్‌)లో నిజాం కాలం నాటి పత్రాలు వెలుగు చూశాయి. లాకర్‌ బయటపడగా అందులో ఏముందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. దీంతో లాకర్‌ను తెరిచేందుకు జిల్లా యంత్రాంగం నుంచి శు క్రవారం సాయంత్రం అనుమతి లభించింది. ఈ మేర కు హన్మకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో లాకర్‌ తెరిచారు. ఇందులో నిజాం కాలం నాటి పత్రాలు, భూములకు సంబంధించిన పహాణీలు, హైదరాబాద్‌ ఆఫ్‌ బ్యాంకుకు సంబంధించిన కొన్ని చెక్కులు లభ్యమయ్యాయి. విలువైన వస్తువులు, సమాచారం లభ్యంకాకపోవడంతో దొరికిన వస్తువులను పంచానామా చేసి భద్రపర్చారు.బైరాన్‌పల్లి నెత్తుటి గాథ


చరిత్ర పుటల్లో స్థానం దొరకని రక్తాక్షరం..
''మనకు తెలియని మన చరిత్ర''
బైరాన్‌పల్లి నెత్తుటి గాథకు నేటితో 68 ఏళ్లు
అదో వీరపోరాటం.
సరిగ్గా 68 ఏళ్ల క్రితం...
బైరాన్‌పల్లిలో నరమేధం...
మట్టిమనుషుల తిరుగుబాటు..
దోపిడీపై దండయాత్ర..
నిజాం మూకలపై నిప్పుల యాత్ర..
అగ్ని జ్వాలలై రగిలిన నెత్తుటి మడుగు..
గడ్డి కోసిన చేతులే కొడవళ్లు పట్టాయి.
బువ్వొండిన చేతులే తుపాకీలు పట్టాయి.
దొరల దాష్టీకాలకు... రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి.
గడీల పాలనను ప్రజలే తరిమికొట్టారు.
సామాన్యులే సాయుధులై రణనినాదం చేశారు.
రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు.
వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే బైరాన్ పల్లి. నాటి తరానికే కాదు...
నేటి తరానికీ స్పూర్తినిస్తోంది.

1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది.
సాయుధ పోరులో 118 మంది వీరమరణం పొందారు. భారత చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచినా...
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైంది
అది 1948 ఆగస్టు 27ఆ రోజు బైరాన్‌పల్లిలో ఉన్మాదం తాండవించింది.
గ్రామ స్వరాజ్యం కోసం 92 మంది ఒకే రోజు నిజాం సేనల చేతుల్లో బలయ్యారు.
బైరాన్‌పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు.
. చరిత్రలోకి తొంగిచూస్తే అది బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం..
సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం..
నిజాం సేనలను తొలుత ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టిన సాహసం వారిది.
గ్రామాలపై దాడులు చేసి ఊళ్లకు ఊళ్లే తగలబెట్టి వల్లకాడుగా మార్చారు రజాకార్లు.
నిజాం రజాకార్ల అకృత్యాలకు ఎంతోమంది తమ మాన ప్రాణాలను కోల్పోయారు.
వీరుల్ని నిరాయుధుల్ని చేసి ప్రాణాలు తీసిన పిరికిపందల చరిత్ర ఒక వైపు ఉంటే..
మరోవైపు త్యాగాల చరిత్ర.. వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన మహోన్నత చరిత్ర..
వరంగల్‌ జిల్లాలోని బైరాన్‌పల్లి నేడు వీర బైరాన్‌పల్లిగా మారింది.
జనగామ డివిజన్‌ మద్దూర్‌ మండలంలోని గ్రామం బైరాన్‌పల్లి...
ఏనాటికీ బైరాన్‌పల్లి పోరాట చరిత్ర మరువనిది.
అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.
వీరోచిత పోరాట కేంద్రం.
నిజాం మూకల తూటాలకు, సైన్యం వికృత క్రీడకు బలిపశువయినా శౌర్యాన్ని చూపింది. తిరుగుబాటుకు నెలవుగా మారింది. పోరాటకాలంలో భైరాన్‌పల్లి ప్రజలు ప్రక్క గ్రామాల ప్రజలకు అండగా నిలిచారు. రజాకార్లకు ఎదురొడ్డి త్యాగాలు చేశారు. సాటి మనిషి పట్ల ఆ గ్రామం చూపిన తెగువ తెగిపోతున్న మానవ సంబంధాలకు ఆదర్శం. ఆపదొస్తే ఆదుకోవటం ఎంత బాధ్యతో లింగాపూర్‌ ఘటన అద్దంలా కనబడుతున్నది. ఆంధ్రమహాసభ పేరుతో ప్రజల్లోకి వచ్చిన ఎర్రజెండా నింపిన చైతన్యం అలాంటిది.
