6, ఏప్రిల్ 2016, బుధవారం

Gadi

నక్సలైట్లు మొదటి సారి దాడి చేసిన గడీ ...
ఆ గడీ ...
ఏమంత కళాత్మకంగా ఉండదు .
రాతి స్తంబాలుండవు ..
పెద్ద పెద్ద బురుజులుండవు ...
అద్దాల మేడలుండవు ...
కానీ ...
ఆ గడీ పేరు తెలంగాణాలోనే కాదు ...
దేశవ్యాప్త సంచలనానికి మూల కారణమయింది.
07-11-1976
ఒక్కసారిగా ఊర్లన్నీ ఉలిక్కిపడ్డాయి .
చాల మంది దొరల్ని నిద్రలేకుండా చేసింది . దొరతనపు వ్యవస్థని అప్రమత్తం చేసి గడీల్ని ఖాళీ చేసి,దొరల్ని వెళ్ళిపోయేలా చేసింది .
రాచరిక వ్యవస్థ పునాదుల్ని కదిలించింది .
అదే ... ఆదిలాబాద్ జిల్లాలోని ...
తపాల్ పూర్ గడీ ...
మొదటి సారి నక్సలైట్లు దాడి చేసిన గడీ ..
బి.బి.సి రేడియోలో ప్రసారం అయి ప్రపంచానికి తెలిసిన గడీ.
గడీ యజమాని పితాంబర రావు పద్దెనిమిది వేల ఎకరాల ఆసామి,1970 ప్రాంతంలో అటవీ శాఖ వారు అప్పటి వీరి వ్యతిరేఖుల పిర్యాదు తో గడీ పై తనిఖీకి వెళ్తే అప్పట్లోనే  పది లక్షల రూపాయల  విలువైన కలప దుంగలు కనిపించాయట. కాని రాష్ట్ర పెద్దల ఫోన్ తో అక్కడినుండి వెళ్లిపోయారట .
జన్నారం మండలంలో ఉన్న ఈ గ్రామం 'కవ్వాల్ అభయారణ్యం' పక్కనుంచి మెయిన్ రోడుకి 4 కిమీ లోపల వుంది. పులులు సంచరించే అటవీ ప్రాంతంగా ప్రభుత్వం పులుల బొమ్మలతో అక్కడక్కడా పెద్దపెద్ద బోర్డుల్ని కూడా ఏర్పాటు చేసింది.
తపాల్ పూర్ గడీ అతి సామాన్యంగా ఉంది. ఒక పెద్ద ఇల్లులా ఉంది. వాకిలి మీద ముగ్గులు, పందిర్ని అల్లుకున్న పూల తీగలతో శుభ్రంగా ఉంది. పాడిసంపద పుష్కలంగా ఉంది. ఇలా ఉండడానికి కారణం ఈ గడీలో పితాంబార్ రావు చిన్న కొడుకు కెప్టైన్  విజయ్ కుమార్ రావు ఉంటున్నారు. నక్సలైట్ల దాడి సమయంలో తాను మిలటిరీలో డాక్టర్ గా పనిచేస్తున్నందున ఆ వివరాలేవీ స్పష్టంగా తెలియవని చెప్పారు.
నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన గడీ వారసుల ఫోటోలు,పెయింటింగులు పెద్ద పెద్ద సైజుల్లో హాల్లోకి వెళ్ళగానే కనిపిస్తాయి. పీతాంబర రావు వేటాడిన ఒక పెద్ద పులి బొమ్మ ఉంది. పులిచర్మం వొలిచి దాని అదే రూపంలో నిలబెట్టారు.
గడీ లోపలి గదులన్ని సామాన్యంగా ఉన్నాయి. వేరేగా ఉన్న ఒక ఇంటిని (పాత గడీ)మాత్రం ఆయుర్వేద ఆసుపత్రికి ఇచ్చారు.ఇక్కడి దొరల అరాచకాలు భరించలేక 7వ నవంబర్ 1976 రోజున ఈ గడీ మీద తుపాకులు బాంబులతో నక్సలైట్లు దాడి చేసారు. పోలీసుల చార్జిషీటు ప్రకారం ఈ దాడిలో అప్పుడు 16 మంది నక్సలైట్లు పాల్గొన్నారు .
ఈ చార్జిషీటులో మొదటి పేరు కొండపల్లి సీతారామయ్యది కాగా వరుసగా కొల్లూరి చిరంజీవి,కొల్లా శివాజీ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ,కుమార్ రెడ్డి ,నల్లా ఆదిరెడ్డి. ఏం . విశ్వేశ్వర రావు, ముప్పాల లక్ష్మన్ రావు (ప్రస్తుత మావోయిస్ట్ కేంద్ర ప్రధాన కార్యదర్శి ),పి . నారాయణ ,ముంజా రత్తయ్య ,బద్దం శంకర్ రెడ్డి ,తుషార్ కాంత్ భట్టాచార్య ,కే లచ్చిరెడ్డి , గండ్ర ప్రభాకర్ , పోశెట్టి , రామ రెడ్డి ఉన్నారు .
పితంబర రావు ముందే మరణించగా ఆయన నలుగురి కుమారుల్లో సుభాష్ బాబు,సంపత్ బాబులను నక్సలైట్లు హతమార్చారు . ఇదే దాడిలో కొండల్ రావు అనే పోలీస్ పటేల్ ను ,ఆ ఊరి మరో భూస్వామి, దొరల ఆంతరంగీకుడు అయిన కమ్మల లచ్చయ్య పటేల్ కొడుకు అశోక్ పటేల్ ను పక్క ఊరిలో ఉండే లచ్చయ్య పటేల్ అన్న అయిన వెంకటయ్య పటేల్ ను కూడా చంపారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...