19, ఏప్రిల్ 2016, మంగళవారం

మహావీర్ జయంతి

ఏప్రిల్ 20 మహావీర్ జయంతి
జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్యాభ్యంతరాలైన (అంటే బయటవీ, లోపలివీ) వికారాలను... అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించినవానికి జిన, జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు.

తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు.  ఇరవై నాలుగవ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మహావీరుడు బీహార్‌లోని వైశాలీ నగరం సమీపంలోని కుందల్పూర్‌లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు కాశ్యప గోత్రానికి చెందిన క్షత్రియుడు. తల్లి... వజ్జీ రాజ్యాధిపతి, ఇక్ష్వాకు వంశ క్షత్రియుడైన చేతకుని కుమార్తె ప్రియకరణి లేక త్రిశల. బాల్యం నుంచీ రాజకుమారునిగా సకల సౌఖ్యాలూ అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లిప్తుడుగా ఉండేవాడు మహావీరుడు.

శ్వేతాంబర సంప్రదాయానికి చెందిన అచరంగ సూత్ర అనే గ్రంథం ద్వితీయ అధ్యాయంలో వర్ధమానుని తల్లిదండ్రులు పార్శ్వనాథుని భక్తులని ఉంటుంది. వర్ధమానుని వివాహ విషయంలో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించి వర్ధమానుడు వివాహం చేసుకోకుండానే ఉండిపోయాడని దిగంబర సంప్రదాయం చెబుతుంటే శ్వేతాంబర సంప్రదాయానుసారం వర్ధమానునికి వివాహం అయ్యింది. భార్య పేరు యశోద. వీరికి ‘ప్రియదర్శి’ అనే పుత్రిక ఉండేది.

వర్ధమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. పాఠశాల, అధ్యాపకుల అవసరం తనకు లేదన్న వివేకాన్ని వర్ధమానుడు మనసులోనే నెల కొల్పుకున్నాడు. మహావీరుని అసలు పేరు వర్ధ మానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘మహా వీరుడు’ అని పేరు పొందాడు. ఈ సార్థకనామం అతనికి ఎలా వచ్చిందనేందుకు ఒక కథ ఉంది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆటలాడు తున్నప్పుడు, ఒక నల్లని పాము పడగ పైన తన పాదం మోపి దాన్ని అణచివేశాడు. ఈ విధంగా మోహం అనే సర్పాన్ని అణచటం జరిగింది.

బుద్ధునిలాగే మహావీరుడు కూడా ప్రపంచ పరిత్యాగం చేయాలనే ఆశతో కొట్టుమిట్టాడాడు. కుటుంబంతో కలిసి 28 ఏళ్ల వయసు వరకు గడి పాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. ఇక తాను సర్వసంగ పరి త్యాగం చేయాలని, యోగ్యమైన, ఉపయోగకరమైన కార్యం నెరవేర్చాలని భావించాడు. సంపదను పేదలకు పంచాడు. కుటుంబాన్ని విడనాడిన రోజే రాజ్యాన్ని సోదరునికప్పగించాడు. అప్పుడు ముప్పది ఏళ్ల వయసులో ఉన్నాడు. తపస్సు, ప్రార్థనలతో నిండిన జీవితంలోకి ప్రవేశించాడు.

గృహస్థ జీవితాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుడి వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత జృంబిక గ్రామం దగ్గర పన్నెండు సంవత్సరాల ధ్యానం, తపస్సుల తర్వాత మహావీరునికి వెలుగు కనిపించింది, ఆత్మ వివేకం (జ్ఞానం) కలిగింది. తీర్థంకరుడయ్యాడు. ఈ స్థితిని కైవల్యం అనీ ఈ స్థితిని పొందినవారిని కేవలి అనీ అంటారు.

తదనంతరం వర్ధమానుడు తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఆనందానికి సంతోషానికి సంబంధించిన తన గొప్ప శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు.

వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. అవే జైనులకు మార్గదర్శకాలు. సన్యాసి అయినవాడు శాకాహారాన్ని తీసుకోవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ప్రాణికి, వస్తువుకి, నిర్జీవులు అయినవాటికి కూడా చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధపడతాయని అంటారు. చివరికి భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని భూమినే దున్నొద్దు అంటారు. అందుకే చాలామంది జైనులు వ్యాపారాల్లో స్థిరపడ్డారు.

గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతారు. నీళ్లు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన చీపురుతో నేలను ఊడుస్తారు. నేల కింద పండే దుంపలు,  ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజలు వంటివి కూడా తినరు.
 తన సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఆయన ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేశాడు. ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగు తున్నప్పుడు ఆయన్ని కలతబెట్టి బాధించేవారు, అవమానపర్చేవారు.

ఒక అడవిలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక ముఠా మనుషులు అతణ్ని కొట్టారు కూడా. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆయన మహావీరుడు. గొప్ప విజేత.
మహావీరునకు పదకొండు మంది ప్రధాన అనుచరులు, నాలుగువేలకు పైగా సన్యాసులు మరియు సామాన్యులు - మత ( విశ్వాసం ) కలవారు ఉండేవారు. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులను కుడా చేర్చుకునేవారు. అతనికి " కులం " మీద నమ్మకం లేదు. 526 బి.సి.లో పావపురి ( బీహార్ )లో తన 72వ ఏట మహావీరుడు దీపావళి రోజున కాలధర్మ చెందాడు.
 ఆయన మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. దేశమంతా ఆయన పేరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వెలిశాయి. ఆయన నిజంగానే వీరుడు. యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు. సకల సౌకర్యాలనూ వదిలి సామాన్యునిగా జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు!

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...