ఓ వైపు యావత్ భారతదేశం స్వాతంత్య్ర సంబురాల్లో మునిగితేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా మరో వైపు నిజాం రాజుల ఏలుబడిలో ఉన్న పల్లెలన్నీ రజాకారు మూకల ఆగడాలు, దుశ్చర్యలతో వణికిపోతున్నాయి. రజాకార్లను ఎదురించి పోరాడలేక పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్నారు. రజాకార్ల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారిగా తిరుగుబాటు ప్రకటించి జంగ్‌సైరన్ చేసిన గ్రామమే..
వీరబైరాన్‌పల్లి. ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే గ్రామానికి లేదనడంలో సందేహం లేదు.
బైరాన్‌పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోతారు.
గ్రామంలో అడుగుపెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోతాయి. పిల్లల నుంచి పడుచు యువతుల దాకా..అంతా ఒక్కటై హైదరాబాద్ సంస్థానాన్ని సవాల్ చేస్తున్న కాలమది. నిజాం చీకటిపాలన నుంచి బయటపడి భారత యూనియన్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛాగాలులు పీల్చాలని ప్రతి గుండె, ప్రతి గ్రామం తహతహలాడుతున్న సందర్భమది. వరంగల్ జిల్లా బైరాన్‌పల్లి (నాటి నల్లగొండ జిల్లా) ఈ ఆకాంక్షలకు నిలువెత్తు ఆకృతిగా నిలిచింది. ఫలితం..
గ్రామరక్షణ దళం ఏర్పాటు
బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్‌పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో... బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు
.
1948 మే నెలలో బైరాన్‌పల్లిపై దాడికి విఫలయత్నం
1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్‌పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు. 1948 ఆగస్టు 27న రాక్షసులు పంజా విసిరారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలను నగ్నంగా చేసి.. బతుకమ్మ ఆడించిన రజాకార్ల పైశాచిక ఆనందం నేటికీ వారి మనసుల్లో మానని గాయంగానే మిగిలిపోయింది.
అవి రజాకార్లు గ్రామాలపై పడి ధన, మాన, ప్రాణాలను దోచుకుంటూ రాక్షస క్రీడలను కొనసాగిస్తున్న రోజులు. వారిని ఎదిరించి పోరాడేందుకు యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. దూళ్మిట్ట, కూటిగల్, లింగాపూర్, బైరాన్‌పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్‌పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకొని రజాకార్ల ఆగడాలను తిప్పికొట్టసాగారు. దీనికి ప్రతిగా రజాకార్లు గ్రామాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఇళ్లను తగులబెట్టి దోపిడీకి పాల్పడే వాళ్లు. గ్రామాలపై దాడులు చేసి దోచుకున్న సంపదతో తిరిగి రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద దూబూరి రాంరెడ్డి, ముకుందాడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో గ్రామ రక్షణ, గెరిల్లా దళాలు దాడిచేసి దోపిడీ సంపదను స్వాధీనం చేసుకొని పంచిపెట్టాయి.
ఈ ఘటన తర్వాత బైరాన్‌పల్లిపై రజాకార్లు ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామక్షిగిని నిల్వ చేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపాలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారా (బెజ్జాయి) మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కట్, కొండాపూర్, లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకొంటూ వచ్చేవారు. రెండుసార్లు బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించిన రజాకార్లను గ్రామరక్షక దళాలు తిప్పికొట్టడంతో 40 మంది రజాకార్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు ఏరియా కమాండర్ ఆషీం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రప్పించిన 500 మంది నిజాం సైనికులతో 1948 ఆగస్టు 27 తెల్లవారుఝామున బైరాన్‌పల్లిపై మూకుమ్మడి దాడి చేసి ప్రతీ ఇంట్లోకి ప్రవేశించి యువకులను బంధించి ఊరిబయటకు తీసుకువచ్చి లెంకలుగట్టి 96 మందిని కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలుగాచేసి కుప్పగావేసిన మృతదేహాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడించారు.
బైరాన్‌పల్లిలో ఆరోజు ఏం జరిగింది..?
