22, మే 2016, ఆదివారం

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది.
ఈ భూమి పై మనుషులతో బాటు ఇతర జీవరాసులన్నీ కూడా సమాన జీవన హక్కును కలిగి ఉన్నాయి కనుక ఆ జీవ రాసులన్నిటిని మనతో బాటుగా జీవించేలా మానవుడు సహకరించటమే 'జీవ వైవిధ్యం'
ఈ జీవ వైవిధ్య దినోత్సవం ఐక్య రాజ్య సమితి చేత ఆమోదించబడి సకల జీవరాసుల పరిరక్షణ కోసం 1993లో రూపొందించబడిన కార్యక్రమం.
2000 సంవత్సరం వరకు దీనిని డిసెంబర్‌ 29 నాడు జరిపేవారు.
అయితే డిసెంబర్‌ 2000 సంవత్సరంలో జరిగిన 2వ కమిటీ సదస్సులోని సభ్యులు ఒక నిర్ణయం చేసారు.. అదేమిటంటే డిసెంబర్‌ నెలలో వచ్చే పండగ సెలవుదినాల్లో ఈ దినోత్సవం కలిసిపోకుండా దీని ప్రాధాన్యత ను ప్రత్యేకంగా తెలియజేయటానికి అనుగుణంగా మొట్ట మొదటి జీవ వైవిధ్య సదస్సు జరిగిన తేదీ మే నెల 22, 1992 కావటం చేత ఈ జీవ వైవిధ్య దినోత్సవపు తేదీని మే 22 గా నిర్ణయించారు.
ఈ 2016వ సంవత్సరానికి గాను జీవ వైవిధ్య దినోత్సవపు లక్ష్యంగా ''జీవ వైవిధ్య సమతౌల్యపు పురోభివృద్ది''గా నిర్దేశించారు.
యునైటెడ్‌ నేషన్స్‌లో 2011-2020 దశాబ్దాన్ని జీవ వైవిధ్యపు దశాబ్దంగా నిర్ణయించింది. .
మన తెలుగు వాళ్లకు సుపరిచితమైన ఒంగోలు గిత్త, పుంగనూరు ఆవు తిరుమల అడవుల్లో కనిపించే బంగారు బల్లి జీవ వైవిధ్యానికి చక్కని ఉదాహరణలు.
అరుదైన ఈ విశిష్ట జాతులను రక్షించుకోవటం ఈ భువి పైనున్న అందరి బాధ్యత.
అంతరించిపోతున్న ఎన్నో పక్షి, జంతు సరీసృపాల జాతులను రక్షించుకోవటం వాటి సంతతిని తిరిగి వర్దిల్లజేసే చర్యలు చేపట్టి మన భావి తరాలకు అందించటమే తక్షణ కర్తవ్యం.
ఇప్పటికే మన చిన్ననాటి చెలికాడైనా పిచ్చుక అసలెక్కడా కనబడటం లేదు.
అలాగే మనంవేసే చిన్న అన్నం ముద్ద తినటానికి కావు కావు మంటూ ఎగిరొచ్చే కాకులు కూడా కనిపించటం లేదు. ఇవి పూర్తిగా అంతరించిపోక ముందే వీటి రక్షణను చేపట్టి, ప్రతి ఇంటి ముందు ఒక పిడికెడు ధాన్యం,
ఒక మూకుడు మంచినీరు అందించే ఏర్పాటు చేసుకుంటే మళ్లీ వీటిని చూడ వచ్చనే ఆశ ఎక్కడో సన్నగా కలుగుతోంది.ఇక్కడ నా స్వీయ అనుభవం కొంత చెబుతాను అసలు ఎల్లలు, భాష లేని ప్రేమైక జీవులు చూడండి..
ఎదురింట్లో ఒక చక్కని కుక్క ఉండేది.
ఎంత అందంగా ఉండేదో. ఇంట్లో అన్నం మిగిలితే అమ్మ మజ్జిగ కలిపి గిన్నె ఇచ్చేది.
ఆరు బయట దాన్ని పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చి ఆ అన్నమంతా క్షణాల్లో తినేసి ఎంతో కృతజ్ఞతతో నిండిన కళ్ళతో నా వైపు చూసేది..
అసలు మాకు భయమే ఉండేది కాదు.
ఆ కుక్కతో ఆడే వాళ్ళం.
ఇంటి పెరట్లో ఎన్ని పిల్లులు ఉండేవో చెప్పలేం.
ఒక తరం తర్వాత మరొక తరం అందరం వీటితో చిన్నప్పుడు ఆడుకున్నాం.
ఈ పిల్లులు గారాలు పోయేవి.
మనం అన్నం వేస్తామని, పాలు పోస్తామని ..
ఒక ఆవు ఎక్కడి నుండో శుక్రవారమే వచ్చేది.
జల్లించిన గోధుమ పొట్టు తినేసి హాయిగా నుదురు నిమిరించుకుని వెళ్ళేది..
ఒకసారి పావురాల గుంపు వచ్చి అందులో తెల్లని పావురాళ్ళు రెండు నేను వేసిన కందిపప్పు తిని   వెళ్ళేవి. అసలు భయపడేవి కావు. అలాకొన్ని నెలలుగా వచ్చాయి. ఇక ఇంట్లో కోడి పిల్లలు, మా చెట్టు ఆకులు తినటానికి వచ్చే మేక పిల్లలు ఎంత ముద్దొచ్చేవో..
సాయంత్రం కాగానే చెట్లపై కిచకిచ లాడే పిచ్చుకలలో ఒక జంట ఇంట్లోకి వచ్చేవి విద్యుత్‌ వైర్ల చెక్కలపై హాయిగా కూచుని తెల్లవారే వరకు కునుకు తీసేవి మళ్లీ ఉదయం ఎప్పుడు వెళ్లిపోయేవో ఎవరికీ తెలిసేది కాదు.
ఉదయాన్నే పెరట్లో కాకుల అరుపులు, బయట ఎక్కడో కోడి కూత, కాసేపయ్యాక పిచ్చుకలన్నీ సందడి చేస్తూ చాటలో బియ్యం ఎరుతుంటే వచ్చి వడ్లు తిని మనకు ఉల్లాసాన్ని ఇచ్చి వెళ్ళేవి ..
ఇలా స్నేహం చెయ్యటానికి భువి పై ఎన్ని జీవరాసులను మనతో పాటు ఉన్నాయి.
మనిషి స్నేహానికి మచ్చలు ఉంటాయేమో కాని ఈ మూగ జీవుల నిస్వార్ధ ప్రేమతో మనసంతా ఎంతోవిశాలత్వంతో నిండిపోతుంది. కనుక జీవ వైవిధ్యపు ఆవశ్యకతను ఈ జీవ వైవిధ్య దినోత్సవం నాడైనా ఒక్కసారి గుర్తిస్తే మన భావి తరాలకు కూడా మన వంటి బాల్యం అందించిన వారం అవుతాం

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...