1948 ఆగస్టు చివరి వారంలో అర్ధరాత్రి, ఆ ఊరికి కాళరాత్రి అయింది. నిరంకుశత్వం.. దానవరూపమెత్తి ఊరి మహిళలను చెరబట్టింది. దాదాపు వందమందిని నిలబెట్టి నిలువునా కాల్చిచంపింది
ఒకే రోజు 92 మంది గ్రామస్తులను రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. నాటి మారణకాండకు గ్రామం నడిబొడ్డులో ఉన్న బురుజు సాక్షీభూతంగా ప్రస్తుతం దర్శనమిస్తోంది. రజాకార్లను ఎదురించేందుకు బైరాన్‌పల్లి గ్రామంలోని యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు. ఒక రోజు రజాకార్లు గ్రామానికి సమీపంలో ఉన్న ధూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలను రజాకార్లు దోచుకొని, దోచుకున్న సొత్తుతో బైరాన్‌పల్లి మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. దీనిని గమనించిన గ్రామరక్షక దళాలు రజాకార్లకు అడ్డు తిరిగి వారి వద్ద నుండి సొమ్మును స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారిచేస్తూ రజాకార్లను వదిలి వేసారు.
దీంతో గ్రామంపై కక్ష పెట్టుకున్న రజాకారు మూకలు గ్రామంపై ఐదు సార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడులలో 20 మందికి పైగా రజాకార్లు మృతి చెందారు. దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించి, గ్రామాన్ని నేల కూలుస్తానని సవాలు చేశాడు. రజాకార్లు ఎదో ఒక రోజు గ్రామంపై దాడి చేసే అవకాశం ఉందని భావించి గ్రామస్తులు గ్రామం చుట్టూ కోట గోడ నిర్మించుకొని మధ్యలో ఎతైన బురుజును నిర్మించుకొని దానిని రక్షణ కేంద్రాంగా మలుచుకున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే బురుజుపైన ఉన్న గ్రామ రక్షక దళ సభ్యులు నగారాను మోగించేవారు.
ఏరులై పారిన రక్తం..
1947 ఆగస్ట్ 15వ తేదీన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా..
నిజాం రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు వీయలేదు. మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామం సహా చాలా గ్రామాల్లో రజాకార్ల పాశవిక దాడులకు అంతులేకుండా పోయింది. అయితే. బైరాన్‌పల్లి.. గట్టిగా నిలబడింది. ఊళ్లోని బురుజును స్థావరం చేసుకొని గ్రామంలోకి వచ్చిన రజాకార్లను ప్రతిఘటించి తరిమికొట్టేది. గ్రామరక్షణ దళాలను ఏర్పాటుచేసుకొని రాత్రింబవళ్లూ కాపలా కాసేవారు. బైరాన్ పల్లి గ్రామంపై పట్టుకోసం రజాకార్లు ఐదుసార్లు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో సుమారు 24 మం దికిపైగా రజాకార్లు ప్రజల చేతుల్లో మరణించారు.
దీంతో బైరాన్‌పల్లిపై నిజాం మూకలు కక్ష పెంచుకున్నాయి. చివరకు దొంగదాడికి పాల్పడ్డాయి.
1948 ఆగస్టు చివరి వారంలో రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం సాయంతో 12 వందల మంది దాడికి దిగారు. జనగామలో రాత్రి 12గంటలకు పది బస్సులలో బయలుదేరారు. లద్దునూరు మీదుగా బైరాన్‌పల్లి చేరుకున్నారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నా రు. ఆయనను వెంటబెట్టుకొని గ్రామంలోకి వస్తుండగా, వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్లోకి పరుగుపెట్టాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. నగారా మోగించాడు. దాంతో ఊళ్లో జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచా యి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి.
1948 ఆగస్టు 27న వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 12వందల మంది బలగంతో భారీ మందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామపొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్‌భట్‌జోషిని రజాకార్లు పట్టుకొని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్లయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుండి తప్పించుకొని గ్రామాన్ని చేరుకొని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారు అని కేకలు వేశాడు.
గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు.
అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలను ఆడించారు. ఈ దాడులలో ఈ దాడులలో 118మంది అమాయకులు బలికాగా 25మంది రజాకార్లు చనిపోయినట్లు రికార్డులలో ఉంది.
బైరాన్‌పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టన పెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది.
27 ఆగస్టు (1948) బైరాన్‌పల్లి మారణహోమం పై ప్రజాకవి కాళోజీ స్పందన
“హింస తప్పు- రాజ్య హింస మరీతప్పు- ప్రతిహింస తప్పుకాదు” కాళోజీ ఎప్పుడూ చెప్పేవారు. గుల్బర్గా జైల్లో శిక్షననుభవిస్తున్న కాళోజీ (1948) (వీర బైరాన్ పల్లి) నరమేధం వార్తలను చదివి ఆవేదనతో రాసిన గేయం.
కాటేసి తీరాలె
మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన
మనపిల్లల చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచిపోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండగ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె
సత్త్యమ్మహింసని సంకోచపడరాదు
దయయు ధర్మంబని తడుముకోపనిలేదు
శాంతియని చాటినను శాంతింపగారాదు
క్షమయని వేడినను క్షమియింపగారాదు
చాణిక్యనీతిని ఆచరణలో పెట్టాలె
కాలంబురాగానె కాటేసి తీరాలె
తిట్టిననాల్కెల చేపట్టికోయాలె
కొంగులాగినవేళ్ళ కొలిమిలోపెట్టాలె
కళ్ళుగీటిన కళ్ళ కారాలు చల్లాలె
తన్నిన కాళ్ళను ‘డాకలి’గ వాడాలె
కండకండగకోసి కాకులకువేయాలె
కాలంబురాగానే కాటేసి తీరాలె
బైరాన్‌పల్లి పోరాటానికి గుర్తింపేది..?
రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులను, సమరయోధులను నాటి సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు.
జలియన్‌వాలా బాగ్ దురాగాతాన్ని మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందేవిధంగా పోరాట ఘట్టాన్ని పాఠ్యంశాల్లో చేర్చి ,గ్రామంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
నాటి పోరాటంలో గ్రామంలోని ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంది. నాటి సమరయోధులకు ఎలాంటి పింఛన్ అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాగా, బైరాన్‌పల్లిని పర్యాటక క్షేత్రంగా చేస్తామన్న హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని బర్మ రాజమల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కోటి పది లక్షల వ్యయంతో, బురుజు చుట్టూ ప్రహరీతో పాటు ఒక వాచ్‌టవర్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, అమరవీరుల స్థూపం నుంచి బురుజు వరకు స్మృతివనం ఏర్పాటు.. ఒక కలగా మిగిలిపోయింది. అమరవీరుల విగ్రహాల ఏర్పాటును విస్మరించడం శోచనీయం.
#AAP
#BHIRANPALLY18, ఆగస్టు 2016, గురువారం

ఓరుగల్లు ఇలవేల్పు... పద్మాక్షీ అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు... పద్మాక్షీ అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు... పద్మాక్షీ అమ్మవారు
సిద్ధులకు మోక్షాన్ని ప్రసాదించడానికి ఈశ్వరుడు అవతరించిన ప్రాంతమే పద్మాక్షీ ఆలయం. పూర్వం ఇక్కడ సిద్ధులు మోక్ష సాధనకై ఈశ్వరుడికోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై, శక్తి లేనిదే మోక్షంలేదని, ఆవిడకోసం తపస్సు చెయ్యమని చెప్పగా మునులు అలాగే చేశారు. శక్తి ప్రత్యక్షమై తన పాదాల దగ్గర ఈశ్వరుడు వుంటే అలాగే సిద్ధుల అభీష్టం మేరకు అక్కడ వెలుస్తానన్నది. ఈశ్వరుడు దానికి ఒప్పుకుని కొండ దిగువను సిద్ధేశ్వరస్వామిగా వెలిశాడు. అమ్మవారు కొండపైన చిన్న గుహలో పద్మాక్షీదేవిగా వెలిసింది. ఆ చిన్న గుహనే గర్భాలయంగా మలిచారు. ఆ చారిత్రక ఆలయమే
పద్మాక్షీ దేవాలయం.
కాకతీయ వంశానికి ‘కాకతీయులు’ అనే పేరుకూడా అమ్మవారే పెట్టిందట. 5వ శతాబ్దంలో కాకతీయ రాజుకి ఖడ్గాన్నిచ్చి, ఆ ఖడ్గం ఆయన దగ్గరున్నంతమటుకూ విజయం లభిస్తుందని ఆశీర్వదించింది. కాకతీయ రాజులలో జైనమతావలంబులున్నారు. అందుకే కొన్ని జైన శిల్పాలను కూడా కొండమీద చూడవచ్చు.ఇదిలావుండగా కాకతీయ సామ్రాజ్య అవతరణకు చాలా ఏళ్లకు ముందే గుట్టపై పద్మాక్షి ఆలయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.పద్మాక్షీ అమ్మవారు ఓరుగల్లువాసుల ఇలవేల్పు. కొండముందు కాకతీయులకాలంనాటి చెరువు. ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం చాలా వైభవంగా జరుగుతుంది.
పాదముద్రలు ఎవరివి?!
పద్మాక్షి ఆలయం అందరికి తెలిసిందే... అయితే ఆ గుట్టపై ఉన్న పాదముద్రలకు గు రించి తెలిసింది చాలా తక్కువ మందికే... గుట్ట పైన సమతల ప్రదేశంలో పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్య అవతరణకు చాలా సంవత్సరాలకు ముందుగానే హన్మకొండను ఆనుకొని ఉన్న గుట్టపై పద్మాక్షి ఆలయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చాళుక్య త్రిభువన మల్ల దేవుని కాలంలో క్రీశ 1117లో కాకతీయ రెండవ ప్రోలుని మంత్రి పెర్గడ బేతయ భార్య మెలమకు ఉగ్రవాడి ప్రాం తానికి చెందిన మహామండలేశ్వరుడు మేడరసుడు ఇచ్చిన భూదానంగా ఇక్కడి శాసనం తెలుపుతోంది. పద్మాక్షి ఆల య నిర్మాణానికి సంబంధించిన ఇతర అనేక కథలు ప్రచా రంలో ఉన్నాయి. ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ కాకతీయ రాజ్య స్థాపనకంటే ముందుగానే పద్మాక్షి ఆలయం వెలసి ఉందన్న సత్యాన్ని అందరూ ఒప్పుకుంటారు.
ఎవరీ పద్మాక్షీ...
ఆలయ పరిసరాల్లో గల గుట్టలపై జైనులకు సంబంధించిన శిల్పాకృతులు వున్నాయి. అలాగే గుట్ట మీద ప్రత్యేకంగా పాదముద్రలు కూడా వున్నాయి. వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ప్రస్తుతం శైవ దేవతగా పూజలందు కుంటున్నప్పటికీ పద్మాక్షి నిస్సందేహంగా జైన దేవతేనని ప్రముఖ చరిత్రకాల ఉవాచ. కాకతీయ వంశ స్థాపకుడైన మాధవ వర్మ పద్మాక్షి దేవత అనుగ్రహం వల్ల గొప్ప సైన్యాన్ని సంపాదించినట్లు సిద్ధేశ్వర చరిత్ర వివరిస్తున్నది.
అభివృద్ధి అంతంతమాత్రమే...
వరంగల్‌ జిల్లాలోని ఇతర పురాతన ఆలయాలతో పోల్చుకుంటే... పద్మాక్షీ దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందనే చెప్పాలి. బతుకమ్మ పండుగ వస్తే తప్ప పాలకులకు పద్మాక్షీ అమ్మవారు గుర్తుకురారు. ఇంతటి చారిత్రక ఆలయంలో తాగునీటి సౌకర్యం లేకపోవడం ఈ ఆలయం పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి స్పష్టం అవుతోంది. గుట్ట పైకి వెళ్ళడానికి సీసీ రోడ్డు వేయాలన్న డిమాండ్‌ ఆచరణకు నోచుకోలేదు. గుండం ఇప్పటికే మురికి కూపంగా మారిపోయింది. బతుకమ్మ, వినాయక విగ్రహాల నిమజ్జనాల వల్ల పూడిక పేరుకు పోతోంది. ఈ పండుగల అనంతరం పూడిక తీయడం వల్ల మరిన్ని సంవత్సరాలు ఈ పండుగల నిర్వహణకు అవకాశ ముంటుంది. లేదంటే కొద్ది సంవత్సరాల్లోనే పూడికతతో నిండిపోయి ఏ నిమజ్జనాలకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న కోనేరు కూలి పోయి శిథిలావస్థలో ఉంది. దాని పునరుద్దరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీస వసతులు కల్పిస్తే సంఖ్య పెరిగే అవకాశముంటుంది. గుట్ట పైన ఇతర విగ్రహాలు, వింతలు, విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రాచీనమెన ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఓరుగల్లు ప్రజల పై ఉంది.
ఎలా వెళ్లాలి?
హన్మకొండ కొత్త బస్టాండు ముందునుంచి కొంత దూరం వెళ్తే కుడివైపు చిన్న ఆంజనేయస్వామి ఆలయం వస్తుంది. అక్కడ కుడివైపు తిరిగి కొంతదూరం వెళ్ళాక కుడివైపున చిన్న కొండమీద ఆలయం కనబడుతుంది. ఆలయం చేరుకోవటానికి కుడివైపు చిన్న మట్టిరోడ్డులో కొంత దూరం వెళ్ళాలి. తోవలో చెరువు కనబడుతుంది.గుట్టపై ఉన్న పాదముద్రలకు గురించి తెలిసింది చాలా తక్కు వ మందికే... గుట్ట పైన సమత ల ప్రదేశంలో పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాక తీయ సామ్రాజ్య అవతరణకు చాలా సంవత్సరాలకు ముందు గానే హన్మకొండను ఆనుకొని ఉన్న గుట్టపై పద్మాక్షి ఆలయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.


మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...